Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

గులాబీ దళాలకు పదును

-సాగర్‌లో 2,3,4 తేదీల్లో టీఆర్‌ఎస్ రాజకీయ శిక్షణ తరగతులు -పది అంశాలపై నిపుణులతో ప్రసంగాలు -స్వయంగా పాఠాలు చెప్పనున్న సీఎం కేసీఆర్ -ప్రారంభ కార్యక్రమానికి హనుమంతరావు, లింగ్డో -క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లు సమీక్షించిన సీఎం

KCR

ప్లీనరీ, బహిరంగ సభల విజయంతో మహోత్సాహంతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి మరో బృహత్తర కార్యక్రమానికి సిద్ధమైంది. పాలనలో కీలక అంశాలపై పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యుల్లో అవగాహన కల్పించేందుకు రాజకీయ శిక్షణా తరగతులు నాగార్జునసాగర్‌లో నిర్వహించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 2, 3, 4 తేదీల్లో ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులకు ఇచ్చే ఈ శిక్షణలో ప్రధానంగా 10 అంశాలను తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, బడ్జెట్, శాంతిభద్రతలు, అడవులు, పరిశ్రమల వంటి అంశాలతోపాటు కేంద్ర, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, చట్ట సభల సంప్రదాయాలు, వర్తమాన రాజకీయాలు-మానవ సంబంధాలు వంటి అంశాల మీద శిక్షణ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. బడ్జెట్‌ను ఎలా ప్రవేశపెడతారు? కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు ఎలా రూపొందుతాయి? వంటి అంశాల్లో ప్రతినిధులకు పరిపూర్ణ అవగాహన ఉండాలన్నది కేసీఆర్ ఆలోచనగా ఉంది. ఈ శిబిరాల నిర్వహణపై మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు, మంత్రులు, ముఖ్యులతో సీఎం సమావేశమయ్యారు. శిబిరం నిర్వహణ ఏర్పాట్లు ఎలా ఉండాలి, ఏఏ నిపుణులతో ఏఏ అంశాలపై శిక్షణ ఇప్పించాలి.. తదితర అంశాలపై చర్చించినట్టు తెలుస్తున్నది. అలాగే ప్రజాప్రతినిధులు, నేతల స్థాయిని బట్టి ఎవరెవరు ఎప్పుడు శిబిరానికి హాజరుకావాలో షెడ్యూల్ రూపొందించినట్టు తెలిసింది. శిబిరం నిర్వహణ బాధ్యతలను కొందరు నేతలకు అప్పగించినట్టు సమాచారం. మొత్తంగా 10 అంశాల మీద 20 గంటల శిక్షణ ఉంటుందని భావిస్తున్నారు.

హాజరవుతున్న లింగ్డో, హనుమంతరావు.. వచ్చే నెల రెండో తేదీ ఉదయం 9 గంటలకు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ లింగ్డో, ప్రముఖ ఆర్థికవేత్త హనుమంతరావు హాజరు కానున్నట్లు సమాచారం. అస్కికి చెందిన విషయ నిపుణులతో ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. సబ్జెక్టులను కేసీఆర్ స్వయంగా ఎంపిక చేశారు. బుధవారంనాడు సీఎం సెక్యూరిటీ అధికారులు నాగార్జునసాగర్‌కు వెళ్ళి భద్రతా ఏర్పాట్లను పరిశీలించనున్నట్టు తెలిసింది. శిబిరానికి హాజరయ్యే ప్రతినిధులకు తగిన ఏర్పాట్ల నిర్వహణకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి తదితరులు నాగార్జునసాగర్‌కు వెళ్లబోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. పాలనలో వేగం పెంచడం, పార్టీ శ్రేణులను ప్రభుత్వ లక్ష్యాల సాధనలో సమన్వయం చేయడం ముఖ్యమైన లక్ష్యాలుగా పెట్టుకున్నట్టు తెలిసింది.

ఒకటో తారీఖు సాయంత్రంకల్లా చేరుకోవాలి.. సీఎం కేసీఆర్ మే ఒకటో తేదీ సాయంత్రానికి సాగర్‌కు చేరుకోనున్నారు. అదే రోజు సాయంత్రానికి పార్టీ తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సాగర్‌కు చేరుకోవాలని పార్టీ నుంచి ఆదేశాలు జారీ చేశారు. మొదటి రెండు రోజులు శిక్షణ వీరికే పరిమితం కాగా ఆ తర్వాత జడ్పీ ఛైర్‌పర్సన్లు, మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్‌పర్సన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు జత కలుస్తారు. వారందరికీ మూడో తేదీ సాయంత్రానికి సాగర్‌కు చేరుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నాలుగో తేదీన శిబిరాలు ముగుస్తాయి.

ఒక్కో అంశానికి రెండు గంటలు.. ఈ శిబిరంలో ముఖ్యమంత్రి నిర్ణయించిన అంశాలపై శిక్షణకు ఒక్కో అంశానికి రెండు గంటల సమయం కేటాయించనున్నారు. ఇందులో మొదటి గంట సంబంధిత నిపుణుడు క్లాస్ ఇస్తారు. తర్వాత మరో గంట ముఖాముఖి (ఇంటరాక్షన్ సెషన్) ఉంటుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి రెండు కార్డులు ఇస్తారు. అందులో ఒక దానిపై నిపుణుడు చెప్పిన అంశాలపై మరింత స్పష్టత కావాలంటే అందుకు సంబంధించిన సందేహాలు , మరో దానిపై ప్రశ్నలు రాసుకోవాల్సి ఉంటుంది. వీటిని అస్కి ప్రతినిధులు సేకరించి అందులో ప్రధానమైనవి క్రోడీకరించి సందేహాలు నివృత్తి చేస్తారు. తద్వారా సమయం ఆదా అవుతుందనేది ఆస్కి ప్రతినిధుల అభిప్రాయంగా ఉంది.

పాఠాలు చెప్పనున్న సీఎం కేసీఆర్ ఇదిలా ఉండగా శిక్షణ శిబిరంలో సీఎం కేసీఆర్ పాఠాలు చెప్పనున్నారు. రాజకీయం- మానవ సంబంధాలు అనే ఆయనకు ఇష్టమైన అంశంపై కేసీఆర్ శిక్షణ ఇస్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయం- మానవ సంబంధాలకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు మరింత సన్నిహితమయ్యేందుకు కేసీఆర్ సూచనలిస్తారు. టీఆర్‌ఎస్ ఉద్యమాల్లోంచి ఆవిర్భవించి ఉద్యమాలే ఊపిరిగా ప్రస్థానం సాగించింది. ఉద్యమాలతో అనుబంధం ఉన్న వారు, ఉద్యమ స్ఫూర్తి ఉన్నవారు పార్టీతో మమేకమయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వీరిలో అనేక మంది చట్టసభలకు వచ్చారు. నూతనంగా వచ్చిన వీరిలో అనేక మందికి ప్రభుత్వ పాలనాంశాలు, చట్ట సభల తీరుతెన్నుల గురించి పెద్దగా అవగాహన లేదు. ఈ నేపథ్యంలో వీరికి సరైన శిక్షణ ఇచ్చి రాజకీయ యోధులుగా తీర్చి దిద్దాలనేది కేసీఆర్ సంకల్పంగా ఉంది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.