
-ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్ -ప్రజలతో మమేకమవుతున్న అభ్యర్థులు -16 మంది ఎంపీలను గెలిపించాలని వినతి -కేంద్రంలో సత్తా చాటుదామంటూ పిలుపు -స్టార్ క్యాంపెయినర్లతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం
నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయి.. బరిలో నిలిచేది ఎవరో తేలిపోయిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మరింత ఉధృతమైంది. ఇప్పటికే జోరుగా ప్రచారంచేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, స్టార్ క్యాంపెయినర్లు, వివిధ జిల్లాల ముఖ్య నేతలు ప్రచార వేడి పెంచారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీలుగా, ప్రభుత్వపరంగా చేసిన కృషిని, రాబోయే రోజుల్లో చేయనున్న కార్యక్రమాలు వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. రాష్ట్రంలో పదహారు సీట్లలో టీఆర్‌ఎస్ గెలిస్తే కేంద్రంలో సత్తా చాటేందుకు, రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం మెడలు వంచి సాధించుకునేందుకు అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. ఢిల్లీ కోటపై గులాబీ జెండా ఎగురవేద్దామని పిలుపునిస్తున్నారు. గురువారం ఆయా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల సభలు, రోడ్‌షోలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది.
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి ఉదయం ఐదుగంటల నుంచే బస్తీల్లో, కాలనీల్లో తిరుగుతూ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌లతో కలిసి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ 16 సీట్లు గెలుపొందటం, ఢిల్లీలో ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడి అవసరం ఉందని నొక్కిచెప్పారు. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌యాదవ్ ప్రచారాన్ని ముమ్మరంచేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్లతో కలిసి ప్రచారం నిర్వహించారు.

దేశానికి దిక్సూచిలా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవాలని, టీఆర్‌ఎస్ గెలుపుతో దేశ రాజకీయాల్లో పవర్ కొనసాగించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి నిర్వహించిన రోడ్‌షోలో హరీశ్ మాట్లాడుతూ.. ఐదేండ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశంలోని అన్ని రాష్ర్టాలు అనుసరిస్తూ తెలంగాణను దిక్సూచిలా చూస్తున్నాయని చెప్పారు.