Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం ఇవ్వాల్సిందే

జీఎస్టీ విధానంతో 70% నష్టం
ప్రగతిశీల రాష్ర్టాల ఆదాయంలో కోత
ఆర్థిక క్రమశిక్షణలేని రాష్ర్టాలకే లాభం
తెలంగాణకు జీఎస్టీ రూ.5420 కోట్లు..
ఐజీఎస్టీ రూ.2700 కోట్లు ఇవ్వాలి
జీఎస్టీ కౌన్సిల్‌లో ఆర్థికమంత్రి హరీశ్‌రావు

జీఎస్టీ విధానం ప్రగతిశీల రాష్ర్టాలకు నిరుత్సాహకరంగా.. ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేని రాష్ర్టాలకు లాభదాయకంగా ఉన్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. జీఎస్టీలో చేరడం ద్వారా తెలంగాణ వంటి రాష్ర్టాలు 60-70% వరకు ఆదాయాన్ని కోల్పోయాయన్నారు. తెలంగాణ రూ.18,820 కోట్లు జీఎస్టీ చెల్లిస్తే.. రూ.3,223 కోట్లు మాత్రమే తిరిగి వచ్చాయని చెప్పారు. జీఎస్టీ పరిహారాన్ని కేంద్రమే ఇవ్వాలని తేల్చి చెప్పారు. రాష్ర్టాల ఆదాయానికి ఎలాంటి నష్టం ఉండదని కేంద్రం ఇచ్చిన భరోసాతోనే తాము జీఎస్టీలో చేరామని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో బీఆర్కే భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జీఎస్టీలో చేరడం వల్ల రాష్ట్రాలు 60%-70% ఆదాయాన్ని కోల్పోతే, కేంద్రం 31% మాత్రమే కోల్పోయింది. అందుకే రాష్ర్టాలకు కేంద్రం జీఎస్టీ పరిహారం చెల్లించాల్సిందే’ అని స్పష్టంచేశారు. తెలంగాణకు రావాల్సిన జీఎస్టీ రూ.5,420 కోట్లు, ఐజీఎస్టీ రూ. 2,700 కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గతంలో నిర్వహించిన 7, 8, 10వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాల్లో.. ఆదాయంలో రాష్ర్టాలకు లోటు ఏర్పడితే ఏదో రూపంలో పరిహారం చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని హరీశ్‌ ప్రస్తావించారు. ‘కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి లేదా అప్పు తీసుకొనైనా చెల్లిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. దీనిపై చర్చ అనవసరం’ అని స్పష్టంచేశారు.

రాష్ర్టాలను అప్పు చేయమనడం సరికాదు
జీఎస్టీ పరిహారంలో సెస్‌ మిగిలితే కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ లో జమచేసి కేంద్రమే వాడుకుంటున్నదని మంత్రి హరీశ్‌ చెప్పారు. ‘సెస్‌ తగ్గినప్పుడు రాష్ర్టాలు అప్పులు తీసుకోవాలని సూచించడం సరికాదు. అప్పులు తీసుకుంటే రా ష్ర్టానికో వడ్డీ రేటు ఉంటుంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు మొదలైన సమస్యలతో చెల్లింపుల్లో గందరగోళం తలెత్తుతున్నది. కేంద్రమే అప్పు తీసుకొని రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారం చెల్లించాలి. అప్పుడు వడ్డీరేటు సైతం తగ్గుతుంది. కొవిడ్‌ ఎంతకాలం ఉంటుందో.. రెవెన్యూ లోటు ఎంత ఉంటుందో తెలియక అంతా అయోమయంలో ఉన్నారు. ఈ స్థితిలో కేంద్రమే బాధ్యత తీసుకొని గతంలో ఇచ్చిన హామీ మేరకు రెండు నెలలకు ఒకసారి జీఎస్టీ పరిహారం చెల్లించాలి. బీహార్‌ ఉపముఖ్యమంత్రి సుశీల్‌మోదీ ఆధ్వర్యంలో మంత్రుల బృందం సమావేశమై ఐజీఎస్టీ కింద తెలంగాణకు రావాల్సిన రూ.2700 కోట్ల విడుదలకు విధివిధానాలు రూపొందించాలి. అత్యధికంగా జీఎస్టీ చెల్లించే, అత్యంత తక్కువ పరిహారం తీసుకునే రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణ రూ.18,820 కోట్లు జీఎస్టీ చెల్లిస్తే.. రూ.3,223 కోట్లు మాత్రమే తిరిగి వచ్చాయి’ అని హరీశ్‌ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

సెన్‌ను పూర్తిగా చెల్లించాలి
‘కొవిడ్‌ పరిస్థితులు.. జీఎస్టీ అమలుతో నష్టపోయాం.. అంటూ పూర్తిస్థాయిలో సెస్‌ చెల్లించకపోవడంతో తెలంగాణ తీవ్రంగా నష్టపోతున్నది. జీఎస్టీ అమలుచేసిన తొలి ఏడాది తెలంగాణ రూ.169 కోట్లు మాత్రమే పరిహారం తీసుకుంది. రెండో ఏడాది అసలే రాలేదు. మూడో ఏడాదీ స్వల్ప మొత్తమే దక్కింది. ఈ ఏడాది కొవిడ్‌ అని, జీఎస్టీ అమలుతో నష్టాలంటూ విభజిస్తే మేము తీవ్రంగా నష్టపోతాం. ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ర్టానికి రావాల్సిన సెస్‌ మొత్తాన్ని చెల్లించాల్సిందే’ అని మంత్రి హరీశ్‌ డిమాండ్‌ చేశారు. 15వ ఆర్థిక సంఘం కేటాయింపుల్లోనూ నష్టం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సమావేశంలో హరీశ్‌ వ్యక్తపరిచిన అభిప్రాయాలనే చాలా రాష్ర్టాల ఆర్థిక మంత్రులు ప్రస్తావించడంతోపాటు మద్దతు ప్రకటించారు. సమావేశంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఆర్థిక, వాణిజ్య, పనుల శాఖ అధికారులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.