-16 రాష్ర్టాలకు కలిపి రూ.25 వేల కోట్లు -కేంద్రం వారంలోగా చెల్లించాలి -కరోనా వేళ ఇవి రాష్ర్టాలకు ఊరట -ఐజీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు

రాష్ర్టానికి రావాల్సిన ఐజీఎస్టీ బకాయి రూ.2,641 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు జీఎస్టీ కౌన్సిల్‌ను డిమాండ్ చేశారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ర్టాలకు ఇవి ఎంతో అవసరమని చెప్పారు. ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌పై వివిధ రాష్ర్టాల ఆర్థికమంత్రుల బృందం మంగళవారం సమావేశమైంది. ఐజీఎస్టీ కన్వీనర్, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్‌కుమార్ మోదీ అధ్యక్షతన జరిగిన ఆన్‌లైన్ సమావేశంలో మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. కేంద్రం 2018 నుంచి తెలంగాణతోపాటు 16 రాష్ర్టాలకు కలిపి చెల్లించాల్సిన ఐజీఎస్టీ బకాయిలు రూ.25,058 కోట్లుగా ఉన్నదన్నారు. ఇందులో తెలంగాణకు రూ.2,641 కోట్లు రావాలన్నారు. అయితే జీఎస్టీ కౌన్సిల్ దీనిని రూ.2,638 కోట్లుగా లెక్కించిందని చెప్పారు. తగ్గిన రూ.3 కోట్లపై తమ అధికారులు చర్చిస్తున్నారని తెలిపారు. ఈ నిధులు వస్తే కరోనా, లాక్‌డౌన్‌తో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ర్టాలకు ఊరట కలుగుతుందని చెప్పారు. వచ్చేనెల 5న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగనున్నదని, ఆ లోగా రాష్ర్టాలకు ఐజీఎస్టీ బకాయిలను చెల్లించేలా సిఫారసు చేయాలని సూచించారు.
భవిష్యత్తులో సర్దుబాటు చేయండి ఐజీఎస్టీకి సంబంధించి 8 రాష్ర్టాల నుంచి వసూలు కావాల్సిన రూ.1015 కోట్లను భవిష్యత్తులో కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చెల్లింపు సమయంలో సర్దుబాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. 18 రాష్ర్టాల నుంచి రికవరీ చేయాల్సిన కాంపెన్సేషన్ ఫండ్‌ను, ఆయా రాష్ర్టాలకు భవిష్యత్తులో చెల్లించే పరిహారంనుంచి సర్దుబాటు చేయాలన్నారు. వీటిపై కన్వీనర్ సుశీల్‌కుమార్ మోదీ సానుకూలంగా స్పందించారు. వచ్చేనెల 1న మరోసారి సమావేశం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఇందులో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, వాణిజ్యపన్నులశాఖ కమిషనర్ నీతూకుమారి పాల్గొన్నారు.