Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

గులాబీ ధూం ధాం..!

-టీఆర్‌ఎస్ ప్లీనరీకి కనీవినీ ఎరుగని ఏర్పాట్లు -గులాబీ శోభను సంతరించుకుంటున్న హైదరాబాద్ -భారీ హంగులతో ముస్తాబవుతున్న ఎల్బీ స్టేడియం -నగరం నలుమూలలా స్వాగత తోరణాలతో ఆహ్వానం

KTR inspects the party pleenary arrangements

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత టీఆర్‌ఎస్ నిర్వహిస్తున్న ప్లీనరీకి నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రికార్డుస్థాయిలో సభ్యత్వ నమోదు పూర్తిచేసుకొని, సంస్థాగత నిర్మాణాన్ని ముగించుకొని జోష్‌లో ఉన్న గులాబీదళం అదే ఉత్సాహంతో ప్లీనరీ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ప్లీనరీని విజయవంతం చేసేందుకు అధిష్ఠానం నిర్ధేశించిన బాధ్యతలను ఏడు కమిటీలు సమర్ధంగా నిర్వహిస్తున్నాయి. ప్లీనరీకి మరో రెండు రోజులే గడువు ఉండటంతో చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ మహానగరం గులాబీ శోభను సంతరించుకుంటున్నది.

ప్లీనరీ ఏర్పాట్ల విశేషాలు.. -కీలకమైన తీర్మానాల కమిటీ కసరత్తు పూర్తయ్యింది. భోజన వసతులకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్లీనరీలో తెలంగాణ వంటకాలన్నీ ఘుమఘుమలాడనున్నాయి. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కమిటీ పార్కింగ్ ఏర్పాట్లు చూస్తున్నది. ఎన్టీఆర్ గార్డెన్స్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, పబ్లిక్ గార్డెన్‌ల్లో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. -ఎల్‌బీ స్టేడియంలో భారీ వేదిక నిర్మాణం దాదాపు పూర్తయింది. వేదికను 100X40 అడుగులతో నిర్మిస్తున్నారు. ఎండ, వానతో ప్లీనరీకి ఇబ్బంది కలుగకుండా పైకప్పును నిర్మిస్తున్నారు. -ప్లీనరీ వేదిక ముందు నాలుగు గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో రెండు వీఐపీ గ్యాలరీలు కాగా, ఒకటి మహిళా గ్యాలరీ, మరొకటి మీడియా గ్యాలరీ. ఎండవేడిమితో ఇబ్బంది రాకుండా ప్రాంగణంలో 300 ఎయిర్ కూలర్స్‌ను ఏర్పాటుచేస్తున్నారు. వేదికపై దృశ్యాలు స్పష్టంగా కనిపించేందుకు ఆరు భారీ ఎల్‌ఈడీ తెరలను అమరుస్తున్నారు. ఆరు భారీ ఎయిర్ బెలూన్లను స్టేడియంపై, ప్రాంగణంలోని భూమిపై మరో 20 బెలూన్లు ఏర్పాటు చేస్తున్నారు. స్టేడియం లోపలే మంచినీటి వసతిని కూడా కల్పిస్తున్నారు.

-హైదరాబాద్‌ను గులాబీమయం చేస్తూ సర్వాంగసుందరంగా అలంకరిస్తున్నారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో అలంకరణ కమిటీ సభా ప్రాంగణంతోపాటు నగర అలంకరణ పనులను పర్యవేక్షిస్తున్నది. స్టేడియం చుట్టూ భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. జిల్లాల నుంచి నగరానికి వచ్చే దారుల్లో దాదాపు 150 ప్రవేశ ద్వారాలు (స్వాగత ద్వారాలు) ఏర్పాటు చేస్తున్నారు. 75వేల భారీ గులాబీ జెండాలు, 50వేల చిన్న జెండాలు, 50 లక్షల వరుస తోరణాలతో నగరాన్ని ముస్తాబు చేస్తున్నారు. నగరంలోని 175 చౌరస్తాల్లో అలంకరణ పనులు చేపట్టారు. అనేక చౌరస్తాల్లో గులాబీ బెలూన్లు కూడా అమరుస్తున్నారు. -ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించేలా నగరవ్యాప్తంగా 400 హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ, ఆసరా పింఛన్లు, సన్నబియ్యం తదితర పథకాలతో హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు.

-టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవి ఏకగ్రీవం కావడంతో సీఎం కే చంద్రశేఖర్‌రావు పేరును ప్లీనరీ వేదికపై ఎన్నికల అధికారి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించగానే వేదిక ముందు అమర్చిన బ్లోయర్లతో గులాబీ పూల వర్షం కురిపించనున్నారు. అదే సమయంలో స్టేడియం బయట భారీ ఎత్తున పటాకులు కాల్చనున్నారు. ప్లీనరీ ముగింపు సమయంలో అరగంటపాటు ప్రత్యేకంగా శివకాశీ బాణాసంచా కాల్చనున్నారు.

ప్లీనరీ షెడ్యూలు ఇది… అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు ఉదయం 11 గంటల్లోపు ప్లీనరీ ప్రాంగణానికి చేరుకుంటారు. -ఉదయం 11-11.05 గంటలకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ జెండావిష్కరణ. అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులు -11.05 – 11.15 గంటల వరకు పార్టీ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వాగతోపన్యాసం -11.15- 11.30 గంటల వరకు పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు తొలి పలుకులు -11.30 -11.45 గంటల వరకు పార్టీ అధ్యక్షుడి పేరు ప్రకటన -11.45 – మధ్యాహ్నం ఒంటిగంట వరకు పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగం -1.00 – 2.00 గంటల వరకు – భోజన విరామం -రెండు గంటలకు ప్లీనరీలో తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో 12 తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. -ప్లీనరీకి వచ్చిన ప్రతినిధులతో కేసీఆర్ ముఖాముఖి. -రాత్రి ఎనిమిది గంటలకు ప్లీనరీ ముగింపు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.