Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

25 వేల పోస్టుల భర్తీ జూలైలో నోటిఫికేషన్: సీఎం కేసీఆర్ ప్రకటన

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేదికపై నుంచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిరుద్యోగులకు శుభవార్త వినిపించారు. వచ్చే నెలలో 25 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్నట్టు ప్రకటించారు. మన నిరుద్యోగ సోదరులు ఎన్నో ఏండ్లుగా ఉద్యోగాలు రావాలని ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఏర్పడిన ప్రతిబంధకాలు కొన్ని తొలగిపోవడం లేదు. అయినా మా సోదరులను ఎక్కువ కాలం నిరీక్షణకు గురిచేయకుండా.. ఇదే జూలై మాసంలో 25వేల ఉద్యోగాలకు వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో నోటిఫికేషన్లు ప్రకటించడం జరుగుతుంది.

KCR addressing in parade grounds on the occassion of Telangana formation day

-అంగరంగ వైభవంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు -జెండా ఎగురవేసి ప్రారంభించిన సీఎం -కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఈనెల నుంచే -పాలమూరుతోపాటు కాళేశ్వరం ఎత్తిపోతలకు త్వరలో శంకుస్థాపన -త్వరలోనే 50వేల డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం -జూలైలో భారీ ఎత్తున హరితహారం -పేదల సంక్షేమమే ధ్యేయం -ఆరు నెలల్లో విద్యుత్ సమస్య అధిగమించాం -2018 నాటికి 24 గంటల విద్యుత్ ఇస్తాం -ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడి

జూలై మాసం నుంచి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఈ శుభ సమయంలో ప్రకటిస్తున్నాను అని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర తొలి ఆవిర్భావ దినోత్సవం సంద ర్భంగా మంగళవారం పరేడ్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. అణువణువునా తెలంగాణ నిండుదనం ఉట్టిపడేరీతిలో సాగిన ఈ ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 9.27 గంటలకు జాతీయ జెండా ఎగురవేసి ప్రారంభించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో జరిగిన కవాతును, వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాల ప్రదర్శనలను తిలకించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు పురస్కారాలు అందించి సత్కరించారు.

అనంతరం పది నిమిషాలపాటు రాష్ట్రంలో గత సంవత్సరం సాధించిన ప్రగతి, భవిష్యత్తు ప్రణాళికలపై ప్రసంగిస్తూ నిరుద్యోగులతోపాటు కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా తీపి కబురు చెప్పారు. ఈ నెలనుంచే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రారంభించి ఏడాదిలోగా పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే కారణాంతరాల వల్ల గత సంవత్సరం చేపట్టలేక పోయిన రెండు పడక గదుల బృహత్తర పథకాన్ని ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, కాళేశ్వరం పథకాలకు త్వరలో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. గిరిజనులు, మైనార్టీల రిజర్వేషన్ల అంశంపై నియమించిన కమిటీలు త్వరలో నివేదికలు ఇస్తాయని ఆ వెంటనే రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. వచ్చే నెలనుంచి హరితహారం భారీ ఎత్తున చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. సీఎం ప్రసంగం ఇలా కొనసాగింది.. విద్యుత్ వెలుగులు తెచ్చాం.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాభినందనలు, శుభాకాంక్షలు. అనేక పోరాటాలు, అనేక త్యాగాలు, అనేక ఉద్యమాల ఫలితం.. గత సంవత్సరం జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమైన చారిత్రక ఘట్టం. ఈరోజు తొలి వార్షికోత్సవాన్ని సగర్వంగా, సంతోషంగా జరుపుకుంటున్నాం. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎన్నో ఇబ్బందులు వస్తాయని, ఎన్నో కష్టాలు వస్తాయని, తెలంగాణ రాష్ట్రం అంధకారం అవుతుందని సాగినటువంటి అసత్య ప్రచారాలను తిప్పి కొడుతూ… తెలంగాణ ప్రభుత్వం మీ అందరి ఆశీస్సులతో కేవలం ఆరేడు నెలల… అర్ధ సంవత్సర అనతి కాలంలోనే విద్యుత్తు వెలుగులు విరజిమ్మే దిశగా సాగిన విషయం మీ అందరికీ తెలుసు.

అంతేగాకుండా అతి తొందరలో స్వయం సమృద్ధిని సాధించడమే కాదు.. అవసరమైతే పొరుగు రాష్ర్టాలకు సరఫరా చేసే విధంగా తెలంగాణను భారతదేశంలోనే అత్యధిక మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మీ అందరి ఆశీస్సులతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.91వేల కోట్ల పెట్టుబడులను సమీకరించడం జరిగింది. నల్లగొండ జిల్లా దామరచర్లతో పాటు కొత్తగూడెం, మణుగూరుల్లో విద్యుత్తు ఉత్పత్తి కర్మాగారాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో రెండు ప్రారంభమైనాయి. దామరచర్లలో నేను త్వరలోనే అక్కడ శంకుస్థాపన చేయబోతున్నాను. దేశంలోనే అతి పెద్ద అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నల్లగొండ జిల్లాలో సాకారం కాబోతుందని ఈ శుభ సందర్భంలో సంతోషపూర్వకంగా తెలియజేస్తున్నాను. గతంలో నేను మీకు మనవి చేసినట్లుగా 2018 నాటికే తెలంగాణలో ఎవ్వరికైనా, ఏ రంగానికైనా 24 గంటలు నిరంతరాయ విద్యుత్తు సరఫరా జరుగుతుందని హామీ ఇస్తున్నాను

పేదల సంక్షేమమే ధ్యేయం.. పేదల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలను రూపకల్పన చేసిన విషయం మీకు తెలుసు. ఆరు కిలోల బియ్యం, ఆరోగ్యలక్ష్మి, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం… ఇలా అనేకానేక రంగాల్లో పథకాలు చేపట్టాం. రూ.200 నుంచి రూ.వెయ్యికి ఆసరా పింఛన్లు పెంచాం. రాష్ట్ర చరిత్ర, దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా సాలీనా రూ.28వేల కోట్లను కేవలం సంక్షేమం మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. గత చరిత్రలో ఎన్నడూలేని విధంగా రైతు సోదరులకు రూ.17వేల కోట్ల రుణ మాఫీని ప్రకటించి, చాలా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం.

ఉద్యోగమిత్ర పాలన… తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా ఉంటామని చెప్పాం. దానిని ఆచరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన విషయం మీకు తెలుసు. ఆర్టీసీ ఉంటుందా? లేదా మునిగిపోతుందా? అనే డోలాయమాన పరిస్థితుల్లో, గత ప్రభుత్వాలు అవలంభించిన దుష్ట విధానాల వల్ల కుంగి కునారిల్లిపోతున్న ఆర్టీసీని తీర్చిదిద్దడానికి ఈరోజు ఉద్యోగులకు 44 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడమే కాదు.. ఆ సంస్థ ఆద్భుతంగా ముందుకు కొనసాగేలా ప్రజల యొక్క రవాణా సౌకర్యాలు నెరవేర్చే విధంగా సంస్థను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అవసరమైతే ప్రతి సంవత్సరం ప్రభుత్వమే గ్రాంటు ఇచ్చినా సరే.. ఆర్టీసీని ఒక అద్భుతమైన సంస్థగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగిపోతున్నది. అంగన్‌వాడీ అక్కా చెల్లెళ్లకు, హోంగార్డు మిత్రులకు కూడా వేతనాలు పెంపు చేయడం జరిగిందనే విషయం మీకు తెలుసు.

రిజర్వేషన్ల అంశంలో పురోగతి.. మైనార్టీలు, గిరిజనులకు రిజర్వేషన్లు అమలు చేయడానికి హుదీదియా, చెల్లప్ప నేతృత్వంలో కమిషన్లు నియమించడం జరిగింది. ఆ కమిషన్లు అనతికాలంలోనే ప్రభుత్వానికి రిపోర్టులు ఇవ్వబోతున్నాయి. ఆ రిపోర్టులు అందిన వెంటనే ఈ రిజర్వేషన్ల పెంపు దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇస్తున్నాను.

ప్రజాభాగస్వామ్యంతో హరితహారం.. తెలంగాణలో ఒకప్పుడు అటవీ సంపద చాలా అద్భుతంగా ఉండేది. అదంతా సమైక్య రాష్ట్రంలో సన్నబడిపోయి, స్మగ్లర్ల పాలై అంతా ధ్వంసమైపోయింది. దాన్ని మళ్లీ పునరుద్ధరించుకొని భవిష్యత్తు తరాలకు చక్కటి పర్యావరణ, వాతావరణ… సమశీతోష్ణ తెలంగాణను అందించాల్సిన కర్తవ్యం నేటి మనందరి మీద ఉంది. అందుకే 300 కోట్ల మొక్కలను పెంచాలని హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాం. వచ్చే జూలై మాసంలో జరిగే ఈ హరిత కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరూ రైతాంగమంతా పాల్గొనాలి. చెట్ల పెంపకంలో విద్యార్థుల నుంచి ఐఏఎస్ అధికారుల వరకు అందరూ పాల్గొని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, తెలంగాణను ఒక హరితవనంగా అవతరింపజేయాలని కోరుతున్నా. ఎన్నికల ప్రణాళికలో ప్రకటించనివి.. ఎన్నికల సమయంలో చెప్పనివి.. చాలా కార్యక్రమాలు ప్రజలకు అందించడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో ప్రభుత్వం ఇదే విధంగా ముందుకు కొనసాగుతుంది.

జలసిరులు పండిద్దాం.. అందరూ ఎదురుచూస్తున్నటువంటి.. వలస జిల్లాగా , ఫ్లోరైడ్ జిల్లాగా మారిన పాలమూరు, నల్లగొండ జిల్లాల కన్నీళ్లు తుడవడానికి పాలమూరు ఎత్తిపోతల పథకానికి రూ.35వేల కోట్లతో త్వరితగతిన, త్వరలోనే ప్రారంభిస్తాం. ఉత్తర తెలంగాణ జిల్లాలను కరువు ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించడానికి రూ.30వేల కోట్లతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కూడా ఈనెలలోనే శంకుస్థాపన జరుగుతుంది. డబుల్ బెడ్ రూం ఇండ్ల స్కీంను గత సంవత్సరం అనేక కార్యక్రమాల వల్ల చేపట్టలేకపోయాం. ఈ సంవత్సరం ప్రతి ఇంటికి రూ.5.04 లక్షల ఖర్చుతో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయనివిధంగా ఈ సంవత్సరమే 50వేల గృహాలు రూ.2500 కోట్ల ఖర్చుతో నిర్మించబోతున్నాం. పోలీసు మిత్రులు తమ సమస్యలు వివరించారు. డీజీపీతో ఒక కమిటీని నియమించి త్వరలో వాటిని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నానని కేసీఆర్ తెలిపారు.

ఆధునీకరణ, అభివృద్ధి.. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలకు ప్రాధాన్యతనిస్తున్నది. రూ.400 కోట్లతో పోలీసు వ్యవస్థను ఆధునీకరించింది. ఈరోజు మనముందే ఈ పెరేడ్ గ్రౌండ్‌లో ఎటువంటి ఆధునిక సౌకర్యాలతో పోలీసు శాఖ పనిచేస్తుందో చూస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తీర్చిదిద్దుకున్నాం. ఇది సంతోషదాయకం. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్‌ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా పోలీసు శాఖ పటిష్టమైన శాంతిభద్రతలు నెలకొల్పడానికి అహోరాత్రులు కృషి చేస్తున్నది. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్లన్నీ దుస్థితిలో ఉండేవి. ఈరోజు రూ.20వేల కోట్లతో రోడ్ల కార్యక్రమాన్ని అద్భుతంగా తీసుకున్నం. జరుగతున్న అభివృద్ధి పనులన్నీ ప్రజల గమనంలో ఉన్నాయి.

చెరువులకు పునర్‌వైభవం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మరో అద్భుత కార్యక్రమం 11వ శతాబ్దంలోనే ప్రపంచానికే వాటర్‌షెడ్ ఏమిటో నేర్పించిన ఘనత సాధించిన కాకతీయ, రెడ్డి రాజులు మనకు 75వేల చెరువు, కుంటలు ప్రసాదించారు. సమైక్య రాష్ట్రంలో సగం సచ్చిపోయి… కునారిల్లిపోయి, కుట్రలకు బలైపోయినాయి. మన మంచినీటి, సాగునీటి చెరువులను పునరుద్ధరించేందుకు, పూర్వ వైభవాన్ని సంతరింపజేయాలని బద్ధ కంకణులై ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు అహోరాత్రులు పని చేస్తున్నారు. దానిలో లక్షలాది మంది రైతులు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఐదు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 46వేల చెరువులు, కుంటలన్నింటికీ పూర్వ వైభవాన్ని సంతరింపజేస్తామని హామీ ఇస్తున్నాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.