-తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, జగన్ నిర్ణయం -ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో రెండు రాష్ట్రాలు.. ప్రగతిభవన్‌లో ఆరుగంటలపాటు భేటీ -వీలైనంత త్వరగా 9,10 షెడ్యూల్ సంస్థల విభజన -ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో ఫోన్‌లో మాట్లాడిన ముఖ్యమంత్రులు

ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా.. సహజ సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు. కృష్ణానదిలో నీటి లభ్యత విషయంలో ప్రతి ఏడాది అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నందున గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించే విషయంలో ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. సోమవారం మధ్యా హ్నం ప్రగతిభవన్‌కు వచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనస్వాగతం పలికారు.
జగన్ ప్రతినిధి బృందంతో కలిసి సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఇద్దరు సీఎంలు దాదాపు ఆరు గంటలపాటు విభజన సమస్యలు సహా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై, దేశ, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పూర్తి సుహృద్భావ వాతావరణంలో, సరస్పర సహకార స్ఫూర్తితో ఈ సమావేశం జరిగింది. పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ముఖ్యంగా గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించే విషయంలో ఇద్దరు సీఎంలు సుదీర్ఘంగా చర్చించారు.

కృష్ణాలో నీటి లభ్యత ఒకే తీరుగా లేదు ‘కృష్ణానదిలో నీటి లభ్యత ప్రతి ఏడాది ఒకేరకంగా ఉండటంలేదు. చాలా సందర్భాల్లో ఎగువనుంచి కృష్ణానదికి నీరు రావటంలేదు. దీంతో ఆయకట్టులో ఉన్న రాయలసీమ, తెలంగాణలో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల రైతులు నష్టపోతున్నారు. పంటలకు సాగునీరు అందటం లేదు. పుష్కలమైన నీటి లభ్యత ఉన్న గోదావరి నీటిని తరలించి, అవసరమైన సందర్భంలో కృష్ణా ఆయకట్టు రైతులకు ఇవ్వడమే వివేకవంతమైన చర్య. దీనివల్ల అటు రాయలసీమ, ఇటు పాలమూరు, నల్లగొండ వ్యవసాయ భూములకు కచ్చితంగా నీరు అందుతుంది.

ఇప్పటికే సిద్ధంగా ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను ఉపయోగించుకుంటూనే గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించాలి. దీనివల్ల తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో అనుకున్న విధంగా గోదావరి నీటిని తరలించవచ్చు’ అని ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో స్థిర నిర్ణయం కుదిరింది. గోదావరి నీటిని ఎక్కడి నుంచి ఎటు తరలించాలి? ఎలా వినియోగించాలి? దీనికి సంబంధించిన మోడల్ ఎలా ఉండాలి? అనే విషయాలపై తదుపరి సమావేశంలో మరింత విపులంగా చర్చించాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల హక్కులకు భంగం కలుగకుండా, అవసరాలకు విఘాతం కలుగకుండా కృష్ణా ఆయకట్టుకు గోదావరి నీటిని తరలించేందుకు చేపట్టాల్సిన పథకాలపై నిర్మాణాత్మక ప్రణాళిక తయారీకి ఉభయ రాష్ట్రాల ఇంజినీర్లు సమావేశం కావాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు.
షెడ్యూల్ 9,10 అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎస్‌ల సమావేశం ‘విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని పలు అంశాలపై అనవసర పంచాయతీ ఉన్నది. దీని త్వరగా పరిష్కరించుకోవాలి. పరస్పర సహకారం, అవగాహనతో వ్యవహరిస్తే దీన్ని పరిష్కరించడం పెద్ద కష్టం ఏమీ కాదు’ అని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. పోలీసుల ప్రమోషన్లకు సంబంధించిన అంశాలపైనా చర్చించారు. సమావేశం నుంచే తమతమ రాష్ట్ర ప్రభుత్వాల సీఎస్‌లతో ఫోన్‌లో మాట్లాడి.. 9, 10 షెడ్యూళ్లలోని అంశాలను పరిష్కరించుకునే దిశలో త్వరలో సమావేశం కావాలని ఆదేశించారు. ఈ మేరకు ఏపీ సీఎస్ హైదరాబాద్‌కు ఒకసారి, తెలంగాణ సీఎస్ ఏపీకి ఒకసారి తమ అధికారుల బృందంతో వెళ్లనున్నారు. ఏపీ సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలు ఉన్నారు. జగన్‌కు స్వాగతం పలికినవారిలో మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్‌కుమార్ ఉన్నారు.