-కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ భూమిపూజ -తెలంగాణ చరిత్రలో నవశకానికి నాంది -ఇది మరో గంగావతరణం!
తెలంగాణలో నవ శకారంభం. దశాబ్దాల చెరనుంచి గోదావరిని విముక్తం చేసే ఓ మహాయజ్ఞం. తెలంగాణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే మరో భగీరథ తపస్సు. దశాబ్దాలుగా తెలంగాణ బువ్వకేడ్చింది. దూపకేడ్చింది. నెర్రెలు విచ్చిన నేలలు చూసి గుండెలవిసేలా విలపించింది. బతుకు వేటలో కన్నవారినీ.. ఉన్న ఊరునూ వదిలి వలసల బాట పట్టింది. బొంబాయి, దుబాయి, బొగ్గుబాయిగా బతికింది. ఎండిన పొలాలై.. కూలిన గుడిస్లై.. దిగులుగా దీనంగా మిగిలింది. పెండ్లిళ్లు చావులే చూపులుగా మారిపోయింది. కుట్రపూరిత సమైక్యాంధ్రం లోతెరుగని అమాయకత్వం తెలంగాణ ఎత్తు లెక్కలు చెప్తే శాపమనుకుంది. పూర్వజన్మ పాపమని సర్దుకుంది. కృష్ణా, గోదావరులను చెరబట్టి జీవనాడి చెరువుల వ్యవస్థను ధ్వంసం చేసినా ప్రకృతి విపత్తేనని భావించింది. పల్లె పల్లె పల్లేైర్లె ఇల్లిల్లు నిర్మానుష్యమై అడిగే దిక్కులేక అనాథగా బతికింది. కానీ కాలం తెలంగాణ కష్టాలకు పరిష్కారాన్ని చూపింది. ఉద్యమమై కేసీఆర్ రూపంలో చూపింది. స్వరాష్ట్రమై తెలంగాణ పాలనగా చూపింది. ఇంటిపార్టీ ప్రణాళికలుగా చూపింది. ఎండిపోయి బీటలు వారిపోయిన తెలంగాణ మాగాణాల గొంతు తడిపే మార్గాన్ని అపర భగీరథుడై కేసీఆర్ రూపొందించిన ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో చూపింది. వందేండ్ల కష్టానికి వెయ్యేండ్లకు సరిపోయే వరాన్ని చూపింది.
ఇవాళ అంతర్రాష్ర్టాలు, వన్యప్రాణులు, పర్యావరణ ఆటంకాల కుట్రలను అటకెక్కించి కాళేశ్వరం ప్రాజెక్టు పట్టాలకెక్కింది. సంకెళ్లను బద్దలు కొట్టి తెలంగాణకు గోదావరి మళ్లింపునకు శ్రీకారం చుట్టింది. 200 టీఎంసీలతో గోదావరి మీద అత్యంత భారీ ప్రాజెక్టుగా కాళేశ్వరం చరిత్రకెక్కుతున్నది. తెలంగాణ ప్రాణధారగా మారుతున్నది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను తిరగరాయనున్నది. సామాజిక సాంస్కృతిక వైభవానికి బాటలు వేయనున్నది. ఇక తెలంగాణ చరిత్ర అంటే కాళేశ్వరానికి ముందు.. కాళేశ్వరం తర్వాత! ఇది శుభోదయం. నవోదయం. మహోదయం!
తెలంగాణ రాష్ట్రం అయిందే మా హక్కు మేం సాధించుకోవడానికి.. తెలంగాణ రాష్టం తెచ్చుకున్నదే మా కరువును తరిమి వేసుకోవడానికి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే మా ప్రజల సాగు, తాగునీటి గోస తీర్చడానికి. ఆరు నూరైనా సరే.. ఏదిఏమైనా సరే.. పిడుగులు పడ్డా.. భూకంపాలు వచ్చినా.. కృష్ణా, గోదావరిలో కలిపి అధికారికంగా కేటాయించిన 1300 టీఎంసీల నీళ్లను తెలంగాణ వాడుకొని తీరుతుంది. కచ్చితంగా ఆ మేరకు ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతాయి. ఎవ్వరు కూడా దీనిని ఆపలేరు. ఆ పిచ్చి ప్రయత్నాలు ఏవైనా ఉంటే ఇప్పటికైనా మానుకోవాలి. అనవసరమైన పిచ్చి ఆలోచనలకు పోవద్దు.. – ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

