– స్వయంగా వెళ్లి.. సమస్యలు విన్న కేసీఆర్ పేద, ధనిక తేడాల్లేకుండా అందరికీ సమాన ప్రాతినిధ్యం ఇస్తానని సీఎం కే చంద్రశేఖర్‌రావు మరోసారి నిరూపించుకున్నారు. సమస్యలు చెప్పుకునేందుకు సచివాలయానికి వచ్చిన గిరిజన మహిళల వద్దకు స్వయంగా వెళ్లి.. వారి సమస్యలు విని, వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. గురువారం సచివాలయం వద్ద ఈ సందర్భం చోటు చేసుకుంది. సచివాలయానికి చేరుకున్న సీఎంకు సీ బ్లాక్ బారికేడ్‌లకు అవతలి వైపు పెద్ద సంఖ్యలో గిరిజన మహిళలు కనిపించారు.

వారంతా అప్పటిదాకా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని సీఎం గుర్తించారు. కారు దిగి వాళ్ల దగ్గరికే వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాధారణంగా సీఎంలెవరూ బారికేడ్ల దగ్గరికి వచ్చి ఫిర్యాదులను స్వీకరించలేదు. సీఎం సామాన్యుల చెంతకే చేరుకొని వారితో ముచ్చటించడంతో మీడియా, పోలీసు బలగాలు ఒక్కసారిగా అప్రతమత్తమయ్యాయి. ఇక్కడెందుకొస్తున్నారోనని ఫొటోగ్రాఫర్లు కెమెరాలను క్లిక్‌మనించారు. గిరిజనుల దగ్గరికి వచ్చేంతవరకు ఎవరికీ విషయం అర్థం కాలేదు. గిరిజనుల వద్దకు వచ్చిన సీఎం.. వారి సమస్యలు తెలుసుకుని.. వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత వారిని లోపలికి పిలిచి ఫొటోలు దిగారు. సీఎంతోపాటు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తదితరులు ఉన్నారు.
సీఎంను కలిసిన ఎల్‌హెచ్‌పీఎస్..: లంబాడీ హక్కుల పోరాట సమితి నాయకులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్‌నాయక్ నేతృత్వంలో సీఎంను కలిశారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, దళిత, గిరిజన యువతుల పెండ్లిడ్ల కోసం కళ్యాణలక్ష్మి పథకంపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని సీఎం అన్నట్లు సంఘం నేతలు పేర్కొన్నారు. సీఎంను కలిసిన వారిలో శ్రీనివాస్‌నాయక్, శంకర్‌నాయక్ తదితరులున్నారు.