-హైదరాబాద్‌కు పుష్కలంగా తాగునీరు
-30 ఏండ్లకు సరిపడాలా పక్కా వ్యవస్థ
-అభివృద్ధిలో దేశానికి మనమే నమూనా
-పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి

హైదరాబాద్ తాగునీటి సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టడానికి గండిపేట జలాశయానికి కాళేశ్వర జలాలను తీసుకొస్తామని పురపాలక, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. సముద్ర మట్టానికి ఎంతో ఎత్తులో ఉన్న కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ ద్వారా రాజధాని నగరానికి నీటిని సరఫరా చేయాలని.. గండిపేటకు నీటిని తరలించడం ద్వారా నగరంలో ఎప్పటికీ నీటి సమస్య తలెత్తకుండా చూడాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. చెన్నైలో ఎదురవుతున్న నీటి ఎద్దడి పరిస్థితులు మన నగరానికి ఉండొద్దనేది కేసీఆర్ భావన అని, దానికి అనుగుణంగా రానున్న 30 ఏండ్లకు సరిపడా మంచినీటిని అందించడానికి ఇప్పటినుంచే ప్రణాళిక రూపొందించి ప్రాజెక్టులను పూర్తిచేస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదని తెలిపారు. సోమవారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అలాపూర్ టౌన్‌షిప్‌లో ప్రజలకు తాగునీటిని అందించేందుకు చేపడుతున్న ఓఆర్‌ఆర్ ఫేజ్ 2లోని ప్యాకేజ్- 2 పనులను మంత్రి కేటీఆర్.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఫేజ్-2లో భాగంగా రూ.1,200 కోట్ల నిధులతో ఓఆర్‌ఆర్ పరిధి మొత్తానికి తాగునీటిని అందించే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుత అవసరాలు తీరుస్తూనే 2051 వరకు వచ్చే అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనులు చేపట్టామని వెల్లడించారు. కృష్ణానది నుంచి సుంకిశాల వద్ద నీటిని తీసుకొని నగరానికి సరఫరా చేసేందుకు రూ.1,400 కోట్లతో కొత్త పైప్‌లైన్ నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు. ‘గతంలో బెంగాల్‌లో మొదట అభివృద్ధి జరిగేది. దాన్ని చూసి దేశంలో అమలు చేసేవారు. కానీ కేసీఆర్ సీఎం అయిన తర్వాత చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులతో అభివృద్ధిలో దేశానికి తెలంగాణ నమూనాగా మారింది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, ఎస్ వాణీదేవి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితా హరినాథ్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, జలమండలి అధికారులు పాల్గొన్నారు.
ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్: సబితా ఇంద్రారెడ్డి
భవిష్యత్తులో పెరగనున్న జనాభాకు తగ్గట్లుగా అభివృద్ధి జరగాలనే ముందుచూపుతో సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గతంలో హైదరాబాద్ శివారు ప్రాంతాలకు జీహెచ్‌ఎంసీ ప్రాంతం నుంచి కష్టపడి నీటిని తరలించాల్సి వచ్చేదని, తెలంగాణ వచ్చాక తర్వాత మౌలిక సదుపాయాలకు సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు.