Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

గల్ఫ్‌ కార్మికులకూ బీమా ఇస్తాం..

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే గల్ఫ్‌ కార్మికులకు కూడా బీమా సదుపా యం వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చా రు. బీడీ కార్మికులకు పెన్షన్‌ ఇచ్చేందుకు ప్రస్తుతం ఉన్న కటాఫ్‌ తేదీని ఎత్తివేసి కొత్తవారికి కూడా పెన్షన్‌ వర్తింపజేస్తామని భరోసా ఇచ్చారు. గురువారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌, బోథ్‌, నిజామాబాద్‌ రూరల్‌, నర్సాపూర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డితోపాటు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్‌.. గల్ఫ్‌ కార్మికులకు కూడా బీమా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉండగా ఎక్కడాలేని విధంగా బీడీ కార్మికులతోపాటు ఆ రంగం లో పనిచేస్తున్న ప్యాకర్లు, టేకేదార్లకు కూడా పెన్షన్‌ ఇస్తున్నామని గుర్తుచేశారు. గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చామని, మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత గిరజనేతరులకు కూడా పోడు పట్టాలు ఇస్తామని భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్‌, బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు
కాంగ్రెస్‌, బీజేపీకి ఓట్లడిగే హక్కే లేదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఒకటి తెలంగాణను ముం చిందని, బీజేపీ తెలంగాణ అడిగిన ఏ ఒక్కటీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నదని ధ్వజమెత్తారు. మతపిచ్చి లేపే బీజేపీని చెత్తకుప్పలో పడేయాలని, కాంగ్రెస్‌ దుష్ప్రచారాలను నమ్మొద్దని కోరారు.

పింఛన్‌ను రూ.5 వేలకు పెంచుతాం..
బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసమని, అలుపెరగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించామని ఇదంతా కండ్ల ముందే జరిగిందని సీఎం కేసీఆర్‌ వివరించారు. మొక్కుబడిగా కాకుండా సామాజిక, ప్రభుత్వ బాధ్యతగా విధివంచితులు, వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు ఇస్తున్నామని, ఎన్నికల తరువాత ఆ మొత్తాన్ని రూ.5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ కిట్‌, కల్యాణలక్ష్మి, కంటివెలుగు, అమ్మ ఒడి వాహనాలను ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఉదహరించారు. నీటి తీరువా రద్దు చేశామని, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్‌ సరఫరా చేస్తున్నామని, ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తున్నదని వివరించారు. వ్యవసాయాన్ని స్థిరీకరించడంతో రాష్ట్రం బాగుపడిందని చెప్పారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఆయుధం ఓటు. రాయేదో, రత్నమేదో గుర్తించి ఓటేయాలి. అప్పుడే ప్రజలకు లాభం జరుగుతుంది. మంచి ప్రభుత్వం రాకుంటే ప్రజలకు చెడు జరుగుతుంది. కాంగ్రెస్‌ 50 ఏండ్ల పాలన, బీఆర్‌ఎస్‌ 10 ఏండ్ల పాలనను బేరీజు వేయాలి. దీనిపై బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో చర్చ పెట్టాలి.

-సీఎం కేసీఆర్‌

రైతుబంధు కావాలా? రాబందు కావాలా..?
కాంగ్రెస్‌ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ప్రజలు కట్టే పన్నులను రైతుబంధు ద్వారా వేస్టు చేస్తున్నామని అనాలోచితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతబంధు ఉండాలా? వద్దా? అని ప్రశ్నించారు. రైతబంధు ఉండాలన్నా, అది రూ.16 వేలకు పెరగాలన్నా బీఆర్‌ఎస్‌ గెలవాలని పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు 24 గంటల కరెంటు వృథా అని మాట్లాడుతున్నారని, అధికారంలోకి వస్తే 3 గంటల కరంటే ఇస్తామంటున్నారని నిప్పులు చెరిగారు. ‘మూడు గంటల కరెంటుతో పొలం ఎట్ల పారతదని అంటే రైతుల దగ్గర 10 హెచ్‌పీ మోటర్‌ ఉండాలని చెప్తున్నారు. మరి 10 హెచ్‌పీ మోటర్లు ఎవరు కొనిస్తరు?’ అని ప్రశ్నించారు. కరెంటు కావాల్నా? కాంగ్రెస్‌ కావాల్నా? రైతుబంధు కావాల్నా? రాబంధు కావాల్నా? అనేది రైతులు నిర్ణయించుకోవాలని తెలిపారు.

కాళేశ్వరంతో నర్సాపూర్‌ వజ్రపు తునక
గతంలో నర్సాపూర్‌లో మూడు, నాలుగురోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవని, నేడు కోమటిబండ లింక్‌ ద్వారా 24 గంటలు నీళ్లు వస్తున్నాయని సీఎం కేసీఆర్‌ వివరించారు. కాంగ్రెస్‌ హయాంలో మంజీరా, హల్దీ నదులపై చెక్‌డ్యామ్‌లు కట్టకూడదని బ్యాన్‌ చేశారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం వాటి మీద చెక్‌డ్యామ్‌లు కడితే ఈ రోజు అవి జీవనదుల్లా మారాయని వివరించారు. కాళేశ్వరం కాల్వ పూర్తయితే నీటిసౌకర్యం వచ్చి నర్సాపూర్‌ వజ్రపు తునకవుతుందని తెలిపారు. పిల్లుట్ల కెనాల్‌ ప్రారంభోత్సవానికి తానే స్వయంగా వస్తానని హామీ ఇచ్చారు. దౌల్తాబాద్‌, కాసర్లను మున్సిపాలిటీ చేస్తామని, రంగపేటను మండలంగా చేస్తామని, రంగంపేట డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల అభీష్టం మేరకు హత్నుర్‌ మండలంలోని గ్రామాలను జిన్నారంలో కలపుతామని, ఐటీఐ కాలేజీని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత మదన్‌రెడ్డి తనకు చిరకాల మిత్రుడని, భవిష్యత్‌లోనూ ఆయనకు సముచితస్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం సునీతాలక్ష్మారెడ్డికి టికెట్‌ ఇచ్చామని, ఇద్దరి సమన్వయంతో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

పచ్చిఅబద్దాలు చెప్పడంలో కాంగ్రెసోళ్లు మొనగాళ్లు. అసైన్డ్‌భూములను గుంజుకుంటున్నామని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా గుంజుకుంటరా? సాధ్యమా? మా మ్యానిఫెస్టోలోనే చెప్పాం. అసైన్డ్‌భూములకు కొంతకాలం దాటిన తరువాత పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. దళిత, గిరిజన ఎమ్మెల్యేలు కూడా కావాలని కోరారు. ఎన్నికల తరువాత పట్టాలు చేసి హక్కులు కల్పిస్తాం.
అసైన్డ్‌భూములు ఎటూ పోవు. అసత్య ప్రచారాలను నమ్మకూడదు.

-సీఎం కేసీఆర్‌

రాష్ట్రాన్ని ఒక దరికి తెచ్చాం
‘14 ఏండ్లు పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. ప్రజలు ఆశీర్వదించి అధికారం అప్పగిస్తే పదేండ్ల పాలనలో సాగు, తాగునీళ్లు, కరెంటు సమస్యలను పరిష్కరించాం. కులమతాలకు అతీతంగా ఎవరి అవసరాలకు అనుగుణంగా వారిని ఆదుకుంటున్నాం. ఒక ప్రణాళికతో మంచి పద్ధతుల్లో రాష్ట్రాన్ని ఒక దరికి తెచ్చాం. ఇప్పుడు దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికోసం ఒక్క కేసీఆరే కాకుండా మీరు కూడా కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎన్నికల్లో మీరే కొట్లాడాలి’ అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

అనిల్‌జాదవ్‌ను ఆశీర్వదించాలి
కాంగ్రెస్‌ పాలనలో బోథ్‌ ప్రజలు అనుభవించిన బాధలు తనకు తెలుసని, చీటికి మాటికి కర్ఫ్యూ ఉండేదని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. ఈ పదేండ్లలో ఒక్కసారి కూడా కర్ఫ్యూ లేదని చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం పాలిస్తున్నదని తెలిపారు. బోథ్‌ నియోజకవర్గంలోని ముక్రాకే సర్పంచ్‌ మీనాక్షి అద్భుతమైన ప్రగతిని సాధించారని, జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చి తెలంగాణ రాష్ట్రం పేరునే నిలబెట్టిన బిడ్డ మీనాక్షి అని కొనియాడారు. బోథ్‌ నియోజకవర్గంలో సుమారు 10 వేల ఎకరాలకు పోడు పట్టాలిచ్చామని చెప్పారు. ‘నన్ను ఎవరూ అడగలేదు. నేనే సర్వే చేయించిన. కుంటాలవాగు మనదగ్గరి నుంచే పోతది. ఇకడ కుప్తి రిజర్వాయర్‌ కట్టాలి. ఈ టర్మ్‌లో కుప్తి రిజర్వాయర్‌ను మొదలుపెట్టించి పూర్తి చేయించే బాధ్యత నాది’ అని భరోసా ఇచ్చారు. అనిల్‌జాదవ్‌ను గెలిపిస్తే నెలరోజుల్లోనే బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌ చేస్తామని, డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేస్తామని, కోల్డ్‌స్టోరేజీ పెట్టిస్తామని హామీ ఇచ్చారు. చనాకా, కోరాట కూడా పూర్తవుతున్నదని, పిప్పల్‌కోట్‌ రిజర్వాయర్‌కు పెన్‌గంగ నీళ్లు తీసుకొస్తే నీళ్లు పుష్కలం అవుతాయని, ఆ బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. ‘అనిల్‌జాదవ్‌ యువకుడు. మంచివ్యక్తి. ప్రజల మనిషి. అందరితో కలిసి మెలిసి ఉండే వ్యక్తి’ అని సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు. పక్క నియోజకవర్గంలోనే జోగు రామన్న ఉంటారని, ఆయన పరపతి కూడా ఉంటుందని భరోసా ఇచ్చారు.

నిజాం రాజులు ప్రాజెక్టులు కట్టారు. చెరువులు తవ్వారు. అనాటి నుంచి హిందువులు, ముస్లింలు దశాబ్దాలుగా కలిసి ఉంటున్నారు. అలాగే ఉండాలి. మతపిచ్చి లేపే బీజేపీని చెత్తకుప్ప మీద పడేయాలి. బీజేపీకి ఓటేస్తే వేస్టు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతకన్నా వేసు.

-సీఎం కేసీఆర్‌

మతపిచ్చి లేపే బీజేపీని చెత్తకుప్ప మీద పడేయాలి
బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని, పదేండ్లలో తెలంగాణకు ఒక్క నవోదయ, మెడికల్‌ కాలేజీ ఇవ్వని ఆ పార్టీకి ఒక్క ఓటు కూడా వెయ్యొద్దని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ‘బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నరు? గడ్డికోత్తున్ర. బీజేపీ ఎంపీలు నోరు తెరువరు. మోదీ ఒకటీ ఇవ్వడు. వీళ్లకు అడిగే దమ్ములేదు’ అని నిప్పులు చెరిగారు. ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో బీజేపీ ఓట్లు అడుగుతున్నదో ప్రజలే నిలదీయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే రానున్నదని, ఈ నేపథ్యంలో అసెంబ్లీనే కాదు రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ అన్ని స్థానాలను బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని, తెలంగాణ తడాఖా చూపాలని పిలుపునిచ్చారు.

జోగు రామన్నతోనే ఆదిలాబాద్‌ అభివృద్ధి
లోయర్‌ పెనుగంగా ప్రాజెక్టు పేరుతో ఆదిలాబాద్‌ ప్రజలను కాంగ్రెస్‌ 50 ఏండ్లపాటు ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఊరించిందని, వాగ్ధానాలకే పరిమితమైందని అని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. కానీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జోగురామన్న పట్టుబట్టి చనాకా కోరాట బరాజ్‌ పూర్తి చేయిస్తున్నారని వివరించారు. ఇప్పటికే పంప్‌హౌజ్‌లు, మెయిన్‌కాలువలు పూర్తయ్యాయని, డిస్ట్రిబ్యూటరీ కాల్వల పనులు కొనసాగుతున్నాయని తద్వారా 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో పిప్పల్‌కోట్‌ రిజర్వాయర్‌ను లింక్‌ చేస్తే మరింత లబ్ధి చేకూరుతుందని చెప్పారు. గతంలో సాత్నాలా ప్రాజెక్టు ద్వారా 8 వేల ఎకారాలకు కూడా సాగునీరందలేదని, నేడు 20 వేల ఎకరాలకు ఇస్తున్నామని వెల్లడించారు. లక్ష్మీపూర్‌ రిజర్వాయర్‌ను కూడా బాగు చేశామని గుర్తుచేశారు. జోగురామన్న చాలా ఉత్తమమైన, సామాన్యమైన, ప్రజల్లో కలిసి ఉండే వ్యక్తని ప్రశంసించారు. ఆదిలాబాద్‌కు ఇప్పటికే ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలు తెచ్చారని తెలిపారు. ఆదిలాబాద్‌ అభివృద్ధి జోగు రామన్నతోనే సాధ్యమవుతుందని, మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ దవాఖానలు తెలంగాణ రాకముందు ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. కిడ్నీ రోగులు డయాలసిస్‌ కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సివచ్చేది. అప్పట్లో డయాలసిస్‌ సెంటర్లు మూడు మాత్రమేఉండేవి.. తెలంగాణ ఏర్పాటు తరువాత వాటిని 103కు పెంచుకున్నాం. కిడ్నీ రోగులను కూడా రూ.2000 పెన్షన్‌ ఇచ్చి ఆదుకుంటున్నాం.

-సీఎం కేసీఆర్‌

ప్రజా నాయకుడు గోవర్ధన్‌
బాజిరెడ్డి గోవర్ధన్‌ ప్రజానాయకుడని, ప్రజల ఎమ్మెల్యే అని, ఆయన ఇం టినిండా ఎప్పుడూ పబ్లికే ఉంటారని సీ ఎం కేసీఆర్‌ కొనియాడారు. ఎంతమం ది వచ్చినా వాళ్ల పనులు చేసిపెట్టే వ్యక్త ని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. డిచ్‌పల్లి నియోజకవర్గంలో 50 తండాలను జీపీలుగా చేశామని, 3,085 ఎకరాల పోడుభూములు పంపిణీ చేశామని గుర్తుచేశారు. ఎన్నికల తర్వాత మిగిలిపోయిన పోడు భూములను పంపిణీచేస్తామని భరోసా ఇచ్చారు. ఎస్టీల రిజర్వేషన్‌ 10 శాతాని కి పెంచడంతో గిరిజన బిడ్డలకు విద్య, ఉద్యోగ అవకాశాలు పెరిగాయని చెప్పా రు. మంచిప్ప రిజర్వాయర్‌ పనులు త్వరలో పూర్తవుతాయని, ఇజ్రాయెల్‌ టెక్నాలజీతో మూడు ఎకరాలకు ఒక ఔట్‌లెట్‌ పెట్టి నీళ్లు అందజేస్తామని చెప్పారు. ఈ నీళ్లు బాల్కొండతోపాటు నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గానికి వస్తాయని, రిజర్వాయర్‌ నిర్వాసితులకు మంచి నష్ట పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.

మైనార్టీలను ఓటు బ్యాంకుగానే కాంగ్రెస్‌ వాడుకున్నది. మైనార్టీల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం పదేండ్లలో కేవలం రూ.900 కోట్లు ఖర్చు చేసింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.12 వేల కోట్లు ఖర్చు చేసింది. మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేశాం. తద్వారా మైనార్టీ విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు.
-సీఎం కేసీఆర్‌

వేముల సూచనతో బీమాపై ప్రకటన
-ఉత్తర తెలంగాణలో ఎక్కువ మందికి లబ్ధి
-గల్ఫ్‌ వెళ్లినవారి కుటుంబాల్లో హర్షాతిరేకాలు
నిజామాబాద్‌ జిల్లాలో ప్రజాఆశీర్వాద సభ సందర్భంగా జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ వెళ్లినవారికి సైతం బీమా కల్పిస్తే బాగుంటుందని చేసిన సూచనను ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెచ్చుకున్నారు. వెంటనే సభా వేదికపైనే గల్ఫ్‌ వెళ్లినవారికి కూడా బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ ఇచ్చిన ఈ ఒక్క హామీతో ఉత్తర తెలంగాణలోని లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనున్నది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ ప్రాంత వాసులకు లాభం జరగనున్నది. సీఎం కేసీఆర్‌ హామీపై ఆయా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.