-కారిడార్‌లో పటిష్ఠ భద్రతా చర్యలు -ద్వితీయ శ్రేణి నగరాలకు పరిశ్రమ విస్తరణ -టిటా ప్రతినిధులతో పీఆర్ అండ్ ఐటీ మంత్రి కేటీఆర్

తెలంగాణకు ప్రతిష్ఠాత్మకమైన ఐటీఐఆర్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకోసం అవసరమైన అన్ని చర్యలు చేపడతామని రాష్ట్ర పంచాయతీరాజ్, సాంకేతిక సమాచార శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. కేంద్రం నిర్దేశించిన గడువులోగానే ప్రాజెక్టును పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి రెండేళ్లలోనే పూర్తిస్థాయిలో విద్యుత్ కొరతను అధిగమిస్తామని చెప్పారు. బుధవారం తన నివాసంలో కలిసిన తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) ప్రతినిధులతో కేటీఆర్ మాట్లాడారు. ఐటీ రంగం అభివృద్ధికి ప్రత్యేకంగా గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. నిరుద్యోగులు, ఉద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
టిటా ప్రతినిధుల సూచన మేరకు నామమాత్రపు ఎంప్లాయిమెంట్ చార్జీలతోనే ఇన్స్యూరెన్స్ వ్యవస్థను రూపొందించే అంశంపై కసరత్తు చేస్తామన్నారు. ఐటీ జోన్లలో మహిళా ఉద్యోగుల రక్షణ కోసం పటిష్ఠ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకే పరిమితమైన ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాల్సిన అవసరముందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ పారిశ్రామికవేత్తలు ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తే భారీగా రాయితీలు అందిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా టిటా అధ్యక్షుడు సందీప్‌కుమార్ మాట్లాడుతూ ఐటీఐఆర్ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే విద్యుత్ కొరత లేకుండా చూడాలని మంత్రిని కోరారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు 3400 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని చెప్పారు. ఐటీ ఉద్యోగులు రోజుకు 14 గంటలు పని చేయడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిపారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ సంస్థ నివేదిక ప్రకారం మానసిక ఒత్తిడి కారణంగా ఐటీ ఉద్యోగుల్లో 36 శాతం మంది మద్యానికి బానిసలుగా మారారని, విడాకులు తీసుకుంటున్న జంటల్లోనూ టెక్కీలే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో కంప్యూటర్ కోర్సుల పేరిట రూ.10 వేల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తోన్న సంస్థలున్నాయని, వాటి పనితీరును పరిశీలించేందుకు మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని సందీప్‌కుమార్ కోరారు. మంత్రిని కలిసిన వారిలో టీటా ఉపాధ్యక్షుడు రాణాప్రతాప్, నవీన్ గడ్డం, సింధుజ, మధురవాణి, నవనీత, అశ్విన్‌చంద్ర, భరత్‌కుమార్ వాకిటి, సందీప్‌గౌడ్, పశుపతి తదితరులున్నారు.
పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేయండి: కేటీఆర్‌కు టిఫ్ వినతి తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేయాలని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య(టిఫ్) ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పీఆర్ శాఖ మంత్రి కే టీ రామారావును కోరారు. బుధవారం కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలుసుకున్న టిఫ్ ప్రతినిధులు పలు పారిశ్రామికరంగ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. నిరుద్యోగయువతకు ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయమార్గాలు పెరగాలంటే పరిశ్రమల విస్తరణ అనివార్యమని సమాఖ్య అధ్యక్షుడు కే సుధీర్‌రెడ్డి తెలిపారు. సమైక్య రాష్ట్రంలో నష్టపోయిన తెలంగాణ పారిశ్రామిక రంగానికి రాయితీలు ప్రకటించకుండా సీమాంధ్రకే పరిమితం చేయడం వల్ల పారిశ్రామికవేత్తలు అక్కడే పరిశ్రమలు ఏర్పాటుచేసే అవకాశాలున్నట్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
వారి సమస్యలను సావధానంగా విన్న మంత్రి కేటీఆర్ తెలంగాణలోనూ ట్యాక్స్ హాలీడేను ప్రకటించే విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తుందని వారికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య ప్రతినిధులు ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ను కూడా కలిసి పరిశ్రమల స్థితిగతులను వివరించారు. మంత్రులను కలిసిన వారిలో సమాఖ్య ప్రధాన కార్యదర్శి గోపాలరావు, సుధాకర్, సుధీప్‌రెడ్డి తదితరులున్నారు.