Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఫెడరల్ ఫ్రంట్ రావాలి

-ఏం జరిగిందో, ఏం జరుగాలో చెప్తే.. కొందరి పీఠాలు కదులుతున్నయ్
-తిట్టినతిట్టు తిట్టకుండా తిడుతున్నరు.. నన్ను చంపుతనన్నా భయపడేది లేదు
-కొత్త ఆర్థిక, వ్యవసాయ విధానాలు రావాలి.. ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట పొలికేక పెట్టాలి
-దేశం బాగుపడాలంటే మార్పులు రావాలి.. ఇండియాలో ఒక కొత్త ఆలోచన పుట్టాలి
-మీ దీవెనతో భారతదేశాన్ని బాగుచేద్దాం
-కాంగ్రెస్, బీజేపీలు స్కీముల పేర్లు తప్ప.. ప్రజల తలరాత మార్చలేదు
-సింగపూర్‌కంటే మనం ఏం తక్కువ? అయినా వెనుకబాటు ఎందుకు?
-దరిద్రపుగొట్టు విధానాలతో అభివృద్ధికి దూరం
-నిజామాబాద్ శంఖారావ సభలో సీఎం కేసీఆర్.. 21న టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడి

దేశానికి కొత్త ఆర్థిక, వ్యవసాయ విధానాలు రావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. పొరుగునున్న చైనా 1971-75 వరకు మనకంటే తక్కువ జీడీపీలో ఉండేదని, ఈరోజు మనకంటే నాలుగు రెట్లు పెరిగిందని ఉదహరించిన కేసీఆర్.. వాళ్లు ఎలా బాగుపడ్డారో.. మనం ఇక్కడనే ఎందుకు ఉన్నామో ఆలోచించాలన్నారు. దేశంలో పరిస్థితులు మారాలంటే ఎవరో ఒకరు ఎక్కడోకాడ పొలికేక పెట్టాలని, గర్జించాలని పిలుపునిచ్చారు. అలా ముందుకుపోతేనే ఈ దేశంలో దరిద్రం పోతుందన్నారు. ఇందుకోసం దేశంలో కొత్త ఆర్థికవిధానం రావాలె. న్యూ అగ్రికల్చర్ పాలసీ రావా లె. రైతుల్లో అశాంతిపోవాలె. రైతులకు గిట్టుబాటుధర రావాలె. రైతుబంధు, రైతుబీమా యావత్తు దేశంలో అమలుకావాలె. దేశాన్ని క్రాప్‌కాలనీల కింద విభజన చేయాలె. ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలె. ఆర్థిక పరపతి పెరుగాలంటే న్యాయపరిపాలనలో మార్పులు రావాలె. లేకుంటే మార్పుండదు. దేశం బాగుపడాలంటే ఎక్కడెక్కడ అవసరమో అక్కడ మార్పులు చేసుకోవాలె అని వివరించారు. అవన్నీ జరుగాలంటే ఫెడరల్ ఫ్రంట్ రావాలని చెప్పారు. నిజమైన ప్రజాప్రభుత్వం.. ప్రజలే కేంద్ర బిందువుగా పరిపాలన చేస్తే వీటన్నింటికీ పరిష్కారం ఉంటుందన్నారు. గతంలో ఏం జరిగిందో, భవిష్యత్తులో ఏం జరుగాలో తాను చెప్తుంటే కొందరి పీఠాలు కదిలిపోతున్నాయని, తనపై దాడి చేస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్‌నుద్దేశించి వ్యాఖ్యానించిన కేసీఆర్.. తనను చంపుతానన్నా భయపడేదిలేదని స్పష్టంచేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవా రం నిజామాబాద్‌లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభనుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

దేశంలో ఎవరూచేయని మంచి పనులు చేస్తున్నాం..
మొన్న కరీంనగర్‌లో నేనేమన్న తప్పు మాట్లాడిన్నా? దేశంలో ఏం జరుగుతుందో చెప్పిన.. ఏం జరుగాల్నో చెప్పిన. దాంతోటి కొందరి పీఠాలు.. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పీఠాలు కదులుతున్నయి. మహారాష్ట్ర ధర్మాబాద్ తాలూకాలోని 40 గ్రామాల సర్పంచులు వచ్చినరు. ఎమ్మెల్యే గోవర్ధన్ నాకు ఫోన్‌చేసి వాళ్లు వస్తమంటున్నరంటే రమ్మని చెప్పిన. మేం తెలంగాణలో కలుస్తమని వారు డిమాండు చేస్తున్నరు. తెలంగాణ నిన్నగాకమొన్న పుట్టిన రాష్ట్రం. మనం బక్క పేదోళ్లమున్నం. మహారాష్ట్ర ఎప్పుడో ఉన్న రాష్ట్రం. వాళ్ల దగ్గరకంటే ఎన్నోరెట్లు ఇక్కడ మంచిపనులు జరుగుతున్నయి. ప్రజలకు మేలు జరుగుతున్నందున తెలంగాణలో కలుపమని అడుగుతున్నరు. దీన్నిబట్టి దేశంలో ఎక్కడ ఏం జరుగుతున్నదో తెలంగాణ ప్రజలు అర్థంచేసుకోవాలి. దేశంలో ఎవ్వరు, ఎన్నడు చేయని మంచిపనులుచేస్తున్నం.

మనదేశం గిట్లెందుకున్నది?
సింగపూర్ మన హైదరాబాద్ సిటీలో సగం ఉంటది. మన సిటీ జనాభా కోటి అయితే దాని జనాభా 50 లక్షలు. ఆ దేశ సముద్రతీరం 193 కిలోమీటర్లు మాత్రమే. అయినా ఏటా మూడుకోట్ల కంటెయినర్ల ఎగుమతులు, దిగుమతులు చేస్తున్నది. మనదేశానికి 7500 కిలోమీటర్ల సముద్రతీరం ఉంటే, 80 లక్షల కంటైనర్ల ఎగుమతులు, దిగుమతులు మాత్రమే చేస్తున్నది. సింగపూర్‌లో మన్నుకూడా లేదు. పెద్దపెద్ద ఓడలల్ల మన్నుకూడా కొనుక్కుంటరు. మంచినీళ్లు లేవు. అట్లాంటి చిన్నదేశం ఆ విధంగా అభివృద్ధి చెందితే మనం ఎలా ఉండాలి? విదేశాలు వెళ్లివచ్చిన మన పిల్లలు జపాన్, అమెరికా, చైనా, లండన్ అభివృద్ధి చెందాయని చెప్తుంటరు. మరి మనదేశం ఎందుకు గిట్ల ఉన్నది? వాళ్లు బంగారం తింటే మనం మన్ను తింటున్నమా? మనదంతా చిల్లర రాజకీయం. తూ కిత్తా, మై కిత్తా తప్ప ప్రజల గురించి ధర్మంగా పనిచేసేది లేదు. ఇలాంటి పరిస్థితులు మారాలంటే ఎవరో ఒకరు ఎక్కడోకాడ పొలికేక పెట్టాలి. గర్జించాలి. ముందుకు పోవాలి. పోతెనే ఈ దేశంలో దరిద్రం పోతది. దేశంలో ఆర్బీఐ, మహారత్నాలు దగ్గర దాదాపు 25 లక్షల కోట్లు మూలుగుతున్నయి. అభివృద్ధి చెందే భారత్‌లాంటి దేశాల్లో 25లక్షల కోట్లు ఆ విధంగా వట్టిగ ఉండొచ్చునా? అది ధర్మమా? ఈ దేశం బాగుపడుతదా? ప్రపంచంలో ఏ దేశంలో లేని యువశక్తి భారతదేశంలో ఉన్నది. కానీ దరిద్రపుగొట్టు విధానాలతో అభివృద్ధికి దూరంగా ఉన్నం.

కాంగ్రెస్, బీజేపీ సక్కదనం లేక..
దేశంలో దళితులు, గిరిజనులు, జనాభాలో సగం ఉన్న బీసీలు నిరాశలో ఉన్నరు. ఈ రెండు పార్టీలు మాట్లాడితే బీసీలు, బలహీనవర్గాలంటయి. కానీ చేసిందేంలేదు. దేశంలో అన్ని రా ష్ట్రాల్లో బీసీ వెల్ఫేర్ శాఖలున్నాయి.. కేంద్రంలో కూడా పెట్టండి అని నేను కేంద్రమంత్రిగా ఉన్నపుడు ప్రధానిని కోరితే పెట్టలేదు. ఎన్డీయే కూడా పెట్టలేదు. డైలాగులు కొడుతరు తప్ప క్రియాశీలంగా వ్యవహరించరు. బీసీలకోసం 73 ఏండ్లలో ఒక మంత్రిత్వశాఖ పెట్టలేదు. కారణం ఏందని మోదీని, రాహుల్‌ను అడుగుతే తిడుతరా.. దాడిచేస్తరా.. ఇదా మీ నీతి? పరిపాలన సక్కగ ఉంటే, ప్రజలు కేంద్రబిందువుగా పనిచేస్తే ఈ పరిస్థితులు ఉండేవా? పరిపాలనను కేంద్రీకృతంచేశారు. బ్రిటిష్‌నాటి పద్ధతులు అనుసరించి పెత్తనం, చిల్లర రాజకీయాలు చేశారు. దేశ వ్యవసాయ, విదేశాంగ, ఆర్థిక వ్యవస్థలు సక్కగ లేవు. రాష్ట్రాల హక్కులు హరించారు.

వీళ్లా మన ప్రధానులు?
దేశ్‌కా ప్రధానమంత్రి చోర్ అంటడు రాహుల్‌గాంధీ. రాహుల్‌గాంధీ, వాళ్లమ్మ ఇద్దరు కేసుల్లో ఉన్నరు.. జమానతు మీద బయట తిరుగుతున్నరంటడు నరేంద్రమోదీ. వీళ్లు నాయకులా? వీళ్లా ప్రధానులు కావాల్సింది? దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఈ నేతలు మారరు. ఆ మార్పు ప్రజలనుంచే రావాలి. కొన్ని విషయాలను గట్టిగా నిలదీస్తే కాంగ్రెసోళ్లు ఒకదిక్కు.. బీజేపోళ్లు ఒకదిక్కు ఒంటికాలిమీద లేస్తున్నరు. ఎవరు ఎలాంటి పద్ధతుల్లో ఉన్నరో ప్రజలు బాగా ఆలోచించాలి. తెలంగాణ తెచ్చిన టీఆర్‌ఎస్ పేదలకోసం ఎలాంటి సంక్షేమం చేస్తున్నదో మీ కండ్లముందే ఉన్నది. ఇతర రాష్ర్టాల్లో ఎట్లుందో మీకు తెలుసు.

రైతులు రాజులు కావాలి..
డైలాగులు కొడితే రైతులు రాజులు కారు. భూమి మీద రైతులకు అన్ని హక్కులు ఇచ్చాం. పంటకు 5వేలు పెట్టుబడి తీసుకువస్తున్నాం. రైతు సమన్వయ సమితులు ఏర్పాటుచేశాం. పంటకాలనీలు ఏర్పాటుచేయాలి. డిమాండున్న పంటలే పండించాలి. వ్యవసాయ వర్సిటీతో చర్చలు జరుగుతున్నయి. ఎన్నికలయ్యాక ఆ పని మొదలుపెడుతం. అందరితో మాట్లాడి నిర్ణయాలు తీసుకొని పంటలు పండిద్దాం. నిజామాబాద్ జిల్లాకు మంత్రిగా ఉన్న ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు డిమాండ్‌చేసి కొట్లాడారు. కింద కాళేశ్వరం బాగానే ఉంది.. మరి మా శ్రీరాంసాగర్ సంగతి ఏందని అడిగారు. అందుకే ప్రత్యేకంగా వెయ్యి కోట్లతో ఎస్సారెస్పీ పునర్జీవ పథకం వచ్చింది. నీళ్ల పంచాయితీ అంతా మూడునాలుగు నెలలే. కాళేశ్వరం పనులు దగ్గరపడ్డయి. జూన్ లేదా ఆగస్టులో కాళేశ్వరం ప్రారంభమైతది. ఆ నీళ్లు వస్తే శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ఈ జన్మల ఎండిపోవు. కడుపునిండ నీళ్లు, కరంటు, పెట్టుబడి ఉంటది. ఒక ఏడేండ్లు ఇలాగే ఇచ్చుకుంటే, రైతుల బాకీలుపోయి వాళ్ల బ్యాంకుల్లో ఐదు లక్షలు నిల్వ ఉంటయి. అట్ల జరిగితే అది బంగారు తెలంగాణ. దానికోసం మనం పోరాటంచేస్తున్నం.

వనరులున్నా అభివృద్ధి సున్నా
మనదేశంలో చాలా వనరులు ఉన్నయి. వాడుకునే తెలివిలేదు. దేశంలో కరంట్ 3.44 లక్షల మెగావాట్లు ఉన్నది. అయినా సగం రాష్ట్రాల్లో చీకటే. 16 రాష్ట్రాల్లో వ్యవసాయానికి 4, 5 గంటల కరంట్ ఇస్తరు. ఇది అబద్ధమా? కాంగ్రెస్, బీజేపీ నేతలకు దమ్ముంటే సమాధానం చెప్పాలి. సరిపోయేంత ఉత్పత్తి ఉన్నా, కరంట్ వాడుకునే తెలివిలేదు. దరిద్రపు గొట్టు పవర్ పాలసీ ఉన్నది. ఇట్లనే ఉండాల్నా.. మారాల్నా? ఇది మాట్లాడితే తప్పని దాడిచేస్తున్నరు. ఏ దేశానికి లేని వరం మనకు ప్రకృతి ఇచ్చింది. 70వేల టీఎంసీల నీళ్లు ఉన్నవి. వ్యవసాయానికి అనుకూలమైన భూమి 40 కోట్ల ఎకరాలు మాత్రమే. ఎందుకు ఇవ్వరు సాగునీరు? కేవలం 5కోట్ల ఎకరాలకే కాల్వల ద్వారా నీళ్లు ఉన్నవి. మన ఖర్మనా ఇది? దేశానికి జలవిధానం కూడా లేదు. ఏటా దేశంలో చాలాచోట్ల కరువు ఉంటుంది కానీ నీళ్లు ఇవ్వరు. ప్రాజెక్టులు కట్టరు. ట్రిబ్యునళ్లలో పరిష్కారంకావు. నీళ్లు సముద్రంపాలవటంతప్ప వ్యవసాయానికి ఇచ్చే తెలివిలేదు. ఇది మారాలని కోరుతున్నం.

బ్యాంకు టైఅప్ లేకుండా రుణాలు
సంచార జాతులకు సరైన న్యాయం జరుగలేదు. బ్యాంకు టైఅప్ పెట్టి రుణాలు అడిగితే రాలేదు. గంగిరెద్దులు, పూసలవాండ్లు, వడ్డెరలు.. దాదాపు 100-120 కులాలవాళ్లందరికీ న్యాయం రావాలని, బ్యాంకు టైఅప్ లేకుండా రుణాలు రావాలని రూ.వెయ్యి కోట్లతో ఎంబీసీ కార్పొరేషన్ పెట్టినం. దాని ద్వారా వడ్డెర సోదరులకు కూడా ఆ స్కీం వర్తింపజేస్తాం.

గిట్టుబాటు ధర కోసం పక్కా ఏర్పాట్లు
స్వరాష్ట్రంలో కొన్ని సమస్యలు పరిష్కారమైతున్నయి. కొన్ని పరిష్కారం కావాల్సి ఉన్నది. కొంత అన్నానికి ఇబ్బంది లేకుండా చేసుకున్నం. సంక్షేమ కార్యక్రమాలతోటి పేదలను ఆదుకుంటున్నం. పింఛన్లు బాగా పెంచుకున్నం. ఇంకా ముందుకు పెంచుకునే అవసరమున్నది. వ్యవసాయానికి పెట్టుబడులు ఇస్తున్నం. వాళ్లకు గిట్టుబాటు ధరలు రావాల్సి ఉన్నది. దానికీ పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నయి. మొన్న అసెంబ్లీ ఎన్నికలపుడే ఆహార శుద్ధికేంద్రాలు ఏర్పాటుచేసి, ఎక్కడి పంటలు అక్కడే, ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే కొనేసి, రైతాంగానికి కచ్చితంగా గిట్టుబాటు ధర వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చిన. నాలుగైదు నెలలు దాటితే యజ్ఞం మొదలైతది. ప్రతి మండలానికి పసుపు సమ స్య ఉన్నది. ప్రజలు పసుపు కొనుక్కోవాలంటే కల్తీలతో మోసపోతున్నరు. దానికోసం మన మహిళాసంఘాల ఆధ్వర్యంలో ఎక్కడి పసుపు అక్కడే కొని, రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి, అక్కడే పసుపు తయారుచేయాలని చూస్తు న్నాం. తెలంగాణ బ్రాండ్ మీద మొత్తం దేశానికి అమ్మే ప్రయత్నం చేస్తున్నం. సమయం పడుతుంది. అందుకే మందిమాటలు పట్టుకొని ఆగంకావొద్దని రైతులను కోరుతున్నా.

నిజం మాట్లాడితే దాడిచేస్తరా?
73 ఏండ్లు చూసినం. బీడీలోల్ల గోస పట్టించుకోరు.. రైతుల గోస పట్టించుకోరు.. మంచినీళ్లు, సాగునీళ్లు గతిలేవు. ఉన్న కరంటు వాడుకునే తెలివిలేదు. నక్సలైట్ ఉద్యమాలు వచ్చినయి. అనేక ఉద్యమాలు జరుగుతున్నయి. అయినా డ్రామాలు చేస్తరు తప్ప నిజంగ పనులు జరుగవు. ఇది కఠోర వాస్తవం. నన్ను ఎవరైనా చంపుతనన్న కూడా నేను భయపడ. భయపడే అవసరం లేదు. ఒట్టిగనే గప్పాలు కొట్టి, లొల్లి పెడుతనంటే కుదరదు. సోషల్ మీడియాలో బీజేపీవాళ్లు 10-20 గ్రూపులు మోపుచేసినరు. మొన్న కరీంనగర్‌లో నేను మాట్లాడిన నుంచి నన్ను తిట్టినతిట్టు తిట్టకుండ తిడుతున్నరు. నేను తప్పు మాట్లాడిన్నంట! ఉన్నది మాట్లాడితే, వాస్తవం చెప్తే తప్పా?

కాంగ్రెస్,బీజేపీలతో ప్రజలు విసిగినరు
ఇయ్యాల మీరు రాహుల్‌గాంధీ, ప్రధాని మోదీ ఉపన్యాసాలు వింటున్నరు. వాళ్లు ఎంత లొల్లి పెడుతున్నరు! మైకులు పగిలేపోతున్నయి ఇగ! లొల్లి ఎవరి మీద? 70-73 ఏండ్లలో 54 ఏండ్లు దేశాన్ని పాలించింది కాంగ్రెస్ కాదా? 11 ఏండ్లు బీజేపీ పరిపాలించలేదా? ఈ 65 ఏండ్లు మీరు ఆరు చందమామలు, ఏడు సూర్యులు పెడితే దేశం వెలిగిపోతుండె కదా.. ఎందుకు పెట్టలేదు? అది అడిగితే ఇతరులను నిందిస్తరా? దాడిచేస్తరా? పిచ్చిపిచ్చి కూతలు కూస్తరా? నేను చెప్పిందాంట్లో ఏదైనా అబద్ధం ఉన్నదా? మధ్యలో మొరార్జీదేశాయి, చరణ్‌సింగ్, వీపీ సింగ్, చంద్రశేఖర్, గుజ్రాల్, దేవెగౌడ ఇట్లాంటోళ్లు ఆరేడు ఏండ్లు ఉన్నరు. ఈ రెండు పార్టీలే వాళ్లను దించేసినయి. ఇయ్యాల ఈ దేశంలో ఈ రెండు పార్టీలతోటి ప్రజలు విసిగిపోయి ఉన్నరు. నిజామాబాద్ జిల్లా చాలా చైతన్యం ఉన్న జిల్లా. ఇక్కడే కాదు.. అన్ని జిల్లాల్లో ఈ చర్చ జరగాలి.. ఇండియాలో ఒక కొత్త ఆలోచన పుట్టాలి.

రెండు కోడెలాగెలనే కట్టాలె..
మొన్నటి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించారు. ఐదేండ్లు పాలన చేయాలె. బండి ముందటికి పోవాల్నంటే రెండు కోడెలాగెలను కట్టాలె. లేకుంటే రెండు దున్నపోతులను కట్టాలె. ఒకదిక్కు దున్నపోతును.. ఇంకోదిక్కు కోడెలాగను కడితే బండి ముందుకుపోదు. మొన్న ఎమ్మెల్యేలందరినీ గెలిపించారు. ఎంపీలను కూడా పదహారుకు పదహారు గెలిపియ్యాలె. రాష్ర్టాన్ని బాగుచేసుకోవడమే కాదు.. కచ్చితంగా దేశాన్ని కూడా బాగుచేద్దం. దానికి మీ దీవెన కావాలె.

73 ఏండ్లు బీడీ కార్మికులను పట్టించుకున్నరా?
ఎన్నికలు రాగనే.. బడుగు బలహీనవ ర్గాలు, పేదలు అంటూ.. సాయం చేస్తమని 73 ఏండ్లకెల్లి చెప్తనే ఉన్నరు. ఈ దేశంలో 16 రాష్ర్టాల్లో 52.32 లక్షల మంది బీడీలుచేసి బతికేవాళ్లున్నరు. దాంట్లో నాలుగున్నర లక్షలమంది తెలంగాణలో ఉన్నరు. తెలంగాణ రాకముందు, టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాకముందు చాలా పార్టీలు పాలనచేసినవి. ఈ బీడీ కార్మికుల బాధ ఎవ్వరూ పట్టించుకోలేదు. కాంగ్రెస్, బీజేపీ రెండూ విఫలమైనవని మొన్న కరీంనగర్‌లో చెప్పిన. కాంగ్రెస్ పాలించే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్.. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్, బీజేపీ సీఎం ఉన్న యూపీలో బీడీ కార్మికులు ఉన్నరు. పొరుగురాష్ట్రమైన మహారాష్ట్రలో కూడా బీడీ కార్మికులున్నరు. ఏ ఒక్క రాష్ట్రంలోనైనా బీడీ కార్మికులకు పింఛను ఇస్తున్నరా? అని నేను రాహుల్, మోదీని అడుగుతున్న. నేను ఫెడరల్‌ఫ్రంట్ రావాలని చెప్తున్న. మన రాష్ట్రంలో బీడీ కార్మికుల బాధలు ఎట్లున్నవో మిగిలిన 16 రాష్ర్టాల్లోని బీడీ కార్మికులకు అవే బాధలున్నయి. ఇండియాలో బీడీ కార్మికులకు ఇయాల్టిదాకా వెయ్యి రూపాయల పింఛను ఇచ్చి ఆదుకునే ఒకే ఒక్క రాష్ట్రం, ఒకే ఒక్క ప్రభుత్వం టీఆర్‌ఎస్- తెలంగాణ ప్రభుత్వం. రాబోయే నెల నుంచి బీడీ కార్మికులకు రూ.2వేల పింఛను వస్తది. అదేవిధంగా ప్రావిడెంట్ కటాఫ్‌డేట్ 2014 వరకు ఉండె.. దాన్ని కూడా రద్దుచేసినం. ఈరోజు వరకు కూడా అది పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. దీనికోసమే దేశంలో కాంగ్రెస్, బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం రావాలని కోరుతున్న. తప్పా?

కాంగ్రెస్, బీజేపీలు ప్రజల తలరాత మార్చలేదు
కాంగ్రెస్, బీజేపీలు దేశానికి ఏం చేయకపోయినా.. ఒక్కపని మాత్రం పక్కా చేస్తరు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జవహర్ రోజ్‌గార్‌యోజన, రాజీవ్ యోజన, మన్నుయోజన అంటరు. ఇందిర, రాజీవ్, నెహ్రూ పేర్ల మీద స్కీములు వస్త్తయి. బీజేపీ ఎక్కిందనుకో దీన్‌దయాళ్, శ్యామ్‌ప్రసాద్ పేర్లు వస్తయి. పేర్లు మారుతయి తప్ప ప్రజల తలరాతలు మారవు. ఉన్న అధికారాలన్నీ దగ్గర పెట్టుకున్నరు. విద్య, న్యాయపరిపాలన, అడవులు ఇలా అనేక అంశాలను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలో పెట్టారు. ఎందుకోసం? ఎంత దరిద్రపుగొట్టు పాలన! ఎక్కడో నిజామాబాద్ జిల్లా మారుమూల గ్రామంలో నరేగా పని జరిగితే కూలీ డబ్బులు ఢిల్లీలో వేస్తరట! మరి ఇక్కడున్న సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ ఎందుకు? ఇంత గొప్ప పరిపాలన ఉంది మన దేశంలో!

పరిపాలనలో మార్పు రావాలె
జాతీయ రహదారులమీద వేరే దేశాల్లో లారీల స్పీడు 80 నుంచి 110 కిలోమీటర్లు ఉంటది. మన దగ్గర 50 కిలోమీటర్లు ఉంటది. మాల్‌గాడీలు బయటి దేశాల్లో 80 కిలోమీటర్ల వేగంతో పోతే.. మనదేశంలో గంటకు కేవలం 24 కిలోమీటర్ల వేగంతో పోతయి. ఎక్స్‌ప్రెస్‌వేలు ఉన్నాయా? మంచి రోడ్లున్నయా? మంచి పోర్ట్‌లున్నయా? విమానయానం సక్కగున్నదా? ఏం దరిద్రమిది? ఎందుకు ఆలోచిస్తలేం? మన పొరుగున్న చైనా 1971- 75 వరకు మనకంటే తక్కువ జీడీపీలో ఉండె. ఇయ్యాల మనతోని నాలుగురెట్లు అయింది. వాళ్లు ఎలా బాగుపడ్తరు? మనం ఎందుకు ఇక్కన్నే ఉంటం? కచ్చితంగా దేశం దీనిపై ఆలోచన చేయాలె. కొత్త ఆర్థిక విధానం రావాలె. న్యూ అగ్రికల్చర్ పాలసీ రావాలె. రైతుల్లో అశాంతి పోవాలె. రైతులకు గిట్టుబాటు ధర రావాలె. రైతుబంధు, రైతుబీమా యావత్తు దేశంలో అమలుకావాలె. దేశాన్ని క్రాప్‌కాలనీల కింద విభజన చేయాలె. ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలె. ఆర్థిక పరపతి పెరుగాలంటే న్యాయ పరిపాలనలో మార్పులు రావాలె. లేకుంటే మార్పుండదు. దేశం బాగుపడాలంటే ఎక్కడెక్కడ అవసరమో.. అక్కడ మార్పులు చేసుకోవాలె.

ఈ నెల 21న అభ్యర్థుల ప్రకటన
ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులను 21న ప్రకటిస్తాం. నిజామాబాద్‌లో కూడా అభ్యర్థిని ప్రకటిస్తం. అభ్యర్థి ఎవరు అయినా సరే మీ దీవెన ఇచ్చి గెలిపించాలె. ఎండ ఎక్కువ ఉన్నా ఇంత పెద్దసంఖ్యలో వచ్చి స్వాగతం చెప్పినందుకు మీకు, సభను ఇంత మంచిగా నిర్వహించిన నాయకులకు ధన్యవాదాలు.

స్వరాష్ట్రంలో కొన్ని సమస్యలు పరిష్కారమైతున్నయి. కొన్ని పరిష్కారం కావాల్సి ఉన్నది. కొంత అన్నానికి ఇబ్బంది లేకుండా చేసుకున్నం. సంక్షేమ కార్యక్రమాలతోటి పేదలను ఆదుకుంటున్నం. పింఛన్లు బాగా పెంచుకున్నం. ఇంకా పెంచుకునే అవసరమున్నది. కరంటు సమస్య తీరింది. వ్యవసాయానికి పెట్టుబడులు ఇస్తున్నం. ఇక వాళ్లకు గిట్టుబాటు ధరలు రావాల్సి ఉన్నది. దానికీ పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నయి. మొన్న అసెంబ్లీ ఎన్నికలపుడే ఆహార శుద్ధికేంద్రాలు ఏర్పాటుచేసి, ఎక్కడి పంటలు అక్కడే, ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే కొనేసి, రైతాంగానికి కచ్చితంగా గిట్టుబాటు ధర వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చిన. నాలుగైదు నెలలు దాటితే యజ్ఞం మొదలైతది. పంట కాలనీలు ఏర్పాటుచేయాలి. ఏ పంటలంటే ఆ పంటలు పండిస్తామంటే కుదరదు. డిమాండ్ ఉన్నవే పండించాలి. వ్యవసాయ వర్సిటీతో చర్చలు జరుగుతున్నయి. ఎన్నికలు అయిపోయాక ఆ పని మొదలుపెడుతం. అందరితో మాట్లాడుతం. కలిసి నిర్ణయాలు తీసుకొని పంటలు పండిద్దాం. -సీఎం కేసీఆర్

మంది మాటలకు ఆగంకావద్దు
-ఎర్రజొన్న రైతులకు న్యాయంచేస్తా
-ఇప్పుడు మిమ్మల్ని ఉస్కాయిస్తున్నవారు ఇరువై రోజుల తర్వాత కనిపించరు

నిజామాబాద్‌లో జిల్లాలో ఎర్రజొన్న రైతులు కొంత ధర రావడంలేదని బాధపడుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. తప్పకుండా మీకు న్యాయం చేస్తాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫైరింగ్‌వరకు తీసుకెళ్లి పదిన్నర కోట్ల రూపాయలు బకాయిపెడితే.. వాగ్దానంచేసి ఆ డబ్బు చెల్లించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని మర్చిపోవద్దు. ఎన్నికల సభ కాబట్టి నేను ఏ ప్రకటనచేసినా బదనాం మనమీద పడతది. కానీ తప్పకుండా స్థానిక మంత్రి, నాయకులతోటి మాట్లాడి ఏంచేస్తే ఎర్రజొన్న రైతులకు లాభమైతదో ఆ లాభం చేస్త. ఎర్రజొన్న రైతులు మందిమాటలు పట్టుకొని ఆగంకావద్దు. 20 రోజుల బాగోతమే ఇది. ఏప్రిల్ తొమ్మిదిన ప్రచారం బంద్ అయితది. ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని ఉస్కా ఇస్తున్నరో వాళ్లెవరూ ఆ తర్వాత ఉండరు. మళ్ల ఉండేది ఇదే ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, ఇదే ఎంపీ, ఇదే నాయకులు. అందుకే మందిమాటలు పట్టుకొని రైతులు ఆగంకావద్దు.

కొత్త మండలాలనూ ఏర్పాటుచేస్తం
ఆర్మూర్ మండలంలో ఆర్మూర్, డొంకేశ్వర్, బోధన్ నియోజకవర్గంలోని సాలూరు, జగిత్యాలలో వడ్ల లింగాపూర్ ఇలా కొన్ని మండలాలు కావాలంటు న్నరు. తప్పకుండా వాటిని మండలాలుచేస్త. అటవీభూముల సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉన్నది. శాశ్వత పరిష్కారం చూపాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నేనే స్వయంగా అన్ని జిల్లాలకు తిరిగి ఆ సమస్యను పరిష్కరిస్త.

ఉద్యమానికి ఆక్సిజన్ అందించిన నిజామాబాద్
తెలంగాణ ఉద్యమం 2001లో ప్రారంభమైనపుడు జిల్లా పరిషత్‌లో టీఆర్‌ఎస్‌ను స్వతంత్రంగా గెలిపించి గులాబీజెండా ఎగురవేసి, ఉద్యమగౌరవాన్ని నిలబెట్టిన గడ్డ ఈ నిజామాబాద్ జిల్లా. ఉద్యమానికి ఆక్సిజన్ అందించిన జిల్లా. వందేండ్లక్రితమే నిజాంకాలంలో నిర్మించిన నిజాంసాగర్‌తోటి చాలా ధనిక, సస్యశ్యామల జిల్లాగా మొత్తం రాష్ట్రంలోనే నిజామాబాద్‌కు పేరు, ప్రఖ్యాతి ఉండేది. సమైక్య పాలకుల పుణ్యమాని నిజాంసాగర్ ఎండిపోయే పరిస్థితి. వ్యవసాయం దిగజారిపోయి, జిల్లానుంచి వేల మంది యువకులు గల్ఫ్ బాట పట్టారు. ఇదే జిల్లాకు ఆనుకుని ఉన్న ఎస్సారెస్పీ కట్ట మీద.. 1996లో నేను ఎమ్మెల్యేగా ఉండే టైంలో కొంతమంది నాయకులతోటి కూర్చుని ఉన్న. తెలంగాణ ప్రాజెక్టు కాబట్టి శివాలయంగా ఉంది.. నిర్వహణ సరిగాలేదని బాధపడిన. మిత్రులందరూ ఏం సార్ అట్ల అన్నరు? అని అడిగినరు. తెలంగాణ కష్టాల గురించి వారికి గంటసేపు చెప్పిన. మరెట్ల సార్ తెలంగాణ? అని అడిగితే.. కచ్చితంగా తెలంగాణ ఉద్యమం మళ్ల వస్తది. వస్తెనే తెలంగాణ బాగుపడతది.. రాష్ట్రమైతదని చెప్పిన. ఆరోగ్యం బాగుంటే, బతికి ఉంటే నేనే ఆ ఉద్యమాన్ని చేపడుతానని చెప్పిన. తదనంతరం 2000, 2001 సంవత్సరంలో గులాబీ జెండా ఎగురటం, నేనే ఉద్యమానికి సారథ్యం వహించటం మీకు తెలుసు. పోరాటంలో మీరందరూ భాగస్వాములయ్యారు.

బీజేపీది డూప్లికేట్ హిందూత్వ
-మాది ఆధ్యాత్మిక హిందూత్వ: సీఎం కేసీఆర్
-బీజేపీ ప్రజల పార్టీనా?
-మత ప్రచారంచేసే పార్టీనా?లక్ష్మణ్ జవాబివ్వాలి

రామజన్మభూమి మీద మీ స్టాండ్ ఏంది? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నన్ను అడిగిండు. నేను ఓ మాట అడుగుతున్న. లక్ష్మణ్ గారు.. మీది రాజకీయపార్టీనా? ప్రజల కోసం పనిచేసే పార్టీనా? లేకుంటే మతప్రచారం చేసే పార్టీనా? నువ్వు ముందు చెప్పు. ఆ తర్వాత నేను చెప్త. రామ జన్మభూమి.. రావణ జన్మభూమి.. శ్రీకృష్ణ జన్మభూమి.. కంస జన్మభూమి.. దుర్యోధన జన్మభూమి.. సత్యభామ జన్మభూమి.. శూర్పణఖ జన్మభూమి.. ఈ పంచాయితీలు . రాజకీయ పార్టీలు చేయాల్నా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఏ జన్మభూమి ఎవ్వల్దో.. ఏది ఎక్కడ ఉండాన్నో ఎవలు నిర్ణయించాలే? శృంగేరిపీఠంలో గద్గురుస్వామి ఉన్నడు. చినజీయర్‌స్వామి ఉన్నడు. పీఠాధిపతులు, ధర్మప్రచారకర్తలున్నరు, మఠాధిపతులున్నరు. వాళ్లు చేయాలె. అవసరమైతే సుప్రీంకోర్టు ఉన్నది. వారు తేల్చుతరు. రాజకీయ నాయకులం ప్రజల సమస్యలు పరిష్కరించాలె. రైతులకు నీళ్లు, కరంట్ తేవాలె. ప్రజలకు బాధలు పోవాలె. నిరుద్యోగ సమస్య తీరాలె. ఇది జరుగాలి కానీ..జన్మభూమి అంటూ మాట్లాడితే ప్రజల జాతకాలు మారయ్ అని కేసీఆర్ అన్నారు. జన్మభూములు, పనికిమాలిన సిద్ధాంతాలు చెప్పి, కథలు చేస్తున్నారని మండిపడ్డారు.

సమస్త జీవరాశి సంతోషంగా ఉండాలని చెప్తరు..
మాట్లాడితే హిందూ అంటరు. మేం హిందువులం కాదా.. పిలగాండ్లకు ఇరవై ఒక్కదినం చేత్తలేమా? ఆయ్యగార్లను పిలిచి పెండ్లిళ్లు చేత్తలేమా? చస్తే తద్దినాలు పెడుతలేమా?గుళ్లకు పోతలేమా గుం డు కొట్టించుకుంటలేమా? ఎంత గరీబోైళ్లెనా ప్రతి ఇం ట్ల దేవుని ఫొటోఅయినా, క్యాలెండర్లో ఫొటో అయి నా ఉంటది. దండం పెట్టుకుంటం. మీరు చెప్తేనే దం డం పెట్టుకుంటున్నమా? ఇతర మతాలను తిట్టేవాడే హిందువు అన్నట్టు చెప్తున్నరు. హిందుమతం అట్ల చెప్పలే. అందరినీ గౌరవించమని, ప్రేమించమని చెప్పింది. మీదేమో రాజకీయ హిందూత్వ. మాది నిజమైన హిందూత్వ. మీది దేవున్ని నమ్మే హిం దుత్వ. మాది ఆధ్మాత్మిక హిందూత్వ. మీది డూప్లికేట్ హిందూత్వ. లక్ష్మణ్ గారు..ఇగ మీ ఆటలు సాగయ్. ప్రజలందరు బాగుండాలె. వేదాల్లో, భగవద్గీతలో ఎక్కడా చెప్పలే తిట్టమని! భగవంతుడు కూడా చెప్పలే. అన్ని మతాలు, అన్ని వర్గాలు, అందరు బాగుండాలని మేం చెప్తున్నం. ఓట్ల రాజకీయం కోసం, చిల్లర రాజకీయాల కోసం మీరు మాట్లాడుతున్నరు. పెద్ద పూజలు చేస్తం.. యాగం చేస్తం. ఏం చెప్తరు ముగింపులో.. స్వస్తి ప్రజాభ్యాం పరిపాల యంతాం! న్యాయేణ మార్గేణ మహీం మహీశా! గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం! లోకాసమస్త సుఖినోభవంతు!.. అంటే సమస్తలోకంలో ఉండేటి అన్నివర్గాల మనుషులే కాదు.. సమస్త జీవరాశి కల్యాణంగా సంతోషంగా ఉండాలని చెప్తరు. కానీ.. ముస్లింలను తిట్టు, క్రైస్తవులను తిట్టు.. గిదా నువ్వు చెప్పే రాజకీయం? పిచ్చిపిచ్చి రాజకీయం మానుకోవాలె. ఇప్పటికైనా రాజకీయ ఎజెండా మనం తీసుకుని ముందుకు పోవాలె అని అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.