తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసిన ఉద్యమకారుడిగా యుద్ధనీతికి, ప్రభుత్వ సారథిగా రాజనీతికి కట్టుబడిన మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రాన్నిఅభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలుపుతూ విజనరీ ముఖ్యమంత్రిగా దేశవ్యాప్త కీర్తి గడిస్తున్నారు. ఉద్యమ నాయకుడిగానైనా, ప్రభుత్వాధినేతగా నైనా అంతుచిక్కని ఆయన వ్యూహాలు అంతిమంగా అప్రతిహత విజయాలనే ఆవిష్కరిస్తాయి.
రాష్ట్రంలో ఈరోజు లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు వచ్చింది. ఇంకా రైతు బంధు, 24 గంటల విద్యుత్, రుణమాఫీ వంటి కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఒక్క వరి పంటే ఒక కోటి 20 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. రాష్ట్ర జీడీపీలో 20 శాతం ఆదాయం వ్యవసాయరంగమే సమకూరుస్తున్నది. వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు జిల్లాలోకి ఇప్పుడు ఇతర రాష్ట్ర వలసలు సాగుతున్నాయి. యావత్ రాష్ట్రంలో ప్రస్తుతం 20 లక్షల మందికి పైగా వలస కార్మికులు జీవిస్తున్నారు. అసాధారణ రీతిలో ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసుకొని నేడు రెండు లక్షల 30 వేల కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ పెట్టుకుంటున్నాం. రాష్ట్ర తలసరి ఆదాయం గత ఏడేండ్లలో రెట్టింపయింది. దేశ ఆర్థికవ్యవస్థకు ఆయువుపట్టుగా ఉన్న టాప్ 5 రాష్ర్టాల్లో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది. ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ది ఇండియన్ ఎకానమీ 2020-21’ పేరిట ఆర్‌బీఐ విడుదల చేసిన నివేదిక ఈ విషయం పేర్కొన్నది.
రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు లక్షా 30 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు జరిగాయి. అతిత్వరలో మరో యాభై వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలోనే ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైంది. కాగా ఐటీ మంత్రి కేటీఆర్ నిరంతరం తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చేలా కృషిచేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ కృషి ఫలించి అంతర్జాతీయ ఐటీ ప్రాజెక్టులు, ఇతర పరిశ్రమలు తెలంగాణకు వచ్చి దాదాపు 18 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలనే ఊడగొడుతున్నది. పైగా ఐటీఐఆర్, రైల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే అనేక ఉద్యోగాలు తెలంగాణ వాసులకు వచ్చి ఉండేవి. బీజేపీ, కాం గ్రెస్ పాలిత రాష్ర్టాల్లో నిరుద్యోగం రేటు 10-35 శాతం ఉండగా తెలంగాణలో 2.2 శాతం మాత్రమే ఉన్నదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) నివేదిక ఇవ్వడం గమనార్హం.
నీళ్లు, నిధులు, నియామకాల్లో గొప్ప విజయం సాధించిన కేసీఆర్ ఇప్పుడు విద్య, వైద్యం, విద్యుత్ రంగాలపై కూడా దృష్టి కేంద్రీకరించారు. తెలంగాణ ఇస్తే కరెంటు లేక చీకట్లు అలుముకుంటుందని అవహేళన చేసిన వారి నోళ్లు మూయిస్తూ ఇప్పటికే విద్యుత్‌రంగాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దడం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం.
2014లో గల విద్యుత్ ఒప్పంద సామర్థ్యం 7,778 నుంచి నేడు 16,623 మెగావాట్లకు పెంచుకోగలిగాం. అంటే ఈ ఏడేండ్లలో 8,845 (114 శాతం) మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకోలిగాం. సోలార్ విద్యుత్ 2014 నాటికి 74 మెగావాట్లు మాత్రమే ఉండగా, మరో 3,923 మెగావాట్లు పెంచుకొని, నేడు సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 3997 మెగావాట్లకు పెంచుకున్నాం. విద్యుత్ పీక్ డిమాండ్ 2014లో 5661 మెగావాట్లు ఉండగా, నేడు 13,688 స్థాయికి చేరుకు న్నాం. 2014లో కోటి 11 లక్షల వినియోగదారుల కు విద్యుత్ సరఫరా చేయగా, నేడు కోటి 68 లక్షల మంది వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి తలసరి విద్యుత్ వినియోగం 1356 యూనిట్లు కాగా, 2021 నాటికి తలసరి విద్యుత్ వినియోగం 2012 యూనిట్లకు పెరిగింది. దేశ తలసరి విద్యుత్ వినియోగం 1,161 యూనిట్లు మాత్రమే. రాష్ట్రంలో 25 లక్షల 92 వేల కనెక్షన్ల్లున్నాయి. వీటన్నింటికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతున్నది. కేసీఆర్ ముందుచూపునకు ప్రతిఫలం ఈ విద్యుత్ విజయం.
ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ విద్య, వైద్యరంగాలపై మరింత దృష్టి కేంద్రీకరించారు. దవాఖానలను వంద పడకలకు అప్‌గ్రేడ్ చేసి సాంకేతికత మేళవించడం, డాక్టర్లు, వైద్య సిబ్బంది, మందుల కొరత తీర్చడం, కేసీఆర్ కిట్ వంటివి రాష్ట్రంలో వైద్య రంగం దారిన పడటానికి కారణం. కంటి పరీక్షలు చేయడమే కాకుండా ఇప్పటికిప్పడు కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ఇంటింటికీ వై ద్య సిబ్బంది వెళ్లి కోటి జ్వర పరీక్షలు చేసేలా ఆదేశించడం ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.
ఇంకా ప్రభుత్వం ప్రతి గ్రామంలో, ప్రతి పాఠశాలలో సంబంధిత ప్రభుత్వ ప్రాథమిక దవాఖానలు, డయాగ్నిస్టిక్ సెంటర్ల ద్వారా వైద్యపరీక్షలు నిర్వహించి సమగ్ర ఆరోగ్య వివరాలతో పౌరుల హెల్త్‌కార్డులు తయారుచేయవలసి ఉన్నది. రూ.8-10 వేల కోట్లతో ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలి.
విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి అందరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో తీసుకున్న గొప్ప నిర్ణయం ‘మన ఊరు-మన బడి’ ప్రణాళిక. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు దశలవారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం, మౌలిక వసతుల కల్పన ఈ పథకం ఉద్దేశం. టెక్నాలజీ ప్రాధాన్యం పెరిగిపోతున్న ఈ రోజుల్లో ప్రపంచంతో పేద విద్యార్థులు కూడా పోటీ పడాలన్న లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది. కాగా, ఇంకా ప్రతి మండల కేంద్రంలో, ప్రతి మునిసిపాలిటీ పరిధిలో కేజీ టు పీజీ వరకు అత్యాధునిక సౌకర్యాలతో విద్యాసంస్థలు నెలకొల్పాలి. భా వితరాలు కూడా అనుభవించేలా ప్రాధాన్యతా క్రమంలో అన్నిరంగాలను ప్రణాళికాబద్ధంగా బలోపేతం చేస్తున్న కేసీఆర్ దార్శనికత తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలుపుతుంది.
-(వ్యాసకర్త: ఆశన్నగారి జీవన్‌రెడ్డి, పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే)