-మీకు నచ్చినప్పుడు నీతి.. మీకు నచ్చనప్పుడు అవినీతా?
-అవినీతి జరగలేదని పార్లమెంట్‌లో క్లీన్‌చిట్ ఇచ్చింది మీరే
-యాసంగికి కాళేశ్వరం నీళ్లు ఇస్తున్నాం
-ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంకండి: హరీశ్
-ప్రధాని, గడ్కరీ, మసూద్‌ల ప్రశంసల మాటేమిటి?
-ఆ ప్రశంసలు అబద్ధమా? ఇప్పటి మీ మాటలు అబద్ధమా?
-మీ పాలనలో తప్పులు చూపినందుకా ఇప్పుడు అక్కసు?
-ఒక్క ఎకరాకు కూడా కాళేశ్వరం నీళ్లు ఇవ్వలేదంటారా?
-మీ ఎమ్మెల్యే మోటర్లు ఆన్ చేసి ఇచ్చిన నీళ్ల మాటేమిటి?
-కేంద్రంపై నిప్పులు చెరిగిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

ఇన్నాళ్లూ అద్భుతమైన ప్రాజెక్టుగా కనిపించిన కాళేశ్వరం ఇప్పుడు విఫల ప్రాజెక్టు అయిపోయింది! రాజ్యాంగ సభల్లో ఒకమాట.. రాజకీయానికి ఇంకోమాట.. బీజేపీ ద్వంద్వ నీతికి ఇంతకంటే నిదర్శనం ఏమున్నది? కమలం నేతల కారడ్డం మాటలకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం దీటైన జవాబిచ్చింది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కేంద్రం తీరును.. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ నాయకుల నిస్సిగ్గు వైఖరిని లెక్కలు, ఉదాహరణలు.. వీడియో ఆధారాలతో సహా ఎండగట్టారు.
ఈ క్షణానికి కాళేశ్వరంలో 31 టీఎంసీల నీళ్లు మునిగింది కాళేశ్వరం కాదు.. 2 పంప్‌హౌజ్‌లే గోదావరి చరిత్రలో ఎన్నడూ లేనంత వరదలు మోటర్లకు మరమ్మతుల బాధ్యత ఏజెన్సీదే.. సర్కారుపై నయా పైసా భారం ఉండదు బీజేపీ నేతల మాటలకు మంత్రి దీటైన జవాబు
తెలంగాణ జీవధార కాళేశ్వరం. ప్రాజెక్టు డీపీఆర్ తయారుచేసిందీ వాళ్లే.. అనుమతులు ఇచ్చిందీ వాళ్లే. నిర్మాణం సాగినన్నాళ్లూ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి గడ్కరీ, జలసంఘం చైర్మన్, మంత్రులు, అధికారులు.. ఒకరివెంట ఒకరు ఉరికొచ్చి మరీ ఆహా ఓహో అని మెచ్చుకొన్నదీ వాళ్లే.. గత ఎనిమిదేండ్లలో పరిపాలనలో విఫలమయ్యారని మోదీ సర్కారును సీఎం కేసీఆర్ నిలదీయడంతో.. ఆ మెచ్చుకోళ్లన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయాయి. నాలుకలన్నీ మడతపడ్డాయి. కొనియాడిన నోళ్లన్నీ తిరగబడ్డాయి. లేని అవినీతి.. ఒక్కసారిగా కనిపించడం మొదలైంది.
తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చేసిన ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం దీటుగా తిప్పికొట్టింది. కేంద్ర మంత్రి అడ్డగోలు ఆరోపణలకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ఉదాహరణలు, ఫొటో క్లిప్పింగ్‌లు, వీడియో ఆధారాలతో సహా ఘాటుగా జవాబిచ్చారు. ఎనిమిదేండ్ల కేంద్రం విఫల పాలనను సీఎం కే చంద్రశేఖర్‌రావు సూటిగా ప్రశ్నిస్తున్న కారణంగానే అక్కసుతో ఆరోపణలు చేస్తున్నారన్నారు. నిన్నటిదాకా ప్రాజెక్టును మెచ్చుకొన్న వాళ్లే ఇప్పుడు విమర్శించడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. గురువారం మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మాణిక్‌రావు, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి టీఆర్‌ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ షెకావత్ ఆరోపణల్లోని డొల్లతనాన్ని బయటపెట్టారు. హరీశ్‌రావు సమాధానం ఆయన మాటల్లోనే..
షెకావత్ చాలా బాధ్యతారాహిత్యంతో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రశ్నించకపోతే సై.. ప్రశ్నిస్తే నై అన్నట్టుంది బీజేపీ తీరు. బీజేపీ సర్కారు కార్మిక, రైతు, ఉద్యోగ వ్యతిరేక విధానాలను, పీఎస్‌యూల అమ్మకాన్ని సీఎం కేసీఆర్ అడుగడుగునా నిలదీస్తున్నరు. కేంద్రం నిజ స్వరూపాన్ని ఎండగడుతున్నరు. దీన్ని జీర్ణించుకోలేక బీజేపీ నేతలు సీఎంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నరు. కాళేశ్వరాన్ని మెచ్చుకొన్న నోళ్లతోనే నేడు పుచ్చిపోయిన మాటలు మాట్లాడుతున్నరు. నాడు కితాబు ఇచ్చినోళ్లు.. ఇవాళ మతలబు ఉన్నదంటున్నరు. షెకావత్‌జీ ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి, మీ మతిమరుపును పరీక్షించుకోండి. పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరంపై చెప్పిన నిజాలను ఇప్పుడు అబద్ధాలుగా ప్రచారం చేస్తున్నారంటే చట్టసభలు బీజేపీకి ఎంత చులకనగా మారాయో అర్థమవుతున్నది. ప్రాజెక్టుకు అనుమతులు, అప్పులు ఇచ్చింది మీరే. అవినీతి జరిగితే అనుమతులు ఎలా ఇచ్చారు? మీకు నచ్చినప్పుడు నీతి.. నచ్చనప్పుడు అవినీతా? కేసీఆర్ పనితీరును ప్రధాని పార్లమెంట్‌లోనే మెచ్చుకొన్నరు. గడ్కరీ కాళేశ్వరాన్ని తెలంగాణ గ్రోత్ ఇంజిన్ అన్నారు. కేంద్ర జలసంఘం చైర్మన్ మసూద్ హుస్సేన్ కాళేశ్వరం ప్రాజెక్టును ల్యాండ్‌మార్క్‌గా అభివర్ణించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ శర్మ.. ప్రాజెక్టుకు అప్పులు ఇవ్వడాన్ని గట్టిగా సమర్థించారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి లోక్‌సభలో 22 జూలై 2021న వేసిన ప్రశ్నకు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరుగలేదని కేంద్ర జలవనరుల సహాయ మంత్రి విశ్వేశ్వర్ తుడు జవాబిచ్చారు. షెకావత్ కూడా పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని వెల్లడించారు. ఇవాళ బీజేపీ నేతలు ఎందుకు మాటమార్చారు.. మోదీ తీరును కేసీఆర్ తప్పు పడుతున్నందుకే బీజేపీ నాలుక మడతపడింది.
చరిత్రలో ఎన్నడూ లేని వరదలు
మొన్న గోదావరిలో వచ్చిన వరదలు ప్రకృతి వైపరీత్యం. గోదావరికి 1986లో అత్యధిక వరద వచ్చింది. ఆనాడు సీడబ్ల్యూసీ నమోదు చేసిన నీటిమట్టం 107.05 మీటర్లు. దాన్ని పరిగణనలోకి తీసుకొనే మేడిగడ్డ బరాజ్, కరకట్టలు, పంప్‌హౌజ్ రెగ్యులేటర్లను నిర్మించారు. ఆ రికార్డును ఇటీవలి వరదలు అధిగమించాయి. గోదావరి ఏకంగా 108.02 మీటర్ల మేర ప్రవహించింది. పరిమాణం 29 లక్షల క్యూసెకులకు పైగా ఉన్నది. అంటే 1986 మట్టం కన్నా 1.2 మీటర్లు అధికం. అసాధారణ ఆ వరద వల్లనే పంప్‌హౌజ్ రెగ్యులేటర్ గేట్ల రబ్బర్ సీల్స్ ఊడిపోయాయి. ఫోర్‌బేలోకి అధికమొత్తంలో నీళ్లు వచ్చాయి. అతి భారీ వర్షాలకు పంప్‌హౌజ్ 220 కేవీ సబ్‌స్టేషన్‌కు విద్యుత్తు సరఫరా చేసే టవర్లు కూలిపోయాయి. దీంతో అధికారులు నీరు తోడలేక పోయారు. ఫలితంగా ఫోర్‌బే రక్షణ గోడపై వత్తిడి పెరిగి కొంత కూలిపోయింది. పంప్‌హౌజ్ నీళ్లతో నిండింది. కన్నెపల్లి పంప్‌హౌజ్‌లోని 17 పంపుల్లో 3 మాత్రమే దెబ్బతిన్నాయి. చందనపూర్ వాగు పొంగడం వల్ల బరాజ్ రక్షణకు నిర్మించిన కరకట్టపై నుంచి నీరు పొర్లినందువల్ల అన్నారం పంప్‌హౌజ్ మునిగింది. అయినా పంప్‌హౌజ్ మొత్తం సురక్షితంగానే ఉంది. ఇది పూర్తిగా ప్రకృతి విపత్తు వల్ల జరిగిందని స్పష్టంగా తెలిసిపోతున్నా, డిజైన్, నాణ్యతా లోపమని బీజేపీ దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నది. 2009లో శ్రీశైలం ప్రాజెక్టు ఇదే తరహాలో నీట మునిగింది. అలాంటి పరిస్థితే మొన్న ఎదురయింది.
అనుమతులిచ్చింది మీరే కదా..?
కాళేశ్వరానికి కేంద్రం అన్ని అనుమతులిచ్చింది. ప్రాజెక్టు నిర్మాణానికి పెట్టుబడి, దానివల్ల ఏ మేరకు ఫలితం ఉంటుందనే కాస్ట్ బెనిఫిట్ రేషియో అనుమతి 2018లో వచ్చింది. చిట్టచివరికి తీసుకోవాల్సిన టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ అనుమతి కూడా కేంద్రమే ఇచ్చింది. నిర్మాణానికి రుణాలను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తదితర కేంద్ర సంస్థలే మంజూరు చేశాయి. ప్రాజెక్టు డీపీఆర్‌ను సైతం కేంద్ర సంస్థ అయిన వ్యాప్కోస్ రూపొందించింది. డిజైన్ లోపాలుంటే కేంద్రం అనుమతులు ఎలా ఇచ్చింది? నిధులను ఎందుకు మంజూరు చేసింది? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కంపెనీకి తగిన టెక్నికల్ సామర్థ్యం లేదని కేంద్ర మంత్రి హోదాలో షెకావత్ మాట్లాడటం గర్హనీయం. తెలంగాణ ప్రభుత్వం ఓపెన్ టెండర్ పిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన కంపెనీయే గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో అనేక ప్రాజెక్టులను చేపడుతున్నది. కేంద్రం పర్యవేక్షణలో జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణంలోనూ అదే కంపెనీ భాగస్వామిగా ఉన్నది. నిర్మాణం సామర్థ్యం లేని కంపెనీ అయితే పోలవరం పనులను ఆ ఏజెన్సీకి ఎలా ఇచ్చారు? కేంద్రమంత్రిగా ఉండి అలా ఎలా మాట్లాడుతారు? మీరు పనులు ఇస్తే ఒప్పు. మేమిస్తే తప్పా? ఇది రాజకీయం కోసం బీజేపీ బురద జల్లడమే తప్ప మరేం లేదు. ప్రాజెక్టులు పాడు కావాలి తెలంగాణ బాగు పడొద్దు అనేది బీజేపీ దుష్ట బుద్ధి
నీళ్లు ఇవ్వకుంటే సాగువిస్తీర్ణం ఎట్లా పెరిగింది?
రాష్ట్రం వచ్చేనాటికి తెలంగాణలో వరిసాగు 34.94 లక్షల ఎకరాలు. ధాన్యం దిగుబడి 68 లక్షల టన్నులు. 2021లో వరిసాగు 1.4 కోట్ల ఎకరాలు. ధాన్యం దిగుబడి 218 లక్షల టన్నులు. పెరిగిన విస్తీర్ణం 200%. ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇవ్వకుంటే సాగు విస్తీర్ణం ఎలా పెరిగింది? నీళ్లు లేకుండా సాధ్యమా? ముమ్మాటికీ కాళేశ్వరం ద్వారానే నీళ్లిచ్చాం. అందువల్లే గతంలో తుమ్మలు మొలిచిన నేలల్లో ఇప్పుడు రెండు పంటలు పండుతున్నయి. సిద్దిపేట జిల్లాలో గతంలో 2 లక్షల టన్నుల ధాన్యం రాకపోయేది. ఇప్పుడు 5 లక్షల టన్నుల ధాన్యం పండుతున్నది. భూపాలపల్లి జిల్లా రేగొండకు, సూర్యాపేట, తుంగతుర్తి వరకు నీళ్లిచ్చాం. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు గత మార్చి 4న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మోటర్లను ఆన్ చేయడం వాస్తవం. అయినా కాళేశ్వరం కింద ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదనడం బీజేపీ దివాళాకోరుతనానికి నిదర్శనం. గత యాసంగిలో 11 లక్షల ఎకరాలకు కాళేశ్వరంతో మేలు జరిగింది. పెరిగిన సాగు.. పండిన పంటే కాళేశ్వరం ప్రాజెక్టు విజయానికి తార్కాణం. గత యాసంగిలో కేంద్రం పంట కొనకుండా చేతులెత్తేయడం కాళేశ్వరం గొప్పతనమే. గత యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయకుండా చేతులెత్తేసినట్టు చేయకుండా.. ఈసారి కొనుగోళ్లకు కేంద్రం సిద్ధం కావాలి.
45 రోజుల్లో నీళ్లిస్తాం.. పంట కొనుగోలుకు సిద్ధంకండి..
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే 3 బరాజ్‌లు, 16 జలాశయాలు, 21 పంప్‌హౌజ్‌లు, 98 కిలోమీటర్ల డెలివరీ పైపులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, భారీ విద్యుత్తు సబ్‌స్టేషన్లు.. ఇలా వందల కాంపోనెంట్ల కలయిక. వీటిలో కేవలం నది పక్కన ఉన్న రెండు పంప్‌హౌజ్‌లు నీట మునిగితే మొత్తం ప్రాజెక్టే నీళ్ల పాలైందని బీజేపీ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. వందలకోట్ల నష్టమంటూ చెప్తున్నారు. నీట మునిగిన పంపుల పునరుద్ధరణ బాధ్యత పూర్తిగా ఏజెన్సీదే. ప్రభుత్వంపై అదనంగా పడే భారం ఏమీ లేదు. ఇప్పటికే అధికారులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. సెప్టెంబర్ నెలాఖరు కల్లా పంప్‌హౌజ్‌లను పునరుద్ధరిస్తాం. యథావిధిగా నీటిని ఎత్తిపోస్తాం. యాసంగికి బ్రహ్మాండంగా నీళ్లు ఇస్తాం. ఇప్పుడు 2 పంప్‌హౌజ్‌లు తప్ప మిగతావన్నీ పనిచేస్తున్నాయి. ఇప్పటికే 31 టీఎంసీల నీటిని మిడ్‌మానేరు నుంచి ఎత్తిపోసి యాసంగికి సిద్ధంగా ఉంచాం. పంద్రాగస్టునాడు కూడా ఎత్తిపోసిన నీళ్లకు త్రివర్ణ శోభ కల్పించాం. ఇకనైనా విమర్శలు మానుకొని యాసంగి పంట కొనేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు పాడైతే బాగుండునని వాళ్లు కంటున్న కలలు కల్లలవుతాయి. రాక్షసానందం పొందుతున్న బీజేపీకి నిరాశ తప్పదు. చౌకబారు రాజకీయం చేస్తే పుట్టగతులుండవు. ఎఫ్‌ఆర్‌బీఎం ఆపితే కేసీఆర్ రైతుబంధు ఇవ్వరని బీజేపీ నేతలు అనుకొన్నారు. కానీ కేసీఆర్ బీజేపీ ఎత్తులను చిత్తుచేశారు. ఉచిత కరెంటుకు కూడా బీజేపీ అడ్డుపడాలని చూసింది. రూ.6,500 వదులుకొన్నారే తప్ప ఉచిత కరెంటు ఆపలేదు.
రాజీవ్‌శర్మ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, ఎండీ
వేదిక: తెలంగాణ , తేదీ: 15-08-2019
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన రుణాలు పూర్తిగా సద్వినియోగం అవుతున్నాయి. చాలా సంతోషంగా ఉన్నది. మేం డబ్బులు ఇచ్చాం. తెలంగాణ సకాలంలో సద్వినియోగం చేసుకొంటున్నది. ఫలితంగా ప్రాజెక్టు వ్యయం పెరిగే అవకాశం లేకుండా పోతున్నది. బరాజ్‌లు, సొరంగాలు, అతిపెద్ద పంపులు ఇప్పటివరకు ఎక్కడా ఉపయోగించలేదు. ప్రాజెక్టు నిర్మాణం ఇంజినీరింగ్ అద్భుతం. ఇతర రాష్ర్టాలు తప్పకుండా సందర్శించాలి. రాజకీయ నేతలు, ఇంజినీర్లు ఈ ప్రాజెక్టును చూసి నేర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
వేదిక: శంషాబాద్ ఎయిర్‌పోర్టు
తేది: 29-04-2022
తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రం. సంపద్వత్తమైన రాష్ట్రం. మీకో విషయం చెప్తాను. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులన్నీ ఇచ్చింది నేనే. నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.
మసూద్ హుస్సేన్, సీడబ్ల్యూసీ చైర్మన్
వేదిక: తెలంగాణ , తేది: 18-04-2018
కాళేశ్వరంలో అతి పెద్ద సర్జ్‌పూల్‌లు, పంప్‌హౌజ్‌లు, సొరంగాలు ఉన్నాయి. మేడిగడ్డ బరాజ్, హైడ్రో మెకానికల్ పనులన్నీ పూర్తి నాణ్యతతో ఏకకాలంలో కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా చాలా ప్రాంతాలకు సాగునీటి లబ్ధి చేకూరనున్నది. తాగునీరు అందనున్నది. ప్రాజెక్టు ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుంది.
ప్రధాని నరేంద్రమోదీ, వేదిక: పార్లమెంట్, తేది: 20-07-2018
నాకు చాలా గుర్తుంది. రాష్ట్ర విభజన తొలినాళ్లలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. గవర్నర్, హోంమంత్రి, స్వయంగా నేనూ ఎన్నో సార్లు సర్ది చెప్పాం. తెలంగాణకు వ్యతిరేకంగానే టీడీపీ తన బలాన్ని అంతా ఉపయోగించింది. ఉపయోగిస్తున్నది. కానీ తెలంగాణ సర్కారు, సీఎం కేసీఆర్ ఎంతో పరిణతితో ఆలోచించారు. తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఏపీలో ఏం జరుగుతున్నదో అంతా చూస్తున్నారు.
కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ ఆరోపణలు
-కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో రూ.వేల కోట్ల కుంభకోణం జరిగింది. ఇప్పుడు రిపేర్ల పేరిట కూడా భారీగా అవినీతి జరిగే అవకాశం ఉన్నది.
-ప్రాజెక్టుకు అనుమతులూ లేవు. ప్రాజెక్టు డిజైన్ సరిగా లేదు.
-కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు.
-ప్రాజెక్టును నిర్మించిన కంపెనీకి ఆ మేరకు తగిన టెక్నికల్ సామర్థ్యాలు లేవు. మోటర్లను తగిన రీతిలో అమర్చలేదు.
-తెలంగాణ డ్రీమ్ ప్రాజెక్టు పేరిట కేసీఆర్ అబద్ధాలు.