-మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటన నారాయణఖేడ్: మనూరు మండలం ఏస్గీ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని, గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.
ఆదివారం రాత్రి మెదక్ జిల్లా మనూరు మండలం ఏస్గీ గ్రామస్థులు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. గ్రామ శివారులో కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన చెరువులో గత ప్రభుత్వాలు తట్టెడు మట్టి తియ్యకుండానే ఏడాదికేడాది బిల్లులు మాత్రం కాజేశారని ఆరోపించారు. ఏస్గీ చెరువును రూ.కోటి నిధులతో పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని, రెండు నెలల్లోగా తానే స్వయంగా వచ్చి గ్రామస్థులతో చేయిచేయి కలిపి సమాధానం ఇస్తానన్నారు. ప్రతి ఏటా 25 చొప్పున డబుల్ బెడ్‌రూం ఇండ్లను సైతం మంజూరు చేస్తామని, ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షల చొప్పున వెచ్చించి ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందన్నారు.
-రూ.కోటి నిధులతో ఊరి చెరువును అభివృద్ధి చేస్తా: మంత్రి హరీశ్‌రావు
ఏస్గీ గ్రామాన్ని చూస్తుంటే 60 ఏండ్లుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదనే విషయం అర్థమవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఏస్గీ గ్రామస్థులు మంత్రి సమక్షంలో ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ ప్రతిజ్ఞచేశారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ రాములునాయక్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.