Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఎన్నికలు.. ఎన్నో కళలు!

ఈ ఎన్నికల ప్రక్రియ చూసినంక కేసీఆర్ గారు ఎప్పుడు పిలుపునిచ్చినా రాజీనామా చేసి, మళ్లీ మళ్లీ బరిలోకి దిగిన తెరాస ఎమ్మెల్యేలకు, వారి నిబద్ధతకు నా తెలంగాణ సలాం. తెలంగాణ ప్రజల జీవితాలలో సంతోషం విరజిల్లేటట్లు 14 సంవత్సరాలు అహర్నిశలూ శ్రమించి, ఆర్థికంగా, శారీరకం గా, మానసికంగా కుంగిపోయిన టీఆర్‌ఎస్ శ్రేణులు, తెలంగాణవాదుల జీవితాలలో కూడా ఆనందం నిండాలని కోరుకుంటున్నాను.ఎన్నికలు వచ్చాయి. వెళ్లాయి. లొల్లి ముగిసింది. కాని నేతల మనసు ల్లో మాత్రం గుబులు మొదలయ్యిం ది. గెలుస్తాము అనే నమ్మకం ఉన్నది కానీ కచ్చితంగా గెలిపిస్తారన్న బలమై న నమ్మకం మాత్రం కలగడం లేదు. గులాబీ పార్టీ తప్ప మిగతాపార్టీలు అన్నీ బేజారుగా ఉన్నాయి.

పైకి మేకపోతు గాంభీర్యం.. కానీ లోలోపలు వెన్ను లో వణుకు. పెద్ద నాయకులకైతే పీడకలలు తప్పడం లేదు. కర్మ సిద్ధాంతం నమ్ముకున్నవారు కంటినిండా కునుకు తీస్తున్నారు. ఆరు నూరైనా అసెంబ్లీ, పార్లమెంట్ గడప తొక్కాలని అనుకున్న వారికి తమ గుండె చప్పుళ్లు కూడా గుబులు రేపుతున్నాయి. మూడు వారాలు అన్నం, నిద్రలు లేక, ఎండ లో తిరుగుతూ అభ్యర్థులందరూ నల్ల కాకులుగా మారిపోయారు. అద్దంలో తమ మొగం తాము చూసుకొని ఆందోళన చెందుతున్నారు. అభ్యర్థుల సతీమణులు, కుటుంబ సభ్యులైతే అలవాటు లేని ఎండలో తిరిగి తిరిగి, మాడిన ముఖాలను అద్దంలో చూసుకోవడానికి కూడా భయపడిపోతున్నారు. ఇక అలసి సొలసిన నాయకులలో డబ్బులు జేబు నిండా ఉన్నవారు సింగపూరు లాంటి విదేశాలకు వెళ్తుంటే, జేబులు ఖాళీ అయిన నాయకులు చేసిన అప్పులను తీర్చడానికి ఉన్న ఆస్తులను బేరం పెడుతున్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత, బీఫాం వస్తుందో లేదో అనే బెంగ. బీ ఫాం చేతికి అందగానే అఫిడవిట్ కోసం అడ్వకేట్ చుట్టూ చక్కర్లు. నామినేషన్‌కు ముహూర్తాలు. జనసమీకరణలో ఉత్సాహం. కానీ ఎలక్షన్ కమిషన్ కంట్లో పడి, ఖర్చు బుక్ అవుతుందని భయం. ప్రచార రథాలు, పోస్టర్లు, కరపత్రాలు, స్టిక్కర్లు, పాటలూ, కళాకారులూ, నియోజకవర్గంలో యాత్రలూను.

ఎన్నికల ప్రచారం మొదలు కాగానే నాయకుల, కార్యకర్తల అలకలు, నిష్ఠూరాలు, అందరిని బుజ్జగించే సరికి అలసట మొదలు. మొదట సమయం సరిపోదని ఆందోళన. ఊరూరా ప్రచారం. రోడ్‌షోలు, మహాసభలు, జనం తప్పక వస్తారు. కానీ దానికీ ఒక లెక్కుంటుంది. ఫుల్ పేజీలలో కొందరు కనిపిస్తారు. రోజూ టీవీలలో, లీడర్‌తో ఒకరోజు పదే పదే కనిపిస్తారు. అది చూసి పేద పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతారు. కాని అవన్నీ అద్దె వార్తలని తెలిశాక ఊరట చెందుతారు. ఎవరు మీటింగ్ పెట్టినా లెక్కలు సరిపోతే చాలు.. జనం రెక్కలు కట్టుకొని వాలుతారు. అద్దె జనంతో మొదలైన ర్యాలీలు మొదట వెయ్యి మంది ఉంటే చివరగా వంద మంది మిగులుతారు. సందు దొరికినప్పుడల్లా జనం చప్పుడు కాకుండా జారుకుంటారు. సొంత జనంతో ఉన్న ర్యాలీలో మొదట వందమంది ఉంటే, చివరగా వేయి మంది అవుతారు.

అభ్యర్థుల పాట్లు ఇంతింతని చెప్పలేనివి. నామినేషన్ నుంచి మొదలు. నన్ను పిలవలేదని ఒకరు, వేరే వాళ్లను ఎందుకు పిలిచారని ఇంకొకరు అలక. ప్రచార రథం ఊర్లోకి వెళితే ఆదరించే వాళ్లు కొందరైతే, అందరూ దొంగలే అని అరిచేవారు మరికొందరు. అందరిలా కాదు, నేను సేవ చేస్తా అని చెబితే నమ్మేవారే కరువు. ఎన్నికల ముందు అందరూ ఇదే మాట చెబుతారు గాని, ఏమి ఇస్తవో ముందు చెప్పు అని నిలదీసేవారు ఇంకొందరు. అలసి సొలసి మధ్యరాత్రి ఇంటికి వస్తే, ఇప్పుడైనా దొరక్కపోతాడా అని వేచివున్న గ్రూపులు. అందులో ఆత్మీయతతో, ఏదో తమ వంతు సాయం చేయాలని వచ్చేవారు కొందరైతే…. ఏదో ఆశించి, వేచి చూసేవారు కొందరు. ఇక మీడియా మిత్రులు, తమ యాజమాన్యం ఇచ్చిన టార్గెట్ పూర్తిచేయాలనే తొందరలో అభ్యర్థులపై వత్తిడి చేయడం సహజం. కాని బడ్జెట్ పరిమితులు ఉన్న అభ్యర్థులకు వారిని తప్పించుకుని తిరగడమే శరణ్యం. రోజూ వందలు, వేల ఫోన్లు. అన్నీ అపరిచితులవే. ఎవరు ఎవరో తెలియదు. కొందరు అభిమానంతో చేస్తే, అత్యధికులు మా దగ్గర ఇన్ని ఓట్లు ఉన్నాయి అని బేరసారాలు జరిపేవారే.

పొద్దున్నే లేచి సగం ఇడ్లీ తిని పరుగులు తీస్తే ఇక ఆకలి ఊసెత్తితే ఒట్టు. అసలు ఆకలి అన్నమాట కడుపుకి తెల్వదు. కారులో వెళ్తూ ఏదో ఒకటి నోట్లో కూరుకుంటూ వెళ్లదీస్తే, కేసీఆర్ గారు హెలికాప్టర్‌లో పండ్లు నంజుకుంటూ ప్రయాణం చేసే.

హెలికాప్టర్ అంటే అందరూ మోజు పడతారు. కాకీ అందులో కూర్చుంటే, డబ్బా కారులా శబ్దం చేసుకుంటూ, ఎప్పుడు పడుతదో అని ప్రాణం బిగపట్టుకుని ప్రయాణం చేయడమే. మీటింగులకు భారీగా జనం వస్తే, అందరూ సంతోషంగా ఉంటారు. కానీ అభ్యర్థికి మాత్రం సంతోషంతో పాటు దుఃఖం కూడా వస్తుంది. ఖజానా ఖాళీ అవుతుంటే గుబులు. ఇంట్లో ఉన్నదంతా ఊడ్చి పెడుతుంటే, చాలక అప్పులు తెస్తుంటే ఇంట్లో ఉన్న పిల్లలు డాడీ ఎన్నికలు అయినంక కనీసం ఇల్లు అయినా మిగులదా అని అమాయకంగా అడుగుతుంటే… మధ్య తరగతి అభ్యర్థులకు గుండె గుభేలు అవుతది. మొదట మూడు వారాలు ఎలా సరిపోతుంది అనుకున్నవారే, వారం అయ్యిందో లేదో దేవుడా ఎన్నికలు ఎప్పుడు అయిపోతవి అని దండం పెట్టుకునే వారే అధికం.

సొంత డబ్బులతో, ఎన్నికలలో నిలబడ్డ వాడికి దిన దిన గండం. అక్రమంగా సంపాదించిన వాడికి మాత్రం డబ్బు ఎరలాంటిది. ఎన్నికలు ముగిశాక, బతుకు జీవుడా అని ఇక అందరూ పట్నం బాట పట్టారు. ఒక్కరోజు కూడా సరిగా నిద్ర పట్టక, ప్రతిరోజూ ఎన్నికల కలలతో దిగ్గున లేచి, హమ్మయ్య ఎన్నికలు అయిపోయాయి, ఇది కేవలం కలేనా! అని గుండె నిండా గాలి పీల్చుకొని, తాపీగా టీ తాగుతుంటే ప్రాణానికి ఎంత హాయిగా ఉండె. మళ్ల తెల్లారి నుంచి ఫోన్లు షురూ. పెండింగ్ బిల్స్, కార్యకర్తలు, అభిమానులు, వారి వారి విశ్లేషణలతో తయారు. వాళ్లందరూ మనం గెలుస్తాము అనే ధీమాను వ్యక్తం చేస్తుంటే వారి అభిమానం చూసి గెలిచిందాని కంటే ఎక్కువ సంతోషం కలుగుతుంది.

ఈ ఎన్నికల ప్రక్రియ చూసినంక కేసీఆర్ గారు ఎప్పుడు పిలుపునిచ్చినా రాజీనామా చేసి, మళ్లీ మళ్లీ బరిలోకి దిగిన తెరాస ఎమ్మెల్యేలకు, వారి నిబద్ధతకు నా తెలంగాణ సలాం. తెలంగాణ ప్రజల జీవితాలలో సంతోషం విరజిల్లేటట్లు 14 సంవత్సరాలు అహర్నిశలూ శ్రమించి, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కుంగిపోయిన టీఆర్‌ఎస్ శ్రేణులు, తెలంగాణవాదుల జీవితాలలో కూడా ఆనందం నిండాలని కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్యం లో మార్పు రావాలంటే ఎన్నికల తీరులో మార్పు అనివార్యం.అప్పుడే అసలు సిసలైన ప్రజాస్వా మ్యం నిలబడుతుంది.

డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ (రచయిత: టీఆర్‌ఎస్ రాష్ట్ర నేత)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.