Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఎన్నికలను రిఫరెండం అనే దమ్ముందా?

– మీరు చేసిన పనులు చెప్పి ఓట్లు అడుగగలరా? – టీ కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్ 10 ప్రశ్నలు – తెలంగాణకు అడుగడుగునా కాంగ్రెస్ నేతల ద్రోహం – తెలంగాణకు కేసీఆర్ వంటి చాణక్యుడి నాయకత్వం కావాలి – 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై చార్జిషీట్ ప్రకటించిన టీఆర్‌ఎస్

Harish

హైదరాబాద్: కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చేప్పే దమ్ములేక తెలంగాణ కాంగ్రెస్ నాయకులు దిగజారి వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ఎల్‌పీ ఉపనేత హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు గాలికి వదిలి సీమాంధ్ర ఏజెంట్లుగా వారి తరపున మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు ముందు అభివృద్ధి కావాలి. తెలంగాణ ఆ తరువాత ఇవ్వవచ్చు అంటూ ఈ టీ కాంగ్రెస్ నేతలే హైకమాండ్‌ను కలిసి మెమోరాండం ఇచ్చిన మాట నిజంకాదా? అని హరీశ్ నిలదీశారు.

ఇంకెక్కడి తెలంగాణ? అని వైఎస్ అసెంబ్లీలో అవహేళన చేస్తుంటే ఆయన వెనకచేరి ముసిముసి నవ్వులు నవ్వింది ఈ నాయకులేనని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నేతలు అడుగడుగునా ద్రోహం చేస్తూ వచ్చారని వారు చేసిన ప్రతి ద్రోహాన్ని ఎన్నికల్లో ప్రజాకోర్టులో పెడతామని హెచ్చరించారు. వచ్చిన తెలంగాణను ఏ విధంగా మలుచుకోవాలో కనీసం ఒక విజన్ కూడా వీరికి లేదని ఆయన దుయ్యబట్టారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన టీ కాంగ్రెస్ నేతలకు 10 ప్రశ్నలు సంధించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేతనైతే జవాబు చెప్పాలని లేదా జైరాం రమేష్ లేదా దిగ్విజయ్‌సింగ్‌తో సమాధానం చెప్పించాలని డిమాండ్ చేశారు.

టీఆర్‌ఎస్ సంధించిన 10 ప్రశ్నలు – ఉద్యోగులకు ఆప్షన్లు ఉండొద్దని టీఆర్‌ఎస్ అంటోంది. మీరెందుకు ఆప్షన్లు సమర్థిస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వంలో సీమాంధ్రులను పెట్టుకుని తెలంగాణ ఉద్యోగులు, నిరుద్యోగుల నోట్లో మట్టికొడతారా? – పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని,లేకుంటే కట్టనివ్వబోమని టీఆర్‌ఎస్ అంటోంది. డిజైన్ మార్పుపై మీ వైఖరేమిటి? – సచివాలయంలో 90శాతం మంది సీమాంధ్ర ఉద్యోగులే. వారు సీమాంధ్ర ప్రభుత్వంలోనే పనిచేయాలని టీ ఉద్యోగసంఘాల నాయకులు దేవీప్రసాద్, విఠల్ వంటివారు అంటున్నారు. దీనిపై మీరేమంటారు ? – భద్రాచలంలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనిపై మీ వైఖరేమిటి? – ఉద్యోగులు, పెన్షన్ల పంపిణీ జనాభా ప్రాతిపదికన కాకుండా స్థానికత ఆధారంగా ఉండాలంటున్నాం. మీరేమంటారు? – తెలంగాణకు ప్రత్యేక కేటగిరి ఇవ్వకుండా కేంద్రం, కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేశాయి. దీనిపై మీరేమంటారు? – ఉన్నత విద్యాసంస్థల్లో ఉమ్మడి అడ్మిషన్లు వద్దంటున్నాం.ఎక్కడి విద్యార్థులు అక్కడే ఉండాలని టీఆర్‌ఎస్ అంటోంది. దీనిపై మీరేమంటారు? – రాష్ర్టాన్ని 41ఏళ్లు కాంగ్రెస్సే పాలించింది. మీ పాలనలోనే తెలంగాణ వెనుకబడింది. పదేళ్ల ఇటీవలి మీ పాలనను చూసి మీకు ఓటేయ్యాలా? ఈ ఎన్నికలను మా పదేళ్ల పాలనకు రెఫరెండం అని ప్రకటించే దమ్ము, ధైర్యం మీకు ఉందా? – తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికే ఓట్లేయాలని మేం ఓట్లు అడుగుతాం. ఇదేమాటపై మీరు ఓట్లు అడుగగలారా? – 13 ఏళ్లు ఉద్యమంలో పాల్గొన్న కేసీఆర్‌ను సమర్థించమని మేం జనంలోకి వెళ్లి ఓట్లు అడుగుతాం. పదేళ్లు మంత్రులుగా ఉన్నాం. మేం చేసిన పనులు చూసి ఓట్లేయాలని మీరు అడుగగలరా?

టీఆర్‌ఎస్ సంధించిన చార్జిషీట్ హైదరాబాద్ ఫ్రీజోన్ అని అన్నప్పుడు పోరాడలేదు.పోలవరం డిజైన్ మార్చాలని డిమాండ్ చేయలేదు.సీమాంధ్ర అక్రమ ప్రాజెక్టులన్నింటికీ నీటి విడుదల ఫైళ్ల మీద పొన్నాల లక్ష్మయ్యే సంతకాలు చేశారు. ఇంకెక్కడి తెలంగాణ అని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్నప్పుడు ఆయన వెనకాల నిలబడి ముసిముసి నవ్వులు నవ్వారు. హైదరాబాద్‌కు పోవాలంటే వీసా, పాస్‌పోర్ట్ తీసుకోవాలా? అన్నప్పుడు నోరు విప్పలేదు. నీలం తుఫాను కారణంగా ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఆపార నష్టం జరిగినా ఒక్క రూపాయి ఇవ్వకుంటే కనీసం ప్రశ్నించలేదు. సొంత జిల్లాకు కిరణ్ అక్రమంగా రూ.5వేల కోట్లు తరలించుకుంటే క్యాబినెట్ ఆమోదించి సంతకాలు చేశారు గానీ నల్గొండ ఫ్లోరైడ్ ప్రాంతాలకు నీళ్లకు నిధులు కావాలనలేదు. దానిపై టీఆర్‌ఎస్ కేసువేసిన తర్వాత ఈ మంత్రులు సంతకాలు చేశారు. సీఎం కిరణ్.. అసెంబ్లీలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నప్పుడు ఒక్కరూ మాట్లాడలేదు. బయ్యారం గనులను ఆంధ్రకు తరలిస్తామంటే కిమ్మనలేదు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏనాడూ ప్రశ్నించలేదు.పోతిరెడ్డిపాడుకు అక్రమంగా నీళ్లివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆరు మంత్రిపదవులకు టీఆర్‌ఎస్ రాజీనామా చేస్తే ఆ ఫైలుపై పొన్నాల సంతకాలు చేశారు. ఛార్జిషీట్‌లోని ఈ అంశాలపై టీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ చర్చకు సిద్ధంగా ఉందని, కాంగ్రెస్ సిద్ధమా? అని హరీష్ సవాల్ విసిరారు.

విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ సమర్థవంతమైన నాయకుడి చేతిలో తెలంగాణ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.. కాంగ్రెస్‌లో ఒక్కరైనా సమర్థుడైన నాయకుడు ఉన్నాడా? అని హరీష్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడే చాణక్యుడు వంటి నాయకుడు ఇపుడు తెలంగాణకు కావాలని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు బొంతురామ్మోహన్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సుమన్ పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.