-ఖాళీగా మున్సిపల్ ఎలక్షన్స్ గ్రౌండ్.. -టీఆర్‌ఎస్ ఘనవిజయం ఖాయం: సీఎం కేసీఆర్ -టికెట్ అడగటం పార్టీ నాయకులు, కార్యకర్తల హక్కు -వారికి సర్దిచెప్పి.. భవిష్యత్ అవకాశాలపై వివరించాలి -ఇంటింటికీ తిరుగాలి.. ప్రతి ఓటరును కలువాలి -పల్లెప్రగతి మాదిరిగానే ఎన్నికల తర్వాత పట్టణప్రగతి -పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు -ఎమ్మెల్యేలు, ఇంచార్జీలకు ఏ, బీ ఫారాలు అందజేత

‘మున్సిపల్ ఎన్నికల బరిలో మనమే ముందు న్నాం. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల గ్రౌండ్ ఖాళీగా ఉన్నది. టీఆర్‌ఎస్ తప్ప మరెవరూ లేరు.. ఈ ఎన్నికల్లో మన పార్టీ ఘన విజయం ఖాయం. రాష్ట్రమంతా టీఆర్‌ఎస్‌కు సానుకూల వాతావరణం ఉన్నది’ అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు దక్కని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇతర అవకాశాలు కల్పిస్తామని సర్దిచెప్పాలని ఎమ్మెల్యేలు, పురపాలక సంఘాల ఇంచార్జీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులకు సూచించారు. గురువారం తెలంగాణభవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు సహా ఇతర మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
పార్టీ ఎమ్మెల్యేలకు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏ, బీ ఫారాలను సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీ టికెట్ అడిగే హక్కు నాయకులు, కార్యకర్తలకు ఉంటుందని, టికెట్ ఎందుకు ఇవ్వలేకపోయామో వివరంగా వారికి చెప్పాలని అన్నారు. భవిష్యత్‌లో వారికి ఎలాంటి అవకాశాలున్నాయో తెలుపాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఆశించడం కార్యకర్తల హక్కు అని, వారు ఒత్తిడి తెస్తుంటారని, వాటన్నింటిపై సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. వారిని కోపగించుకోవద్దని, కసురుకోవద్దని అన్నారు. మార్కెట్ కమిటీ పదవులు, దేవాలయ కమిటీ పదవులు, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు ఇలా అనేక రకాలు ఉంటాయని, వీటిలో ఏదో ఒకటి ఇస్తామని వారికి భరోసా కల్పించాలని చెప్పారు. అభ్యర్థులను ఖరారుచేయడం, బీ ఫారాలు ఇవ్వడంలో జాప్యం చేయొద్దని, శుక్రవారం సాయంత్రానికి వాటన్నింటినీ ఖరారుచేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక పూర్తయితే వారు ప్రచారంపై దృష్టి పెడుతారని, దీంతోపాటు టికెట్ రానివారిని సముదాయించుకొని ముందుకుపోయే సమయం ఉంటుందని వివరించారు.
అభ్యర్థుల ఖరారు ఆలస్యమైతే వారందరి పేర్లు ప్రకటించేవరకు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగడం వల్ల ఏ పనీచేసుకోలేని పరిస్థితి తలెత్తుతుందని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల పేర్లను వెంటనే ఖరారుచేయాలని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు.. స్థానిక సంస్థల ఎన్నికలైనందున ట్రెండ్ ద్వారా ఓటింగ్ జరుగదని, ప్రతి ఓటరును కలువాల్సిందేనని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎమ్మెల్యేలకు స్పష్టంచేశారు. అభ్యర్థులను ఆ విధంగా గైడ్‌చేయాలని సూచించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేయాలని చెప్పారు. ప్రతి ప్రభుత్వ పథక లబ్ధిదారుడిని కలువాల్సిందేనని, ప్రభుత్వం పథకం ఇస్తుంది కాబట్టి ఓటు వేస్తారనుకోవద్దని, మనం కలిసి ప్రభుత్వ పథకాన్ని గుర్తుచేసి, మళ్లీ గెలిపిస్తే ఇంకా మంచి పథకాలు అమలుచేస్తామని చెప్పాలన్నారు. అప్పుడే ఓట్లు పడుతాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు తక్కువగా ఉంటాయి.. అభ్యర్థులు ఎక్కువగా ఉంటారని, ఈ నేపథ్యంలో ప్రతి ఓటు విలువైనదేనని పేర్కొన్నారు. మరో నాలుగేండ్లపాటు రాష్ట్రంలో ప్రస్తుత టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, పట్టణాలను అభివృద్ధి చేసుకోవడానికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తుందని చెప్పారు. కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్లు, గురుకుల పాఠశాలలు ఇలా అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టామని, వాటన్నింటినీ లబ్ధిదారులకు గుర్తుచేయాలని చెప్పారు. బుజ్జగించినా వెనక్కి తగ్గని నాయకుల పేర్లను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపించాలని సూచించారు.

నేను మీ కోసం పనిచేసినట్టే చేయాలి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుకోసం తాను ఏ విధంగా పనిచేశానో, ఎమ్మెల్యేలు కూడా అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో పనిచేయాలని అధ్యక్షుడు కేసీఆర్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థులను గెలిపించడానికి నిత్యం సమీక్షలు, ప్రణాళికలు, వ్యూహం, ఎత్తుగడలతో ఏ విధంగానైతే తాను ముందుకెళ్లానో అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా చేయాలని చెప్పారు. వారందరూ గెలిస్తేనే ఎమ్మెల్యేలకు బలమని, లేకుంటే బలహీనమవుతారని స్పష్టంచేశారు. వాళ్లే ఎమ్మెల్యేలకు పునాదులని హితబోధచేశారు. వాళ్లు ఓడిపోతే ఎమ్మెల్యేలకు ఇబ్బంది అవుతుందని తెలిపారు.
జాగ్రత్తగా వ్యవహరించాలి ఏ ఫారాలను సంబంధిత జిల్లాల కలెక్టర్లకు, రిటర్నింగ్ అధికారులకు అందచేయాలని అధ్యక్షుడు కేసీఆర్ సూచించారు. ఒక నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో ఉంటే రెండు జిల్లాల కలెక్టర్లకు ఏ ఫారాలు అందించాలని చెప్పారు. న్యాయవాదులతో నామినేషన్ ఫారాలు, బీ ఫారాలు సరిచూసుకొని సమర్పించాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లు జరుగకుండా చూడాలని కోరారు. ఈ ప్రక్రియకు సంబంధించి పార్టీ ఇంచార్జి, ప్రధాన కార్యదర్శులుగా ఉన్నవారు సహకరించాలని సూచించారు. ఏ ఫారాలు సమర్పించేందుకు శుక్రవారం సాయంత్రం తుది గడువని తెలిపారు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఖర్చులను సమర్పించాలని సూచించారు.

ఎన్నికల తర్వాత పట్టణప్రగతి గ్రామాల్లో పల్లెప్రగతి పేరుతో చేపడుతున్న కార్యక్రమం అద్భుత ఫలితాలను ఇచ్చిందని, గ్రామాలకు నెలకు రూ.339 కోట్లు ఇస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. అదేవిధంగా ఎన్నికల తర్వాత పట్టణప్రగతి కార్యక్రమాన్ని చేపడుతామని ప్రకటించారు. పరిశుభ్రత, పచ్చదనం కనిపించేలా పట్టణాలను మారుస్తామని వెల్లడించారు. అనేక పట్టణాల్లో తాగునీటి, కరంటు సమస్యను పరిష్కరించామని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఎన్నికలు పూర్తికాగానే వాటిని పరిష్కరిస్తామని చెప్పారు.
లెక్కింపు రోజున ప్రత్యేక ఏర్పాట్లు ఈ నెల 25న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో 60-70 మంది వరకు అందుబాటులో ఉంటారని, వారికి ఓట్ల లెక్కింపు సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని సీఎం కేసీఆర్ నేతలకు సూచించారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువా కప్పి అభినందించారు.

అన్నదమ్ములలెక్క కలిసి పనిచేస్తాం ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకం టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తుంది. మేడ్చల్ జిల్లాలో రెబల్స్ లేరు. అందరం కలిసి అన్నదమ్ములలెక్క కలిసి పనిచేస్తాం. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి నాకు ఎలాంటి విభేదాలు లేవు. నాపై అసత్య ప్రచారం జరుగుతున్నది. బుధవారం బోడుప్పల్‌లో జరిగిన గొడవకు నాకు ఎలాంటి సంబంధంలేదు. మేడ్చల్ నియోజకవర్గంలో ఎక్కువ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఉన్నాయి. అందరం కలిసి మున్సిపాలిటీలన్నింటినీ గెలిపించుకుంటాం. – చామకూర మల్లారెడ్డి, మంత్రి
గెలుపునకు బ్రాండ్ అంబాసిడర్ టీఆర్‌ఎస్ గెలుపునకు బ్రాండ్ అంబాసిడర్ టీఆర్‌ఎస్. కాంగ్రెస్, బీజేపీలు ఓటమికి బ్రాండ్ అంబాసిడర్లు. గెలిచే అవకాశం కాంగ్రెస్, బీజేపీలకు ఉంటే ఎన్నికలను ఆపడానికి కోర్టుకు ఎందుకు వెళ్లారు? బండి సంజయ్ ఎంపీగా ఎన్నికైన ఏడు నెలల్లో అభివృద్ధి ఆపడానికి అనేక లేఖలు రాశారు. 70 ఏండ్లల్లో జరుగని అభివృద్ధి కరీంనగర్‌లో గత ఆరేండ్లల్లో జరిగింది. కేంద్రం నిధులు ఇవ్వకపోగా కరీంనగర్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. కరీంనగర్‌కు ఐటీ టవర్‌ను తీసుకొచ్చాం. అందరినీ కలుపుకొని ఎన్నికల్లో విజయం సాధిస్తాం. కరీంనగర్‌లో టీఆర్‌ఎస్ భారీ విజయాన్ని నమోదు చేస్తుంది. కాంగ్రెస్ నేతల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఇప్పటివరకు ఐదుసార్లు ఓడిపోయారు. ఆయన మతిస్థిమితం కోల్పోయారు. నాపై వ్యక్తిగతంగా చేసిన ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. – గంగుల కమలాకర్, మంత్రి
సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ ఎజెండా సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ ఎజెండా. సమన్వయంతో అందరం కలిసి పనిచేసి మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం. టీఆర్‌ఎస్‌కు తిరుగులేదు. పార్టీలో పోటీతత్వమున్నది. రెబెల్స్ బెడద ఇప్పుడే కొత్తకాదు. రెబెల్స్‌తో ఎలా సమన్వయం చేసుకోవాలో మాకు తెలుసు. ఒకటి రెండు రోజుల్లో అన్ని సమస్యలు సద్దుమణుగుతాయి. – సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మంత్రి
ప్రభుత్వం పథకం ఇస్తుంది కాబట్టి ఓటు వేస్తారనుకోవద్దు. ప్రతి ఓటరునూ కలిసి ప్రభుత్వ పథకాన్ని గుర్తుచేసి, మళ్లీ గెలిపిస్తే ఇంకా మంచి పథకాలు అమలుచేస్తామని చెప్పాలి.అప్పుడే ఓట్లు పడుతాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు తక్కువగా ఉంటాయి.. అభ్యర్థులు ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రతి ఓటు విలువైనదే. – ఎమ్మెల్యేలు, ఇంచార్జీలతో ముఖ్యమంత్రి కేసీఆర్