Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఎందుకీ అపశకునం మాటలు

60 ఏండ్ల కిందట మా ఊరు చిట్టడవి అంచుకు విసిరేసినట్లుండేది. ఊరు చివర మా ఇల్లు. ఇంటి ముందు పెద్ద వేప చెట్టు. పంటచేలలో పొద్దంతా కాయకష్టం చేసి పొద్దు గూకి నులక మంచం ఆల్చుకొని అడ్డమొరిగే వేళకు వేప చెట్టు మీద పెద్దపిట్ట(దెయ్య పు పిట్ట అని కూడా పేరు) కూత, ఊరి బయటి నుంచి నక్కల ఊల వినిపించేది. పెద్ద పిట్ట ఏడిస్తే ఊరిలో పీనుగెళ్తదనే ఓ విశ్వాసం. పెద్ద పిట్ట కూత, నక్కల ఊల విన్నప్పుడు గుండె దడదడలాడేది. పిల్లలం భయంతో బిర్ర బిగుసుకు పోయే వాళ్ళం. మా నాయన నన్ను, ఇద్దరన్నలను, ముగ్గురక్కలను దగ్గరకు తీసుకొని వీపు చరిచి, దేవునికి దీపం పెట్టీ, ఊదు పొగేసి.. ‘ఇక ఏమి కాదు భయపడకురి బిడ్డా’అని ధైర్యం చెప్పేటోడు. ఇది నమ్మకమా? విశ్వాసమా? మూఢమా? అనే మీమాంస చర్చ అక్కరలేనిది.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కొన్ని పెద్దపిట్ట కూతలు, నక్కల ఊలలు వినిపిస్తున్నాయి. అప్పట్లో పెద్దపిట్ట లాంటి కూతల వలె, ఇప్పుటి ప్రతిపక్ష నేతలు రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, బండి సంజయ్‌ మాటలు కీడునే కోరుతున్నాయి. తెలంగాణ గడ్డ ఉన్నపళంగా పీనుగల దిబ్బగా మారితే శవ రాజకీయం చేయాలని కాటి కాడి నక్కల్లా కాచుకుని కూర్చున్నట్లు వారి మాటలు చెబుతున్నాయి.

ప్రతి వందేండ్లకు ఒకసారి కరోనా లాంటి వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్నది. గతంలోకూడా ఇలాంటి వైరస్‌తో 1.4 కోట్ల మంది చనిపోయారు. మందు లేని ఈ మాయ రోగానికి మానసికంగా సిద్ధం కావటమే మందు. తెలంగాణలో వ్యవసాయం చేసుకునే ఒక వృద్ధుడు చెప్పిన మాటను ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. ‘కేసీఆర్‌ ఉన్నంతకాలం కరోనా ఏమీ చేయలేదు.. తడక అడ్డం పెట్టి అయినా రానియ్యడు.. వెయ్యి కోట్లు ఖర్చు చేసైనా కాపాడుతడు’ అని ఆ వృద్ధుడు ధీమా ప్రకటించాడు. అది ప్రజలకు కేసీఆర్‌ మీద ఉన్న విశ్వాసం. ఈ విశ్వాసానికి అనుగుణంగా సీఎం అదే రీతిలో కరోనా కట్టడికి కృషిచేస్తున్నారు. ఈ మహమ్మారికి మందు లేకపోవటమే పెద్ద సమస్య అయితే, ఇది చాలదన్నట్టు ఎంతో మంది చనిపోతున్నారంటూ ప్రతిపక్షాలు, సోషల్‌ మీడియా విశృంఖల ప్రచారం సాగిస్తూ ప్రజల్లో భయం సృష్టిస్తున్నాయి. పెద్దపిట్ట కూత భయం నుంచి తండ్రి తన పిల్లలను రక్షించు కున్నట్టుగానే అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ అద్భుతమైన వివరణతో ప్రజల్లో విశ్వాసాన్ని నింపారు.

దేశంలో నమోదైన కరోనా కేసుల్లో చనిపోతున్న వారి సంఖ్య సుమారు 2.8 శాతంగా ఉంది. జూన్‌ 30వ తేదీ నాటికి.. మహారాష్ట్రలో కరోనా రోగుల్లో మరణాల రేటు 5 శాతంగా ఉంది. కానీ తెలంగాణలో మరణాల రేటు 0.87 మాత్రమే ఉన్నది. అది కూడా వయసు మీదపడి, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారిలోనే మరణాల శాతం ఎక్కువగా ఉన్నది. కేసీఆర్‌ ఇచ్చిన ధైర్యంతోనే కరోనా లక్షణాలు ఉన్న వేల మంది ధైర్యంగా ఇంట్లోనే ఉండి కోలుకుంటున్నారు. తెలంగాణను చూసి సరిహద్దు రాష్ర్టాల ప్రజలు కూడా ‘హోమ్‌ ఐసోలేషన్‌’లో ఉంటూ వ్యాధి నుంచి కోలుకుంటున్నారు. కేసీఆర్‌ నూరిపోసిన ధైర్యమే వారిని కోలుకునేలా చేస్తున్నది.

ఒక్క కరోనా విషయంలోనే కాదు, ప్రతి సందర్భంలోనూ ప్రతిపక్షాలది ప్రజా వ్యతిరేక వైఖరే. ఉస్మానియా దవాఖాన భవనాలు వందేళ్ల నాటివని, శిథిలావస్థకు చేరుకున్నాయని వెంటనే వాటిని కూల్చివేసి కొత్త ఆస్పత్రి భవన నిర్మాణం చేపట్టాలని 2015 లోనే కేసీఆర్‌ గుర్తించారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ ప్రతిపక్షాలు అడ్డం పడ్డాయి. పురాతన వారసత్వ భవనాలను ఎట్లా కూల్చి వేస్తారంటూ రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కోర్టుకు వెళ్లి అడ్డం పడ్డారు. కొత్త ఆస్పత్రి కట్టకుండా అడ్డుకున్నారు. ఇటీవలి వర్షాలకు వరద నీరు దవాఖానలోకి వచ్చి చేరితే ఆ నీళ్లను చూపి రాజకీయం చేస్తున్నారు. ప్రతిపక్షాల తీరు ఎలా ఉందంటే.. కాళేశ్వరం కట్ట తెగి తెలంగాణను ముంచుతే బాగుండనే నీచమైన ఆలోచనల్లోకి దిగజారిపోయారు. ఉస్మానియా దవాఖానలో రోగుల మంచాల కిందికి నీళ్లు చేరటం బాధాకరం. ఇటువంటివి తలెత్తినప్పుడు మానవత్వంతో ముందుకు పోవాలి. మన కుళ్ళు ప్రతిపక్షాలు మాత్రం ఉస్మానియా ఆస్పత్రి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టుతో పోలుస్తూ ప్రచారం చేస్తున్న తీరు అత్యంత గర్హనీయం. ఇదో తరహా రాక్షసానందం. ప్రతిపక్షాల మానసిక పరిస్థితి ఏమిటో, వాళ్లు దేన్ని కోరుకుంటున్నారో.. వారి విమర్శల తీరు మాత్రం జుగుప్సాకరంగా ఉన్నది. తెలంగాణలో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతున్న వేళ ప్రతిపక్ష పార్టీలు 60 ఏండ్ల కిందటి గబ్బిలపు వాసనే కావాలంటున్నాయి. అపశకునం పెద్దపిట్ట కూతలే పల్లెను నిద్ర లేపాలని కోరుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మల్లన్న సాగర్‌ ప్రాజెక్టును అడ్డుకునేందుకు విపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఇదే రకమైన కుట్రలు, కుయుక్తులు చేసింది. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చనిపోయిన వారి పేరుతో హైకోర్టులో కేసులు వేసింది. అభివృద్ధి పనులకు అడ్డం పడిన ప్రతిసారి కాంగ్రెస్‌ నాయకుల అల్పబుద్ధి బయటపడుతున్నదే తప్ప కేసీఆర్‌ సంకల్పానికి ఇసుమంత కూడా అవరోధం ఎదురు కాలేదు. కీడు కోరే పెద్ద పిట్టలను జనం పొలిమేర దాకా తరిమినా.. ఊరవతల నుంచి నక్కల్లా ఊల పెడుతూ స్మశాన కాంక్షను వ్యక్తపరుస్తూనే ఉండటం శోచనీయం.

వ్యాసకర్త: శ్రీ సోలిపేట రామలింగా రెడ్డి, శాసనసభ సభ్యులు, సీనియర్‌ జర్నలిస్ట్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.