Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఎక్కడికీ పయనం.. ఎక్కడికీ పతనం!

నేడు మధ్యవయస్కులుగా ఉన్నవాళ్లందరికీ ప్రత్యేకించి గ్రామీణ నేపథ్యం ఉన్నవాళ్లకు పౌరాణిక సినిమాలు చూసిన అనుభవం కానీ, చందమామ కథలతో కానీ మంచి పరిచయం ఉంటుంది. ఆ కథల్లో, సినిమాల్లో పెళ్లీడుకొచ్చిన ఒక రాకుమారి/యువతి కలలో.. ఆమెకు భర్తగా కాబోయేవాడు, సుదృఢంగా, బంగారు మేనిఛాయలో, స్ఫురద్రూపి అయిన ఒక అందమైన రాకుమారుడు, గుర్రంపై వేగంగా స్వారీ చేస్తూ, ఆ యువతి వైపే ప్రేమగా చూస్తూ వస్తున్నటివంటి దృశ్యం… అందరూ దాదాపు చూసే ఉంటారు.

విచిత్రమేమంటే అటువంటి అన్ని సన్నివేశాల్లోనూ దూరంగా పంచవన్నెల గుర్రంపై దుమ్మురేపుతూ, భుజమ్మీద సెల్ల గాలిలో ఎగురుతూ, ఆకాశం బంగారురంగులో మెరుస్తూ ఉన్న నేపథ్యంలో వస్తున్న ఆ అందగాడు ఆ యువతి దగ్గరకు రాగానే, ఆమె చేయి అందుకోవాలని అనుకోగానే అదృశ్యమైపోతాడు. నేటి కేంద్ర బీజేపీ నాయకత్వం 2014 నుంచి దేశప్రజలకు వినిపించిన హామీలన్నీ, పథకాలన్నీ రాకుమారి కలలోని వరుడిలాగ మొదట విన్నపుడు, దూరం నుంచి చూసినప్పుడు బ్రహ్మాండంగా, అరచేతిలో వైకుంఠంలాగా కనపడ్డాయి. కానీ, ప్రజలుగా మేము కన్న కలలు సిద్ధిస్తున్నాయి, అన్నీ దగ్గరకొస్తున్నాయనుకోగానే ఒక్కొక్కటిగా ఆ కలలన్నీ అంతర్థానమైపోతున్నాయి. ఆశలు అడియాసలైనాయి.

వ్యవస్థలు కుప్పకూలి నిర్వీర్యమవుతూ సగటు భారతీయుని బతుకు దుర్భరమవుతున్నది. ఆర్థికవ్యవస్థ అడుగంటుతున్నది. ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయి. వివిధ వర్గాల ప్రజల మధ్య ద్వేషభావం పెచ్చరిల్లుతున్నది. ఉద్యోగాల కల్పన అటకెక్కింది. చెప్పిన సిద్ధాంతాలన్నీ, నీతులన్నీ పక్కదారి పడుతున్నాయి. గవర్నర్ల వ్యవస్థను వాడుకుంటున్నారని కాంగ్రెస్‌ను నిందించి అధికారంలోకి వచ్చినవాళ్లు అదే వ్యవస్థను వాడుకొని ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను చికాకు పరుస్తున్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ వ్యవస్థలను దుర్వినియోగం చేశారని గత పాలకుల ను నిందించినవాళ్లు నేడు అవే వ్యవస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఎక్కుపెడుతున్నారు. కాంగ్రెస్‌ అన్నింటి నీ అమ్ముకుంటున్నదన్నవాళ్ళు పబ్లిక్‌రంగ సంస్థలను అడ్డికి పావుసేరు చొప్పున వేలం వేస్తున్నారు. రిటైల్‌ వర్తకంలో విదేశీ కంపెనీల ప్రవేశాన్ని వ్యతిరేకించినవాళ్లు రక్షణరంగంలో కూడా ప్రైవేటీకరణకు తలుపులు బార్లా తెరిచారు. విలువలు, నైతికత అన్నవాళ్లు పక్క పార్టీలను యథేచ్ఛగా నయాన్నో భయాన్నో చీల్చి మరీ అధికారాన్ని దండుకుంటున్నారు. కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీలన్నీ పరివార్‌వాద్‌ పార్టీలు అన్నవాళ్లు, సామర్థ్యంతో సంబంధం లేకుండా, ఉన్నతస్థాయిల్లో పుత్రరత్నాలను ప్రవేశపెట్టి భవిష్యత్తును భద్రపరుచుకుంటున్నారు. ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు.. దేశంలో సమాఖ్యస్ఫూర్తి దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తం చేసిన వాళ్లు రాష్ర్టాల హక్కులను కాలరాసే ప్రయత్నంలో బిజీగా
ఉంటున్నారు.

ఎందుకిలా జరుగుతున్నదన్న ప్రశ్న ప్రతి భారతీయుని మనసులో అగ్ని పర్వతంలా ఉడుకుతున్నది. మోసపోయామన్న భావన నిత్యం వెంటాడుతున్నది. తాము విశ్వసించిన ప్రస్తుత దేశ ప్రభుత్వ నాయకత్వం డొల్ల అని, మేడిపండు చందం అని తెలిసి నివ్వెరపోతున్నారు. దీనంతటికీ కారణం ఎవరనే ప్రశ్న ఉదయిస్తే.. చాలామంది యథాలాపంగా, ఓట్లేసి బీజేపీని ఎన్నుకున్నారు కదా, అనుభవించండని కొట్టిపడేస్తారేమో కానీ… అసలు వాస్తవాలను గమనిస్తే..

ఇక్కడ ప్రజలు ఓట్లేసింది బీజేపీకే.. కానీ పాత బీజేపీ అనుకొని ఓట్లేశారు. ఈ బీజేపీ జనసంఘ్‌ నుంచి సంఘటించిన నాటి బీజేపీ అనుకున్నారు. విలువలు, సిద్ధాంతమే ప్రాధాన్యం అనుకునే వాజపేయి బీజేపీ అనుకున్నారు. ఒక్క ఓటుతో అధికారం పోయినా చలించని పూర్వపు బీజేపీ అనుకున్నారు. ప్రతిపక్షంగా కూడా సున్నిత సమయాల్లో అంతర్జాతీయ వేదికలపై దేశానికి ప్రాతినిధ్యం వహించగలిగే సమున్నత వ్యక్తిత్వం ఉన్న నాయకులున్న బీజేపీ అనుకున్నారు. దేశం కోసం, ధర్మం కోసం నిజాయితీగా పనిచేస్తామని చెప్పుకొనే నాటి బీజేపీ అనుకున్నారు. పక్షపాత రాజకీయాల నుంచి సర్వ ధర్మ సమభావన వైపు పయనిస్తామన్న బీజేపీ అనుకున్నారు. అధికారం మాత్రమే ప్రజాసేవకు మార్గం కాదని చాటుకున్న నాటి బీజేపీ అనుకున్నారు. కానీ కల చెదిరింది.

కలల మబ్బు వీడింది. నిజం గోచరించింది. తత్వం బోధపడింది. గోముఖ వ్యాఘ్రాల అసలు రంగు బయటపడింది. తాము విశ్వసించింది ఎండమావులనని, దూరపు కొండలు నునుపనే విషయం నిజమైందని అర్థమైంది. గుజరాత్‌ మోడల్‌ ఉత్త గాసి ప్‌ మోడల్‌ అనీ, మోదీ నాయకత్వం దేన్నీ సాధించలేదని సామాన్యునికి విదితమైంది. ఇది నాటి వాజపేయి బీజేపీ కాదు, ఇది మోదీ, షాల బీజేపీ అని స్పష్టమైంది. ఇప్పుడిది బీజేపీ కాదు, అధికార లాలస ఉన్న, నయాన్నో భయాన్నో అధికార పగ్గాలను గుప్పిట ఉంచుకోవాలనుకున్న వారి బీజేపీ అని తేలిపోయింది. అఖండ భారతావనిని సాకారం చేస్తామన్నవాళ్లు.. నిత్యం భారతీయ ఆత్మను, భిన్నత్వంలో ఏకత్వమనే భావనను ఖండఖండాలుగా విభజించే ప్రయత్నం చేస్తున్నారు. వసుధైక కుటుంబమ ని సుద్దులు చెప్పే అధికార నాయక ద్వయం భారత కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి, భాష, ప్రాంత, వర్గ పక్షపాత ధోరణితో, దేశవాసుల హృదయాన్ని నిత్యం గాయపరుస్తున్నారు. ‘సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌’ అనే మాటల అసలైన అర్థం ‘సబ్‌కా వినాశ్‌, హమారా వికాస్‌, సత్తా మే హీ విశ్వాస్‌ అని, అదే నేటి బీజేపీ విధానం అని అర్థమైంది.

నాటి బీజేపీ దేశ సమగ్రత తమ లక్ష్యమన్నది. నేటి బీజేపీ ఆ సిద్ధాంతానికి తూట్లు పడేలా వ్యవహరిస్తున్నది. పాకిస్థాన్‌కు కూడా సుహృద్భావ యాత్రను చేపట్టి లాహోర్‌కు బస్సు నడిపిన వాజపేయి బీజేపీకి.. పర మతస్థుల ప్రార్థన స్థలాలపై నచ్చిన రంగు జెండా కట్టి, అదే దేశభక్తి అనుకుని రొమ్ము విరుస్తున్న నేటి బీజేపీకి ఏది సామ్యం. ఏకాత్మ మానవ వాదమే సరైనదని నినదించిన నాటితరం నాయకులెక్కడ.. స్వపక్షమైనా, విపక్షమైనా తమను వ్యతిరేకిస్తే చాలు పాతాళానికి అణగదొక్కాలన్న క్రూరభావన ఉన్న నేటి బీజేపీ నాయకత్వమెక్కడ. జాతి హితం కోసం త్యాగం చేసిన పాతతరం నాయకులెక్కడ.. విదేశీ కార్లు, విలాస భవనాలు, ఖరీదైన ఆహార్యంతో, కార్పొరేట్‌ కుబేరుల సేవలో ధరించిపోతున్న నేటి దేశ నాయకత్వం ఎక్కడ?

‘గజం మిథ్య, పలాయనం మిథ్య’ అన్నట్టు ‘సిద్ధాంతం మిధ్య, ఆచరణ మిధ్య’ అధికారంతోనే సయోధ్య అనుకునే పద్ధతిలో మోదీ, షా బీజేపీని నడిపిస్తున్నారు. సిద్ధాంతవాదులది వెనుక సీటు, అధికార కీచకులకు ముందు సీటు అన్నట్టు ఉంది బీజేపీ నీతి. ఇక అక్కడ దేశం, జాతీయవాదం అన్నవారికి స్థానం లేదు.

నక్సలైట్‌ నేపథ్యమైనా, తీవ్రవాద సాన్నిహిత్యమైనా, సిద్ధాంత వైరుధ్యమున్నా, అవినీతిపరులైనా, ఆర్థిక నేరస్థులైనా, అక్రమార్కులైనా పర్వాలేదు. ఆయా రాష్ర్టాల్లో అధికార అందలాలెక్కడానికి నిచ్చెనలైతే చాలన్నట్లు ఎవరికైనా పార్టీలో స్థానం ఇస్తామన్న భావన పెచ్చరిల్లిన ఈ నయా బీజేపీలో సంప్రదాయవాదుల, సైద్ధాంతికవాదుల ప్రాబల్యం నేడు శూన్యం. ఈ మధ్య తెలుగు రాష్ర్టాల్లో బీజేపీ వేదికలపై ప్రముఖంగా కనపడుతున్న చాలామంది నాయకుల నేపథ్యం చూస్తే చీమల పుట్టలో పాములు ప్రవేశించినట్లు, నేటి బీజేపీలో అధికార లాలస అనే విష సంస్కృతి అణువణువునా నింపుకొన్న నాయకులదే ప్రథమ స్థానం అని విదితమవుతుంది. ఇప్పటి బీజేపీలో అద్వానీలు లేరు. రాజ్‌నాథ్‌ సింగ్‌, అరుణ్‌ శౌరీ లేరు. తొగాడియా లేరు. యశ్వంత్‌సిన్హా , ఉమాభారతి లాంటి వాళ్లకు ప్రాముఖ్యం ఉండదు. సిద్ధాంతం కూడు పెట్టదనే భావనను ప్రబలం చేస్తున్న నాయకులదే పెత్తనం. అందుకే ఇది నయా బీజేపీ, కాదు ఎంఎస్‌పీ (మోదీ షాల పార్టీ). న.షా.ల బీజేపీ. నరేంద్రమోదీ, అమిత్‌షాల బీజేపీ.

ఈ బీజేపీలో సిద్ధాంత రాహిత్యం ఉన్న నాయకత్వం ప్రజలను మతాల పేరుతో విభజించే ప్రయత్నం చేస్తున్నది. ఇతరుల విశ్వాసాలపై దాడి, సంస్కృతి సంప్రదాయాలలో లోపాలు ఎంచడం నిత్యకృత్యమైంది. చెప్పింది మేక్‌ ఇన్‌ ఇండియా, చేస్తున్నది బ్రేక్‌ ఇన్‌ ఇండియా. అభివృద్ధి అజెండాతో అధికారం రాదు, విభజనవాదం, కమ్యూనల్‌ పోలరైజషన్‌తోనే అధికారం కచ్చితమని గట్టిగా విశ్వసిస్తున్న నేటి బీజేపీ అధినాయకత్వం రాష్ర్టాల్లో అధికార విస్తరణకు అదే మార్గాన్ని ఎంచుకున్నది. అదిష్ఠానం అలవర్చుకున్న విష సంస్కృతి మార్గాన్ని యథేచ్ఛగా అమలు చేయగలిగే, స్థాయి లేని, సమర్థత లేని, చదువు కూడా సక్రమంగా లేని కొంతమంది అనామకులకు రాష్ర్టాల్లో నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పి సమాజంలో విద్వేషపూరిత రాజకీయాలకు తెర లేపుతున్నది. పూర్వ రాజకీయాల పట్ల ఎక్కువగా అవగాహన ఉండే అవకాశం లేనివాళ్లలో ప్రత్యేకించి యువతలో విషబీజాలు నాటుతున్నది. రాజకీయమంటే ఇతరుల మత విశ్వాసాలను గట్టిగా వ్యతిరేకించడమేనని, భౌతికదాడులకు పాల్పడి అయినా ఇతరులను లొంగదీసుకోవాలనే భావనను పెంపొందిస్తున్నది.

గతంలో రాజకీయం ఆయా మతాలను అనుసరించే వ్యక్తుల విశ్వాసాలను కాపాడేది. కానీ నేటి బీజేపీ.. మతమే తమ రాజకీయాన్ని కాపాడగలుగుతుందని విశ్వసిస్తున్నది. ఇది వినాశకరం. వేల ఏండ్ల చరిత్ర ఉన్న హిందూ ధర్మానికి ఎంతోమంది ఈ దేశంపై దండెత్తి వచ్చినా కించిత్‌ నష్టం చేయలేకపోయారు. సహనం, సంయమనం, పరమత సహనం, పొరుగువారిపై గౌరవం, అందరి మేలు, అందరి అభివృద్ధి ఈ ధర్మ లక్షణాలుగా విలసిల్లాయి. మొఘలులు వచ్చినా, తురుష్కులు వచ్చినా, పారసీలు, అరబ్బులు వచ్చినా, ఆంగ్లేయులు సుదీర్ఘకాలం పరిపాలించినా దౌష్ట్యాన్ని, దౌర్జన్యాన్ని చూపించినా.. చివరికి ఈ ధర్మ లాలనలో కరిగిపోయారు, కలిసిపోయారు. భారత్‌లో అంతర్భాగమైనారు. ఇదీ హిందూ ధర్మం గొప్పతనం. దీనికి కొత్తగా నడకలు నేర్పుతామని, పునర్నిర్వచిస్తామని, తామే రక్షకులమంటే కొంతకాలం ప్రజలు విశ్వసించారేమో కానీ అందమైన అబద్ధం చిరకాలం కొనసాగదు.

భారత ప్రజలు చైతన్యవంతులు. శాంతి కాముకులు. ఎంతోకాలం ఈ నూతన బీజేపీ విభజనవాదం నడువదు. నిజాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మరింత స్పష్టత వచ్చినరోజు ఈ నిరంకుశ విధానాలకు స్వస్తిగీతం పాడతారు. దానికోసం విశాల భావాలున్న, జాతిహితం కోరే అందరూ నడుం కట్టాలి. దేశం ఎవరొక్కరి సొత్తో కాదు. ఇది అందరిదీ అన్న భావనను పటిష్ఠపరచాలి. ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలి. ఒక నూతన నాయకత్వ ఆవిష్కరణకు బుద్ధిజీవులు ఆలోచించాలి. మూస విధానాలకు, మొండిపోకడలకు, వినాశకర బుద్ధులకు మంగళం పాడాలి. నేనే సర్వం, నాతోనే మొదలు, ఆఖరు అనుకొనే భ్రామిక ప్రపంచంలో జీవిస్తున్న కేంద్రప్రభుత్వ అధినాయకత్వానికి చరమగీతం పాడాలి.

భారత ప్రజా బాహుళ్యానికి ఒక విస్తృత ప్రయోజనాలున్న, దీర్ఘకాలికమైన, దృఢమైన లక్ష్యాలున్న, వనరుల సద్వినియోగంపై అవగాహన ఉన్న, సుసంపన్నమైన భారతదేశాన్ని స్వప్నించగలిగి, అసమానతల్లేని, అందరికీ సమానావకాశాలున్న సుందర భారతాన్ని ఆవిష్కరించగలిగే దమ్మున్న నాయకత్వం కావాలి. అవసరం వచ్చినప్పుడల్లా చరిత్ర ఒక నాయకున్ని సృష్టించుకుంటుందన్న గతనుభవాలను నిజం చేస్తూ దేశ హితం కోసం ప్రత్యామ్నాయ సింధువులను సృష్టించగలిగే వ్యక్తులకు, వ్యవస్థలకు ప్రజానీకం వెన్నుదన్నుగా ఉండాలి. అప్పుడే ఈ నూతన బీజేపీ కుటిల రాజకీయాలకు అంతిమ చరణం పలికినట్లవుతుంది. దేశ క్షేమం సురక్షితమవుతుంది.
జై తెలంగాణ.. జై హింద్‌..

అఖండ భారత్‌ను సాధిస్తామని బీరాలు పలికి, జాతీయవాద స్ఫూర్తి అని,సర్వధర్మ సమభావన మూలసూత్రమని, భారతీయీకరణతో కూడిన ప్రజాస్వామ్యమే ధ్యేయమని, అంత్యోదయ తమ సిద్ధాంతమని చెప్పినవాళ్లు, నేషన్‌ ఫస్ట్‌ సెల్ఫ్‌ లాస్ట్‌ అనీ, అధికారం మా చివరి లక్ష్యమని చెప్పిన మోదీ-షా ద్వయం అదే రాజకీయాధికారం కోసం అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలను,అప్రజాస్వామిక విధానాలను దేశం నిస్సహాయంగా చూస్తున్నది.

పాకిస్థాన్‌కు కూడా సుహృద్భావ యాత్రను చేపట్టి లాహోర్‌కు బస్సు నడిపిన వాజపేయి బీజేపీకి.. పర మతస్థుల ప్రార్థన స్థలాలపై నచ్చిన రంగు జెండా కట్టి, అదే దేశభక్తి అనుకుని రొమ్ము విరుస్తున్న నేటి బీజేపీకి ఏది సామ్యం. అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతిని చేశామని చెప్పుకొన్న బీజేపీకి.. మోదీ షా నాయకత్వంలో పర మత విశ్వాసాలపై దాడిచేస్తూ, బూతులు ప్రయోగించి సంబురపడుతున్న చట్టసభ సభ్యులను అందలమెక్కిస్తున్న నేటి బీజేపీకి ఎంత అంతరం.
(వ్యాసకర్త: చైర్మన్‌, తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ)

రావుల శ్రీధర్‌ రెడ్డి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.