Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఏకగ్రీవాల్లో కారు జోరు

-78 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ ఏకపక్ష విజయం
-కారుకు మద్దతుగా నిలిచిన విపక్షాల అభ్యర్థులు
-మూడు వార్డుల్లో ఎంఐఎం విజయం
-పరకాల మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ కైవసం!
-మొత్తం 22 వార్డులకు 11 స్థానాలు ఏకగ్రీవం
-ముగిసిన ఉపసంహరణ
-అభ్యర్థుల తుదిజాబితా విడుదల
-పలుచోట్ల ప్రతిపక్షాలకు అభ్యర్థులు కరువు
-ప్రారంభమైన ప్రచారం

మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏకగ్రీవాల్లో కారు దూసుకుపోయింది. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తికావడంతో అధికారులు అభ్యర్థుల తుదిజాబితాలను విడుదలచేశారు. ఈ జాబితాల ప్రకారం 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతుండగా.. 40 మున్సిపాలిటీలు.. కార్పొరేషన్లలో 81 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వాటిలో 78 వార్డులను టీఆర్‌ఎస్‌ ఏకపక్షంగా కైవసం చేసుకున్నది. నిర్మల్‌ జిల్లాలోని భైంసా మున్సిపాలిటీలో ముగ్గురు ఎంఐఎం అభ్యర్థులు పోటీలేకుండా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజు 39 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 38 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఉన్నారు. వరంగల్‌ జిల్లా పరకాల మున్సిపాలిటీ చైర్మన్‌ పీఠం కూడా టీఆర్‌ఎస్‌ ఖాతాలో చేరింది. ఇక్కడ మొత్తం 22 వార్డులు ఉండగా మంగళవారం నాటికి 11 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మంగళవారం ఒక్కరోజే ఐదు వార్డులు పోటీ లేకుండా టీఆర్‌ఎస్‌ పరమయ్యాయి. తుదిజాబితాలు విడుదలైన తర్వాత చాలా వార్డుల్లో ప్రధాన ప్రతిపక్షంతో సహా ఇతర విపక్షాలకు అభ్యర్థులే లేకుండాపోయారు. స్వతంత్ర అభ్యర్థులు టీఆర్‌ఎస్‌కు మద్దతుగా బరిలోనుంచి తప్పుకొన్నారు.

బరిలో 12 వేల మంది రాష్ట్రంలో మొత్తం 120 మున్సిపాలిటీల్లోని 2,727 వార్డులు, 9 కార్పొరేషన్లలోని (కరీంనగర్‌ కాకుండా) 325 వార్డుల్లో ఈ నెల 22 న ఎన్నికలు జరుగనున్నాయి. 120 మున్సిపాలిటీల్లోని 81 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దాదా పు 12,398 మంది అభ్యర్థులు బరిలో ఉండ గా.. వీరిలో దాదాపుగా 2,970 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోటీపడుతున్నారు. కాంగ్రెస్‌ పక్షాన 2603, బీజేపీ నుంచి 2330 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. జాబితా విడుదలతోపాటు గుర్తులు కూడా ఖరారు కావడంతో అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నెల 20న ప్రచారం ముగించాల్సి ఉండటంతో అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి ప్రతి ఒక్క ఓటరును కలిసి ప్రచారంచేస్తున్నారు. 20న సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగుస్తుంది.

కరీంనగర్‌లో రేపు ఆఖరు కరీంనగర్‌ కార్పొరేషన్‌లో ఎన్నికలు ఈ నెల 24 న జరుగుతున్నాయి. ఇక్కడ నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 16న ముగియనున్నది. మొత్తం అరవై వార్డుల్లో ప్రస్తుతం నామినేషన్ల పరిశీలన, అప్పీళ్లు జరుగుతున్నాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో ఇక్కడ రెండు రోజులు ఆలస్యంగా ఎన్నికలు జరుగుతున్నాయి.

ప్రతిపక్షాలకు అభ్యర్థులు కరువు నామినేషన్ల తుది జాబితా ప్రకారం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని పలు వార్డుల్లో కాంగ్రెస్‌, బీజేపీలకు అభ్యర్థులు లేకుండా పోయారు. కొన్నిచోట్ల వేసిన నామినేషన్లను ఉపసంహరించుకొన్నారు. నామినేషన్ల దాఖలు అఖరు రోజు వరకు కాంగ్రెస్‌ నుంచి 5,365, బీజేపీ నుంచి 4,179 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. బీ ఫారాలు సమర్పించే సమయానికి కొన్నిచోట్ల నేతలు గొడవకు దిగారు. టికెట్లు అమ్ముకున్నారంటూ నిరసన తెలిపారు. కొన్ని వార్డుల్లో ఈ రెండు పార్టీల అభ్యర్థులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి తప్పుకున్నారు.

పోలింగ్‌ కేంద్రాలు ఖరారు కాగా పురపాలక ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను ఖరారుచేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. పది కార్పొరేషన్లలో 385 వార్డుల్లో 1786 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. నిజామాబాద్‌లో అత్యధికంగా 411, కరీంనగర్‌లో 348, రామగుండంలో 242 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. తక్కువగా బండ్లగూడ జాగీర్‌లో 85 కేంద్రాలున్నాయి. 120 మున్సిపాలిటీల్లో 2,727 వార్డులకు 6,325 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. మున్సిపాలిటీల్లో అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 240, ఆదిలాబాద్‌లో 183, నల్లగొండలో 180, సూర్యాపేటలో 146, మిర్యాలగూడలో 144 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. డోర్నకల్‌, వర్ధన్నపేట, కొత్తపల్లి, ధర్మపురి మున్సిపాలిటీల్లో 15 చొప్పున పోలింగ్‌ కేంద్రాలున్నాయి.

తెలుపురంగు బ్యాలెట్‌ మున్సిపల్‌ ఎన్నికలకు తెలుపురంగులో బ్యాలెట్‌ పేపర్‌ను ముద్రించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఈ నెల 22న, కరీంనగర్‌ కార్పొరేషన్‌కు 24న పోలింగ్‌ జరుగనున్న విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నానికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో తుది అభ్యర్థుల జాబి తా ఖరారైంది. గుర్తుల కేటాయింపు పూర్తయింది. దీంతో బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు అధికారులు అత్యవసర ఆదేశాలు జారీచేశారు. ఒక్కో బ్యాలెట్‌ పత్రంలో మొత్తం నోటాతో కలిపి ఎనిమిది గుర్తులు కేటాయించనున్నారు. ఒక వార్డులో ఏడుగురికంటే ఎక్కువమంది పోటీచేసినట్లయితే రెండో బ్యాలెట్‌ పత్రాన్ని ముద్రిస్తారు. బ్యాలెట్‌ పత్రాల ముద్రణలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్వోలను ఎన్నికల సంఘం ఆదేశించింది.

మున్సిపాలిటీ, వార్డుల పేర్లు, నంబర్లు, సీరియల్‌ నంబర్లు, అభ్యర్థులపేర్లు, గుర్తులు అన్నింటినీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని.. ముద్రణ అనంతరం పోలింగ్‌ కేంద్రాలవారీగా తరలించడానికి ముందస్తుగా ఏర్పాట్లుచేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి పదిశాతం అదనంగా బ్యాలెట్‌ పత్రాలను రిజర్వులో ఉంచేందుకు వీలుగా పంపించాలని.. వీటిని రిటర్నింగ్‌ అధికారుల సమక్షంలో భద్రపరచాలని ఆదేశించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చింది. వేల మంది ఉద్యోగులు విధుల్లో ఉంటే.. కనీసం పదిశాతం కూడా పోస్టల్‌ ఓట్లు నమోదు కాకపోతుండటంతో ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ను మంగళవారం నుంచే అందుబాటులో ఉంచారు. పోస్టల్‌ బ్యాలెట్‌ను ఆర్వో కార్యాలయంలోనైనా, ఆన్‌లైన్‌ ద్వారానైనా సమర్పించాలని ఎన్నికలసంఘం తెలిపింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.