Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఎగిరింది జెండా..తెలంగాణ నిండా

-వాడవాడలా టీఆర్‌ఎస్‌ జెండా పండుగ
-పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రారంభం
-అంబరాన్నంటిన పార్టీ శ్రేణుల సంబురాలు
-పార్టీ కార్యకర్తలకు కేటీఆర్‌ ధన్యవాదాలు
-ఇదేస్ఫూర్తితో నిర్మాణం చేపట్టాలని పిలుపు
-జిల్లాల్లో పాల్గొన్న హరీశ్‌, కొప్పుల, తలసాని

టీఆర్‌ఎస్‌ జెండాపండుగ సంబురం అంబరాన్నంటింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు గులాబీ జెండాలు ఎగురవేశారు. బైక్‌ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ఒకవైపు ఊరూరా జెండాపండుగ, అదే సమయంలో పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రారంభించారు. జెండాపండుగలో ఉత్సాహంగా భాగస్వాములై విజయవంతం చేసిన శ్రేణులకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్‌ నేత పర్యాద కృష్ణమూర్తి తెలంగాణ భవన్‌లో గులాబీ జెండాను ఆవిష్కరించారు. సిద్దిపేటలోని తెలంగాణ భవన్‌లో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, పెద్దపల్లి జిల్లా ధర్మారం చౌరస్తాలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, హైదరాబాద్‌లోమంత్రి తలసాని పార్టీ జెండా ఎగురవేశారు.

టీఆర్‌ఎస్‌ పుణ్యానే బండి, రేవంత్‌కు పదవులు:మంత్రి తన్నీరు హరీశ్‌రావు
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ జలదృశ్యంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ వరకు వెళ్లిందని చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా పని చేసిందని స్పష్టంచేశారు. స్వరాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో బంగారు తెలంగాణ దిశగా పరుగులు తీస్తున్నదని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ జెండా పుణ్యం, సీఎం కేసీఆర్‌ చలువతో రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి, బండి సంజయ్‌కి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చిందన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేసి, సంస్థాగత నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. ఢిల్లీలో తెలంగాణ భవన్‌ నిర్మాణం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి సూచిక అని పేర్కొన్నారు. నాడు తెలంగాణ ఎలా సాధిస్తారని ఎద్దేవాచేసిన నోర్లు మూతపడేలా సీఎం కేసీఆర్‌ పట్టుదలతో రాష్ర్టాన్ని సాధించి, అన్నిరంగాల్లో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. నల్లగొండ పట్టణంలోని 48వ వార్డులో మండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు.

టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం

గ్రామగ్రామాన జెండాపండుగ విజయవంతం కావ డంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నిం పింది. ఆదిలాబాద్‌ జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే జోగు రామన్న కార్యకర్తలతో కలిసి ర్యాలీ తీసి, పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేశారు. భైంసా మండలంలోని వాలెగాంలో ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఖానాపూర్‌ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే రేఖానాయక్‌ ఆధ్వర్యంలో జెండా పండుగ నిర్వహించారు. ఇచ్చోడ మండలం ముక్రా (కే)లో రైతులు పొంట పొలాల్లో గులాబీ జెండాను ఎగురవేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గులాబీ జెండా ఎగురవేశారు. అనంతరం భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మధిర నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ పార్టీ జెండా ఎగురవేశారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జెండా పండుగ ఘనంగా జరిగింది. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం చౌరస్తాలో పార్టీ పతకాన్ని ఎగురవేశారు. వనపర్తి జిల్లాకేంద్రంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సంబురాలు పెద్ద ఎత్తున జరుపుకొన్నారు.

ఎగిరింది జెండా..తెలంగాణ నిండా
-ఇదే స్ఫూర్తితో పనిచేయాలి: కేటీఆర్‌
రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగను పెద్ద ఎత్తున నిర్వహించి విజయవంతం చేసిన టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించాలన్నారు. జెండా పండుగ మాదిరిగానే, పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాలను గడువులోగా పూర్తిచేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.