Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఈ జన్మకు ఇది చాలు..!

ఉద్యమ యోధుడు, ఆలోచన ధీరుడు, రాజకీయ అపర మేధావి- ఒక లక్ష్యం కోసం ఒక నూతన పార్టీని పెట్టి దానికి జెండా, ఎజెండా అన్నీ తానై ఒక్కడిగా కదిలాడు. గల్లీలో మొదలైన కొట్లాటను ఢిల్లీ వరకు చేర్చి, లక్ష్యాన్ని ప్రజాస్వామ్య రీతిలో చేరుకున్నాడు. శాంతియుతంగా జాతిపిత గాంధీ బాటలో సాగి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను తెలంగాణ జాతిపిత అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేసీఆర్‌ కారణజన్ముడు. తెలంగాణ రాష్ట్ర సమితి నేడు ఇరవై ఏండ్ల వేడుకను జరుపుకొంటున్నది. ఈ ప్రయాణాన్ని పలకరిస్తే హృదయం ఉప్పొంగిపోతది. త్యాగాల జ్ఞాపకాలు ముప్పిరిగొంటయి. పోరాటంలో విజయం సాధించినందుకు, అందులో భాగస్వామిని అయినందుకు ఈ జన్మకు ఇది చాలనిపిస్తుంది.

కేసీఆర్‌ అనేక సభల్లో- ‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై / ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్‌/ ధీరుల్‌ విఘ్న నిహన్య మానులగుచు ధ్రుత్యున్నతోత్సాహులై/ ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్‌ గావునన్‌’ అని ఏనుగు లక్ష్మణకవి సుభాషిత పద్యం చెప్పి పని మొదలుపెట్టి సాధించేవరకు వదలవద్దని.. ధీరులుగా నిలువాలని ఉద్బోధ చేసేవారు.

ఈ జన్మకు ఇది చాలు..!
2001లో హుస్సేన్‌సాగర్‌ తీరాన.. ‘జలదృశ్యం’లో ఏర్పడ్డ ఉద్యమ పార్టీ ఇప్పుడు విశేష జనదృశ్యం. ఉద్యమకారులు, మేధావులు, రాజకీయ ప్రముఖులతో అనేక మేధోమథనాల ఫలితంగా పురుడు పోసుకున్న పార్టీ టీఆర్‌ఎస్‌ కొన్ని తరాలపాటు దోపిడీకి గురైన తెలంగాణను విముక్తి చేయాలన్న ఆశయంతో ఏర్పడ్డ పార్టీ టీఆర్‌ఎస్‌.

అద్భుత ప్రసంగాలతో వినయ విజ్ఞాన సంపన్నతతో, తన మాట ప్రతి హృదయం చేరేట్లు చేసిన ఉద్యమ నాయకుడు కేసీఆర్‌. కాళోజీ అన్నట్లుగా- ‘దోపిడి చేసే ప్రాంతేతరులను దూరం దాక తన్ని తరుముతం, ప్రాంతం వాడే దోపిడి చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తం’ అనే స్ఫూర్తిని మదిలో నింపుకొన్న నేత. నిద్ర లేని రాత్రులతో వ్యూహాత్మక ఎత్తుగడలతో కలిసివచ్చే శక్తులను కలుపుకొంటూ జనాన్ని జాగృతం చేశాడు. తెలంగాణ పార్టీ ఏర్పాటులో సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ పాత్ర మరువలేనిది. ఆయన తెలంగాణను ఔపోసన పట్టిన ఉద్యమకారుడు. కేసీఆర్‌ నాయకత్వానికి మద్దతు ఇచ్చి ఉత్తేజం నింపినవాడు.

టీఆర్‌ఎస్‌ పెట్టిన 20 రోజులకే సింహగర్జన సభలో తన వాగ్ధాటితో అందరి చూపును తనవైపు మరల్చుకున్నాడు కేసీఆర్‌. 2002లో నల్లగొండ తొలి వార్షికోత్సవ సభతో ఊపిరి ఊది, 2003లో వరంగల్‌ సభలో 15 లక్షల మందిలో ఉద్యమ కిరణాలను ప్రసరింపజేశాడు. గద్వాల నుంచి అలంపూర్‌ వరకు పాదయాత్ర చేసి విజయయాత్రకు మార్గం సుగమం చేశాడు. 2006లో పార్టీకి చిరునామాగా తెలంగాణ భవన్‌ రూపుదిద్దుకుంది. 2007లో పరేడ్‌గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహించి హైదరాబాద్‌లో ఉద్యమ బావుటా ఎగిరేసింది టీఆర్‌ఎస్‌.

ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ‘పల్లె నిద్ర’ పెట్టి ప్రతి పల్లెను, ప్రతి తండాను చైతన్యపరిచారు. సైకిల్‌ యాత్ర ద్వారా నగరాలలో పర్యటించారు. కారు యాత్ర ద్వారా ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లారు. ఫ్రీ జోన్‌ కాదురా.. హైదరాబాద్‌ మాదిరా.. అని తెలంగాణ యువత ఉద్యోగాల కోసం ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను భాగస్వాములు చేయడానికి టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం ఏర్పాటుచేశారు. వారికి స్వయంగా కేసీఆరే తెలంగాణ భవన్‌లో శిక్షణ తరగతులతో మార్గనిర్దేశం చేశారు. ప్రతి పట్టణంలో కూడా విద్యార్థి విభాగ కమిటీలు ఏర్పాటుచేశారు. ఓయూ జేఏసీ, కేయూ జేఏసీ ఏర్పాటుచేసి విద్యార్థి మహా పాదయాత్ర తలపెట్టారు. ఆ పాదయాత్రకు నన్ను ఇంచార్జ్‌గా కేసీఆర్‌ నియమించారు. విద్యార్థి పాదయాత్ర ఉస్మానియా నుంచి మొదలై రామాయంపేట్‌, కామారెడ్డి మీదుగా తెలంగాణ యూనివర్సిటీ నుంచి కాకతీయ యూనివర్సిటీ చేరుకొని అక్కడ బహిరంగసభతో ముగిసింది.

తెలంగాణ నినాదాన్ని ఎంతోమంది ఎత్తుకున్నప్పటికి మధ్యలోనే వదిలివెళ్లారు. కానీ కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు మాత్రమే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. ఉద్యమంలో అందరిని ఏకం చేయడానికి రైతు కమిటీలు, మహిళ విభాగాన్ని ఏర్పాటుచేశారు. కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి ఏర్పడింది. బతుకమ్మను విదేశాలలో ఆడి ఉద్యమాన్ని మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పారు. సడక్‌ బంద్‌, వంటావార్పు, పాదయాత్ర, సైకిల్‌యాత్ర, కార్‌ యాత్ర, ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహారదీక్షలు, ఫ్రీ జోన్‌పై పోరు.. ఇలా ఎన్నో రకాలుగా పోరాటాలు కొనసాగాయి. కేసీఆర్‌ జీవితమే ఒక పోరాటం.. తెలంగాణ ప్రజల కోసమే అతని ఆరాటం అని ప్రజలు తెలుసుకోగలిగారు.

2010 నాటికి రాజకీయాలను శాసించేస్థాయికి చేరింది టీఆర్‌ఎస్‌. 2011లో పాలమూరులో దశాబ్ది ఉత్సవాలు, 2012లో అనంతగిరి కొండల్లో ఆవిర్భావ వేడుకలు జరుపుకొన్నది. కేసీఆర్‌ తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ సాధించారు. 2014లో రాష్ట్ర ఏర్పాటు తర్వాతి ఎన్నికల్లో ప్రజలు- తెలంగాణ సాధించిన ఇంటి పార్టీగా కార్‌ను ఆహ్వానించారు. కేసీఆర్‌ నేతృత్వంలో తొలి ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆత్మకథలో రాసినట్టు- ఉద్యమ నాయకుడు తన లక్ష్యం నెరవేరిన తర్వాత నూతన రాష్టానికి సారథి అయి నడిపించటం చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాలేదు ఒక్క కేసీఆర్‌కు తప్ప. తెలంగాణ నినాదాన్ని కేసీఆర్‌ ఎంతలా తీసుకెళ్లారు అంటే- తెలంగాణ ఏర్పడాలంటే పార్లమెంటులో బిల్లు పెట్టాలి- ఆ పార్లమెంట్‌లో చప్రాసి కూడా అందరికి నమస్కారం పెట్టి కేసీఆర్‌ను చూస్తే మాత్రం జై తెలంగాణ సర్‌ అనేంతగా. ఈ రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో కేసీఆర్‌ సార్‌తో ప్రయాణించడం నా అదృష్టం.

గులాబీ జెండాను 20 ఏండ్లుగా రెపరెపలాడిస్తూ సమస్త ప్రజానీకానికి నీడగా నిలిపారు కేసీఆర్‌. గులాబీ కండువా భుజాలపై వేసుకున్న కార్యకర్తలకు భరోసా కల్పించారు. తెలంగాణ పార్టీ అంటే టీఆర్‌ఎస్‌ అనేలా ప్రజలలో నాటుకుపోయింది. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కృషి జరుగుతుండటం వల్ల కారు గుర్తుకు, సార్‌కు ప్రజలు రెండోసారి పట్టం కట్టారు.

టీఆర్‌ఎస్‌ ఏ ఉద్దేశం కోసం పుట్టిందీ విస్మరించలేదు. ఉద్యమ లక్ష్యాల సాధన దిశలోనే పాలన సాగుతున్నది. ఏ నీళ్ల కోసం మనం అరిగోస పడ్డమో ఆ నీటిని పెద్ద సారే ఒక ఇంజినీర్‌ అవతారం ఎత్తి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందించారు. రెండు లక్షల కోట్ల బడ్జెట్‌తో తెలంగాణ ప్రజలకు ఏం కావాలో గుర్తెరిగి అందిస్తున్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలు అన్నదాతలను ఆనందపరవశులను చేస్తున్నాయి. 33 జిల్లాలతో ప్రజలకు పాలన మరింత దగ్గరయింది. బడుగు బలహీనవర్గాల కోసం పేదింటి ఆడపడుచుల కోసం పథకాలు రూపుదిద్దుకున్నాయి.

కేసీఆర్‌ పాలన ఎట్లా ఉంది.. ఇదివరలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మన పరిస్థితి .. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంది?.. ఈ విషయాన్ని నేను ఒక రైతును అడిగినప్పుడు వచ్చిన జవాబు- ‘పుట్టగానే పేదింటి ఆడపిల్లలకు కేసీఆర్‌ కిట్‌ ఇస్తున్నారు. ఆ పిల్లలు చదువుకోవడానికి నూతన గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేశారు. ఆ పిల్లలకు సన్న బియ్యంతో అన్నం పెడుతున్నారు. పేదింటి ఆడపిల్లల పెండ్లి ఖర్చుల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ సాయం అందుతున్నది. రైతులకు రైతుబంధు ఇస్తున్నారు. రైతు చనిపోతే 5 లక్షల రైతు బీమా వస్తున్నది. కాళేశ్వరం నీళ్లతో సాగుకు నీరు, మిషన్‌ భగీరథతో ఇంటింటికి తాగునీరు వస్తున్నది. వృద్ధ్దులకు, వికలాంగులకు, వితంతువులకు ఆసరాతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక కొడుకు లెక్క అందరిని ఆదుకుంటున్నారు ఇంకేం కావాలి సార్‌’.

టీఆర్‌ఎస్‌ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ప్రతిపక్షాలకు పార్టీని, ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇరుకునబెట్టే అవకాశమే లేని పరిస్థితిని సృష్టించింది. కండ్లముందు అభివృద్ధితో సమాధానం చెప్తున్నది. వందల ఏండ్ల భవిష్యత్‌ను ముందే రాసుకున్న పార్టీ టీఆర్‌ఎస్‌. ఈ పార్టీ కోసం అలుపెరుగక పనిచేసే కార్యకర్తలున్నరు. ఇంత గొప్ప ఉద్యమ పార్టీలో పనిచేసేవారంతా నిజమైన సేవకులు అని భావిస్తున్న. ఇరవై ఏండ్ల ఈ కాలంలో ప్రతి మనసులో నిండిపోయిన నినాదం ఒక్కటే- సార్‌.. కార్‌.. సర్కార్‌. ఇవి కలకాలం విజయంతో వెలిగిపోవాలని కోరుకుంటూ, ఇరవై ఏండ్ల పండుగ శుభవేళ అందరికీ శుభాకాంక్షలు. జై తెలంగాణ- జై కేసీఆర్‌.

(వ్యాసకర్త: శాసన మండలి సభ్యులు)
శేరి సుభాష్‌రెడ్డి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.