సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల స్ఫూర్తితో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలు మరుగుదొడ్ల నిర్మాణంలో ముందడుగు వేయాలని రాష్ట్ర భారీనీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట నియోజకవర్గం వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకుని రికార్డు సృష్టించిన సందర్భంగా చరిత్ర పుటల్లో నిలిచిన సిద్దిపేట పేరిట శుక్రవారం విజయోత్సవ సభ నిర్వహించారు.

-సిద్దిపేట, సిరిసిల్ల స్ఫూర్తితో తెలంగాణ కదలాలి -గ్రామ ప్రజల ఆరోగ్యమే నిజమైన అభివృద్ధి -వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం సాధించిన సిద్దిపేట నియోజకవర్గం -చరిత్ర పుటల్లో సిద్దిపేట విజయోత్సవ సభలో మంత్రి హరీశ్‌రావు -సిద్దిపేటే ఓ చరిత్ర: మధుసూదనాచారి -ప్రతిసారి పాఠాలు నేర్చుకున్నా: స్వామిగౌడ్ -ఈ గడ్డను తెలంగాణ మరిచిపోదు: నాయిని శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్న ఈ సభకు హరీశ్‌రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ సిద్దిపేటకు ఈ ఘనత సాధించిపెట్టడంలో అధికారులు ప్రజల సమష్టి కృషి ఉందన్నారు. కేవలం 15 రోజుల వ్యవధిలోనే 5,531 మరుగుదొడ్లను నిర్మించడం దానికి ఉదాహరణగా చెప్పారు. అలాగే రాష్ట్రంలోని 64 మున్సిపాలిటీల్లో సిద్దిపేట నూటికి నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణం, వందశాతం పన్నుల వసూలు సాధించిన ఘనత దక్కించుకుందన్నారు.ఇంకుడు గుంతల నిర్మాణంలో రాష్ట్రానికే ఇబ్రహీంపూర్ ఆదర్శంగా నిలిచిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జూలై మాసంలో ఏక కాలంలో 5,500 మొక్కలు నాటితే ఆ మొక్కలన్ని పచ్చగా ఏపుగా పెరిగి సిద్దిపేట పట్టణానికే పచ్చని శోభను తీసుకువచ్చాయన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలు నాటి రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచామని అన్నారు. అభివృద్ధి అంటే సీసీ రోడ్డు.. డ్రైనేజీ.. పైపులైన్.. వేయడం కాదని.. ప్రజలు ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి అవుతుందని అన్నారు. ఈ విజయోత్సవ స్పూర్తితో మరిన్ని స్పూర్తిదాయకమైన కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు.
సిద్దిపేట ఓ చరిత్ర.. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ప్రసంగిస్తూ చరిత్ర పుటల్లోకి సిద్దిపేట ఎక్కడం కాదు.. సిద్దిపేటే ఒక చరిత్ర అని అభివర్ణించారు. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకుని దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు పుణికిపుచ్చుకున్న మరో శక్తి హరీశ్‌రావు అని పేర్కొన్నారు. సమాజాన్ని ఆలోచింపజేసే కార్యక్రమాల రూపకల్పనలో ఆయన దిట్ట అని, చక్కటి నాయకుడు దొరుకడం ప్రజల అదృష్టమని అన్నారు.
సిద్దిపేట ఇచ్చిన స్ఫూర్తితో తన నియోజకవర్గం భూపాలపల్లిలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేస్తానని అన్నారు. శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రసంగిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ ఒక కొత్తపాఠాన్ని నేర్చుకుని రాజేంద్రనగర్‌లో అమలు చేస్తున్నానని అన్నారు. సిద్దిపేట అనేది ఒక దిశా నిర్దేశం చేసే ఒక చరిత్ర పుస్తకమని చెప్పారు. మరుగుదొడ్డి అనేది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిని అంశమన్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా సిద్దిపేట, సిరిసిల్లా నియోజకవర్గాలకు రావాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీని ఆయన కోరారు.
వందశాతం మరుగుదొడ్ల నిర్మాణంతో సిద్దిపేట యావత్తు దేశానికి ఆదర్శప్రాయమైందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనికి సర్టిఫికెట్ ఇవ్వాలని అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ పేరిట మేమే ఎన్నో కార్యక్రమాలు చేసి ముందుంటాం అనుకుంటే హరీశ్‌రావు మాకన్నా ముందే ఆ పనిచేశాడని నాయిని చమత్కరించారు. తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్న సిద్దిపేట గడ్డను రాష్ట్ర ప్రజలు మరిచిపోరన్నారు. సిద్దిపేట ఉప ఎన్నికల సమయంలో డబ్బుకు లొంగని ప్రజల కమిట్‌మెంట్‌ను ఎప్పటికీ మరిచిపోమని అన్నారు.
ఈ విజయోత్సవ కార్యక్రమాన్ని మండలి చైర్మన్ ఢంకా మోగించి ప్రారంభించారు. ఆహూతులను మంత్రి హరీశ్‌రావు సన్మానించి జ్ఞాపికలను అందచేశారు. అనంతరం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావును, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ సంఘాలు, క్షేత్రస్థాయి బృందాలను మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంశాఖ మంత్రి నాయిని, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సన్మానించి మెమోంటోలు అందజేశారు. సమావేశంలో ఎమ్మెల్సీలు యాదగిరిరెడ్డి, పాతూరి సుధాకర్‌రెడ్డి, ఫారూఖ్‌హుస్సేన్, భూపాల్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంకవర్గీస్, దేశపతి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌లు పాల్గొన్నారు.
హరీశ్‌రావు.. ఆల్ ఇన్ వన్: స్వామిగౌడ్ మండలి చైర్మన్ స్వామిగౌడ్ తన ప్రసంగంలో మంత్రి హరీశ్‌రావుపై ప్రశంసల వర్షం కురిపించారు. అసలు ఈయన ఏ మంత్రి? ఇరిగేషన్.. ఆరోగ్యం.., వ్యవసాయం, రోడ్లు, ఇండ్లు …ఇలా ఒక్కటేమిటీ..ఆల్ ఇన్ వన్. ఇదేంటండీ.. ఆశ్చర్యమేస్తుందీ..ప్రతిశాఖపై పట్టు ఉండటమే గాకుండా ఆనర్గళంగా మాట్లాడుతాడు.. అనడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. రాష్ట్రహోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మామకు దగ్గ అల్లుడు హరీశ్‌రావు అన్నారు. ఎన్టీ రామారావు పిల్లనిచ్చి చంద్రబాబును అల్లున్ని చేసుకుంటే వెన్ను పోటు పొడిచిండు. మన హరీశ్‌రావేమో మామకు దగ్గ అల్లుడిగా పేరు నిలబెట్టి కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తున్నడని అనడంతో సభలో కరతాళ ధ్వనులు మార్మోగాయి.