Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఈ ఏడాది చివరికి పాలమూరు

-6 నెలల్లో డిండి
-పాలమూరు-రంగారెడ్డి, డిండికి నిధులు ఆగొద్దు
-బిల్లులకు తక్షణం 2 వేల కోట్లు విడుదల: సీఎం
-నిర్వాసితులకు వెంటనే పరిహారం ఇవ్వాలి
-నీటిపారుదలశాఖలో లష్కర్లుగా మస్కూరీలు
-ఆరేండ్లలో మూడున్నర రెట్లు పెరిగిన వరిసాగు
-నీటి పారుదలశాఖ ప్రాధాన్యం పెరిగింది
-ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు

వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు, దుర్భిక్షానికి నెలవైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి వందశాతం పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఫ్లోరైడ్‌, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించే డిండి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచాలని, ఆరునెలల్లోగా పూర్తిచేయాలని స్పష్టంచేశారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధులు ఆగవద్దని చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్లో కూడా నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు.

అత్యవసరమైన, తక్కువ వ్యయంతో కూడిన పనుల కోసం హైదరాబాద్‌దాకా రావాల్సిన అవసరం లేకుండా, వివిధ స్థాయిల అధికారులే మంజూరు చేసి, పనులు చేపట్టే అధికారం కల్పిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గ్రామాల్లోని మస్కూరీలను నీటిపారుదలశాఖలో విలీనం చేయాలని, వారిని లష్కర్లుగా వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. వారికి తగిన శిక్షణ ఇచ్చి ప్రాజెక్టుల నిర్వహణలో ఉపయోగించుకోనున్నట్టు వెల్లడించారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు.

భూ సేకరణ వెంటనే పూర్తిచేయాలి
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సమీక్ష సందర్భంగా నార్లాపూర్‌ రిజర్వాయర్‌, పంప్‌హౌజ్‌, నార్లాపూర్‌-ఏదుల కాలువ, ఏదుల పంప్‌హౌజ్‌, ఏదుల-వట్టెం కాలువ, వట్టెం రిజర్వాయర్‌, వట్టెం-కర్వెన కాలువ, కర్వెన రిజర్వాయర్‌, కర్వెన-ఉద్ధండాపూర్‌ కాలువ, టన్నెల్‌ పనుల పురోగతిని సీఎం కేసీఆర్‌ తెలుసుకున్నారు. ఉద్ధండాపూర్‌ నుంచి ఎగువ ప్రాంతాలకు నీరందించే మార్గానికి సంబంధించి తుది డిజైన్లు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కల్వకుర్తి, బీమా, కోయిల్‌సాగర్‌, నెట్టెంపాడు పూర్తిచేయడం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు, జూరాలతో కలిపి 11.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే మొత్తం మహబూబ్‌నగర్‌ జిల్లా సస్యశ్యామలం అవుతుందని చెప్పారు.

డిండి ప్రాజెక్టు పరిధిలోని కాలువలు, రిజర్వాయర్ల పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. రెండు ప్రాజెక్టులకు సంబంధించిన బిల్లులను వెనువెంటనే చెల్లించేందుకు తక్షణం రూ.2,000 కోట్లు విడుదలచేయాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. రెండు ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణను పూర్తిచేయడానికి తక్షణం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని నాగర్‌కర్నూల్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు సూచించారు. రైతులకు చట్ట ప్రకారం పరిహారం అందజేసి, వెంటనే భూ సేకరణను పూర్తిచేయాలని, ఆ భూమిని నీటిపారుదల శాఖకు అప్పగించాలని స్పష్టంచేశారు. బీహెచ్‌ఈఎల్‌ అధికారులతో సమావేశమై అవసరమైన మోటర్లను వెంటనే తెప్పించి, బిగించే పనులను పర్యవేక్షించాలని నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌కు సీఎం సూచించారు. విద్యుత్‌శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని చెప్పారు.

ఆర్థిక అధికారాలు.. చారిత్రాత్మక నిర్ణయం
నీటిపారుదల శాఖలో డీఈఈ స్థాయి నుంచి ఈఎన్సీ వరకు ప్రతి అధికారికి నిర్దిష్టమైన ఆర్థిక అధికారాలను ప్రభుత్వం బదిలీ చేసిందని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు. అత్యవసరమైన, తక్కువ వ్యయంతో కూడిన పనుల కోసం హైదరాబాద్‌ దాకా రావాల్సిన అవసరం లేకుండా, స్థానిక అధికారులే మంజూరుచేసి, పనులు చేపట్టే అధికారం ఇచ్చామని చెప్పారు. దేశంలో మరెక్కడా ఈ విధానం లేదని, ఇది చారిత్రాత్మక నిర్ణయమని అభివర్ణించారు. దీన్ని సద్వినియోగం చేసుకొని చిన్న చిన్న పనులను వెంటనే పూర్తిచేసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా సాగునీరు అందించాలని స్పష్టం చేశారు. ‘పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయా అధికారులకు నిర్ణయించిన పరిధి సౌకర్యవంతంగా, పనులు చేయడానికి అనువుగా ఉన్నదో లేదో తెలుసుకోవాలి. ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలి. అవసరమైన పక్షంలో మార్పులు చేయాలి’ అని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, సురేందర్‌, నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌, సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్‌, నీటిపారుదలశాఖ సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ మురళీధర్‌రావు, సీఈలు మోహన్‌కుమార్‌, రమేశ్‌, రఘునాథరావు, ఎస్‌ఈలు ఆనంద్‌, విజయభాస్కర్‌రెడ్డి, ఉమాపతిరావు, సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నీటిపారుదలశాఖ ప్రాధాన్యం పెరిగింది
ప్రతి సంవత్సరం ముందుగా అన్ని చెరువులను నింపాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. మిషన్‌ భగీరథకు నీరివ్వడానికి వీలుగా అన్ని రిజర్వాయర్లలో కనీస నీటి నిల్వను (మినిమమ్‌ డ్యామ్‌ డ్రాయింగ్‌ లెవల్‌) కొనసాగించాలని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు జరిగేదని, ఇప్పుడది 1.10 కోట్ల ఎకరాలకు పెరిగిందని పేర్కొన్నారు. సాగునీటి వసతి పెరుగడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. 1.25 కోట్ల ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే వ్యవస్థ సిద్ధమవుతున్నదని చెప్పారు. బోర్ల ద్వారా సాగయ్యే భూమి దీనికి అదనమని తెలిపారు. సాగునీటితోపాటు మిషన్‌ భగీరథకు, పరిశ్రమలకు నీరు అందించే బాధ్యత కూడా నీటి పారుదలశాఖదేనని పేర్కొన్నారు. దీంతో నీటిపారుదలశాఖ ప్రాధాన్యం, పరిధి ఎంతో పెరిగిందని చెప్పారు. సాగునీటి వ్యవస్థను సమర్థంగా నిర్వహించడానికి నీటిపారుదల శాఖను పునర్వ్యవస్థీకరించామని గుర్తుచేశారు. ఆయా ప్రాదేశిక ప్రాంతాల్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, చెరువులు, తూములు, చెక్‌ డ్యాములు, ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలు తదితరాలన్నీ ఒకే సీఈ పరిధికి తెచ్చామనాని చెప్పారు.

కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్‌, నెట్టెంపాడు పూర్తిచేయడం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు, జూరాలతో కలిపి 11.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే మొత్తం మహబూబ్‌నగర్‌ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. డిండి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి ఆరు నెలల్లోగా పూర్తిచేయాలి. ఈ రెండు ప్రాజెక్టులకు నిధులు ఆగవద్దు.
-ముఖ్యమంత్రి కేసీఆర్‌

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.