-హుజూరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే
-2001 నుంచి ప్రజలంతా టీఆర్‌ఎస్ వెంటే
-తెలంగాణకు టీఆర్‌ఎస్‌తోనే శ్రీరామ రక్ష
-బీజేపీ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేదు
-‘నమస్తే తెలంగాణ’తో గెల్లు శ్రీనివాస్‌యాదవ్
-అందరికీ అందుబాటులో ఉంట

నేను పుట్టింది, పెరిగింది వీణవంక మండలం హిమ్మత్‌నగర్. మా అమ్మ, నాన్న ఇక్కడే ఉన్నరు. నేనూ ఇక్కడే ఉంట. నాకు హైదరాబాద్‌లో వందలకోట్ల విలువైన ఇండ్లు లేవు. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలు లేవు. ఉద్యమ సమయం లో వందల కేసులు ఎదుర్కొన్న. వందల లాఠీ దెబ్బలు తిన్నోడిని. ఈ ప్రాంతంమీద ప్రేమ ఉన్నోడిని ఇక్కడే ఉంట. నియోజకవర్గంలోని పేదల బతుకులు మార్చేందుకు ఒక్కఅవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్న. టీఆర్‌ఎస్‌లో కుట్రలు, కుతంత్రాలకు తావులేదు. ఈటల ఒక్కటి కాదు.. రెండు కాదు.. అనేక కుట్రలు చేసిండు. ఆయన చేసే ఆరోపణల్లో ఒక్కటి కూడా వాస్తవంలేదు. ప్రజలే ఆయనకు జవాబు చెప్తారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఎవరేమిటో తేలిపోతుంది
హుజూరాబాద్‌లో ఎగిరేది ముమ్మాటికీ గులాబీ జెండానేనని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు, హుజూరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. తెలంగాణ అభివృద్ధి సీఎం కే చంద్రశేఖర్‌రావుతోనే సాధ్యమని, రాష్ర్టానికి టీఆర్‌ఎస్సే శ్రీరామ రక్ష అని చెప్పారు. పేదల బతుకులు మారాలని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్తుంటారని.. నియోజకవర్గంలో పేదల రాత మార్చేందుకు తనకొక అవకాశం ఇవ్వాలని కోరారు. ‘ఈ గడ్డ బిడ్డను.. ఎన్నికల్లో గెలిపించి దీవించండి’ అని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా ఎంపికైన సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా అవకాశం కల్పించడం తన అదృష్టమని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఏవీ కాలేజీలో కార్యకర్త స్థాయిలోఉన్న తనను పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా చేశారని, తండ్రిలా అక్కున చేర్చుకున్నారని చెప్పారు. శ్రీనివాస్ యాదవ్‌తో ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే..
బీజేపీకి ఆదరణే లేదు
హుజూరాబాద్‌లో 2001 నుంచి ఇప్పటివరకు టీఆర్‌ఎస్ తప్ప మరో పార్టీలేదు. 2001లోనే ఎంతోమందిని సర్పంచులుగా, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా గెలిపించిన చరిత్ర టీఆర్‌ఎస్‌కు ఉన్నది. ఇక్కడ బీజేపీకి స్థానం లేదు. ముమ్మాటికీ విజయం సాధించబోయేది టీఆర్‌ఎస్ పార్టీనే. 2018 ఎన్నికల్లో బీజేపీకి ‘నోటా’కు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు. గతంలో కాంగ్రెస్‌కు 62వేల ఓట్లు వచ్చినా.. గతంలో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన కౌశిక్‌రెడ్డి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను చూసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసారి కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా కష్టమే. హుజూరాబాద్‌లో భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నాం.
దళితబంధు అద్భుత పథకం
దళితబంధు అద్భుతమైన పథకం. సమాజంలో అత్యంత వెనుకబడిన, అణగారినవర్గాల అభ్యున్నతికోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ఎలా వ్యవహరిస్తారన్నదానికి దళితబంధు పథకమే ఉదాహరణ. ఇది హుజూరాబాద్ ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెచ్చింది కాదు. దళితుల జీవితాలను సమూలంగా మార్చే పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ అభినవ అంబేద్కర్.. ఆధునిక పూలే. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి పథకాలున్నాయో చెప్తారా..? తెలంగాణ దళిత, బహుజనుల కోసం అమలుచేస్తున్న పథకాల్లో ఒక్కటైనా కేంద్రంలో బీజేపీ అమలుచేస్తున్నదేమో ఆ పార్టీ నాయకులు చెప్ప గలుగుతారా?
హుజూరాబాద్‌ను తీర్చిదిద్దుతా
హుజూరాబాద్‌ను అభివృద్ధిలో తీర్చిదిద్దుతా. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్‌నగర్ తదితర నియోజకవర్గాలతో పోటీపడేలా చేస్తా. గత ఏడేండ్లుగా రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలో ఉండి నిధులు ఇచ్చినప్పటికీ ఇక్కడి ఎమ్మెల్యేగాఉన్న ఈటల రాజేందర్ పట్టించుకోలేదు. రాష్ట్రంలో రెండు లక్షలకుపైగా డబుల్‌బెడ్రూం ఇండ్లు కట్టిస్తే హుజూరాబాద్‌లో ఒక్కటి కూడా కట్టలేదు. ఆయన వ్యాపారాలను పెంచుకోవడం తప్ప నియోజకవర్గ అభివృద్ధిని ఎప్పుడూ పట్టించుకోలేదు. నన్ను గెలిపిస్తే పేదలందరికీ డబుల్‌బెడ్రూం ఇండ్లు కట్టిస్త. హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలను మోడల్ సిటీలుగా తీర్చిదిద్దుతా.