-స్వయంగా పోర్టల్‌ను ప్రారంభించనున్న సీఎం -ఆలోగా అన్ని ఆస్తుల డాటా నమోదు చేయాలి -అంతకు ముందే రిజిస్ట్రేషన్ రేట్ల నిర్ణయం -సర్వే నంబర్లవారీగా ధరలు ఖరారు చేస్తాం -ఆగిన రిజిస్ట్రేషన్లు మళ్లీ విజయ దశమి నుంచే -అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు

రాష్ట్రంలో భూ లావాదేవీలకు ఆయువుపట్టుగా మారనున్న ధరణి పోర్టల్.. దసరా పర్వదినాన ప్రారంభం కానున్నది. విజయదశమిని ప్రజలు శుభదినంగా భావిస్తున్నందువల్ల ఆ రోజున ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా పోర్టల్‌ను ప్రారంభిస్తారు. ఆలోగానే ధరణికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ శనివారం అధికారులను ఆదేశించారు. అవసరమైన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, బ్యాండ్‌విడ్త్‌లను సిద్ధంచేయాలని స్పష్టంచేశారు. మారిన రిజిస్ట్రేషన్ విధానం, వెంటనే మ్యుటేషన్ చేయడం, ధరణి పోర్టల్‌లో వివరాలను అప్‌డేట్ చేయడం, విధి విధానాలపై తాసిల్దార్లు, డిప్యూటీ తాసిల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లకు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నట్టు సీఎం వెల్లడించారు.
నమూనా ట్రయల్స్ కూడా నిర్వహించి అధికారులకు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్టు చెప్పారు. పోర్టల్ నిర్వహణకు అనుగుణంగా ప్రతి మండలానికి ఒకరు, ప్రతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకరు చొప్పున కంప్యూటర్ ఆపరేటర్లను నియమించాలని సీఎం ఆదేశించారు. దసరాలోగా అన్నిరకాల ఆస్తులకు సంబంధించిన డాటాను ధరణి పోర్టల్‌లో ఎంటర్‌చేయాలని అధికారులను కోరారు. ఆ తర్వాత జరిగే మార్పులు, చేర్పులు వెంటవెంటనే నమోదుచేయాల్సి ఉంటుందన్నారు.
ధరణి ప్రారంభంకావడానికి ముందే రాష్ట్రవ్యాప్తంగా సర్వేనంబర్లవారీగా రిజిస్ట్రేషన్ రేట్లను నిర్ణయించనున్నట్టు చెప్పారు. అదే రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభమయ్యే రోజు నుంచే రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభం అవుతాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అప్పటివరకు ఎలాంటి రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ వ్యవహారాలు జరుగవని స్పష్టంచేశారు. తాసిల్దార్ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులు ఇచ్చి వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నట్టు సీఎం వెల్లడించారు.