ఇటీవల తన బీజింగ్ పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు చైనాకు చెందిన అగ్రశ్రేణి నిర్మాణరంగ సంస్థ శానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు పరిశీలించేందుకు రావడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తంచేశారు. శానీ గ్రూప్ నాయకత్వంలో వచ్చిన చైనా కంపెనీల ప్రతినిధులతో శుక్రవారం సాయంత్రం నగరంలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగిన సమావేశానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -చైనా కంపెనీతో రెండు ఎంవోయూలు కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం -ఫలక్‌నుమాలో చైనా కంపెనీ ప్రతినిధులతో భేటీ -పెట్టుబడుల అనుకూల వాతావరణం మా సిద్ధాంతం -పరిశ్రమల ఏర్పాటులో అవినీతికి తావులేదు -చైనా కంపెనీల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ -రాష్ట్ర పర్యటనకు వచ్చిన 14 కంపెనీల ప్రముఖులు

ఈ సందర్భంగా తెలంగాణలో డ్రైపోర్టు ఏర్పాటు చేసేందుకు, ప్రీఫ్యాబ్ కాంక్రీట్ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, శానీ గ్రూప్‌కు మధ్య రెండు ఎంవోయూలు కుదిరాయి. డ్రైపోర్ట్ ఎంవోయూపై రాష్ట్ర పరిశ్రమలశాఖ ఇన్‌చార్జి కార్యదర్శి జయేశ్ రంజన్, పోర్ట్ ఆఫ్ శానీ హెవీ ఇండస్ట్రీ చైర్మన్ లియాన్ వెన్‌జెన్ సంతకాలు చేశారు. ఒప్పంద పత్రాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. నిర్మాణాలకు ఉపయోగించే ప్రీఫ్యాబ్రికేటెడ్ కాంక్రీట్ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ స్థాపనకు సంబంధించిన ఎంవోయూపై తెలంగాణ గృహనిర్మాణ శాఖ కార్యదర్శి దానకిశోర్, శానీ ఇంటర్నేషనల్ హౌజింగ్ కార్యదర్శి హైజెన్ డెంగ్ సంతకాలు చేశారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, శానీ గ్రూప్ నేతృత్వంలోని చైనా దేశ కంపెనీల ప్రతినిధుల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో చైనా దేశంలోని 14కంపెనీల నుంచి 45మంది ప్రతినిధులు పాల్గొన్నారు. చైనా పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తన చైనా పర్యటనలో శానీ గ్రూప్ ఆఫీసుకు వెళ్లినప్పుడు ఎంతో ప్రేమ, ఆదరణ చూపారని, విందు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. తాము చైనాలో ఎక్కడికి వెళ్లినా ఇదే ఆదరణ లభించిందని చెప్పారు. తన ఆహ్వానం మన్నించి చైనా నుంచి ఎంతో ఆసక్తితో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు శానీ గ్రూప్ వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో అన్ని రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించబోతున్నదని తెలిపారు. ఈ రంగంలో అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

రాష్ట్రంలో మంచి పారిశ్రామిక విధానం ఉన్నదని, అవినీతి రహిత పాలన ఉందని చైనా ప్రతినిధులకు వివరించారు. బొగ్గు ఉత్పత్తి, భూగర్భ ఖనిజవనరులు, విద్యుత్‌రంగంతోపాటు ఇతర రంగాలలో పుష్కలమైన వనరులున్నాయని, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని శానీ గ్రూపును కోరారు. పేదల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి చేపడుతున్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణానికి సాంకేతిక సహకారమందించాలని విజ్ఞప్తిచేశారు. అంతకు ముందు రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం, మిగులు విద్యుత్ ఉత్పత్తికోసం చేస్తున్న ప్రయత్నాలు, డ్రైపోర్టు ఆవశ్యకత, సింగరేణి కాలరీస్‌ద్వారా జరిగే బొగ్గు ఉత్పత్తి, పట్టణప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, హైదరాబాద్ నగరంలో రహదారులు, రవాణావ్యవస్థ అభివృద్ధి తదితర అంశాలపై రాష్ట్ర అధికారులు చైనా ప్రతినిధులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కేటీ రామారావు, గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర, డీజీపీ అనురాగ్‌శర్మ, హౌసింగ్ కార్యదర్శి దానకిశోర్, పరిశ్రమలశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంజీ గోపాల్, జెన్కో సీఎండీ ప్రభాకరరావు, సింగరేణి సీఎండీ శ్రీధర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ శాలినీమిశ్రా, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, సీఎం అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి, ఎంఏయూడీ కమిషనర్, డైరెక్టర్ జనార్దన్‌రెడ్డి, పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి వాంకుడోతు సైదా, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ అనంద్ తదితరులు పాల్గొన్నారు.

చైనా బృందంలో శానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ లియాన్ వెన్‌జెన్, ప్రెసిడెంట్ టాంగ్ జిగువో, వైస్ ప్రెసిడెంట్ డుయాన్‌డవే, శానీ ఇండియా డైరెక్టర్, సీఈవో దీపక్‌గార్గ్, సీసీటీఈజీ షెన్యాంగ్ ఇంజినీరింగ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఝాంగ్ కేషు, చైనా మిన్‌షెంగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ చెన్ గుయోగాంగ్, చైనా కోల్‌మైన్ కన్‌స్ట్రక్షన్ గ్రూప్ కార్పొరేషన్ చైర్మన్ క్షావోషిబ్లింగ్, పవర్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా వైస్ ప్రెసిడెంట్ జెంగ్‌జింగ్లియాంగ్, చింట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ నాన్, గోల్డెన్ కాంకర్డ్ హోల్డింగ్ లిమిటెడ్ వైస్ చైర్మన్ షుహువా, వైస్ ప్రెసిడెంట్ ట్జావు సియాన్, లియాన్ యాంగ్‌గాంగ్ పోర్ట్ హోల్డింగ్ గ్రూప్ కంపెనీస్ వైస్ ప్రెసిడెంట్ లీ చున్‌హాంగ్, స్టేట్ పవర్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ మా లు, టెబియాన్ ఎలక్ట్రిక్ అప్పారటస్ స్టాక్ కంపెనీ సీఈవోతోపాటు చైనా ఎంబసీ నుంచి జుయిజియాన్ ఇన్వెస్ట్ ఇండియా నుంచి సిద్ధార్థ ఆనంద్, ప్రియారావత్ తదితరులు పాల్గొన్నారు.
అన్నీ అగ్రశ్రేణి కంపెనీలే రాష్ట్ర పర్యటనకు వచ్చిన చైనా కంపెనీలు అన్నీ ప్రపంచస్థాయి అగ్రశ్రేణి కంపెనీలే. ఇందులో శానీగ్రూపు మొత్తం ఆస్తుల విలువ 1800 కోట్ల డాలర్లు. ఈ కంపెనీకి భారతదేశం సహా వంద దేశాల్లో శాఖలు ఉన్నాయి. 1989లో ఏర్పాటైన శానీ గ్రూప్.. నిర్మాణరంగ మెషినరీ తయారీ రంగంలో చైనాలో నంబర్ వన్‌గా, ప్రపంచంలో ఐదవ పెద్ద కంపెనీగా ఉంది. సీసీటీఈజీ షెన్యాంగ్ ఇంజినీరింగ్ కంపెనీ చైనాలోని మొట్టమొదటి వృత్తిపరమైన కోల్ డిజైన్ కంపెనీ. 1952లో ఏర్పాటైన ఈ కంపెనీ అమెరికా, పోలండ్, ఆస్ట్రేలియా, రష్యా, బెల్జియం, స్వీడన్, జపాన్, జర్మనీల్లో శాఖలు కలిగి ఉంది. ఈ కంపెనీ మొత్తం ఆస్తుల విలువ 1250 కోట్ల అమెరికన్ డాలర్లు.
చైనా కోల్‌మైన్ కన్‌స్ట్రక్షన్ గ్రూప్ కార్పొరేషన్‌ను 1989లో ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ లావోస్, వియత్నాం, టర్కీ, భారత్‌లో ప్రాజెక్టులు చేపట్టింది. చింట్‌గ్రూపు కేంద్ర కార్యాలయం ఝీజియాంగ్‌లోని వెంఝోలో ఉంది. ఈ కంపెనీ మొత్తం ఆస్తుల విలువ 340 కోట్ల అమెరికన్ డాలర్లు. విద్యుత్ పంపిణీ, లోవోల్టేజీ పరికరాల తయారీలో ఈ సంస్థ పేరెన్నికగన్నది. దాదాపు వంద దేశాల్లో ఈ కంపెనీ అనేక పనులు చేపట్టింది. టాప్ 500 చైనా కంపెనీల్లో ఒకటిగా ఉంది. భారత్‌లో 2011 నుంచి 11 భారీ సౌర విద్యుత్ ప్లాంట్లు నిర్మించేందుకు ఈ కంపెనీ సహకరించింది. గోల్డెన్ కాంకర్డ్ హోల్డింగ్ లిమిటెడ్ చైనాలోని అతిపెద్ద ప్రభుత్వేతర విద్యుత్ సంస్థ. ఫోటోవోల్టాయిక్ మెటీరియల్ తయారీలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. లియాన్ యంగ్‌గాంగ్ పోర్ట్ హోల్డింగ్స్ గ్రూప్ చైనా రవాణా పరిశ్రమలో ఆధిపత్యం చెలాయిస్తున్నది.
భారత్‌లో నిర్మించిన అనేక నౌకాశ్రయాల్లో దీని పాత్ర ఉంది. స్టేట్‌పవర్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ జపాన్, టర్కీ, పాకిస్థాన్, బ్రెజిల్ సహా 35 దేశాల్లో శాఖలు కలిగి ఉంది. చైనాలో జల, థర్మల్, అణు, నవ ఇంధన విద్యుత్ విభాగాలన్నీ కలిగి ఉన్న ఏకైక ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ గ్రూప్‌గా ఉంది. టీబీఈఏ ఎనర్జీ ఇండియా.. భారీ యంత్రాలను తయారుచేసే కంపెనీ. దీని ప్రధాన కేంద్రం చైనాలోని లియోనింగ్‌లో ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశాలకు హాజరయ్యేందుకు చైనా వెళ్లిన సందర్భంగా ఈ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు జరిపి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పైన పేర్కొన్న కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో పర్యటనకు వచ్చారు.