Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

దుమ్మురేపిన కారు..

…9 గంటల్లో 10 సభలు -టీఆర్‌ఎస్‌కు ఓటేస్తేనే తెలంగాణ సస్యశ్యామలం -పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తం.. -ఉద్యోగులందరికీ కొలువు భద్రత -కాంట్రాక్ట్ ఉద్యోగమన్న పదమే వినపడదు -పోలీసులకు వారాంతపు సెలవులు, నియమిత పనివేళలు -ఆదిలాబాద్ జైత్రయాత్రలో కేసీఆర్ హామీలు

KCR in Adilabad Meeting 002

టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ పనులు చేపట్టి బీడు భూములను సస్యశ్యామలం చేస్తామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. ప్రజల భద్రత కోసం యంత్రాల్లా పనిచేసే పోలీసులకు వారాంతపు సెలవు సదుపాయం కల్పిస్తామని, పోలీసులందరికీ నిబంధనలతో కూడిన పనివేళలు నిర్ణయిస్తామని తెలిపారు. అవినీతి రహిత పాలన చేస్తామని, ఈ విషయంలో సొంత మనుషులకు కూడా మినహాయింపు ఉండదని, చివరకు కొడుకైనా, కూతురైనా అవినీతికి పాల్పడితే జైలుకు పంపిస్తానని స్పష్టం చేశారు.

మైనారిటీల అభివృద్ధికి వెయ్యికోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేస్తామని, వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియల్ హోదా కల్పిస్తామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా జైత్రయాత్రలో భాగంగా ఆదివారం భైంసా, నిర్మల్, ఇచ్చోడ, ఆదిలాబాద్, ఉట్నూర్, ఆసిఫాబాద్, సిర్పూర్ (టి), బెల్లంపల్లి, శ్రీరాంపూర్, కరీంనగర్ జిల్లా రామగుండంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచార వేగం పెంచిన టీఆర్‌ఎస్ అధినేత, ఒకేరోజు 9గంటల వ్యవధిలో 10చోట్ల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ కశ్మీర్‌లాంటి ఆదిలాబాద్ జిల్లా సీమాంధ్రుల పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాను గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తుందని హామీ ఇచ్చారు.

కాంట్రాక్టు అన్న పదమే వినపడదు టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలోని కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్దీకరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఉద్యోగాల కల్పనలో కాంట్రాక్టు అనే పదానికి నేను పూర్తిగా వ్యతిరేకిని. మా పార్టీకి అధికారం వచ్చిన మరుక్షణమే కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తా. కాంట్రాక్టు అన్న పదమే వినపడకుండా చేస్తా. నిర్మల్ కొయ్యబొమ్మల పరిశ్రమను ఆదుకొని, కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తా. ప్రభుత్వ ఉద్యోగులుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం స్నేహపూర్వకంగా ఉంటుంది. ఎమ్మెల్యేకు కోపమొచ్చినా, ఎంపీకి కోపమొచ్చినా బదిలీ అనే ముచ్చటే ఉండదు. నిబంధనలకు లోబడి మాత్రమే ఉద్యోగుల బదిలీలుంటయ్. సమాజ భద్రతకోసం నిరంతరం శ్రమించే పోలీసుల పట్ల ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా జాలి చూపిన దాఖలాల్లేవు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రతి పోలీస్‌స్టేషన్‌కు పెన్ను, పేపర్, పెట్రోల్ నుంచి మొదలు పెడితే చీపురుకట్టదాకా మెయింటెనెన్స్ చార్జీలన్నీ సర్కారే చెల్లిస్తుంది. వారికి ఆరోగ్య భద్రత విషయంలో రాజీ ఉండదు అని అధినేత స్పష్టం చేశారు.

వృద్ధులకు వెయ్యి, వికలాంగులకు రూ.1500 పెన్షన్ టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరిని ధనవంతుడిని చేసేంత వరకు నిద్రపోనని ప్రకటించారు. రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని, వితంతువులు, వృద్ధులకు రూ.1000, వికలాంగులకు 1500 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆటో యాజమానులకు పన్నును మాఫీ చేస్తామని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇండ్లు కట్టిస్తామని డబ్బాల్లాంటి ఇండ్లు కట్టించారని, అవి కుటుంబాలకు ఏమాత్రం సరిపోవటం లేదని తెలిపారు. రూ.3 లక్షలతో 125 చదరపు గజాల్లో డబుల్ బెడ్‌రూం ఇంటికి పేదలందరికీ నిర్మించి ఇస్తామని వాగ్దానం చేశారు. మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థులు గెడం నగేష్, బాల్క సుమన్, ఎమ్మెల్యే అభ్యర్థులు కోవ లక్ష్మీ, కావేటి సమ్మయ్య, దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్‌రావు, నల్లాల ఓదేలు, తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్, కావేటి సాయిలీల, రాజమౌళి, భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్, జమున, గంధం శ్రీనివాస్, అచ్యుత్‌రావు, మల్లేష్ యాదవ్, జే రాజమల్లు, నర్సింగం, పీ సురేశ్, దుగుట శ్రీనివాస్, ఎస్కే రషీద్ తదితరులు కేసీఆర్ వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

లోయర్ పెన్‌గంగను పూర్తి చేస్తాం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చేతగాని దద్దమ్మల్లా వ్యవహరించాయని కేసీఆర్ దుయ్యబట్టారు. ఆదిలాబాద్ జిల్లాలోని లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్, తాంసి, తలమడుగు, బేల మండలాల్లో 70 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఈ ప్రాజెక్టుపై సీమాంధ్ర పార్టీలు కావాలనే నిర్లక్ష్యం వహించాయని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పెన్‌గంగ ప్రాజెక్టును పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో ఈ ప్రాజెక్టు పనులు చకచకా జరుగుతున్నాయని, అంతేవేగంగా తెలంగాణలో పనులు పూర్తిచేస్తామని తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గంలో కడెం, సదర్‌మాట్ ప్రాజెక్టుల్లో ప్రతిఏటా 30 టీఎంసీలకు పైగా నీరు వృథా అవుతుందని, ఈ ప్రాజెక్టుల ఎత్తును పెంచడంతో పాటు మరో రెండు ప్రాజెక్టులను నిర్మిస్తే 40వేల ఎకరాల భూమి సాగులోకి వస్తుందని అన్నారు. గిరిజనులు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు తండాలు, గోండుగూడేలను గ్రామపంచాయతీలుగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. 50ఏళ్ల క్రితం నాటి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులు ఇప్పటికీ సహాయం కోసం నిరీక్షిస్తున్నారంటే గత ప్రభుత్వాల పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందని అన్నారు. నిర్మల్ సమీపంలో 400 కేవీ విద్యుత్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

కబ్జా భూముల్ని ముక్కుపిండి లాక్కుంటం టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్, దాని చుట్టూ సీమాంధ్రులు కబ్జా చేసిన లక్షల కోట్ల విలువైన భూములను ముక్కుపిండి వెనక్కు తీసుకొంటామని కేసీఆర్ ప్రకటించారు. అందుకే టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావొద్దని ఎన్నో కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు చీకట్లో చేతులు కలిపి టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకుండా అడ్డుకొనే ప్రయత్నం చూస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. అక్రమాస్తులు ఎక్కడ దక్కకుండా పోతాయోననే భయంతో రూ.2వేల కోట్లు కుమ్మరించి, 20 నుంచి 30 సీట్లు సాధించేందుకు సీమాంధ్రులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేవీపీ రాంచంద్రారావు ఎన్నికల్లో పెద్ద మొత్తంలో నల్లధనాన్ని కుమ్మరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌కు 90 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఎలాగైనా ఇక్కడ కనీసం 20 నుంచి 30సీట్లు సాధించడమే లక్ష్యంగా టీడీపీ ముందుకు కదులుతోందన్నారు. కానీ ఎంత డబ్బు ఖర్చు చేసినా ప్రయోజనం ఉండదనీ, టీఆర్‌ఎస్ ప్రభంజనం ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

పొన్నాల సన్నాసే టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. నిర్మల్ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణను అడ్డుకోవాలని చివరివరకు ప్రయత్నించిన కేవీపీ రామచంద్రరావుతో చేతులు కలిపిన పొన్నాల నిజంగా సన్నాసేనని విమర్శించారు. మన గాచారం. ఆయన తెలంగాణలో పుట్టినందుకు బాధపడుతున్నా. తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో పని చేయాలని, ఆంధ్ర ఉద్యోగులు వారి ప్రాంతానికి వెళ్లిపోవాలని నేనంటే దానిపై క్షమాపణ చెప్పాలని పొన్నాల నన్ను డిమాండ్ చేస్తున్నారు. ఇది చూస్తుంటే పొన్నాల బేతాల మాంత్రికుడైన కేవీపీ చేతుల్లో పావుగా మారారని అర్థమవుతుంది అని కేసీఆర్ ధ్వజమెత్తారు.

బంగారు తెలంగాణ కావాలంటే టీఆర్‌ఎస్‌కే ఓట్లేయాలి ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ అభివృద్ధి చెంది బంగారు తెలంగాణగా మారాలంటే టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని కేసీఆర్ అన్నారు. 14 ఏళ్ల పోరాటంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకొన్నామని, తాను ముందుండి నడిపిస్తే ఎంతోమంది పోరాటాల ఫలితంగా తెలంగాణ కల సాకారమైందని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు రాష్ట్రంకోసం ఉద్యమాలు చేశారా, లాఠీ దెబ్బలు తిన్నారా, జైళ్లకు పోయారా అన్న విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలని కేసీఆర్ కోరారు. మీ పాదాల ముందు తెలంగాణ ఉంచిన. దానిని అద్భుతంగా రూపొందించుకోవటం మీ చేతుల్లోనే. ఉద్యమం చేయని వారిని ఎన్నుకుంటే తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తేనే స్వచ్ఛమైన తెలంగాణను కండ్ల చూస్తాం అని అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.