-నెలరోజుల తరువాత అధికారంలోకి వస్తాం.. రూపాయి అవినీతిలేని పాలన తెస్తాం
-అవినీతికి పాల్పడితే కొడుకునైనా, బిడ్డనైనా జైల్లో పెట్టిస్తా: కేసీఆర్ -బంగారు తెలంగాణే లక్ష్యం -మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన టీఆర్‌ఎస్ బహిరంగసభకు హాజరైన ప్రజానీకం. -ఇళ్ల నిర్మాణాల రుణాలు మాఫీ -పోలీసు కుటుంబాలకు ఇళ్ల స్థలాలు -మెదక్ జిల్లా మూడు జిల్లాలుగా ఆవిర్భావం -సింగూరు జలాలు నిజామాబాద్, మెదక్ జిల్లాలకే -ఆంధ్రా ఉద్యోగులు పోవాల్సిందే -టీడీపీకి ఓటేస్తే ఆంధ్రాకు వేసినట్టే -త్వరలో టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో -కాంగ్రెస్, టీడీపీలకు 60 ఏళ్ల తర్వాత తెలంగాణ గుర్తొచ్చింది -జోగిపేట సభలో టీఆర్‌ఎస్ అధినేత -టీఆర్‌ఎస్‌లో చేరిన కరణం సతీమణి

అధికారం చేపట్టాక రాజకీయ అవినీతిని పూర్తిగా అంతం చేస్తానని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిజ్ఞ చేశారు. ఈ దిశగా అవినీతికి పాల్పడితే కొడుకైనా కూతురైనా జైలుకు పంపుతానని ఆయన అన్నారు. దానితోపాటు ఇంతకాలం రాజకీయ నాయకులు బొక్కిన అక్రమ నిధులను విచారణ జరిపి కక్కిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. రూపాయి అవినీతి లేని పాలన అందిస్తామని కేసీఆర్ చెప్పారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే రైతుల ఆత్మహత్యలు, చేనేత ఆకలి చావులు రాజ్యమేలాయన్న కేసీఆర్ ఆ పార్టీ నాయకులు ఇప్పుడు కొత్తగా ఉద్దరించేదేమిటని ప్రశ్నించారు.
ఇంత కాలం ఎప్పుడూ మాట్లాడని వారు ఇవాళ తెలంగాణ అభివృద్ధి అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఒప్పించి సింగూరు ప్రాజెక్టు కాల్వలకు తాను నిధులు మంజూరు చేయిస్తే ఇక్కడ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్లు కనీసం కాల్వలు కూడా కట్టలేకపోయారని దామోదర రాజనర్సింహమీద విరుచుకుపడ్డారు.లక్ష రూపాయల వరకు పంట రుణాలు, ఇళ్ల నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు మాఫీ చేయిస్తామని కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం మెదక్ జిల్లా జోగిపేటలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ విజయోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే ..
నెల రోజుల తరువాత తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తది. కొత్త ప్రభుత్వంలో అవినీతికి తావుండదు. రాజకీయ అవినీతిని పూర్తిగా అంతం చేస్తా. అవినీతి అంతం నా పంతం. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడేవారు ఎవ్వరైనా ఉపేక్షించం. అది నా కొడుకైనా, బిడ్డయినా జైల్లో పెట్టిస్తా. ఇన్నేళ్లుగా రాజకీయ నాయకులు అవినీతితో అక్రమంగా దిగమింగిన జనం సొమ్ము ఎంక్వైరీ పెట్టించి కక్కిస్తా. నాలుగున్నర కోట్ల ప్రజల సహకారంతో 14 ఏళ్లు శాంతియుత పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన రోజున కేసీఆర్‌తో ఏమవుతుందనుకున్నారు. ఇంటికో యువకుడిని నాతో పంపిస్తే తెలంగాణ తెచ్చిస్తానని ఆప్పుడే చెప్పిన. ప్రాణాలు పోతున్నా సరే ఉద్యమాన్ని వీడలేదు. ఉద్యమాన్ని వీడితే రాళ్లతో కొట్టిచంపమని నేనే చెప్పిన. భగవంతుని దయ, అందరి సహకారంతో తెలంగాణ సాధించుకున్నాం. ప్రజల ఎజెండా అమలు చేస్తా..: ఇల్లు అలుకగానే పండుగ కాదు..
ఇది నా పంతం సాధించుకున్న తెలంగాణపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలు నెరవేరడం కోసం తెలంగాణ ప్రభుత్వంలో ప్రజల ఎజెండాను అమలు చేస్తా. మంచి పరిపాలన రావాలంటే రాజకీయ అవినీతి అంతం కావాలి. ఇప్పటి వరకు టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల పాలన చూసిండ్రు. అవినీతి రాజ్యమేలింది. అందిన కాడికి దోచుకున్నరు. ఇండ్లు కట్టకపోయిన బిల్లులు తీసుకున్నరు. పేదల పేర్లు ఉండాల్సిన ఇండ్ల జాబితాల రాజకీయ నాయకులు, గూండాలు, దొంగల పేర్లు చేరినయి. అందరూ కలిసి దోచుకుతిన్నరు. ఆ ప్రభుత్వాల హయాంలో అవినీతి అందరికీ తెలుసు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అవినీతికి పాతర వేస్తం, రూపాయి అవినీతి లేని పాలన అందిస్తాం. తెలంగాణ అభివృద్ది మాతోనే సాధ్యమని చాలా మంది చాలా మాట్లాడుతున్నరు. 60 ఏళ్లు తెలంగాణాను పరిపాలించింది టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే. ఇంత కాలం తెలంగాణ అభివృద్ధిపై మాట్లాడని ఆ నాయకులు ఇపుడు కొత్తగా అభివృద్ధిపై మాట్లాడుతున్నరు. ఆ రెండు ప్రభుత్వాల కాలంలోనే రైతు ఆత్మహత్యలు, చేనేతల ఆకలి చావులు జరిగినయ్.
సింగూరుకు నిధులు ఇప్పించా.. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను ఒప్పించి, అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డిని ఢిల్లీకి పిలిపించి సింగూరు ప్రాజెక్ట్ కాలువల నిర్మాణానికి నిధులు నేనే ఇప్పించిన. ప్రాజెక్ట్ ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు అందాలి. ఏండ్లు గడుస్తున్న కాలువల పనులు మాత్రం జరుగుతలేవు. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్లు ఇక్కడ ఉన్నరు. వాళ్లేం చేస్తున్నరు? 400 కిలోమీటర్ల పోతిరెడ్డిపాడు పనులు వేగంగ ఎందుకు జరుగుతయి? సింగూరు కాలువ పనులు ఎందుకు ఆగుతయి? మెదక్ జిల్లాకు మిడ్‌మానేరు, ప్రాణహిత చేవెళ్ల నుంచి సాగు నీరు అందిస్తాం. సింగూరు జలాలు మెదక్, నిజామాబాద్ జిల్లాలకే దక్కాలి.. అయితే ఆంధ్ర పాలకులు కుట్రలతో నీళ్లను హైదరాబాద్ తరలించుకుపోయారు. ఇక మీదట ఆలా జరగదు.
బీసీ ఇండ్ల నిర్మాణానికి పెద్దపీట.. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో బలహీన వర్గాల గృహనిర్మాణానికి పెద్దపీట వేస్తం. ఇప్పుడు ప్రభుత్వం కట్టిస్తున్న ఒక్క రూం ఇంటిలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఉంటడా..? బలహీన వర్గాల కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయి. మేకలు, కోళ్లు, బర్లు ఉంటాయి. సర్కారు కట్టించిన ఒక్కరూంలో మనుషులు ఎక్కడుండాలి, మేకలు, కోళ్లు ఎక్కడుండాలె? బీసీలు ఆత్మగౌరంతో ఉండేలా 125 గజాల స్థలంలో రూ. మూడు లక్షలతో రెండు బెడ్‌రూంలు, వరండా, బాత్‌రూం, మరుగుదొడ్డితో కలిపి పిల్లర్లతో ఇళ్లు నిర్మించి ఇస్తాం. ప్రభుత్వానికి ఒక్కపైసా చెల్లించే పనిలేదు. ఇప్పటి దాక ఇండ్ల నిర్మాణం కోసం తీసుకున్న రుణాలన్నీ మాఫీ జేస్తం. ఇండియాలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం ఉంటది. అట్లనే రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ. లక్ష వరకు క్రాప్ లోనులు మాఫీ చేస్తం. కొత్త ప్రభుత్వంలో నిర్బంధ విద్య అమలు చేస్తం. 40 లక్షల మంది విద్యార్థులు చదువుకునేలా అన్ని సౌకర్యాలతో కూడిన ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ హాస్టళ్లతో ఏర్పాటు చేస్తం. ఐదారు గ్రామాలకు కలిపి ఒక హాస్టల్ ఉంటది. గ్రామాలనుంచి విద్యార్థులను తెచ్చే బాధ్యత ఎస్సైలకు అప్పచెబుతం. పోలీసుల్లో సామాజిక దృక్ఫథం రావాలె. పోలీసులు కూడా మా నిర్ణయాన్ని స్వాగతిస్తారనుకుంటున్నం. పోలీసు కుటుంబాలకు ఇళ్ల స్థలాలు అందిస్తం.
ఆంధ్ర ఉద్యోగులు పోవాల్సిందే.. ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రకు వెళ్ళాల్సిందే… ఆప్షన్లు లేవని నేనంటుంటే దామోదర రాజనరసింహ మాత్రం ఉండాలంటున్నడు. ఆప్షన్లు ఎందుకు ఉండాలె? ఇక్కడ పనిచేసే ఆంధ్ర ఉద్యోగులు వెళ్ళిపోతే మన వారికి కొత్తగా లక్ష ఉద్యోగాలు వస్తాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు అధికారుల ట్రాన్స్‌ఫర్లు ఉండవు. పైరవీలు కూడా ఉండయ్. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ట్ ఉద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వ స్కేలు అమలు చేస్తం. రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మన మంత్రులు వారి పక్కన నక్కి మనల్ని వెక్కిరించిండ్రు.
వరాల జల్లు.. ఈ సందర్భంగా కేసీఆర్ వివిధ వర్గాల ప్రజలకు అనేక వరాలు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని, మొత్తం తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు రావాల్సిందేనని అన్నారు. మూడేళ్లలో 13 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి రైతుల కరెంట్ కష్టాలు తీరుస్తామని, లంబాడీ తండాలను పంచాయతీలు మార్చి, లంబాడీ, కోయ, గోండు, చెంచు వంటి ఎస్టీ కులాలకు, ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. వక్ఫ్‌భూముల పరిరక్షణ కోసం జుడీషీయల్ అధికారాలు, వృద్ధులకు, వితంతువులకు వెయ్యి, వికలాంగులకు రూ.1500 పెన్షన్లు ఇస్తామన్నారు. వ్యవసాయ పరిశోధనలు పెంచి రైతులు లక్షాధికారులుగా మారేలా చర్యలు తీసుకుంటామని, వ్యవసాయ, సాగునీరు, విద్యుత్ రంగాల్లో అధునాతన పద్దతులను తీసుకువస్తామని చెప్పారు. జోగిపేటలో చెరుకు రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, నిజాం షుగర్ ప్యాక్టరీని స్వాధీనం చేసుకుని ఇక్కడ రైతులు చెరుకు పండించేలా ప్రోత్సహిస్తామన్నారు. అంగన్‌వాడీ, గ్రామ కార్యదర్శి, రేషన్‌డీలర్, ఆశ వర్కర్, ఆదర్శరైతు ఇలా గ్రామాభివృద్ధి కోసం పాటుపడుతున్న అందరిని ఓ కమిటీగా ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యవస్థను పటిష్టం చేయనున్నామన్నారు. త్వరలో టీఆర్‌ఎస్ ఎన్నికల మెనిపెస్టోను విడుదల చేయనున్నామని, అందులో అన్ని అంశాలను పొందుపరిచామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మరో 14 కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయని అందులో భాగంగా మెదక్ జిల్లాలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట పేరిట మూడు జిల్లాలుగా ఆవిర్భవించనున్నదని కేసీఆర్ వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో లక్షలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.
టీఆర్‌ఎస్‌లోకి కరణం సతీమణి.. కాగా కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి కరణం రామచందర్‌రావు సతీమణి, మెదక్ మాజీ ఎమ్మెల్యే కరణం ఉమాదేవి కుటుంబ సభ్యులతో సహా టీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే నిజామాబాద్ జిల్లాకు చెందిన సామాజిక సేవకుడు బీబీ పాటిల్, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ జైపాల్‌రెడ్డి, జహీరాబాద్ వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాణిక్యరావు, టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జైపాల్‌నాయక్ తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీష్‌రావు, ఏనుగు రవిందర్‌రెడ్డి, ఆకుల రాజేందర్, హనుమంత్ షిండే, గంపగోవర్దన్, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహ్మద్‌అలీ, మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, రామలింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా ఇన్‌చార్జ్ రాజయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌లో సమరోత్సాహం మెదక్ జిల్లా జోగిపేటలో మంగళవారం టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన సభ విజయవంతం కావడంతో నేతల్లో సమరోత్సాహం కదలాడుతోంది. నాలుగో తేదీన పార్టీ అభ్యర్థులను ప్రకటించబోతున్న నేపథ్యంలో సభ సక్సెస్ నేతల్లో ఆనందాన్ని నింపింది. మెదక్ జిల్లాలో బలమైన పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్ ఇతర నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌కు సవాల్‌గా మారింది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్సే బలమైన పార్టీ. సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్, పటాన్‌చెరు స్థానాల్లో కాంగ్రెస్‌తో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో ఉంది. కాంగ్రెస్‌కు గట్టి పట్టున్న స్థానాల పరిధిలోనే బహిరంగ సభ సక్సెస్ కావడం పార్టీ నేతల్లో విశ్వాసాన్ని నింపింది.