Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ధూంధాంగా ఉత్సవాలు

-జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ ద్వితీయ వార్షికోత్సవాలను వైభవంగా జరపాలి: సీఎం కేసీఆర్ -రాష్ట్రమంతటా బ్యానర్లు, హోర్డింగులు -విశిష్ట వ్యక్తులకు పురస్కారాల ప్రదానం -అమరుల కుటుంబాలకు సన్మానం -అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం -ఉత్సవాల నిర్వహణకు మంత్రి నాయిని చైర్మన్‌గా క్యాబినెట్ సబ్‌కమిటీ

CM-KCR-review-meet-on-Telangana-Formation-day

రాష్ట్ర ఆవిర్భావ ద్వితీయ వార్షికోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ సహా రాష్ట్రమంతటా జూన్ 2న పండుగ వాతావరణం కనిపించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, పాఠశాలలు, హాస్పిటళ్లను అందంగా అలంకరించాలని సూచించారు. వివిధ రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తులను సత్కరించాలని, అమరవీరుల కుటుంబాలను సన్మానించాలని ఆదేశించారు.

ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహించేందుకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చైర్మన్‌గా క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేశారు. ఉత్సవాల ఏర్పాట్లపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో అధికారులు స్మితాసబర్వాల్, రాజశేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, సీఎం ఓఎస్‌డీ దేశపతిశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై చర్చించేందుకు బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ నాయిని నర్సింహారెడ్డి, సభ్యులు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్, పురపాలక, పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఇతర అధికారులు పాల్గొంటారు.

ఇవీ సీఎం కేసీఆర్ సూచనలు.. -జూన్ 2వ తేదీన రాష్ట్రమంతా పండుగ వాతావరణం కల్పించాలి. అన్ని నగరాలు, జిల్లా కేంద్రాల్లో వీధులు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలను అలంకరించాలి. పరిశ్రమలు, వైద్యశాలలు, హోటళ్లు, మాల్‌లు, థియేటర్లలో రాష్ర్టావతరణ దినోత్సవాన్ని తెలుపుతూ బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటు చేయాలి. ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లను అలంకరించి, బ్యానర్లు ఏర్పాటు చేయాలి. అమరవీరుల స్తూపాలను, తెలంగాణతల్లి విగ్రహాలను అలంకరించాలి. వైద్యశాలలు, అనాథ శరణాలయాల్లో పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి మాంసాహార భోజనం అందించాలి.

– హైదరాబాద్‌లో జరిగే ప్రధాన కార్యక్రమంలో గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు; జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో జిల్లాకు చెందిన మంత్రి, కలెక్టర్, ఇతర ప్రముఖులు హాజరుకావాలి.

– జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించాలి. ఈ కార్యక్రమంలో వారికి వీఐపీ హోదా ఇచ్చి గౌరవించాలి. 1969 ఉద్యమంలో పాల్గొన్న వారిని కూడా ఈ కార్యక్రమానికి అతిథులుగా ఆహ్వానించాలి. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 50మందికి రాష్ట్ర స్థాయిలో, 25 మందికి జిల్లా స్థాయిలో జీవిత సాఫల్య పురస్కారాలు, అవార్డులు అందచేయాలి.

– రాష్ట్ర ఆవిర్భావం ఇతివృత్తంగా జిల్లా, డివిజన్, నియోజకవర్గ కేంద్రాల్లో తెలుగు, ఉర్దూ భాషల్లో కవి సమ్మేళనాలు నిర్వహించాలి. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలి. అన్ని మతాల ప్రార్థనాస్థలాల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలి. -ట్యాంక్‌బండ్‌పై జూన్ 2వ తేదీ రాత్రి పెద్ద ఎత్తున పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించాలి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.