
-తెలంగాణ సమాజంలో ఏకీకరణ జరుగుతున్నది -చేరికలతో నిత్యకల్యాణం, పచ్చతోరణంలా తెలంగాణభవన్: కేటీఆర్ -పార్టీలో చేరిన అనిల్‌జాదవ్, నకిరేకల్, తుంగతుర్తి నాయకులు -సీఎం కేసీఆర్, కేటీఆర్‌తో కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ భేటీ -త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటన -జైకిసాన్ వారికి ఒక నినాదం.. టీఆర్‌ఎస్‌కు ఒక విధానం -సంక్షోభంలో కాంగ్రెస్.. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న పార్టీ -ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి -ఢిల్లీ గులాంలు కావాలా? తెలంగాణ గులాబీ కావాలా? -టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు -మోదీ, రాహుల్‌కు పదవుల యావ -మోదీ వేడి తగ్గింది.. కాంగ్రెస్ గాడి తప్పింది
దేశంలోని సమస్యల శాశ్వత పరిష్కారానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆలోచనచేస్తుంటే.. ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాత్రం పదవుల గురించి ఆలోచిస్తున్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. కేసీఆర్ ఆలోచనలే దేశానికి ఆచరణగా మారాయని చెప్పారు. మోదీ వేడి తగ్గిందని, కాంగ్రెస్ గాడి తప్పిందని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో ఒకవేళ కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ ప్రయోజనాలకు, బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్రమోదీ ప్రయోజనాలకు పనిచేస్తారన్న కేటీఆర్.. టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ ప్రయోజనాలకోసమే పనిచేస్తారని చెప్పారు. బుధవారం తెలంగాణభవన్‌లో బోథ్ నియోజకవర్గానికి చెందిన అనిల్‌జాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే కుమారుడు చిరుమర్తి మనోజ్‌కుమార్, తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సహా వివిధ పార్టీలకు చెందిన నాయకులు కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
వారికి కేటీఆర్ గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు సీఎం కేసీఆర్‌తో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కొల్లాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఒక ప్రకటన విడుదలచేస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై నమ్మకం, విశ్వాసం, నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కోశాధికారి జూపల్లి భాస్కర్‌రావు కేటీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణభవన్‌లో చేరికల సందర్భంగా జరిగిన సభల్లో కేటీఆర్ మాట్లాడుతూ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలుకావాలంటే గులాబీ సైనికులు పార్లమెంట్‌లో ఉండాలన్నారు. ఎర్రకోట మీద జాతీయజెండా ఎవరు ఎగురవేయాలనేది తెలంగాణ నిర్ణయించేలా తీర్పు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రజలను కేటీఆర్ కోరారు.
మోదీ గ్రాఫ్ పడిపోయింది.. ప్రతిరోజు చేరికలతో తెలంగాణభవన్ నిత్యకల్యాణం పచ్చతోరణంలా ఉన్నదని కేటీఆర్ అభివర్ణించారు. ప్రస్తుతం 14 మంది టీఆర్‌ఎస్ ఎంపీలున్నా.. కేంద్రంలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉండటంతో మన అవసరం పడలేదని, కానీ ప్రస్తుతం మోదీపై ప్రజలకు భ్రమలు తొలిగిపోయాయని, ఆయన గ్రాఫ్ పడిపోయిందని చెప్పారు. ఈసారి ఎన్డీయేకు 160కి మించి సీట్లు వచ్చే పరిస్థితి లేదని, అటు యూపీఏకు కూడా 100-110 సీట్లు మించి రావన్నారు. కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్‌గాంధీ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్.. రాహుల్ ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో అంటారు అని ఎద్దేవాచేశారు.

ఢిల్లీ గులాంలు కావాల్నా? తెలంగాణ గులాబీలు కావాల్నా? ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రెండు సీట్లతో తెలంగాణ సాధించిన కేసీఆర్ చేతిలో 16 సీట్లు పెడితే మన రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చని చెప్పారు. టీఆర్‌ఎస్ గెలిచే 16మంది ఎంపీలే కాకుండా.. కేసీఆర్ వ్యూహం, చాతుర్యంతో నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీలు, బీజేడీ, వైసీపీ ఉ న్నాయన్నారు. వాళ్లంతా మనతో కలిసి రావటానికి సుముఖంగా ఉన్నారన్నారు. 16కు మరో 116 తోడవుతాయని, అప్పుడు కేంద్రం జుట్టు మనచేతిలో ఉంటే రాష్ట్రానికి కావాల్సినవి ఉరుక్కుంటూ రావా? అని ప్రశ్నించారు.
సంక్షోభంలో కాంగ్రెస్.. రాష్ట్రంలో కాంగ్రెస్ సంక్షోభంలో ఉన్నదని, ఆ పార్టీ ఖాళీ అవుతున్నదని కేటీఆర్ అన్నారు. ఆ పార్టీ నాయకత్వంపై నమ్మకం, విశ్వాసం లేక ఎమ్మెల్యేలు సహా ఇతర నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతుంటే కొందరు ఆక్రోశంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలే కాకుండా పీ కార్తీక్‌రెడ్డి, ఆరెపల్లి మోహన్, క్రిశాంక్, అనిల్‌జాదవ్.. ఇలా వేలమంది అన్ని స్థాయిలవారు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారనే విషయాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తించాలన్నారు. ఓడిపోయినవాళ్లకే కాంగ్రెస్‌పార్టీ ఎంపీ టిక్కెట్లు ఇచ్చిందన్న కేటీఆర్.. రెండునెలల క్రితమే ఓడించిన నాయకులను ప్రజలు ఇప్పుడు ఎలా గెలిపిస్తారనుకుంటున్నారని ప్రశ్నించారు. ఒక దగ్గర చెల్లని నోటు మరో దగ్గర ఎలా చెల్లుతుందన్నారు.

జై కిసాన్ వారికి నినాదం.. మాకు విధానం దేశాన్ని స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి పాలించిన పార్టీలకు జై కిసాన్ అనేది నినాదమని, కానీ టీఆర్‌ఎస్‌కు అది ఒక విధానమని కేటీఆర్ స్పష్టంచేశారు. దీనిలో భాగంగానే రైతుబంధు, రైతుబీమాలను కేసీఆర్ తీసుకొచ్చారని, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఏనాడైనా కాంగ్రెస్, బీజేపీలకు అలాంటి ఆలోచన వచ్చిందా? అని ప్రశ్నించారు. రైతుబంధు పథకం కింద వచ్చే మే నుంచి ఎకరానికి రూ.10వేలు చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు చెప్పారు. పొద్దున లేస్తే కేసీఆర్‌ను తిట్టే చంద్రబాబుకూడా రైతుబంధు పథకాన్ని పేరు మార్చి ఏపీలో అన్నదాత సుఖీభవగా అమలుచేస్తున్నారని చెప్పారు. ప్రధాని మోదీకి ఎన్నికలు దగ్గరకు వచ్చేటప్పటికి రైతులు గుర్తొచ్చారని, అందుకే రైతుబంధు పథకాన్ని పేరు మార్చి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రవేశపెట్టారన్నారు. నకిరేకల్ నియోజకవర్గం పరిధిలో డ్రైపోర్టు ఏర్పాటుకు కృషిచేస్తున్నామన్న కేటీఆర్.. కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తే ఉదయసముద్రం, బ్రాహ్మణవెల్లం ప్రాజెక్టులకు నిధులు తెచ్చుకోవచ్చన్నారు.

కాంగ్రెస్‌లో జోష్ లేదు.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 71 ఏండ్లు గడిచినా అనేక గ్రామాలకు రోడ్లు, తాగు, సాగునీరు, కరంటు లేవని కేటీఆర్ చెప్పారు. మా తండాలో మా రాజ్యం కావాలని ఆదివాసీలు అనేక సంవత్సరాలుగా డిమాండ్‌చేస్తున్నా కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదని, కానీ.. తెలంగాణ ఏర్పడగానే తండాలను, గూడేలను పంచాయతీలుగా మార్చిందని తెలిపారు. కాంగ్రెస్‌లో జోష్ లేదు.. బీజేపీలో హోష్ లేదన్నారు. రాబోయే 15 రోజులు కష్టపడి భారీ మెజార్టీలతో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ కార్యకర్తలు కేటీఆర్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ఖాళీ: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ఖాళీ అవుతున్నదని రాష్ట్ర అటవీ, దేవాదాయ, న్యాయ శాఖ మం త్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏనాడూ నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. తాను ఎంపీగా ఐదేండ్లలో ఏం చేసిందీ జాబితా ప్రకటిస్తానన్న బూర.. ఐదేండ్లలో ఎంపీగా రాజగోపాల్‌రెడ్డి ఏంచేశారో చెప్పాలని సవాలు విసిరారు. ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ మాట్లాడుతూ అనిల్‌జాదవ్ చేరికతో బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మొత్తం ఖాళీ అయిందన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎంపీ లింగయ్యయాదవ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగురామన్న, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, బోథ్ ఎమ్మెల్యే సోయం బాపూరావు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శంభయ్య, డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, టాంకాం చైర్మన్ రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గడ్డం అరవింద్‌రెడ్డి, వేముల వీరేశం, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గానికి చెందిన అనిల్‌జాదవ్, పీసీసీ అధికార ప్రతినిధి గోసుల శ్రీనివాస్‌యాదవ్, కోటేశ్వర్‌రావు, చింతల సోమయ్య, మామిడి సర్వయ్య, పీ సారయ్య, కృష్ణమూర్తి, సదానంద్, సంజీవరెడ్డి, శ్రీధర్‌రెడ్డితోపాటు పెద్ద సంఖ్యలో సర్పంచ్‌లు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వివిధస్థాయిల కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు.

కాంగ్రెస్‌కు బీరం గుడ్ బై -ఎమ్మెల్సీ కూచకుళ్లతో కలిసి సీఎంతో చర్చలు -టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ -నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లోకి -ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విశ్వాసం ఉన్నది -అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా -మీడియాకు విడుదల చేసిన లేఖలో బీరం
కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతున్నది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామాచేసి, టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. ఉమ్మ డి పాలమూరు జిల్లాలో ఆయన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే కావటం విశేషం. సీఎం కేసీఆర్‌పై విశ్వాసం, నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు బీరం తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌తో బీరం భేటీ అయ్యారు. అనంతరం ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి వెంటరాగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. త్వరలో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు బీరం ముహూర్తం నిర్ణయించుకున్నట్టు సమాచారం. హైకోర్టు న్యాయవాదిగా ఉన్న బీరం 2014 ఎన్నికల్లో తొలిసారిగా కొల్లాపూర్‌లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఇటీవలి ఎన్నికల్లో రెండోసారి పోటీచేయగా ప్రజలు ఆశీర్వదించారు. కేటీఆర్, కేసీఆర్‌తో భేటీ అనతరం హర్షవర్ధన్‌రెడ్డి మీడియాకు ఒక ప్రకటన విడుదలచేస్తూ.. కొల్లాపూర్ సెగ్మె ంట్ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తేగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.
శ్రీశైలం ముం పు బాధితులకు ఉద్యోగవకాశాలు కల్పించడం, సోమశిల-సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మా ణం, పాలమూరు- రంగారెడ్డి ముం పు బాధితులకు మంచి నష్టపరిహారం అందించడంపై సీఎం హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మాదాసి కురుమ కులస్థుల దీర్ఘకాల సమస్యను పరిష్కరించాలని కోరానని తెలిపారు. నియోజకవర్గ ప్రజ లు, కార్యకర్తలు, అభిమానులతో చర్చించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ద్వారా వచ్చిన ఎమ్మె ల్యే పదవికి అవసరమైతే రాజీనామా చేసి, టీఆర్‌ఎస్ తరుఫున పోటీచేసి గెలిచేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. గత ఎన్నికల్లో 88 స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించగా, ఇద్దరు ఇండిపెండెంట్ల చేరికతో బలం 90కి చేరింది. ఇప్పటివరకు కాంగ్రెస్ నుంచి 9మంది, టీడీపీ నుంచి ఒకరు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు.