Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

దేశ గతిని మార్చే ఓట్లు

-మీ ఓటు దేశ భవిష్యత్‌ను నిర్దేశించాలి: కేసీఆర్
-కాంగ్రెస్, బీజేపీ కలిసినా కేంద్రంలో ప్రభుత్వం రాదు
– ఢిల్లీ అధికారం ప్రాంతీయ పార్టీల కూటమిదే
-అందులో టీఆర్‌ఎస్‌ది నిర్ణయాత్మక పాత్ర
-అందుకే పదహారుమంది ఎంపీలను గెలిపించాలి
-తెలంగాణను చూసి దేశం నేర్చుకుంటున్నది
-దేశం దిశ మారాలంటే మనం వైతాళికులం కావాలె
-రాహుల్, మోదీ డ్రామాలు ఇంకెన్నాళ్లు?
-రెవెన్యూ యాక్ట్‌ను సమూలంగా మార్చాలి
-కలెక్షన్లే లేనప్పుడు కలెక్టర్లు ఎందుకు?
-జిల్లా పరిపాలనా అధికారి అనాలా? ఏమి అనాలో ఆలోచన చేద్దాం
-గిరిజనుల బతుకుల్లో నిజమైన వెలుతురు రావాలనే ఇన్ని జిల్లాలు
-సింగరేణి ద్వారా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ
-సీతారామతో ఖమ్మంజిల్లాలో రెండు పంటలకు నీళ్లు
-భవిష్యత్‌లో గవర్నర్లు, రాయబారులుగా టీఆర్‌ఎస్ నేతలు
-మహబూబాబాద్, ఖమ్మం ఎన్నికల సభల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

రానున్న లోక్‌సభ ఎన్నికలు దేశ భవిష్యత్తును, గతిని, గమనాన్ని నిర్దేశించనున్నాయని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. దేశవ్యాప్తంగా చాలామంది రాజకీయ నాయకులతో మాట్లాడానని, కాంగ్రెస్, బీజేపీ కలిసినా ప్రభుత్వం ఏర్పాటుచేసే పరిస్థితి ఉండబోదని అన్ని సర్వేలు చెప్తున్నాయని సీఎం పేర్కొన్నారు. ఇటువంటి దశలో ప్రాంతీయ పార్టీల కూటమి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. అందులో టీఆర్‌ఎస్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అనేక విషయాల్లో తెలంగాణను చూసి దేశం నేర్చుకుంటున్నదని, నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉన్నదని అన్నారు. ఈ రాష్ట్రంలో ఏ ఇంచైనా… ఏ బెత్తెడు జాగైనా.. తనదేనని భావిస్తానని, తెలంగాణలో ఉండే ప్రతి అంగుళం అన్ని రకాలుగా అభివృద్ధికావాలని, అన్నివర్గాల ప్రజలు సుఖంతో, సంతోషంగా ఉండాలనేది తన జీవిత లక్ష్యమని, అదే తన గమ్యం, ప్రస్థానం అని సీఎం స్పష్టంచేశారు. చైతన్యవంతులైన ఖమ్మం, మహబూబాబాద్ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమ సమయంలో తనను ఖమ్మంలో నిర్బంధించిన విషయాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. మహబూబాబాద్‌లో మాలోత్ కవితను, ఖమ్మంలో నామా నాగేశ్వర్‌రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. గురువారం మహబూబాబాద్, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికల ప్రచారసభల్లో సీఎం ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

ఎన్నాళ్లీ డ్రామాలు?
నరేంద్రమోదీ, రాహుల్‌గాంధీ ఇద్దరూ తుమ్ చోర్ హై అంటే తుమ్ చోర్ హై అనుకుంటున్నరు. ప్రజలను గోల్‌మాల్ చేయాలని చూస్తున్నరు. 66 ఏండ్లు కాంగ్రెస్, బీజేపీలే దేశాన్ని పాలించాయి. 1947లో నెహ్రూ దరిద్రో నారాయణ (దరిద్రుడే భగవంతుడు) అన్నడు. ఇందిరాగాంధీ గరీబీ హటావో అన్నది. ఆ తర్వాత రాజీవ్‌గాంధీ అదే అన్నడు. పీవీ నరసింహరావు, మన్మోహన్‌సింగ్ ఇట్లా చానామంది ప్రధానులు అన్నరు. మీ తాత, మీ నాయనమ్మ, మీ నాయన ఇప్పుడు నువ్వు ఇలా ఎన్నేండ్లు ఈ హటావో డ్రామాలు? ఈ రోజు దేశంలో దరిద్రానికి, సాగు, తాగునీటి కరువుకు, కరంటు లేని చిమ్మచీకటి ప్రాంతాలకు ఎవరు బాధ్యులు? వేరే ఇంకెవరో పరిపాలించినట్టు మళ్లీ వీళ్లే వీరంగం ఎత్తుతా ఉన్నారు. దయచేసి దానిని విశ్లేషణ చేయాలి. నేను కఠోరమైన వాస్తవాలు మనవిచేస్తున్న. దేశంలో ఉత్పత్తి అవుతున్న కరంటును వాడుకునే తెలివితేటలు కాంగ్రెస్, బీజేపీలకు లేవు. మీరు రోజూ పేపర్లలో చూస్తావున్నారు. నా మాటలు వింటావున్నారు. దీనిమీద ఏ ఒక్క నాయకుడు నోరు తెరుస్తలేడు. వ్యవసాయ పనులను గ్రామీణ ఉపాధి హామీ పనులకు అనుసంధానం చేయాలని ఆనాడు మన్మోహన్‌సింగ్‌కు చెప్పినం. వందలసార్లు మోదీకి చెప్పిన. అయినా వినలే. పెడచెవిన పెట్టేవాళ్ల చెంపలు వాచిపోయేలా ఛెళ్లుమనిపించాలి.

ప్రాంతీయ పార్టీలదే గెలుపు
ఈ రోజు తెలంగాణ బిడ్డగా, ఈ జాతిని చైతన్యం చేసే బాధ్యత మనమీద ఉన్నది కాబట్టి నేను ఫెడరల్‌ఫ్రంట్‌ను ప్రస్తావిస్తున్న. ఆషామాషీగా చెప్పడంలేదు. దేశవ్యాప్తంగా చాలామంది రాజకీయ నాయకులతో మాట్లా డి ఉన్నాను. ఈ రెండు పార్టీలు కలిస్తే కూడా వాళ్లకు మెజార్టీ వచ్చే పరిస్థితి లేవని అన్ని సర్వేలు చెప్తున్నయి. బీజేపీకి 130, 140 సీట్ల కన్నా ఎక్కువరావు. ఎన్డీయే కూటమి 160, 170 సీట్లు దాటే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌కు వందకు అటుఇటు వస్తావున్నయి. ప్రాంతీయ పార్టీలే 250, 260 సీట్లు గెలిచే పరిస్థితులు ఈ దేశంలో నెలకొని ఉన్నయి. మళ్లీ కాంగ్రెస్, బీజేపీ గెలిస్తే ఇదే వ్యవహారం ఉంటది తప్ప గుణాత్మకమైన మార్పురాదు. గుణాత్మక మార్పు రావాలంటే కచ్చితంగా బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి అధికారంలోకి రావాలి. అందుకు అవకాశాలు ముమ్మరంగా ఉన్నయి. కేంద్రంలో ఫెడరల్‌ఫ్రంట్ రావాలి. రాష్ర్టాల అధికారాలు రాష్ర్టాలకు దక్కాలి. రాష్ర్టాల హక్కులు చెల్లుబాటుకావాలి.

అలా రావాలంటే టీఆర్‌ఎస్ 16 స్థానాలు గెలువాలి. ఇదే మోదీ ఎంత ఈజీగా ఎంత అలవోకగా అబద్ధాలు మాట్లాడుతారంటే.. పాతాళలోకంలో ఉన్నా సరే, ఏ దేశంలో ఉన్నాసరే నల్లడబ్బు తెచ్చి, ఇంటికి 15 లక్షలు ఇస్తామన్నరు. ఇచ్చినారండీ? ఇవ్వలేదు. ఇవ్వకపోగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను మీడియా అడిగితే.. ఓ చునావీ జుమ్లా థా! ఏదో ఎన్నికల్లో ఉబుసుపోక చెప్తాం. చెప్పినవన్నీ చేస్తమా? అని మాట్లాడుతడు. ఇంత అహంకారమా? ప్రజల మీద ఇంత నిర్లక్ష్యమా? గతంలో చాయ్‌వాలా! ఇప్పుడు చౌకీదార్! క్రియాశూన్యమైన నినాదాలతోని, ఒక విశేషమైనటువంటి ప్రచారహోరుతోని.. ఆహోరులో దేశాన్ని తీసుకపోతరు తప్ప వీళ్ల ఎజెండా వేరే ఉంటది. వీళ్లు ప్రజలకోసం ఏమీచేయరు. నేను మీ అందర్నీ ప్రార్థించేది ఒక్కటే. దయచేసి ఈ దేశం గతి, గమనం, దశ, దిశ మారాలంటే తప్పకుండా తెలంగాణ నుంచి మనం వైతాళికులుగా మారాలె. ఇక్కడ నుంచి మన ప్రభంజనం మొత్తం దేశానికే ఒక దిశ తిప్పే విధంగా ముందుకు పోవాలె. మీ బిడ్డగా ఆ పాత్ర నేను సంపూర్ణంగా పోషిస్త. ఈ ఇద్దరి పరిపాలనలోనే ఈరోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మన ముందర ఉన్నవి. వీటికి నిష్కృతి రావాలంటే ఆ ఇద్దరు లేని పరిపాలన రావాలె. అందుకు ఇప్పడు అవకాశాలు పుష్కలంగా ఉన్నవి. అందుకు మార్గం వేసే పరిస్థితి మనకి కావాలె.

మే నుంచి ఆసరా పెంపు
తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీలో కేసీఆర్.. తెలంగాణ వస్తే ఏం చేస్తవయా? అన్న ఎంపీలు.. ఇప్పుడు ఆశ్చర్యపోతున్నరు. తెలంగాణ ఇవ్వాళ అనేక విషయాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇంకా అనేకం ఇక్కడే నుంచే జరుగబోతున్నయి. పేదలు, ముసలివాళ్లు, ఒంటరి మహిళలు కడుపునిండా రెండుపూటలు అన్నం తినాలి. బిర్యానీ అక్కర్లేదు. పప్పో, పచ్చి పులుసో వేసుకొని తినాలి. ఇప్పటికే నెలకు వెయ్యి రూపాయలు పింఛన్లు అందుతున్నయి. వికలాంగులకు 1500 వస్తున్నయి. వచ్చే మే నెల నుంచి రెట్టింపు అవుతయి. ఒంటరి మహిళలు, బోదకాలు బాధితుల గురించి ఇప్పటివరకు ఎవరూ ఆలోచన చేయలేదు. పేదవాళ్లందరికీ ఆసరా కావాలి. అదే నా తపన.

పంట కాలనీలతో గిట్టుబాటు ధర
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర పెద్ద సమస్యగా మారింది. దీనికి పరిష్కారం ఉంది. ఏ ప్రాంతంలో, ఏ భూమిలో, ఏ పంట వేయాలి అనేది ముఖ్యం. ఏదిపడితే అదివేసి రైతులు ఇబ్బందులు పడొద్దు. భూముల స్వరూపాన్నిబట్టి పంటలు వేసుకోవాలి. రైతు సమన్వయ సమితులు నిర్ణీత పంటలు వేసుకోవాలని సూచిస్తయి. మార్కెట్‌లోకి వెళ్లి పరేషాన్ కావద్దు. నియోజకవర్గానికో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టబోతున్నం. రైతులు పండించిన పంటకు సరైన ధర వచ్చే మార్గాలను వెతుకుతున్నం.

ఆషామాషీగా జిల్లాలను చేసుకోలే
జిల్లాలను ఆషామాషీగా ఏర్పాటుచేసుకోలే. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ ఇంత చిన్న ఏరియాలో ఏర్పాటుచేసుకున్నం. డైలాగులు, డంబాచారాల కోసం జిల్లాలను ఏర్పాటు చేసుకోలే. గిరిజన బతుకుల్లో ఫోకస్‌గా పని జరుగాలి. గిరిజనులు ఎక్కువ ఉండే కేంద్రీకృతమైన ప్రాంతం. వీళ్ల బతుకుల్లో నిజమైన వెలుతురు రావాలనే ఇన్ని జిల్లాలు ఏర్పాటుచేసుకున్నం.

మహబూబాబాద్‌కు మెడికల్ కళాశాల
గిరిజన బతుకుల్లో వెలుగులు నింపాలనేది నా ధ్యేయం. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో గిరిజన జనాభా ఎక్కువ. తప్పకుండా ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజీ పెట్టిస్తం. ఈ ప్రాంత పరిస్థితులు పూర్తిగా నాకు తెలుసు. తాగు, సాగునీరు సమస్య పరిష్కారం కాబోతున్నది. మానుకోట పోరాటాల గడ్డ. ఇక్కడి ప్రజలకు చైతన్యం ఎక్కువ. ఉద్యమ సమయంలో మీరు చూపిన చొరవ అంతాఇంతాకాదు. ఇలాంటి ప్రాంతాన్ని జిల్లా చేసుకున్నం. ఇటీవల ములుగును జిల్లా చేయాలంటే చేశాం. పాలన సౌలభ్యం కోసం ఇన్ని జిల్లాలు చేసుకున్నం. ఈ ప్రాంతంలో ఒకటో, రెండో మండలాలు చేయాలనే డిమాండ్ ఉన్నది. తప్పకుండా చేసుకుందం. బయ్యారం ఉక్కు ప్యాక్టరీని కూడా కచ్చితంగా ఈ టర్ములో సాధించుకుందం. ఈ ప్రాంతంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అవసరమైతే మన సింగరేణికి అప్పగించి స్టేట్ సెక్టారులో మనమే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించుకుందం.

సీతారామతో రెండు పంటలకు నీళ్లు
సీతారామ ప్రాజెక్టు కోసంగా రూ.13వేల కోట్లు లోన్ తీసుకున్నాం. అన్ని అనుమతులు సాధించినాం. ఒక్కసారి దుమ్ముగూడెం దగ్గర సీతారామ లిఫ్ట్ స్విచ్ ఆన్ అయితే ఖమ్మం జిల్లాలో రెండు పంటలకు నీరుపారించే బాధ్యత నాది. ఆంధ్రలో ఎట్లయితే పట్టిసీమ పెట్టుకుని కృష్ణాడెల్టా సమస్య తీర్చుకున్నారో.. మనం కూడా నాగార్జునసాగర్‌కెల్లి చూడకుండా సీతారామ లిఫ్ట్ ద్వారానే ఎన్‌ఎస్పీ ఆయకట్టును కంప్లీటుగా పారించుకుందం. గోదావరి మనల్ని ఒర్సుకుంటూ పారతది. కాబట్టి సంపూర్ణంగా రెండు పంటలను కడుపునిండా పండించుకునే విధంగా, ఆసక్తి ఉన్నవాళ్లు మూడోపంట కూడా వేసుకునే విధంగా ఏడాదిన్నరలోనే సాకారం చేస్త.

ఖమ్మం జిల్లాను అగ్రభాగాన నిలుపుత
ఖమ్మం జిల్లాను అన్నిరంగాల్లో అగ్రభాగాన తీసుకుపోయే బాధ్యత నాది. ఈరోజు ఖమ్మం నగరంలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం మొదలుపెట్టినం. ఇంకా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. తుమ్మల నాగేశ్వరరావు ఆర్‌అండ్‌బీ మంత్రిగా ఉన్నప్పుడు నగరంలో రహదారుల అభివృద్ధి జరిగింది. లకారం చెరువు పనులుచేసినం. నగరంలో మరిన్ని కార్యక్రమాలు జరిగినవి. ఇంకా మరిన్ని ప్రత్యేక నిధులు మంజూరుచేసి, ఖమ్మం పట్టణాన్ని అభివృద్ధిచేస్త. కాల్వకట్టలపై ఉన్న పేదలకు కొన్నివేల డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్త. సొంత జాగలు ఉంటే వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లకు డబ్బులు మంజూరు చేస్త. ఇక్కడ అద్భుతమైన గ్రానైట్ ఇండస్ట్రీ ఉంది. అది ఎగుడుదిగుడుతో జరుగుతా ఉంది. దానిని కూడా బాగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలు చేసుకుందాం. నర్సరీ రైతులకు ఉచిత కరంటుపై ఎన్నికల తరువాత ఉత్తర్వులు ఇస్తం.

మనలా రైతులను ఎవరూ పట్టించుకోలేదు
మనలాగా రైతుల్ని ఎవరూ పట్టించుకోలేదు. వ్యవసాయరంగాన్ని నిర్వీర్యంచేశారు. అన్నం పెట్టే రైతును పట్టించుకున్న పాపానపోలేదు. రైతుల సమస్యల పరిష్కారానికి మానవీయకోణంలో ఆలోచించాను. ఆచరించాను. నేను కాపోన్నే కాబట్టి తెలంగాణ రైతుల పరిస్థితి బాగాలేదని గ్రహించి, రైతుబంధు, రైతుబీమా తెచ్చినం. 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నం. కేసీఆర్ మాట మీద నిలబడుతడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు లక్షల రుణాలు మాఫీచేస్తమంటే ప్రజలు నమ్మలేదు. నేను లక్ష రూపాయలే మాఫీచేస్తనని చెప్పిన. టీఆర్‌ఎస్‌ను, రైతుబిడ్డగా మీ కేసీఆర్‌ను నమ్మిండ్లు. మే నెల నుంచి మూడు నాలుగు విడుతల్లో రుణమాఫీ చేసి తీరుతం.

భవిష్యత్తులో గవర్నర్లు, రాయబారులుగా టీఆర్‌ఎస్ నాయకులు
రాజకీయంగా చిన్నచిన్న పొరపొచ్చాలు ఉన్నా.. టీఆర్‌ఎస్ నాయకత్వం అంతా శషభిషలు లేకుండా ఒక్కటికావాలి. ప్రధానంగా ఎంపీ శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సూచిస్తున్న. ఇవ్వాల దేశ ప్రజలు మనకు ముఖ్యం. మనం చిన్నచిన్న విభేదాలు ఉన్నప్పటికీ అవన్నీ వదిలేసి ఇవ్వాల దేశం కోసం పనిచేయాలి కాబట్టి కచ్చితంగా ముందుకు పోవాలె. శ్రీనివాసరెడ్డి నా కుటుంబసభ్యుడులాంటి వ్యక్తి. ఆయనకు అద్భుతమైన రాజకీయ భవిష్యత్తు ఉంటది. ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవకాశాలు వస్త్తయో, ఎవరికి అదృష్టం ఎలా ఉంటుందో ఎవరికీ తెలవదు. 2001లో ఉద్యమ సహచరులకు నేను ఒక్కటే చెప్పేవాడిని. మీరు భయపడవద్దు. టీఆర్‌ఎస్ చాలా పెద్దపార్టీ అవుతుంది. ఈ పార్టీవాళ్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, గవర్నర్లు, రాయబారులు అవుతరు అని చెప్పిన. ఇప్పుడు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులదాక వచ్చినం. గవర్నర్లు, రాయబారులు కాలే. ఈసారి మీ దయతో ఆ పదవులు కూడా టీఆర్‌ఎస్ అధిష్ఠించబోతున్నది. అందులో తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సేవలు తప్పకుండా వాడుకుందాం. అనేక సమీకరణాలు, ఆలోచనల తర్వాతనే అందరి ఇష్టంమేరకు నామా నాగేశ్వరరావును ఎంపీ అభ్యర్థిగా సబబుగా ఉంటరని ప్రకటించాం. నాయకులు ఎలాంటి శషభిషలు లేకుండా నామాను పెద్ద మెజార్టీతో గెలిపించాలి. తుమ్మల, పొంగులేటి కాలికి బలపం కట్టుకుని పనిచేసి నామాను గెలిపించాలి. మీ స్థానం ఇప్పటికే నా హృదయంలో ఉన్నది. మీ రాజకీయ స్థానం భద్రంగా ఉంటుంది. మీరు శంకించాల్సిన పనిలేదు.

రెవెన్యూ యాక్ట్‌ను సమూలంగా మార్చాలి
ఇప్పుడున్న రెవెన్యూ చట్టం బ్రిటిష్‌కాలంనాటిది. ఆనాడు భూమి శిస్తు వసూళ్లకోసమే అది ఉండేది. కాని పరిస్థితులు మారినాయి. శిస్తే లేనప్పుడు వసూళ్లు ఎక్కడివి? ఇప్పుడున్న చట్టాన్ని సమూలంగా మార్పుచేయాలి. విప్లవాత్మక మార్పు రాబోతున్నది. కన్‌క్లూజివ్ టైటిల్ (పూర్తి యాజమాన్య భూమి హక్కు) ఇవ్వాలి. ఏ ఒక్క రైతుకు గుంటభూమి పోవడానికి వీలులేదు. ఈ చట్టం కఠినంగా ఉండబోతున్నది. అవసరమైతే వెయ్యి నుంచి రెండు వేల కోట్లు ఖర్చు చేసి అధునాతన జీపీఎస్ సిస్టం తెచ్చి భూ సంబంధ సమస్యలు లేకుండా గట్టి చర్యలు తీసుకుంటాం. వీన్ని వాన్ని ఎవన్నీ నమ్మా! నేనే వస్త. ప్రతి జిల్లాకు వచ్చి రెండుమూడ్రోజులుండి అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా ప్రజాదర్బార్ నిర్వహిస్త. చీఫ్ సెక్రటరీ నుంచి మొత్తం పరిపాలన వ్యవస్థను తెచ్చి సమస్య శాశ్వత పరిష్కారం అయ్యేలా చూస్త. రెవెన్యూ డిపార్టుమెంట్‌ను పూర్తిగా మార్చబోతున్నం. కలక్షన్లే లేనప్పుడు కలెక్టర్లు ఎందుకు? ఈ వ్యవస్థను మార్చాలి. జిల్లా పరిపాలనా అధికారి అనాలా? ఏమి అనాలో ఆలోచన చేద్దం. ప్రభుత్వమే రైతులకు రైతుబంధు ద్వారా ఎకరానికి ఐదువేలు ఇస్తున్నది.

రుణమాఫీ చేస్తున్నది. అటువంటప్పుడు ఈ శిస్తులెందుకు? ఈ కలెక్షన్లు ఎందుకు? అందుకే రెవెన్యూ డిపార్టుమెంట్‌ను సమూలంగా మార్పులు చేయాలె. అప్పులు కట్టగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నాలుగు పైసలుండాలి. గిరిజన రైతులు, పేద రైతులు, పెద్ద రైతులు అనేది కాకుండా అందరు రైతుల సమస్యలు పరిష్కరించాలి. రైతులు సుఖంగా ఉండాలి. అందుకోసమే రైతు కేంద్రంగా ఆలోచన జరుగాలి. పోడు భూముల సమస్యను పరిష్కరించుకుంటం. గిరిజనులను పట్టిపీడించే సమస్యలు అనేకం దూరంకావాలి. తాగునీరు, సాగునీరు సమస్య సంపూర్ణంగా పోవాలి. మిషన్‌భగీరథ ద్వారా తాగునీటి సమస్య పరిష్కారం అవుతున్నది. ఇప్పటికే 98% పనులు పూర్తయినాయి. సాగునీటి సమస్య ఎస్సారెస్పీ, కాళేశ్వరం ద్వారా పరిష్కారం అవుతుంది.

మూడు లక్షల మెజార్టీతో గెలిపించాలి
మహబూబాబాద్ పార్లమెంట్ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ కవితను మూడు లక్షల మెజార్టీతో గెలిపించాలి. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో పోడు సమస్య ఉంది. ఈ సమస్యను సీఎం కేసీఆర్ దగ్గరుండి పరిష్కారిస్తారు. వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం చేసే విధంగా కేంద్రంపై పోరాటం చేస్తాం. ఈ ప్రాంతంలో వైద్య రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. త్వరలోనే మెడికల్ కళాశాల ఈ ప్రాంతానికి రానుంది. ప్రజల కోసం పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి.
– ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి

సీఎం కేసీఆర్ రాజకీయ జన్మనిచ్చారు
జన్మనిచ్చిన తండ్రి ఎమ్మెల్యే రెడ్యానాయక్ అయితే.. సీఎం కేసీఆర్ నాకు రాజకీయ జన్మనిచ్చారు. మీ ఆడబిడ్డను ఆశీర్వదించండి. సమస్యలపై పార్లమెంటులో పోరాటం చేస్తా. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం కొట్లాడుతా.. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో పోడు భూముల సమస్యను సీఎం కేసీఆర్ పరిష్కారిస్తారు. మేడారం జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు తెచ్చేందుకు పోరాడుతా. భద్రాచలం రాములవారి దేవస్థానం వరకు రైల్వేస్టేషన్ కోసం పోరాడుతా. -మాలోత్ కవిత, టీఆర్‌ఎస్, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి

ఆశీర్వదించి పార్లమెంటుకు పంపండి..
ఐదేండ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రత్యక్షంగా చూశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టనన్ని పథకాలు సీఎం కేసీఆర్‌చేపట్టారు. ఖమ్మం జిల్లా వాసిగా, తెలంగాణ బిడ్డగా, రైతు కుటుంబంలో పుట్టిన నన్ను ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించి జిల్లా అభివృద్ధికి కృషి చేసే అవకాశం ఇవ్వండి. ప్రత్యేక రాష్ట్రం కోసం 14ఏండ్లు అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. -నామా నాగేశ్వరరావు, ఖమ్మం పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి

మళ్లీ కాంగ్రెస్, బీజేపీ గెలిస్తే ఇదే వ్యవహారం ఉంటది తప్ప.. గుణాత్మక మార్పురాదు. గుణాత్మక మార్పు రావాలంటే కచ్చితంగా బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి అధికారంలోకి రావాలి. అం దుకు అవకాశాలు ముమ్మరంగా ఉన్నయి. కేంద్రంలో ఫెడరల్‌ఫ్రంట్ రావాలి. రాష్ర్టాల అధికారాలు రాష్ర్టాలకు దక్కాలి. రాష్ర్టాల హక్కులు చెల్లుబాటుకావాలి. అలా రావాలంటే టీఆర్‌ఎస్ 16 స్థానాలు గెలువాలి.
– సీఎం కేసీఆర్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.