Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

దేశానికి కొత్త ఎజెండా

-దేశానికి కొత్త ఎజెండా తెలంగాణ యావత్తు పిడికిలి బిగించాలె..
-దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తామని చెప్పాలె: సీఎం కేసీఆర్
-73 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రజల కనీస అవసరాలు తీరలేదు
-ఐదేండ్ల పాలనలో మోదీ అట్టర్‌ఫ్లాప్
-దేశ ప్రజలకు ఆయన చేసిందేమీలేదు
-మోదీ ఇస్తామన్న 15 లక్షలు ఏమైనయి?
-అప్పుడు చాయ్‌వాలా.. ఇప్పుడు చౌకీదార్
-నాడు గరీబీ హటావో అన్న ఇందిరాగాంధీ
-నేడు న్యాయ్ పేరుతో రాహుల్‌గాంధీ
-ప్రజలు ఈ డ్రామాలు ఇంకెన్నాళ్లు చూడాలి?
-మన పథకాలు చూసి దేశం ఆశ్చర్యపోతున్నది
-టీఆర్‌ఎస్ రాకుంటే ఈ పథకాలు వచ్చేవికావు
-మెదక్‌లో రెండున్నరేండ్లలో లక్ష్మీతాండవం
-నిమ్జ్‌తో రెండు లక్షలమందికి ఉద్యోగాలు
-జహీరాబాద్, మెదక్ ఎన్నికల సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్

దేశానికి ఒక కొత్త రాజకీయ ఎజెండా ఇద్దామని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ యావత్తు పిడికిలి బిగించి, భారతదేశ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తామని చెప్పాలన్నారు. పదహారు మంది టీఆర్‌ఎస్ ఎంపీలను గెలిపించినట్టయితే భారతదేశ గతిని, గమనాన్ని మార్చడానికి.. దేశంలో కొత్త ఎజెండా, పేదల ఎజెండా, రైతుల ఎజెండా, ప్రజల ఎజెండా.. ప్రగతికాముక భారతదేశాన్ని తయారుచేసే ఎజెండా అమలుచేసేందుకు దేవుడు తనకిచ్చిన శక్తినంతటిని ఉపయోగించి కొట్లాడుతానని ఉద్ఘాటించారు. తెలంగాణ అనుకున్న పద్ధతిలో, అన్ని రంగాల్లో బాగుపడాలని, అభివృద్ధి చెందాలని, అదే సమయంలో భారతదేశం కూడా ఇప్పుడున్న మార్గాన్ని వదిలి మంచిమార్గంలో నడవాలని అన్నారు. స్థానిక సమస్యలను పరిష్కారం చేసుకుంటూనే, తెలంగాణను బాగుపరుస్తూనే, దేశ అభ్యుదయం, అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం వహించుదామని పిలుపునిచ్చారు. బుధవారం జహీరాబాద్, మెదక్ లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభల్లో సీఎం మాట్లాడారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

దేశం బాగుపడితేనే మనకూ లాభం
మనం బాగుపడాలె. ఆర్థికంగా బాగానే ఉంది. కానీ ఇంకా బాగుపడే అవకాశం ఉన్నది. అనుకున్నస్థాయిలో దేశం కూడా బాగుపడాలె. మన రాష్ట్రం అన్నిరకాలుగా అభివృద్ధి చెందాలన్నా.. దేశంకూడా ఆర్థికంగా పటిష్ఠపడాలె. మంచి విధానాలు రావాలె. అప్పుడే మనకు కూడా లాభం. అమెరికా, చైనా, జపాన్, లండన్‌లో ఇట్ల ఉంటదట అనే స్టోరీలను ఎన్ని రోజులు వినాలె? తెలంగాణ యావత్తు పిడికిలి బిగించి, ప్రగతికాముక భారతదేశంలో మేము పాత్ర వహిస్తామని చెప్పాలె. దేశం గతి, గమనం మారాల్సిన అక్కర ఉన్నది. దానికోసం మీ బిడ్డగా అన్ని ప్రయత్నాలు చేస్త. ఈ హామీ జరుగబోయే సూచనలు కనిపిస్తున్నయి. టీఆర్‌ఎస్ 16 ఎంపీ స్థానాలు గెలుచుకునేలా ముందుకు దూసుకపోతున్నది. నిన్న ఇయ్యాల వచ్చిన రిపోర్టులు కూడా అవే చెప్తున్నయి.

కాంగ్రెస్, బీజేపీల కొట్లాటేంది?
ప్రధాని చోర్ అని రాహుల్‌గాంధీ అంటడు. రాహుల్‌ని తుమ్ బడాచోర్ అని మోదీ అంటడు. మరి ఇద్దరిలో ఎవరు చోరో.. ఎవరు కాదో మనం కన్ఫ్యూజ్ అయితా ఉన్నం. మీరందరూ ఆలోచన చేయాలె. కాంగ్రెస్, బీజేపీ కొట్లాటేంది? ఈ దేశాన్ని పాలించింది ఈ రెండు పార్టీలే కదా! ఇతరులెవరో పరిపాలించినట్టు.. ఎవరిమీదనో తప్పు ఉన్నట్టు.. వాళ్లే ఇప్పుడు బజార్లకు దిగి వీరంగమెత్తుతా ఉన్నరు. ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తా ఉన్నరు. తెనాలి రామలింగడు కథలో నీవు కొట్టినట్టు చేయి.. నేను ఏడ్చినట్టు చేస్త.. అన్నట్టు జనాల్ని గోల్‌మాల్ చేస్తున్నారు.

దేశ ప్రజల కనీస అవసరాలూ తీరలే
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 73 ఏండ్లు గడిచిపోతున్నది. ప్రజలు ఏం కోరుకుంటరు? కనీస ప్రాథమిక అవసరాలు! అందరికీ విద్య, వైద్యం అందాలె. కరంటు, నీళ్లు అందాలె. ఉండటానికి గూడు కావాలె. ఇవి కనీస అవసరాలు. ఈ దేశంలో ఇవి తీరినయా? తీరలే! కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దళితుల గోడు. మేం బాగుపడలేదు.. మమ్మల్ని అణచివేస్తున్నరు అని దళితవర్గాల బాధ. మాకు న్యాయం జరుగుతలేదని గిరిజన సోదరుల బాధ. ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు సరైన ఆదరణలేదని నిరాశతో ఉన్నరు. రైతులు కూడా నిరాశతో ఉన్నరు. దేశంలో 3.50 లక్షల మెగావాట్ల కరంటు ఉత్పత్తి అయితే దాన్ని వాడే తెలివిలేదు. సగం దేశం చీకట్లో ఉంటున్నది. 70వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నా.. ఇప్పటికి కూడా సాగు, తాగునీళ్లకు బాధపడాలి. ఏమి గ్రహచారం ఇది? ఎవరి కోసం ఈ దేశం బాధపడాలి? వీళ్ల డైలాగుల రాజ్యం ఎన్ని రోజులు నడువాలి?

ఐదేండ్లపాలనలో మోదీ అట్టర్‌ఫ్లాప్
దేశంలో రైతులకు, పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన కరంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రధాని మోదీ రాష్ట్రంలో కూడా 24 గంటల కరంటు ఇయ్యరు. ఆ సంస్కారమే లేదు. మంచి పనులను కొద్దికాలంలోనే చేసుకోగలిగినం. ఇది దేశమంతటా జరగాలె. దేశమంతటా మంచి జరగాల్నంటే మంచి ప్రభుత్వం రావాలె. మోదీ మీద ప్రజలకు చాలా ఆశలుండె. కానీ ఆయన అట్టర్‌ఫ్లాప్ అయినాడు. ఐదేండ్లు సంపూర్ణమైన మెజార్టీతోని ప్రధానిగా ఉన్నరు. ఏం జరిగింది దేశంలో? వాళ్లు వచ్చి ఉల్టా మనల్ని నిందిస్తా ఉన్నరు.

మేం తెలంగాణ ప్రజల ఏజెంట్లం
రాహుల్‌గాంధీ వస్తడు.. మోదీతోని టీఆర్‌ఎస్ కలిసున్నదంటడు. నరేంద్రమోదీ వస్తడు రాహుల్‌గాంధీతోని టీఆర్‌ఎస్ కలిసున్నదంటడు. అసలు మనం ఎవల్తోని కలిసిలేం. మన బతుకు మనం బతుకుతున్నం. మేం ప్రజలతోని కలిసున్నం. మేం తెలంగాణ ప్రజల ఏజెంట్లం. మాకు తెలంగాణ ప్రజలే బాసులు. వారి అవసరాలే మా ఎజెండా. దానికోసమే పేగులు తెగేదాకా కొట్లాడుతం తప్ప ఎవరితోనో కలిసి లోపాయికారి రాజకీయం చేయాల్సిన అవసరం టీఆర్‌ఎస్‌కులేదు.

గరీబీలు ఎన్ని దశాబ్దాలు ఉండాలె?
సిద్దిపేటలో 1974-75 ప్రాంతంలో నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో ఇందిరాగాంధీ గరీబీ హటావో అని నినాదం ఇచ్చింది. ఆమె తర్వాత రాహుల్ నాయన రాజీవ్‌గాంధీ కూడా వినిపించారు. ఆ తరువాత పీవీ నరసింహారావు ఐదేండ్లు ఏలిండు. ఆ తరువాత మన్మోహన్ పదేండ్లు ప్రధానిగా చేసిండు. ఇందిర, ఇందిర కొడుకు రాజీవ్‌గాంధీ, ఇందిర మనుమడు రాహుల్‌గాంధీ కూడా గరీబీ హటావో నినాదాన్ని చెప్తున్నరు. ఎన్ని దశాబ్దాలు గరీబోళ్లు ఉంటరు? ఎప్పటిదాకా ప్రజలు ఈ డ్రామా చూడాలె? దేశం నుంచి శాశ్వతంగా గరీబోళ్లు ఎప్పుడు పోతరు? ప్రజలు ఆలోచనచేయాలి. ఇందిరాగాంధీ గరీబీ హటావో.. రాహుల్‌గాంధీ న్యాయ్ పేరుతో గరీబీ హటావో! నాయనమ్మ దగ్గర నుంచి మనుమడి వరకు గరీబీ హటావో అంటే.. వాళ్ల ఆలోచన ఎట్ల ఉన్నది.. వాళ్లు ఎంత దరిద్రంగా ఆలోచిస్తున్నారు!

20 లక్షల కోట్లు మూలుగుతున్నయి
ఈ రెండు పార్టీలకు దేశంలో ఉన్న సంపద, వనరులు, మానవవనరులు వాడుకునే తెలివితేటలు లేవు. బాధ్యతకల సీఎంగా చెప్తున్న. ఆర్‌బీఐ, మహారత్న కంపెనీలవద్ద 20 లక్షల కోట్లు పైబడి మూలుగుతున్నయి. దేశంలో పేదరికం ఉన్నది. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బీసీ వర్గాల్లో, ఓసీ వర్గాల్లో నిరుపేదలు బాధపడుతున్నారు. కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ పెట్టరు. యూపీఏ పెట్టలే.. ఎన్టీయే పెట్టలే. అన్ని రాష్ట్రాల్లో బీసీ మంత్రిత్వశాఖలున్నయి. కేంద్రంలో ఎందుకు పెట్టరు? ప్రజలు ఏం చేస్తరులే అనే అహంకారం. ప్రతి ఎన్నికల్లో ఒక నినాదం సృష్టించాలె.. ఒక ప్రచారహోరు క్రియేట్ చేయాలే.. దానిలో క్యారీ ఫార్‌వర్డ్ కావాలె! ఇది మారాలి.

నాడు ఎట్లుండె.. నేడు ఎట్లుండె?
15 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత కష్టపడి తెలంగాణ సంపాదించుకున్నం. ఎన్నికలు రాంగనే ఆగమాగంకావద్దు. చాలా పార్టీలు వస్తయి.. చాలా విషయాలు చెప్తరు. అన్నీ సావధానంగా వినాలి. మీ ఇంటికి పోయిన తర్వాత మీ బస్తీలో, మీ ఊరిలోగానీ చర్చ చేయాలె. ఏది నిజం, ఏది జరిగితే ఈ దేశానికి.. ఈ రాష్ర్టానికి మంచిదనేది నిర్ణయం తీసుకోవాలి. ఇంకా ఎవరైనా తప్పుదారిలో ఉంటే, మంచిమార్గంలో పోదామని వాళ్లకు చెప్పండి. నిర్ణయాత్మకంగా ఓటువేస్తే ప్రజలు గెలుస్తరు. అప్పుడే దేశం బాగుపడుతది. ఐదేండ్ల ముందు తెలంగాణ ఎట్లుండే.. ఇయ్యాల ఎట్లున్నది? ఆనాడు కరంట్ సప్లయి ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లున్నది? ఆలోచన చేయాలే. టీఆర్‌ఎస్‌కంటే ముందు కూడా చాలా ప్రభుత్వాలున్నయి, చాలామంది ముఖ్యమంత్రులయిండ్రు, చాలా పార్టీలున్నయి. కానీ మనకు కరంట్ ఇయ్యలే. చాలా బాధలుపడ్డం. ఐదేండ్ల కింద ఎన్ని మోటర్లు కాలుతుండె? ఎన్ని ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోతా ఉండే? ఈరోజు ఆ సమస్య లేదు. ఒకనాడు కరంటు ఉంటే వార్త.. ఇయ్యాల కరంటు ఉండకపోతే వార్త. అంతగా సమస్యను బాగుచేసుకున్నం. మంచినీళ్ల సమస్య కూడా మిషన్‌భగీరథ ద్వారా కంప్లీట్ అయితా ఉంది. సింగూరులో నీళ్లు ఖతమైతున్నయి. ఈ సంవత్సరం జరంత ట్రబులైనా ఓర్సుకోవాలి. ఎండకాలం పోయిందంటే, మీ ఇంటికే ప్రతి వ్యక్తికి వందలీటర్ల చొప్పున దర్జాగా నీళ్లు వస్తయి. భవిష్యత్తులో ఆడబిడ్డ బిందెపట్టుకుని బజారుకు పోయే అవసరమే ఉండదు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పిల్లలకు పెట్టే సన్నబియ్యం, వృద్ధులకు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లు కావచ్చు.. ఇవన్నీ ఏ రాష్ట్రంలో ఇయ్యలే. మన దగ్గర మాత్రమే జరుగుతున్నయి.

రైతుబంధును ప్రధాని నకలు కొట్టిండు
మన రైతుబంధును చూసి ప్రధానమంత్రి కూడా పావులొంతు నకలు కొట్టిండు. వేరే రాష్ర్టాలవాళ్లు కూడా మేం చేస్తం అంటున్నరు. నేను కూడా కాపోన్నే. తెలంగాణ రైతులు పడే బాధలు, వారికి ఉన్న అప్పులు.. ఇవన్నీ నాకు తెలుసుకాబట్టి ఆర్థికవేత్తలు ఏం అన్నా సరే, కచ్చితంగా ఇంకో ఏడు, ఎనిమిది, తొమ్మిదేండ్ల వరకు నీళ్లురావాలి, ఫ్రీ కరంటు రావాలి, రైతుబంధు పెట్టుబడి సాయం రావాలి.. రైతు బీమా కొనసాగాలి. అప్పుడేమైతది? ఉన్న అప్పులు తీరిపోయి, ప్రతి రైతు దగ్గర మూడులక్షలో, ఆరు లక్షలో, పది లక్షలో బ్యాంక్ బ్యాలెన్స్ వస్తది. అది బంగారు తెలంగాణ. అది కావాలనే మనం తండ్లాడుతున్నం.

సింగూరు నీళ్లు తెచ్చుకుంటున్నం
జహీరాబాద్ నియోజకవర్గం బ్రహ్మాండమైన ఎర్రనేలలు, నల్లనేలలు ఉన్న ప్రాంతం. మంచి రైతులున్నరు. ఆలుగడ్డలు, అల్లం, చెరుకు పండిస్తరు. సింగూరు దగ్గరే ఉన్నది. కానీ ఇన్నేండ్లు ఆ నీళ్లు మనకురాలే. ఈ మధ్యనే అందోల్ నియోజకవర్గానికి 40 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చుకున్నం. సింగూరు నుంచి నీళ్లు తెచ్చుకునే పద్ధతి మొదలుపెట్టినం. ఇయ్యాల సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్.. మూడు జిల్లాలు అయినయి. 80 వేల కోట్లతో కాళేశ్వరం కడుతున్నం. అక్కడ ఎంత అంటే అంత నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నది. మీ బిడ్డగా హామీ ఇస్తున్న.. ఆరు నూరైనా సరే, ఇంకో రెండు, మూడు వేలకోట్లు ఖర్చయినా సరే.. జహీరాబాద్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు లక్షఎకరాల చొప్పున నీళ్లు అందించే బాధ్యత నాది. అదికూడా పదేండ్లకో, ఇరవై ఏండ్లకోకాదు. వచ్చే రెండేండ్లు లేదా రెండున్నరేండ్లలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాలకు కాళేశ్వరం నీళ్లు బ్రహ్మాండంగా నిజాంసాగర్‌కు తెస్తున్నం. అక్కడి నుంచి ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలకు నీళ్లు తెస్తున్నం. ధర్మారావుపేట, ఆమర్లబండ, మోతె, గుజ్జుల్, కాటేవాడి దగ్గర రిజర్వాయర్లు కట్టి లక్షల ఎకరాలకు నీళ్లిస్తం. జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు కౌలాస్‌నాలా ఉంది. లెండి కాల్వలు ఉన్నయి. కానీ కాల్వలు సరిగా లేవు. మహారాష్ట్రతో మాట్లాడినం. ఒప్పించినం.

దాన్ని కూడా కంప్లీట్ చేస్తం. అవసరమైతే లెండి మీద బ్రిడ్జి, చెక్ డ్యాం కట్టి నీళ్లు తెచ్చుకుంటాం. లెండి కాల్వను, కౌలాస్‌నాలాను బాగుచేసుకుందం. స్థానిక ఎమ్మెల్యే షిండే, ఎంపీ పాటిల్ పట్టుబట్టి నాలుగుమాసాల ముందే నాగమడుగు లిఫ్ట్ స్కీమును నాతోనే శాంక్షన్ చేయించినారు. దానిని కూడా పూర్తిచేసి జుక్కల్ నియోజకవర్గానికి సాగునీరందిస్తం. కాళేశ్వరం నీళ్లు మల్లన్నసాగర్ ప్రాజెక్టు ద్వారా మన నారాయణ్‌ఖేడ్, అందోల్ ప్రాంతానికి కూడా వస్తున్నయ్. అందోల్‌కు సింగూరు నుంచి ఇచ్చే 40 వేల ఎకరాలే కాదు.. ఇంకా 50 వేల ఎకరాల పైగా కాళేశ్వరం ద్వారా సాగునీరు వస్తున్నయి. నారాయణ్‌ఖేడ్ కావచ్చు.. జహీరాబాద్ కావచ్చు.. మీకు సింగూరు ప్రాజెక్టు మీద హక్కున్నది. సింగూరు ప్రాజెక్టు మీద ఒకటి జహీరాబాద్‌కు, ఒకటి నారాయణ్‌ఖేడ్‌కు లిఫ్ట్‌లు పెట్టి.. చెరొక లక్ష ఎకరాలకు వ్యవసాయానికి నీళ్లిచ్చే బాధ్యత నాది. నేనే వచ్చి స్వయంగా కొబ్బరికాయ కూడా కొడుత. సంగారెడ్డి జిల్లా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. కోల్డ్ స్టోరేజీలు అడుగుతా ఉన్నరు. జహీరాబాద్‌లో హజ్ నిర్మాణం కావాలని అడుగుతున్నరు. హైవే మీద యాక్సిడెంట్లు బాగా అయితయ్ కాబట్టి.. ఒక పెద్ద దవాఖాన రావాలని కోరుతున్నరు. నిజాంపేట్ దగ్గర కొత్త మండలాలు కావాలని కోరుతున్నరు. వాటన్నింటినీ కూడా చేసుకుందం.

రెండేండ్లలో లక్ష్మీతాండవం
పెద్దలు చెప్పిన సామెత ఉంది. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని. నేను కూడా ఈ మట్టిలో పుట్టిన మీ బిడ్డనే. ఇక్కడ సాగునీళ్లకు, కరంటుకు, తాగునీళ్లకు తీవ్రమైన బాధలు పడ్డం. భగవంతుడి దయ, మీ దీవెన, అధికారులు కూడా బాగా కష్టపడ్డారు. ఈ వర్షాకాలంలో కాళేశ్వరం నీళ్లు వస్తే, ఈ జిల్లాలో మీరు అద్భుతం చూస్తరు. అటు మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్‌తోపాటు సింగూరు ప్రాజెక్టును కూడా మనం కాళేశ్వరం నీళ్లతో నింపుకుంటం. ఇప్పటికే మంజీర నదిపై 11 నుంచి 12 చెక్‌డ్యామ్‌లు, హల్దీనదిపైన రెండుమూడు చెక్‌డ్యామ్‌లు మంజూరై ఉన్నాయి. వాటిని వేగంగా పూర్తిచేస్తం. మంజీరనది మెదక్ జిల్లాకు భగవంతుడు ఇచ్చిన ప్రకృతి సంపద. సమైక్యరాష్ట్రంలో సింగూరు ప్రాజెక్టును హైదరాబాద్‌కు అప్పజెప్పి, మన నోరు కొట్టినారు. మన పొట్టకొట్టినారు. మనం ఎంతో బాధపడ్డాం. ఈ మధ్యనే అందోల్ నియోజకవర్గంలో 40వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చుకుంటున్నం. నర్సాపూర్‌కు మల్లన్నసాగర్ నుంచి, కాళేశ్వరం నుంచి మెదక్, మిగతా ఐదు నియోజకవర్గాలకు కూడా ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు తగ్గకుండా నీళ్లు వస్తాయి. అంటే పాత మెదక్ జిల్లాలో పది నుంచి పదకొండు, పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఒకటిన్నర రెండు సంవత్సరాల్లో పది పదకొండు లక్షల ఎకరాల్లో వరినాట్లు పడి పచ్చగా లక్ష్మి అమ్మవారు తాండవం ఆడే మెదక్ జిల్లాను చూస్తం.

నిమ్జ్‌తో 2లక్షలమందికి ఉద్యోగాలు
జహీరాబాద్‌లో నిమ్జ్ వస్తున్నది. మూడువేల ఎకరాలు తీసుకున్నం. ఇంకా ఏడెనిమిదివేల ఎకరాలు తీసుకుంటున్నం. 2 లక్షలమందికి ఉద్యోగాలొస్తయి. నిమ్జ్ కంప్లీట్ అయితే జహీరాబాద్ పారిశ్రామికంగా బాగుంటది.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్లే ఈ పథకాలు
పెన్షన్‌లు మే నెల నుంచి రూ.2 వేలు ఇస్తరు. రైతుబంధు.. ఇప్పటిదాకా రెండు పంటలకు ఎనిమిది వేలు ఉండె. ఇప్పుడు సంవత్సరానికి ఎకరానికి పదివేలు ఇస్తున్నం. రైతులకు 24 గంటలు ఫ్రీ కరంటు కంటిన్యూ చేస్తం. ఎందుకంటే అప్పులల్ల ఉన్న రైతులు ధనవంతులుకావాలి. రైతు సచ్చిపోతే దేశంలో పట్టించుకునే నాథుడే లేకుండె. ఇయ్యాల దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. పెద్ద రైతా, చిన్న రైతా, కులం, మతం లేకుండా ఐదు గుంటల భూమి, పావు ఎకరం ఉన్న రైతు చనిపోయినా ఏ దరఖాస్తు లేదు, ఏ ఆఫీసుకు తిరిగే పనిలేదు. చనిపోయిన రైతు కుటుంబీకుల ఖాతాల్లో పదిరోజుల్లో ఐదులక్షలు జమచేస్తున్నం. ఇది చూసి ఈ రోజు యావత్తు దేశం, ఇతర రాష్ర్టాలు చాలా అశ్చర్యపడుతున్నయి. ఇలాంటి పథకం పెట్టాలని ఇతర రాష్ర్టాల్లో రైతులు డిమాండ్ చేస్తున్నరు. ఇవన్నీ జరుగతాయని అనుకోలే. వృత్తిపనివాళ్లను ఆదుకున్నాం. యాదవ సోదరులకు గొర్రెలు, మత్స్యకారులకు చేపపిల్లలు ఇచ్చినం. చేనేతకార్మికులను ఆదుకున్నం. ఇట్లా అన్ని ఫ్రంట్స్ లో నాలుగున్నరేండ్ల తక్కువ కాలంలో కష్టపడి, కడుపుకట్టుకుని, నోరుకట్టుకుని పనిచేసినం కాబట్టి ఇవి సాధ్యమైనవి. ఎప్పటినుంచో గిరిజన సోదరులు అడిగినా, ఎవరూ చేయలేదు. కానీ మనం తండాలను గ్రామపంచాయతీలు చేసుకున్నం. నిజంగా చెప్పుతున్న.. తెలంగాణ రాష్ట్రం రాకుంటే ఈ పథకాలు వచ్చేవి కావు. తెలంగాణ రాష్ట్రం అయి నా కూడా టీఆర్‌ఎస్ గవర్నమెంట్ రాకుంటే ఈ పథకాలు వచ్చేవి కావు.

మోదీ.. 15 లక్షలు ఏమైనయి?
నరేంద్రమోదీ, అమిత్‌షా 2014 ఎన్నికల్లో మైకులు పగిలిపోయేటట్టు చెప్పారు. మమ్ముల్ని గెలిపియ్యండి.. నల్లధనం పాతాళంలో ఉన్నా తెస్తం.. ప్రతి ఇంటికీ రూ.15 లక్షలు ఇస్తం అన్నరు. ఏడాది తర్వాత అమిత్‌షాను విలేకరులు ఇదే అడిగితే ఎలక్షన్ల మస్తు చెప్తం. అన్నీ చేస్తమా? అని మాట్లాడుతడు. దేశ ప్రజల గురించి ఏదైనా మాట్లాడొచ్చు. ఓట్లు కొట్టుకొని పోవాలి.. ఆ తరువాత ఏమన్న కానీ. మల్ల కొత్త నినాదం! ఇంతకుముందు చాయ్‌వాలా. ఇప్పుడేమో చౌకీదార్! ఇదే డ్రామా కావాల్నా ప్రజలకు? మైభీ చౌకీదార్! క్రియాహీనమైన నినాదాలు తప్ప నిజంగా మనసు కరగదీసి, దేశాన్ని కచ్చితంగా బాగుచేయాలనే ఆలోచనలేదు వీరికి.

ప్రభాకర్‌రెడ్డికి ఆల్ ఇండియా రికార్డు మెజార్టీ
కొత్త ప్రభాకర్‌రెడ్డి మెజార్టీ ఐదు లక్షలు దాటి వస్తది. మొత్తం రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తరని అందరూ చెప్తున్నరు. మెదక్ జిల్లా పక్కనున్న జహీరాబాద్, నిజామాబాద్‌లను ప్రభావితం చేయాలి. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితోపాటు సోదరి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇద్దరు కలిసిన తరువాత తిరుగేలేదు. నర్సాపూర్‌లో లక్ష యాభైవేల మెజార్టీ రావాలి. వాస్తవంగా మెదక్‌లో టీఆర్‌ఎస్‌కు టీఆర్‌ఎస్‌కే పోటీ. గజ్వేల్‌కు నర్సాపూర్ పోటీ, దుబ్బాకకు సిద్దిపేట పోటీ, మెదక్‌కు సంగారెడ్డి పోటీ. ఈ ఏడు నియోజకవర్గాల్లో ఒక్కో దాంట్లో లక్ష కంటే ఎక్కువగానే మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నది. ప్రభాకర్‌రెడ్డి మెజార్టీ ఆలిండియా రికార్డు బద్దలుకొట్టినా ఆశ్చర్యంలేదు. ముఖ్యమంత్రి కూడా ఉన్న నియోజకవర్గం కాబట్టి మన అందరి గౌరవం పెరుగుతది. ప్రతి ఒక్కరు ఇదే టెంపో కొనసాగించి అతి భారీ మెజార్టీతో గెలిపించండి. ఈ జిల్లా అవసరాలన్నీ తీర్చే బాధ్యత నాది. మంజీర నదిని , హల్ది నదిని ఒక చెక్ డ్యాం నీళ్లు మరో చెక్ డ్యాంకు తగిలేలా సజీవ జలధారగా రూపుదిద్దే బాధ్యత నాది.

బీబీ పాటిల్ బొబ్బపెట్టడు… కష్టపడుతడు…
బీబీ పాటిల్ సౌమ్యుడు, విద్యావంతుడు. చక్కటి మనిషి. కాంట్రవర్సీకి పోయే మనిషికాదు. కాబట్టి పెద్ద ఎత్తున ఓటు వేసి వారిని గెలిపించండి. ఆయన ఎక్కువ అరచి బొబ్బ పెట్టడు. కానీ అభివృద్ధి దగ్గర చాలా కష్టపడుతడు. నా మీదనే చాలాసార్లు అలిగినాడు. జాతీయ రహదార్లు కావచ్చు.. రైల్వే లైన్లు కావచ్చు. కేంద్ర ప్రభుత్వంలో కూడా హోరాహోరీగా పోరాడే వ్యక్తి. నియోజకవర్గానికి సాగునీళ్ల కోసం ఎమ్మెల్యేలను తీసుకొచ్చి నన్ను అడుగుతుంటరు. ఆయన ధనవంతుడు. డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలే. ఈ ప్రాంతాన్ని బాగుచేయాలనే తపనతోని వచ్చినారు. ఉత్తమ వ్యక్తి, అవినీతికి దూరముండే వ్యక్తి, ప్రజల బాగోగులు చూసే వ్యక్తి కాబట్టి పాటిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలె. ఎండను లెక్క చేయకుండా, అడవిలో మీటింగ్ పెట్టినా, పెద్దఎత్తున సభకు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. బీబీ పాటిల్ గెలుపు ఖాయ మే అని అర్థమైతుంది. ఇదే ఉత్సాహాన్ని 11వ తారీఖు వరకు కొనసాగించండి. -పదహారు మంది టీఆర్‌ఎస్ ఎంపీలను గెలిపిస్తే భారతదేశ గతిని, గమనాన్ని మార్చివేస్తా..ప్రగతికాముక దేశ నిర్మాణానికి కొట్లాడుత…: కేసీఆర్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.