
-మోదీ పాలన శుష్క ప్రియాలు.. శూన్యహస్తాలు: కేటీఆర్ -కొడంగల్‌లో చెల్లని రూపాయి.. మల్కాజిగిరిలో చెల్లుతుందా? -ఈసీఐఎల్ వరకు మెట్రోరైల్.. ఉప్పల్‌లో మరో శిల్పారామం సిద్ధం -1400 కోట్లతో ఉప్పల్ అభివృద్ధి.. నారపల్లి వరకు స్కైవే పనులు -మర్రి రాజశేఖర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి -మల్కాజిగిరి రోడ్డు షోలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
చాయ్ పే చర్చ పేరుతో 2014 ఎన్నికలకు ముందు రచ్చచేసిన నరేంద్రమోదీ గడిచిన ఐదేండ్లపాలన శుష్క ప్రియాలు.. శూన్యహస్తాలన్నట్లుగా సాగిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. ప్రస్తుతం మోదీ వేడి తగ్గిందని, కాంగ్రెస్ పుంజుకొనే పరిస్థితి లేదన్న కేటీఆర్.. నేడు దేశమంతటా తెలంగాణ పే చర్చ.. రైతుబంధు పే చర్చ.. మిషన్ భగీరథ పే చర్చ.. మొత్తంగా కేసీఆర్ పే చర్చ షురూ అయ్యిందన్నారు. 31 లక్షల పైచిలుకు ఓటర్లున్న మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఒక్క అభ్యర్థి దొరుకలేదని, కొండంగల్‌లో ఓడిపోయిన వ్యక్తిని తెచ్చారంటూ కొడంగల్‌లో చెల్లని ఓ రూపాయి.. మల్కాజిగిరిలో చెల్లుతుందా? అని ఎద్దేవాచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని నాచారం, మల్లాపూర్, హబ్సిగూడ, ఈసీఐఎల్ ప్రాంతాల్లో, మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని నేరేడ్‌మెట్, సఫిల్‌గూడ, అనుటెక్స్ ప్రాంతాల్లో, మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని నాగారం, దమ్మాయిగూడ తదితర ప్రాంతాల్లో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు బేతి సుభాష్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డితో కలిసి కేటీఆర్ రోడ్డుషో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిస్తే రాహుల్‌గాంధీకి, బీజేపీ గెలిస్తే మోదీకి లాభం జరుగుతుందని, కానీ.. 16 ఎంపీలు టీఆర్‌ఎస్ గెలిస్తే తెలంగాణకు లాభమని చెప్పారు. రాష్ర్టానికి రావాల్సిన పథకాలు, ప్రాజెక్టులు, నిధులు, రాష్ట్ర హక్కులు సాధించుకోవచ్చన్నారు.
16 ఎంపీ స్థానాలతో కేంద్రంలో పదవులు రాకపోవచ్చుగానీ, కేంద్రం మెడలువంచే శక్తి కేసీఆర్‌కు వస్తుందని చెప్పారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌ఫ్రంట్ ఏర్పాటు ఖాయమన్నారు. 40 ఏండ్లక్రితం తన నాయనమ్మ నినాదమైన గరీబీ హఠావో పేరుతో తానే ఈ దేశానికి టేకేదార్ అంటూ ఓ వైపు రాహుల్, ఐదేండ్లు అధికారంలో ఉండి దేశానికీ ఏమీచేయని మోదీ తానే ఈ దేశానికి చౌకీదార్‌నంటూ గారడీ మాటలతో ప్రజలముందుకు వస్తున్నారన్నారు. ఓటువేసేముం దు ప్రజలు ఆలోచించాలని కోరిన కేటీఆర్.. దే శానికి చౌకీదార్, టేకేదార్ కావాలా? లేక జోర్దార్.. వఫేదార్.. జిమ్మేదార్.. కేసీఆర్ కావాలా? అని ప్రశ్నించారు. పింఛన్లు, కల్యాణలక్ష్మి, నిరంతర విద్యుత్, మెట్రో విస్తరణ, లక్షల కోట్లతో ైఫ్లె ఓవర్ల నిర్మాణం ఇలా మంచి పనులుచేసే టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు.

ఈ గట్టున కారుంది.. ఆ గట్టున బేకారుండు.. కొద్దిరోజుల క్రితం ఓ సినిమాకు వెళ్తే ఆ గట్టునుంటావా నాగన్న.. ఈ గట్టునుంటావా.. అనే పాట విన్నానని చెప్తూ.. ఇప్పుడు తెలంగాణ ప్రజలు, మల్కాజిగిరి ఓటర్లు ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాలన్నారు. ఆ గట్టున కరంటు అడిగితే కాల్చి చంపిన పార్టీలున్నాయని, ఈ గట్టున అడుగకున్నా 24 గంటలు కరంట్ ఇచ్చిన టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి ఉన్నారని చెప్పారు. ఆ గట్టున టీవీల సాక్షిగా దొరికిన ఓటుకు నోటు కేసు దొంగ ఉన్నాడని.. ఈ గట్టున ఎందరో విద్యార్థులకు ఉన్నత చదువులను అందించిన విద్యావేత్త ఉన్నాడని చెప్పారు. ఈ గట్టున కారుంటే… ఆ గట్టున బేకారున్నారని అన్నారు.
అప్పుడెలా ఉంది? ఇప్పుడెలా ఉంది? ఐదేండ్ల క్రితం రాష్ట్రం ఏర్పడకముందు అభివృద్ధి ఎలా ఉంది? ఇప్పుడెలా ఉందో ప్రజలు గమనించాలని కేటీఆర్ కోరారు. అనాడు కరంటు ఎప్పుడు ఉంటదో.. ఎప్పుడు పోతదో తెలియదని, కానీ తెలంగాణ ప్రభుత్వ హయాంలో కరంట్ పోతే వార్త అన్నది ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు. రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.వెయ్యి చేశామని, మే 1 నుంచి రెండువేలు ఇవ్వబోతున్నామని తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభు త్వం ఉండటంతో ముంబై మెట్రోకు రూ.17వే ల కోట్లుఇచ్చారని, కానీ.. మనం కాళేశ్వరానికి జాతీయహోదా అడిగితే పట్టించుకోలేదని వి మర్శించారు. 16 ఎంపీలను గెలిస్తే కేంద్రంతో పోరాడి నిధులు తెచ్చుకోవచ్చన్నారు.
ఈసీఐఎల్ వరకు మెట్రో త్వరలోనే ఈసీఐఎల్ వరకు మెట్రోరైల్‌ను విస్తరిస్తామని కేటీఆర్ హామీనిచ్చారు. దీంతో ఈ ప్రాంత ప్రజలకు రవాణా కష్టాలు తొలిగిపోతాయని చెప్పారు. కేంద్రంలో మన 16 మంది ఎంపీలుంటే ఈసీఐఎల్‌తోపాటు మరిన్ని ప్రాంతాలకు మెట్రో విస్తరించుకోవచ్చన్నారు. ఉప్పల్‌లో మరో శిల్పారామం సిద్ధమైందని, త్వరలోనే ప్రారంభించుకుందామని చెప్పారు. రూ.1400 కోట్లతో ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులు, రూ.1600 కోట్ల తో ఉప్పల్ నల్లచెరువు సుందరీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. వందలకోట్లతో నారపల్లి వరకు స్కైవే నిర్మించుకోనున్నామని, పను లు జరుగుతున్నాయని చెప్పారు. ఈ పనుల్లో ఎక్కువ వాటా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తున్నదని, కానీ, టీఆర్‌ఎస్ ఎంపీలు 16 మంది ఉంటే కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకునే వెసులుబాటు ఉంటుందని వివరించారు.
గల్లీలో మీ సేవకుడు.. ఢిల్లీలో కేసీఆర్ సైనికుడు టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి గల్లీలో మీ సేవకుడిగా, ఢిల్లీలో కేసీఆర్ సైనికుడిగా పోరాడుతారని కేటీఆర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి మల్లారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించారని, మల్లారెడ్డికి తోడు ఎంపీగా రాజశేఖర్‌రెడ్డిని గెలిపిస్తే యావత్తు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, డంపింగ్ యార్డుపై గ్రీన్‌క్యాపింగ్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో డంపింగ్‌యార్డు నుంచి శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.