-కేసీఆర్ పాలనను అనుసరిస్తున్న రాష్ట్రాలు
-ప్రధాని కిసాన్ నిధికి స్ఫూర్తినిచ్చిన రైతుబంధు
-ఏపీ, బెంగాల్, ఒడిశాల్లోనూ రైతుబంధు తరహా పథకాలు
-మన పథకాలకు అంతర్జాతీయంగా గుర్తింపు
-సుపరిపాలనకు రోల్‌మోడల్‌గా తెలంగాణ
ఎప్పుడు వచ్చారన్నది కాదు.. ప్రజలకు ఏం చేశారన్నది లెక్క! పురుడుపోసుకుని కేవలం 57 నెలలే అయినా.. అనేక వినూత్న పథకాలతో, కొత్త ఆలోచనలతో తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తానికి దారి చూపిస్తూ.. అభివృద్ధి పాఠాలు బోధిస్తున్నది. అతిచిన్న వయసులోనే అత్యధిక వృద్ధిని నమోదుచేస్తూ అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలుస్తున్నది. తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అమలు చేస్తున్న సంస్కరణలు, పథకాలను పలు రాష్ట్రాలు అధ్యయంచేసి, తమ సొంత రాష్ట్రాల్లో అమలుచేస్తున్నాయి. మరికొన్ని రాష్ర్టాలు ఆ దిశగా అడుగులేస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ మొదలుకుని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాష్ర్టాల మంత్రు లు, అధికారులు, ప్రముఖ నిపుణు లు, ఆర్థిక, వ్యవసాయ, సామాజికవేత్తలు తెలంగాణ ప్రభు త్వ పథకాలను వేనోళ్ల ప్రశంసిస్తున్నారు. కాగ్, నీతి అయోగ్ వం టి కేంద్రసంస్థలు తెలంగాణ పథకాలను ఆదర్శంగా తీసుకోవాలని వివి ధ రాష్ర్టాలకు సూచించాయి. భూరికార్డుల ప్రక్షాళన, కేసీఆర్ కిట్లు, భారీ ఎత్తిపోతల పథకాలు, రైతన్నకు పంట పెట్టుబడి సాయం వంటి పథకాలు దేశానికే ఆదర్శమని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద సుబ్రమణ్యన్ సైతం ప్రశంసించారు. వీటిని అధ్యయనం చేసి దేశమంతా అమలుచేయాలని కూడా సూచించారు. అంతేకాదు పార్టీలకు, వ్యక్తులకు అతీతంగా తనదైన పాలనతో అన్ని వర్గాలవారి మనసులను దోచుకొని, దేశంలోని అన్ని రాష్ర్టాలకు తెలంగాణను మార్గదర్శిగా నిలిపారంటూ సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.
తెలంగాణ వెలుగులు దేశవ్యాప్తంగా..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే చీకటిమయం అవుతుందని కొందరు, అభివృద్ధిలో వెనుకబడిపోతుందని ఇంకొందరు, శాంతిభద్రతలు క్షీణిస్తాయని మరికొందరు.. ఇలా ఎవరికి తోచినట్లు వ్యాఖ్యలు చేశారు. శాపనార్థాలూ పెట్టినవారూ ఉన్నారు. వీటన్నింటి మధ్య 2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భవించింది. అప్పటికే ప్రగతిపథంలో దూసుకుపోతున్న పెద్ద రాష్ట్రాలు ఒకవైపు, రాష్ట్ర ఏర్పాటును సహించని రాజకీయనేతల పన్నాగాలు మరోవైపు తెలంగాణకు సవాలుగా నిలిచాయి. పసిబిడ్డ అయిన తెలంగాణ రాష్ట్ర పాలనా బాధ్యతలను ప్రజల తీర్పుతో తలకెత్తుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేవలం నాలుగేండ్లలో అద్భుతాలు సృష్టించారు. పాలన చేతకాదని అవహేళన చేసినవారు సైతం విస్మయానికి గురయ్యేలా.. ప్రజల కష్టాలను తీర్చడం, వారి ఇబ్బందులను తొలిగించడం.. వారి జీవితాలను మెరుగుపర్చడమే పాలన అనే సూత్రంతో దూసుకుపోయారు. పాలనలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు అమలుచేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆయన అమలుచేస్తున్న పథకాల ఫలితాలు తక్కువ కాలంలోనే లబ్ధిదారులకు చేరడం, అమలులో పారదర్శకత వంటి అంశాలు విపక్ష నేతలను సైతం ఆకర్షించేలా చేశాయి. రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, ఈనామ్ అమలు, హరితహారం, మైనార్టీ సంక్షేమం, కేసీఆర్ కిట్స్, టీఎస్ ఐపాస్, కల్యాణలక్ష్మి, కేజీ టు పీజీ ఉచిత విద్యావిధానం.. ఒకటేమిటి.. తెలంగాణలో అమలుచేస్తున్న ప్రతి విధానంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. వీటి ని అనేక రాష్ర్టాల అధికారులు తమ రాష్ర్టాల్లో అమలుచేసేందుకు అధ్యయనం చేస్తున్నారు.

ప్రతిపక్షాలు మెచ్చిన అరుదైన ఘనత జాతీయ పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టీఆర్‌ఎస్ పాలనను మెచ్చుకున్న ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కింది. ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ పథకాలపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోయాయి. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా అమలుచేస్తున్న పథకాలను ప్రత్యర్థి పార్టీలు ఇంతగా మెచ్చుకొన్న సందర్భాలు లేవు. ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటులో తెలంగాణ అభివృద్ధిని ప్రస్తావించడంతోపాటు మన్ కీ బాత్ కార్యక్రమంలోనూ మన ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ భేష్ అంటూ కితాబునిచ్చారు. ఆయన ఇటీవల అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచిస్తుంటే, ఏపీ సీఎం చంద్రబాబు పేచీ పెడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ సోదరులు మిషన్ భగీరథ పథకం ద్వారా కృష్ణా, గోదావరి నదీజలాలను అత్యంత ఉత్తమమైన రీతిలో ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మిషన్ భగీరథను ప్రశంసించారు.
కేంద్రమంత్రుల ప్రశంసల జల్లు తెలంగాణ పథకాలకు పలువురు కేంద్రమంత్రులు ఫిదా అయ్యారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ పథకాలను ప్రస్తావిస్తూ.. ప్రశంసలు కురిపించారు. ప్రజలకు రక్షిత తాగునీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శనీయమని, కేంద్రం నుంచి ఎలాంటి నిధులు ఆశించకుండానే రూ.40 వేల కోట్లతో ప్రాజెక్టును చేపట్టడం సాహసోపేతమని వాటర్ ఫర్ ఆల్, స్వచ్ఛభారత్ వర్క్‌షాప్‌లో కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరాశాఖమంత్రి నరేంద్రసింగ్‌తోమర్ అన్నారు. తెలంగాణలో పారిశ్రామిక శిక్షణాసంస్థ (ఐటీఐ)ల పనితీరు బాగుందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖమంత్రి అనంతకుమార్ హెగ్డే, కల్యాణలక్ష్మి భేష్ అని కేంద్ర సామాజికన్యాయ, సాధికారిత సహాయమంత్రి రాందాస్ అథావలె, మిషన్ భగీరథతోపాటు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను తెలుసుకున్న తర్వాత ఎవరైనా కేసీఆర్ డైనమిక్ అనే మాటను అంగీకరించాల్సిందేనని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ శాఖమంత్రి ఎస్‌ఎస్ అహ్లూవాలియా అభిప్రాయపడ్డారు. షాదీ ముబారక్ ఆదర్శంగా షాదీ షగుణ్, మైనార్టీ విద్యకోసం తెహ్రీక్ తాలీమ్‌ను జాతీయస్థాయిలో అమలుచేస్తామని, కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్‌నక్వీ, అడవుల పెంపకం, పచ్చదనం అభివృద్ధి, మొక్కలు నాటడం వంటి అంశాల్లో తెలంగాణ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని కేంద్ర పర్యావరణమంతి హర్షవర్ధన్, భద్రత అందించడంలో తెలంగాణ ఆదర్శనీయంగా ఉందని, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు పేర్కొనడం గమనార్హం.

రైతుబంధు దేశవ్యాప్తం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పథకం దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందింది. ఈ పథకాన్ని చివరికి ప్రధాని నరేంద్రమోదీ ఆదర్శంగా తీసుకుని, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రకటించి కేసీఆర్ బాటలో నడవక తప్పలేదు. రైతుబంధు పథకంలో తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి రెండు విడుతల్లో రూ.పదివేలు చొప్పున ఎంత భూమి ఉంటే అంత భూమికీ ఇస్తుండగా, కేంద్రం ఐదు ఎకరాల వరకు భూమి ఉన్నవారికి.. అందులోనూ అనేక షరతులతో, మూడు విడుతల్లో కేవలం రూ.ఆరువేలు ఇస్తుండటం గమనార్హం. ఒడిశాలోనూ కాలియా పేరుతో ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. ఇక, పశ్చిమబెంగాల్‌లో రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలుచేస్తున్నారు. ప్రతి రైతుకు ఎకరాకు రూ. 5000 వంతున రెండు విడుతల్లో సొమ్మును అందజేస్తున్నారు. రైతుబీమా కింద రూ. రెండు లక్షల చొప్పున బీమా సౌకర్యం కల్పిస్తున్నారు.
సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలు అనుసరిస్తుంటాయి. యథాతథంగా లేదం టే.. కాస్త పేర్లు మార్చి అమలుచేస్తుంటాయి! కానీ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కేంద్ర ప్రభుత్వానికే ఆదర్శంగా నిలుస్తుండటం విశేషం! కేంద్రమే కాదు.. పలు రాష్ర్టాలు సైతం తెలంగాణను అనుసరిస్తున్నాయి. రైతుబంధు పథకమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ! ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన పథకానికి స్ఫూర్తి రైతుబంధు పథకమే! కొంతమేరకైనా దేశవ్యాప్తంగా రైతులు లబ్ధిపొందుతున్నారంటే.. అది తెలంగాణ పుణ్యమే! పథకాలకు గుర్తింపు, గౌరవం, ప్రశంసలు దక్కుతున్నాయంటే.. అది ప్రభుత్వ సారథి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆలోచనా విధానమే! ఈ క్రమంలోనే యావత్ దేశం ఇప్పుడు తెలంగాణవైపు చూస్తున్నది!

ఏపీలో అన్నదాత సుఖీభవ తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను మక్కికిమక్కీగా అమలుచేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది మొదటి స్థానం అనాలి. ఇప్పటికే తెలంగాణ సంస్కరణలను, పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలుచేస్తున్న ఏపీ సర్కారు.. దేశం మెచ్చిన రైతుబంధును అన్నదాత సుఖీభవ పేరున అమలుచేస్తున్నది. తెలంగాణలో అమల్లో ఉన్న రూ.5 లకే భోజనం పథకాన్ని ఏపీలో యధాతథంగా అన్న క్యాంటీన్ పేరుతో అమలుచేస్తున్నారు. కల్యాణలక్ష్మి పథకంతోపాటు తెలంగాణ ఐటీ పాలసీని ఏపీ ప్రభుత్వం కూడా అమలుచేస్తున్నది. రైతుబంధు పథకాల తరహాలో కార్యక్రమాలు తీసుకునేందుకు మరికొన్ని సిద్ధమవుతున్నాయి.
వివిధ పార్టీల మ్యానిఫెస్టోలలో సైతం..! ఇటీవలి ఎన్నికల్లో తెలంగాణ పథకాలను తాము కూడా అమలుచేస్తామంటూ కొన్ని రాష్ట్రాలు ప్రకటించాయి. తమ మ్యానిఫెస్టోలలోనూ చేర్చాయి. మిషన్ కాకతీయ, కల్యాణలక్ష్మి, పంట రుణమాఫీ, టీ-హబ్, అన్నపూర్ణ, టీఎస్‌ఐపాస్‌లను అమలు చేస్తామని కర్ణాటక ఎన్నికల్లో అక్కడి బీజేపీ ప్రకటించింది. ఇక రైతులు, మహిళలకోసం తెలంగాణ అమలుచేస్తున్న పలు పథకాల అమలుకు మరికొన్ని రాష్ట్రాలు కూడా సిద్ధమయ్యాయి.
స్ఫూర్తినిస్తున్న అనేక పథకాలు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు తదితర రాష్ట్రాలు మన సంక్షేమ పథకాలను స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి.

షీ టీం వ్యవస్థపై బెంగాల్ ప్రభుత్వం అధ్యయనం చేసింది.

మిషన్ భగీరథ పథకంపై తొమ్మిది రాష్ట్రాలు అధ్యయనం చేశాయి.

ఒడిశాలో కంటి వెలుగు పథకం అమలుకు సన్నాహాలు చేస్తున్నారు.

గొర్రెల పంపిణీ పథకంపై తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఆసక్తితో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల అధికారుల బృందాలు అన్ని పథకాలనూ అధ్యయనం చేశాయి.

తెలంగాణలో ఇసుక పాలసీకి దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. పంజాబ్ మంత్రి నవజ్యోత్‌సింగ్ సిద్ధు.. మన ఇసుక పాలసీనే పంజాబ్‌లో యథాతథంగా అమలుచేసేందుకు ముసాయిదా విధానం ప్రకటించారు.

తెలంగాణ పౌరసరఫరాలశాఖలో అమలుచేస్తున్న సంస్కరణలను తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతోపాటు శ్రీలంక అధికారుల బృందం కూడా అధ్యయనంచేసి వారి ప్రాంతాల్లో అమలుచేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
ఒకప్పుడు పశ్చిమబెంగాల్ ఏం చేస్తే భారత్ అదే చేస్తుందనేవారు.. కానీ, ఇప్పుడు తెలంగాణ ఏం చేస్తుందో భారత్ అదే చేస్తున్నది. -కే తారకరామారావు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
తెలంగాణ ప్రజల జీవనాడి చెరువుల వ్యవస్థకు పూర్వవైభవం తీసుకురావడానికి ప్రజా ఉద్యమంలా సాగిస్తున్న మిషన్ కాకతీయ పనుల తీరుతెన్నులు అద్భుతం. ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలి.. – నీతి ఆయోగ్
దేశంలోనే అత్యుత్తమ పాలన తెలంగాణలో కొనసాగుతున్నది. అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలి. – మన్మోహన్, మాజీ ప్రధాని
తెలంగాణ ఇసుక పాలసీ దేశంలోనే గొప్పది. – నవజ్యోత్ సింగ్ సిద్దూ, కాంగ్రెస్ నేత
24 గంటల కరంట్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. అలాగే, దేశంలోనే మొట్టమొదటిసారి గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. గొల్ల, కురుమల కోసం ప్రత్యేక భవనాలు నిర్మిస్తున్నందుకు కృతజ్ఞతలు. – కర్ణాటక మంత్రి రేవణ్ణ, కాంగ్రెస్ నేత
కోట్ల రూపాయలతో యాదాద్రి దేవస్థానాన్ని అభివృద్ధిచేస్తున్న కేసీఆర్ అభినందనీయుడు. – యనమల రామకృష్ణుడు, ఏపీ ఆర్థిక మంత్రి