
-చౌకీదార్లు, టేకేదార్లు కాదు.. -కేసీఆర్‌లాంటి జిమ్మేదార్లు కావాలి -కేసీఆర్ పాలన దేశానికి దిక్సూచి -ఇంటి పార్టీని గెలిపించుకుంటే కేంద్రాన్ని శాసించవచ్చు -తెలంగాణకు ప్రాతినిధ్యం ఇవ్వని బీజేపీకి ఓటెందుకెయ్యాలి? -సిరిసిల్ల సభలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -కేసీఆర్ వల్లే చేనేత కార్మికులకు మహర్దశ : మంత్రి ఈటల -రాబోయేది సంకీర్ణ యుగమే: ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్
మాటలు చెప్పేవారు కాకుండా చేతల్లో చూపించే నేతలే దేశానికి కావాలని, అటువంటివారినే ఎన్నుకోవాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు అన్నారు. దేశానికి చౌకీదార్లు, టేకేదార్లు అవసరంలేదని, ప్రజలకు నమ్మకాన్నిచ్చే కేసీఆర్‌లాంటి జిమ్మేదార్లు కావాలని చెప్పారు. దేశంలో కాంగ్రెస్‌కు జోష్‌లేదని, బీజేపీకి హోష్ లేదని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకపవనాలు వీస్తున్నాయన్నారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో ప్రజలు బీజేపీని గెలిపిస్తే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రాహుల్‌గాంధీకి, బీజేపీకి ఓటేస్తే నరేంద్రమోదీకి లాభమని, అదే టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే తెలంగాణ ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని స్పష్టంచేశారు. మన ఇంటి పార్టీ టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి 16 మంది ఎంపీలను గెలిపించుకుంటే కేంద్రాన్ని శాసించవచ్చని, ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎవరు ఎగురవేయాలో నిర్ణయించే నిర్ణయాత్మక శక్తి తెలంగాణ ప్రజలదే అవుతుందని చెప్పారు.

సోమవారం సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల బహిరంగసభలో కేటీఆర్ ప్రసంగిస్తూ.. పేగులు తెంచుకుని కొట్లాడి స్వరాష్ర్టాన్ని సాధించుకున్న సత్తా ఉన్న గులాబీ సైనికులకే కేంద్రాన్ని నిలదీసే దమ్మూ, ధైర్యం ఉంటుందన్నారు. పదహారుమంది టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా, రాష్ట్రానికి మెగా పవర్‌లూం క్లస్టర్లు నడుచుకుంటూ వస్తాయని చెప్పారు. కేంద్రంలో తెలంగాణకు ప్రాతినిధ్యం లేకుండా చేసిన మోదీకి ఓటు ఎందుకు వేయాలని కేటీఆర్ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రంలో మోదీ కాపీ కొట్టడాన్ని ప్రస్తావించిన కేటీఆర్.. కేసీఆర్ దిక్సూచిలా మారారని చెప్పారు.
దేశంలో నంబర్ వన్ సీఎం కేసీఆర్.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తమ పాలకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని కేటీఆర్ ప్రశంసించారు. దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రిగా 79% ప్రజలు మెచ్చుకున్నారని గుర్తుచేశారు. ప్రధానిని నిర్ణయించే శక్తిసామర్థ్యాలున్న తెలంగాణ ప్రజలిచ్చే తీర్పు కోసం దేశం అబ్బురపడి చూస్తున్నదని పేర్కొన్నారు.

రెండు ఎంపీ స్థానాలతో తెలంగాణ తెచ్చుకున్న మనం.. 16 సీట్లు గెలిపించుకొని ఢిల్లీలో చక్రం తిప్పలేమా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌తోపాటు బెంగాల్‌లో మమతాబెనర్జీ, యూపీలో మాయావతి, అఖిలేశ్‌యాదవ్, ఒడిశాలో నవీన్‌పట్నాయక్, ఏపీలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పార్టీల ఎంపీలను కలుపుకొంటే ఎంపీల సంఖ్య 170 వరకు ఉంటుందన్నారు. ఇంతమంది ఎంపీలు ఉంటే దెబ్బకు ఢిల్లీ దిగిరాదా? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించడంవల్ల కేంద్రం నుంచి 90% నిధులు వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. అదేతరహాలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలని ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీకి మొరపెట్టుకున్నా, నవ్వారే తప్ప ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత, మరమగ్గాల పరిశ్రమతోపాటు అన్ని కులాలకూ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్వవైభవం తెచ్చారని గుర్తుచేశారు. సంక్షేమ ఫలాలు అందరికీ అందిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలను అమలుచేసి అండగా నిలిచిందని చెప్పారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2వేలు, దివ్యాంగులకు రూ.3వేలు వచ్చే నెల నుంచి ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆరేనని కొనియాడారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధితోపాటు తెలంగాణ అభివృద్ధికి కృషిచేసిన ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ను మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కేసీఆర్ వల్లే చేనేత కార్మికులకు మహర్దశ: మంత్రి ఈటల తెలంగాణలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు, ఆకలిచావులకు గురైతే కేంద్రం ఏనాడూ పట్టించుకోలేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి, పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి ఈటల రాజేందర్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ పర్యటించిన కేసీఆర్.. చేనేత కార్మికుల దయనీయ పరిస్థితికి చలించిపోయి, రూ.50 లక్షల విరాళాలు పోగుచేసి సిరిసిల్ల నేత కార్మికుల ట్రస్టుకు ఇచ్చారని గుర్తుచేశారు. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు బతుకమ్మ చీరెలు, రంజాన్, క్రిస్మస్ పండుగలకు వస్ర్తాల తయారీ ఆర్డర్లు ఇచ్చి ఆదుకున్న ఘనత కేసీఆర్‌దేనన్నారు. మరమగ్గాలు, చేనేతరంగానికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటుచేసి బడ్జెట్‌లో రూ.1200 కోట్లు కేటాయించిన ఏకైక ప్రభుత్వమని చెప్పారు. సిరిసిల్లను వస్త్రరంగంలో మరో తిరుపూరు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతున్నదని స్పష్టంచేశారు. వేల కోట్లతో కులవృత్తిదారుల కుటుంబాల్లో, జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్‌ను ఈరోజు దేశమంతా నంబర్ వన్ సీఎం అంటూ కొనియాడుతున్నదని చెప్పారు. సంకీర్ణ రాజకీయాల్లో కేసీఆర్ దిక్సూచిగా మారనున్నారని, 16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలను గెలిపించి బహుమతిగా ఇస్తే కేంద్రంలో ప్రధాన భూమిక పోషించి ఎక్కువ నిధులు తీసుకువస్తారన్నారు.

మరోసారి ఆశీర్వదించండి: ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్ పదహారు మంది టీఆర్‌ఎస్ ఎంపీలను గెలిపిస్తే దేశరాజకీయాల్లో మనమే కీలకం కానున్నామని టీఆర్‌ఎస్ కరీంనగర్ అభ్యర్థి బీ వినోద్‌కుమార్ అన్నారు. రాబోయేది సంకీర్ణయుగమేనని, ప్రాంతీయ పార్టీల కూటములదే అధికారమని చెప్పారు. రూ.70 వేల కోట్లతో సీతారామ, కాళేశ్వరం ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నామని అన్నారు. కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే కొత్తపల్లి- మనోహరాబాద్ రైలుమార్గాన్ని మంజూరుచేయించారని గుర్తుచేశారు. రైలుమార్గం పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. తనను మరోసారి ఎంపీగా ఆశీర్వదిస్తే జిల్లాకు మంచిపేరు తీసుకువచ్చి, అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, ఉమ్మడి జిల్లా ఇంచార్జి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఇరిగేషన్ డెవలప్‌మెంట్ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, జెడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, చిక్కాల రామారావు, కార్యదర్శి గూడూరి ప్రవీణ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.