-కాకపోతే సీబీఐ తాతతోనైనా.. -బండి సంజయ్‌కి విప్ బాల్క సుమన్ సవాల్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి దమ్ముంటే సీబీఐ కాదు సీబీఐ తాతతోనైనా విచారణ జరిపించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సవాల్ విసిరారు. సింగరేణిలో అవినీతి, అక్రమాలు జరిగాయని మాటిమాటికి బండి సంజయ్ ఆరోపణలు చేయటాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణిపై బండి సంజయ్ దుర్మార్గంగా మాట్లాడుతున్నారన్నారు. సింగరేణి కార్మికుల ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని 2014 జూన్ 14న అసెంబ్లీ తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
బీజేపీ నాయకులకు దమ్మూ, ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందాల్సిన అనేక ప్రయోజనాలను కేంద్రం తొక్కిపెడుతుందని, వీటిపై స్పందించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై బట్టకాల్చి మీదేయటం మానుకోవాలని హితవు పలికారు. సింగరేణి లాభాల్లో 28 శాతం వాటాను కార్మికులకు పంచిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత 14 వేల ఉద్యోగాలను సింగరేణిలో కల్పించిన ప్రభుత్వాన్ని అభినందించకపోయినా పర్వాలేదు కానీ.. అసత్యాలు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు.