-అన్ని రంగాల్లోనూ ఆదర్శం -మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ -రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో జాతీయ పతాకం ఆవిష్కరణ

గత ఆరేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అద్వితీయ విజయాలను సాధిస్తూ దేశానికే తలమానికంగా నిలిచిందని పురపాలక, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. శరవేగంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయడం, 24 గంటల ఉచిత విద్యుత్తును అందించడంతో రాష్ట్రంలో పంటల దిగుబడి గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీ పనులు త్వరితగతిన పూర్తిచేసి వచ్చే దసరానాటికి ఎత్తిపోతలతో ఎగువ మానేరును నింపుతామన్నారు.

రాష్ట్ర ఆవిర్భావదినోత్సవం సందర్భంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల కేంద్రంలోని పాత బస్టాండ్‌లో అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. తర్వాత కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పట్టణంలోని పలువార్డుల్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమాలను పరిశీలించారు. రిజర్వాయర్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. కోనారావుపేట మండలం మల్కపేటలో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను పరిశీలించారు. సొరంగం, లైనింగ్, సర్జ్‌పూల్ పంప్‌హౌజ్ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
భూగర్భ కాల్వలోకి వెళ్లి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకొన్నారు. మంత్రి కేటీఆర్ వెంట కలెక్టర్ కృష్ణభాస్కర్, అదనపు కలెక్టర్ అంజయ్య, ట్రైనీ కలెక్టర్ సత్యప్రసాద్, ప్యాకేజీ 9 కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీనివాస్‌రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ పాల్గొన్నారు.