Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

దేశానికే ఆదర్శం కావాలి..

ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించే వాటర్‌గ్రిడ్ పథకంపై దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ విషయాన్ని గమనంలో ఉంచుకుని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని స్పష్టంచేశారు. -వాటర్ గ్రిడ్ పనుల నాణ్యతలో రాజీపడొద్దు -తొమ్మిది నియోజకవర్గాల్లో ఏప్రిల్ నాటికి నీళ్లివ్వాలి -బస్సుయాత్ర సందర్భంగా పనులను పరిశీలిస్తా -చట్టానికి సీఎం సహా అందరూ సమానమే -నా వ్యవసాయ భూమిలోంచీ పైపులైన్లు వెళతాయి -వాటర్‌గ్రిడ్‌పై సమీక్షలో సీఎం

CM-KCR-review-on-Watergrid-project

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు పనులను నిర్ణ్ణీత గడువులోగా పూర్తిచేసి దేశానికి ఆదర్శంగా నిలువాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వాటర్‌గ్రిడ్ పథకంపై ఎంసీఆర్‌హెచ్చార్డీలో ఆర్‌డబ్ల్యూఎస్, రైల్వే, జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ట్రాన్స్‌కో, నీటిపారుదల శాఖ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలవారీగా పనులు జరుగుతున్న తీరును సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.

దేశంలోని అనేక రాష్ర్టాలు ఇప్పటికే ఈ పథకాన్ని తమ తమ రాష్ర్టాల్లో అమలుచేయడానికి అసక్తి కనబరుస్తున్నాయని సీఎం చెప్పారు. ఇంతటి బృహత్తర పథకాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. 2019 ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని పూర్తి చేసి, ఇంటింటికీ సురక్షితమైన తాగునీటిని అందించిన తరువాతనే ఓట్లు అడుగుతామనే ప్రకటనకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌కు మంచినీరు సరఫరా చేసే గోదావరి జలాల పైప్‌లైన్‌ద్వారా వచ్చే ఏప్రిల్ చివరినాటికి మెదక్ జిల్లాలోని గజ్వేల్, సిద్ద్దిపేట, దుబ్బాక, రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్, వరంగల్ జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్, నల్లగొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు తాగునీరు అందించాలని అధికారులకు సూచించారు. అటవీ శాఖ అనుమతుల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా డీఎఫ్‌వో స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించాలని ఆదేశించారు.

పైప్‌లైన్లు వేయడానికి అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని వాటర్‌గ్రిడ్ అధికారులకు ఆయన సూచించారు. ఈ పథకానికి అవసరమయ్యే విద్యుత్‌ను సరఫరా చేయడానికి సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. విద్యుత్ పనులన్నింటికీ బాధ్యతలను సీఎండీ ప్రభాకర్‌రావుకు అప్పగించారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు 1.5 శాతం ప్రోత్సాహకం ఇస్తామని సీఎం కేసీఆర్ సమావేశంలో ప్రకటించారు.

బస్సు యాత్రలో పనులను పరిశీలిస్తా వచ్చే సంవత్సరం మొదట్లో బస్సుయాత్ర ద్వారా జిల్లాల్లో పర్యటిస్తానని, ఆ సందర్భంలో వాటర్‌గ్రిడ్ పనులను స్వయంగా పరిశీలిస్తానని సీఎం సమావేశంలో ప్రకటించారు. అధికారులందరూ చిత్తశుద్ధితో పనుల్లో నిమగ్నం కావాలన్నారు. ఆర్‌అండ్‌బీ రోడ్ల తవ్వకాలకు ఇప్పటికే అనుమతులు ఇచ్చినా మరోసారి ఆదేశాలు జారీచేయాలని ఈఎన్‌సీని ఆదేశించారు. డిజైన్లకు వారంలోగా అనుమతించాలని సూచించారు.

నా భూముల గుండా పైప్‌లైన్లు పైపులైన్లు వేయడానికి అవసరమయ్యే అనుమతులు త్వరగా సాధించడానికి అటవీశాఖ ఒక డీఎఫ్‌వోను ప్రత్యేకంగా నియమించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. రైట్ ఆఫ్ వే చట్టాన్ని అనుసరించి ఆరు అడుగుల లోతున పైపులైన్లు వేయాలని అన్నారు. ఎవరి భూముల నుంచైనా వేసుకోవచ్చన్నారు. మెదక్ జిల్లాలో వేసే పైపులైన్ తన వ్యవసాయ క్షేత్రంనుంచి పోతున్నదని పేర్కొంటూ చట్టానికి ముఖ్యమంత్రి సహా ఎవరూ అతీతులు కాదని చెప్పారు. వాటర్‌గ్రిడ్ పథకానికున్న ప్రాధాన్యం దృష్ట్యా అధికారులు పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.

అదే సమయంలో పనుల నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దని సూచించారు. పనులు భావితరాలకు ఉపయోగపడేలా చేయాలని సీఎం అన్నారు. భూ సేకరణ, డిజైన్లు, టెండర్లు, ఆర్థిక అనుమతులు అనేక ఇతర విషయాల్లో మార్పులు తెచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వీటన్నింటినీ సానుకూలంగా మార్చుకుని పనుల్లో వేగం పెంచాలని చెప్పారు. నీటిపారుదల ప్రాజెక్టులంటేనే జాప్యానికి నిదర్శనంగా మారుతున్నాయని, ఈ అపోహను తొలగించే విధంగా పనులు వేగంగా సాగాలని అన్నారు.

రెండున్నరేండ్లలో పూర్తి: మంత్రి కేటీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకాన్ని రానున్న రెండున్నర సంవత్సరాల్లో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. సమీక్షా సమావేశం అనంతరం సమావేశ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. పైప్‌లైన్లు అత్యధికం రోడ్ల వెంబడే వేస్తున్నామని.. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిచోట్ల రైతుల భూములనుంచి వెళుతున్నాయని అన్నారు. దీనికోసం రైట్ ఆఫ్ వే చట్టాన్ని వినియోగించుకుంటామన్నారు.

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాబోయే ఎన్నికల్లోపు పనులను పూర్తిచేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి స్పష్టంచేశారు. దేశానికి స్వాత్రంత్యం వచ్చి ఆరు దశాబ్దాలైనా ప్రజలకు సురక్షితమైన నీరు అందించడంపై గత పాలకులు దృష్టి పెట్టలేదని కేటీఆర్ అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశంతో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసిందని చెప్పారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్ రావు, విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు జ్ఞానేశ్వర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు టీ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావు, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, పంచాయతీరాజ్ ఈఎన్‌సీ సత్యనారాయణరెడ్డి, రైల్వే, ఆర్‌డబ్ల్యూఎస్, వాటర్‌గ్రిడ్ ఎస్‌ఈలు, ఈఈలు, జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.