-రాజధానిలో పేదల ఇండ్లకు ఐడీహెచ్ కాలనీయే మోడల్ -కొత్తగా నిర్మిస్తున్న కాలనీకి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ -నిర్మాణ పనుల తీరుపై సంతృప్తి -రాష్ట్రావిర్భావ దినోత్సవాన కాలనీ ప్రారంభిస్తా -నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే నా కోరిక -అందుకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్ణయం -కాలనీవాసులతో ముచ్చటిస్తూ సీఎం వ్యాఖ్య -ఇంత బాగుంటాయని అనుకోలేదు: స్థానికులు -ఇండ్లలో సజ్జలకోసం వినతి.. వాటి ఏర్పాటుకు సత్వరమే ఆదేశించిన సీఎం

ఎక్కడో మూలకు విసిరేసినట్లు ఉండే ప్రాంతంలో నెర్రెలిచ్చిన గోడలనుంచి చీల్చుకుని వచ్చిన రావి మొక్కలతో.. ఎప్పుడు కూలిపోతాయో తెలియని ఇండ్లతో.. దీనావస్థలో ఉన్న కాలనీ అది! ఆ దుస్థితి ఒకనాడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దృష్టికి వచ్చింది! స్థానికుల వినతి మేరకు కాలనీని సందర్శించిన సీఎం.. దాని స్థితిగతులు చూసి.. చలించిపోయారు! కాలనీ స్థితిగతులను సమూలంగా మార్చేస్తానని ప్రకటించారు. అప్పటికప్పుడు కార్యాచరణ ప్రారంభించారు! ఆరునెలలు తిరిగేసరికి.. ఇప్పుడు అక్కడ సకల సదుపాయాలతో పేదలకు ఇండ్లు శరవేగంగా నిర్మాణమవుతున్నాయి. సీఎం ఆశయాన్ని నెరవేర్చుతూ.. పేదల కలను నిజం చేస్తూ రెండు పడక గదులతో ఫ్లాట్లు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయి! ఇది సికింద్రాబాద్ బోయిగూడలోని ఐడీహెచ్ కాలనీ కొత్త జీవితం! గురువారం ఆ కాలనీని సందర్శించిన సీఎం.. కొత్తగా నిర్మిస్తున్న కాలనీ దేశానికే ఆదర్శప్రాయమని అన్నారు. నగరంలో పేదలకు నిర్మించబోయే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు ఈ కాలనీనే మోడల్‌గా తీసుకుంటామని ప్రకటించారు. నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తన కోరికని సీఎం కేసీఆర్ చెప్పారు. అందుకే వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కట్టించాలనే ఆలోచన చేశానన్నారు. సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీలో నిర్మిస్తున్న నూతన గృహసముదాయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్ నిర్మాణం పూర్తయిన ఇండ్లలోపలికి వెళ్లి వాటి పటిష్టతను పరిశీలించారు. కొత్త గృహసముదాయంలో ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్, నల్లా కనెక్షన్ ఇస్తున్నారు.
కాలనీలో మురికి నీటి కాలువలు, వర్షపునీటి కాలువలు, మంచినీటి పైపులైన్లను కూడా నిర్మించారు. కాలనీలో కలియదిరిగిన సీఎం.. వాటన్నింటితోపాటు ఇక్కడ నిర్మించిన రెండు మోడల్ ప్లాట్లను పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన మహిళలు రూపవతి, మున్నాభాయ్, లలిత తదితరులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రభుత్వమే మొత్తం ఖర్చు భరించి, ఇండ్లు కట్టించడం సంతోషంగా ఉందంటూ మహిళలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. తాము ఇంత మంచి ఇంటిని ఊహించలేదని, తమకు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయని చెప్పారు. సామాన్లు పెట్టుకోవడానికి సజ్జలు కూడా నిర్మించాలని మహిళలు విన్నవించగా.. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి రెండు బెడ్‌రూమ్‌ల మధ్య ఉన్న ప్రదేశంలో ఒక సజ్జ నిర్మించాలని, కిచెన్‌లో పప్పులు, ఉప్పు, కారం, పసుపులాంటివి పెట్టుకునేందుకు వీలుగా సజ్జలు, టాయిలెట్‌లపైన ఉన్న ఖాళీ స్థలంలో కూడా ఏవైనా సామానులు పెట్టుకోవడానికి మరో సజ్జ నిర్మిస్తే బాగుంటుందని సూచించారు. ఈ కాలనీలోని కుటుంబాలన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ఇంటిని తీర్చిదిద్దాలని కోరారు. హైదరాబాద్ నగరంలోని నిరుపేదలందరికీ ఇదే రకమైన ఇండ్లు కట్టించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని సీఎం ప్రకటించారు. ఐడీహెచ్ కాలనీ మొత్తం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రారంభోత్సవంనాటికి చిన్న పని కూడా పెండింగ్‌లో ఉండకూడదని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీన గృహ సముదాయాన్ని తానే స్వయంగా ప్రారంభిస్తానని ప్రకటించారు.
తలసానికి సీఎం అభినందన ఇండ్ల నిర్మాణంలో అడ్డంకులను ఎప్పటికప్పుడు తొలగిస్తూ, పూర్తి శ్రద్ధ తీసుకుంటున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను సీఎం కేసీఆర్ అభినందించారు. చక్కటి నాణ్యతతో ఇండ్లు నిర్మిస్తున్నారంటూ కాంట్రాక్టర్‌లను, ప్రతిరోజు సైట్ వద్ద ఉండి పనులు చేయిస్తున్న అధికారులను సీఎం ప్రశంసించారు. ఇటీవల ఢిల్లీనుంచి వచ్చిన కేంద్ర ప్రభుత్వ అధికారులు మన ఇండ్ల నాణ్యతను చూసి ప్రశంసించారని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ఈ సమయంలో సీఎంకు చెప్పారు. పనులు జరుగుతున్న తీరును సీఎంకు వివరించారు.
32 బ్లాకులు.. 396 ఫ్లాట్లు అత్యంత దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్న ఐడీహెచ్ కాలనీవాసుల దుస్థితిని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే కేసీఆర్ కళ్లారా చూశారు. వారందరికీ పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే ఇండ్లు కట్టిస్తానని హామీఇచ్చారు. దానికి అనుగుణంగా గత ఏడాది అక్టోబర్ 3న కొత్త ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా జీహెచ్‌ఎంసీ అధికారులు ఇండ్ల నిర్మాణం చేపట్టారు. మొత్తం 32 బ్లాకుల్లో జీ ప్లస్ టూ పద్ధతిలో 396 ఇండ్లు నిర్మిస్తున్నారు. ఇందుకు రూ.37 కోట్లు వ్యయంచేస్తున్నారు. ప్రతి ఇల్లు 580 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు బెడ్ రూమ్‌లు, హాలు, కిచెన్, రెండు టాయిలెట్లతో ఉంటుంది. ఒక్కో ఇంటికి రూ.7.9 లక్షల వ్యయం చేస్తున్నారు. అన్ని సదుపాయాలతో నిర్మిస్తున్న ఈ ఇండ్లను జూన్ 2వ తేదీన స్వయంగా సీఎం కేసీఆర్ ప్రారంభించి లబ్ధిదారులకు అందజేస్తారు.
పదో నంబర్ బ్లాకు మరమ్మతులకు ఆదేశం ఐడీహెచ్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇండ్లను పరిశీలించి బయటకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పాత 10వ నంబరు బ్లాక్ ప్రజలు కలిశారు. తాము నివసిస్తున్న బ్లాక్‌లో గోడలకు పగుళ్ళు ఏర్పడ్డాయని, వానవస్తే పైకప్పు నుంచి నీళ్ళు పడుతున్నాయని గోడు వెళ్ళబోసుకున్నారు. దీనికి స్పందించిన సీఎం.. పాత భవనంపై వాటర్ ప్రూఫింగ్, ఇతర మరమ్మత్తులు చేయించాలని అధికారులను అప్పటికప్పుడు ఆదేశించారు. అందుకు అవసరమైన రూ.12 లక్షల నిధులను వెంటనే విడుదల చేయాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్‌కు సూచించారు. బంగారు తెలంగాణ సాధనకు ఐడీహెచ్ కాలనీ ఇండ్లే నిదర్శనమని మంత్రులు అన్నారు. ఈ కాలనీ పర్యటనలో సీఎం కేసీఆర్‌వెంట మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, టీ హరీశ్‌రావు, ఐ ఇంద్రకరణ్‌రెడ్డి, నమస్తే తెలంగాణ సీఎండీ దివికొండ దామోదర్‌రావు తదితరులున్నారు.