Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

దేశంలోనే బెస్ట్ రోడ్ నెట్‌వర్క్ నిర్మిస్తాం

-ట్రాఫిక్ ఇబ్బందులులేని రవాణా వ్యవస్థే సీఎం లక్ష్యం -సముచిత స్థానమిచ్చి సీఎం నా బాధ్యత పెంచారు -కేసీఆర్ వల్లే రాజకీయాల్లో కొనసాగుతున్నా -పార్టీ, ప్రభుత్వ బలోపేతానికి కృషిచేస్తా -నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో ఆర్ అండ్ బీ, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల

Tummala-Nageswara-Rao(1)

దేశానికే తలమానికమైన రోడ్ వ్యవస్థను రాష్ట్రంలో సృష్టిస్తామని రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. అత్యుత్తమ రవాణా వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తున్నదని చెప్పారు. మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కించుకొని, ఆర్ అండ్ బీ, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఆదివారం నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌లో చేరిన తనకు క్యాబినెట్‌లో స్థానం కల్పించి సముచిత స్థానమిచ్చిన సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆశయాలకు అనుగుణంగా పనిచేసి రాష్ర్టాభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

ప్రశ్న: టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి పదవి కూడా పొందారు. ఎలా ఫీలవుతున్నారు? జవాబు: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తెలిసిన ఏకైక పార్టీ అయిన టీఆర్‌ఎస్‌లో చేరడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నాకు సముచిత స్థానం ఇచ్చి మరింత బాధ్యత పెంచారు. క్యాబినెట్‌లో స్థానం కల్పించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు. కేసీఆర్, నేను ఓకేసారి రాజకీయాల్లోకి వచ్చాం. 1985లో ఇద్దరం ఒకేసారి ఎమ్మెల్యేలుగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టాం. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేశాం. ముఖ్యమంత్రి ఆలోచనా తీరు బాగా తెలిసిన వ్యక్తిగా నేను తెలంగాణ అభివృద్ధితోపాటు పార్టీ అభివృద్ధికి అండగా ఉంటా.

నాకు కేటాయించిన శాఖలే కాకుండా సీఎం ప్రాధాన్య ప్రాజెక్టులైన వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ, హరితహారం వంటి పథకాల విజయవంతానికి కృషిచేస్తా. తెలంగాణ కోసం కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. సీఎంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ రాష్ర్టానికి వన్నె తెచ్చేలా ఉన్నాయి. సీఎం ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధిలో భాగస్వామినవుతాను. ఒక దశలో రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నాను. కేసీఆర్ ఆహ్వానించడంతో టీఆర్‌ఎస్‌లో చేరి ప్రజలకు మరింత సేవ చేయాలని నిర్ణయం తీసుకున్నాను.

ప్ర: రోడ్ల అభివృద్ధిలో ఇప్పటికే సీఎం ప్లాన్ ప్రకటించారు. దానిని ఎలా అమలు చేయబోతున్నారు? జ: రాష్ట్రంలో రోడ్లను అద్దంలా ఉంచాలనేది సీఎం ఆకాంక్ష. గత ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాల వల్ల తెలంగాణలో ఎక్కడ చూసినా రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. సరైన విధానాలతో వాటిని బాగుచేస్తాం. హెచ్‌ఎండీఏ, మున్సిపాలిటీ, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవేస్ వంటి వాటిని ఒకే గొడుగు కిందికి తెచ్చి అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తా. సీఎం ఆదేశించినట్లుగా ప్రతి గ్రామానికి పక్కా రోడ్డు వేస్తాం. హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రాలకు నాలుగు లేన్ల రోడ్లు, మండల కేంద్రాలకు రెండు లేన్ల రోడ్లు వేసి ప్రయాణంలో ఇబ్బందులను తొలిగిస్తాం.

రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్ వరకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తాం. ఎలివేటెడ్ కారిడార్లు, మల్టిలేయర్ ైఫ్లె ఒవర్లు నిర్మించి ఇంటిగ్రేటెడ్ రోడ్ సిస్టంను అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా రైతులు పంటలను మార్కెట్ చేసుకోవడానికి, ప్రధాన దేవాలయాలకు మెరుగైన రహదారి వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. దేశంలోనే ఉత్తమమైన రోడ్ నెట్‌వర్క్ అభివృద్ధి పరుస్తాం. రాబోయే నాలుగున్నరేండ్లలో రోడ్ నెట్‌వర్క్‌లో తెలంగాణకు మించిన రాష్ట్రం ఉండకూడదన్నది సీఎం లక్ష్యం. దీనికి అనుగుణంగా నా గతానుభవంతో దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. సీఎంతో చర్చించి ఆర్ అండ్ బీలో శాఖలోని ఖాళీలను భర్తీచేస్తాం.

ప్ర: జాతీయ రహదారుల అభివృద్ధిపై ఎలాంటి ప్రణాళికలు అమలుచేయనున్నారు? జ: రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీనికోసం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. వీటిని సాధించేందుకు కృషి చేస్తా. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ర్టానికి రావాల్సిన రోడ్లను తెచ్చుకునేందుకు కృషి చేస్తా. ఇందులో ఉప్పల్ నుంచి ఘట్‌కేసర్ వరకు చేపట్టే బైపాస్‌ను ఎలివేటెడ్ కారిడార్‌గా మార్చాలని, ఆరాంఘర్, శంషాబాద్ నేషనల్ హైవేలో మార్పులు చేయాలని, ఎన్‌హెచ్ 67కు సంబంధించి జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్ వరకు నాలుగులేన్ల రోడ్‌ను మంజూరు చేయాలని కోరాం.

ప్రతిపాదించిన వాటిలో మొదటి ప్రాధాన్యంగా హైదరాబాద్-నర్సాపూర్ (230 కిలోమీటర్లు), హైదరాబాద్-బీజాపూర్ (133 కిలోమీటర్లు), కోదాడ- మిర్యాలగూడ (220 కిలోమీటర్లు), నిర్మల్- జగిత్యాల (110 కిలోమీటర్లు), అశ్వరావుపేట-ఖమ్మం (160 కిలోమీటర్లు), కరీంనగర్- సిరిసిల్ల (165 కిలోమీటర్లు) జాతీయ రహదారులను మంజూరు చేయాలని కోరాం. భవిష్యత్‌లో నిర్మించే జాతీయ రహదారులన్నీ నాలుగులేన్లతో ఉండేలా చర్యలు తీసుకుని టోల్‌గేట్ల వ్యవహరాన్ని పునఃసమీక్షిస్తాం.

ప్ర: ఆర్ అండ్ బీ భవనాలు, గెస్ట్‌హౌస్‌లు శిథిలావస్థలో ఉన్నాయి. వీటిని ఏమి చేయబోతున్నారు? జ: ఆర్ అండ్ బీ పరిధిలో విలువైన స్థలాలున్నాయి. వీటిని కాపాడటానికి చర్యలు తీసుకుంటాం. త్వరలో దీనిపై అధికారులతో సమీక్ష జరుపుతాం. ముఖ్యమంత్రితో చర్చించి వీటిని ప్రభుత్వ ఆదాయవనరులుగా మార్చుతాం. అవసరమైన ప్రాంతంలో పక్కా భవనాలు నిర్మించి వాటి నిర్వహణకు ప్రత్యేక యంత్రాంగాన్ని నెలకొల్పుతాం.

ప్ర: స్త్రీ, శిశు సంక్షేమశాఖ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? జ: ఈ శాఖను బలోపేతం చేసి నిరుపేదలకు, నిర్భాగ్యులకు చేయూతనివ్వాలన్నది కేసీఆర్ ఆలోచన. ప్రస్తుతమున్న విధానంపై సీఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ శాఖను బలోపేతం చేసి స్త్రీ, శిశు సంక్షేమానికి పెద్దపీట వేసేలా ప్రణాళికలు రూపొందిస్తాం. త్వరలో దీనిపై సమీక్షించి మార్పులు తెస్తాం. ఈ శాఖలో పనిచేసే ఉద్యోగులకు ఇబ్బందులున్నాయి. వీటిని పరిష్కరిస్తాం.

ప్ర: ఖమ్మం జిల్లాకు ఏం చేయబోతున్నారు? జ: ఖమ్మం జిల్లా అన్నిరంగాల్లో వెనుకబడింది. జిల్లా అభివృద్ధికి పాటుపాడుతా. జిల్లాలో టీఆర్‌ఎస్ బలం పెంచేందుకు కృషి చేస్తా. ప్రతి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ బలంగా ఉండేలా ప్రయత్నిస్తా. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భవిష్యత్తులో టీఆర్‌ఎస్ శ్రేణులే ఉంటాయి. ఇది ముఖ్యమంత్రి ఆకాంక్ష కూడా. తప్పకుండా సాధిస్తా.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.