-కేసీఆర్ రాకతోనే దేశంలో మార్పు
-తెలంగాణ మాడల్‌పై దేశవ్యాప్త చర్చ
-బీఆర్‌ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్‌సింగ్ చడూనీ
దేశంలో పెద్ద మార్పు రావాల్సి ఉన్నదని, ఆ మార్పు బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని బీఆర్‌ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్‌సింగ్ చడూనీ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ను దేశమంతా విస్తరిస్తామని, తొలి దశలో ఆరు రాష్ట్రాల్లో ఊరూరా బీఆర్‌ఎస్ కిసాన్ సమితి కమిటీలు వేస్తామని తెలిపారు. హర్యానా, పంజాబ్, బీహార్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రలో త్వరలోనే కమిటీలు వేయనున్నట్టు ఆయన చెప్పారు. రాజకీయాల్లో రైతుల క్రియాశీల భాగస్వామ్యాన్ని బీఆర్‌ఎస్ కోరుకుంటున్నదని ఆయన చెప్పారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ తరహా అభివృద్ధి ఫలాలు యావత్ దేశంలోని అన్ని వర్గాలకు అందజేస్తామని అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని బీఆర్‌ఎస్ జాతీయ కార్యాలయంలో గుర్నామ్‌సింగ్ మీడియాతో మాట్లాడారు. దేశంలో నెలకొన్న రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా జాతి భారీ మార్పును ఆశిస్తున్నదని, తెలంగాణలో అమలవుతున్న రైతు అనుకూల విధానాలు దేశమంతా అమలు కావాలనే డిమాండ్ వస్తున్నదని అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని చాలామంది భావిస్తున్నారని, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని రైతులు, వివిధ వర్గాల ప్రతినిధులు తాము సమావేశాలు నిర్వహించిన సందర్భంగా వెల్లడించారని ఆయన పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే పార్టీ విధి విధానాలు వెల్లడిస్తారని ఆయన చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సామాన్యుల ఆకాంక్షలను తొక్కిపెట్టి కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నదని గుర్నామ్‌సింగ్ విమర్శించారు.
పాడిపంటలతో తులతూగాల్సిన భూములు బీడు భూములుగా మారిపోతున్నాయని, ప్రభుత్వ రంగసంస్థలన్నింటినీ మోదీ అమ్మకానికి పెట్టారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్ మాడల్ దేశాన్ని అమ్మేస్తుంటే.. తెలంగాణ మాడల్ ఆదర్శనీయంగా ఉండటమే బీఆర్‌ఎస్ వైపు దేశమంతా ఆసక్తిగా ఎదురుచూడడానికి కారణమని అన్నారు. సీఎం కేసీఆర్ నాయత్వంలోని తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేనివిధంగా అన్నివర్గాలకు అండగా ఉంటున్నదని వివరించారు. రైతులకోసం రైతుబంధు, రైతుబీమా సహా అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే దేశంలోని అన్ని ప్రాంతాలకు తెలంగాణ పథకాలను అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రైతులందరికీ అందటంలేదని, తెలంగాణలో మాత్రం రైతుబంధు అందరికీ వర్తింపజేస్తున్నారని ఆయన వివరించారు.
కేసీఆర్ వద్ద దేశాన్ని మార్చే ప్రణాళికలు
దేశంలో ప్రస్తుతమున్న రాజకీయ పార్టీలు అధికారం, డబ్బు కోసం పనిచేస్తున్నాయని.. బీఆర్‌ఎస్ అలా కాదని గుర్నామ్‌సింగ్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అనేకసార్లు చెప్పారన్నారు. కేసీఆర్ ఆలోచనా విధానాలు, తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే తాను బీఆర్‌ఎస్‌లో చేరానని చెప్పారు. దేశాన్ని మార్చేందుకు తమ అధినాయకుడు కేసీఆర్ వద్ద అనేక ప్రణాళికలు ఉన్నాయని, త్వరలోనే వాటిని వెల్లడిస్తారని తెలిపారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే రైతు ఆందోళనలే ఉండవనే విషయాన్ని తెలంగాణ నిరూపించిందని, 8 ఏండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని గుర్నామ్‌సింగ్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌లో రైతులే నేతలుగా ఉంటారని, రైతులకు అనుకూల చట్టాలను రైతులే చేసుకుంటారని ఆయన పేర్కొన్నారు.