-కేంద్ర, రాష్ట్ర సర్కార్లకు దిక్సూచిలా రైతుబంధు -ప్రశంసించని నేత లేడు.. నచ్చని ఆర్థికవేత్త లేడు -పలు రాష్ర్టాల్లో వేర్వేరు పేర్లతో ఉనికిలో పీఎం కిసాన్ సమాన్ నిధికీ ఇదే స్ఫూర్తి -అన్ని రాష్ర్టాలకు మార్గదర్శకమన్న కేంద్రం రాష్ట్రంలో ఏటా రూ.14వేల కోట్లు ఖర్చు -అన్నదాతల జీవితాల్లో సమూల మార్పు -కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల కోసం రూ.7 వేల కోట్లకుపైగా నిధులను సమకూర్చి 48 గంటల్లోనే అందించడం ఓ రికార్డు. -ఈ ఏడాది తెలంగాణలో వానకాలం సీజన్‌లో లబ్ధిపొంచిన రైతులు 57.86 -లక్షల మంది రైతుఖాతాల్లో జమఅయిన మొత్తం 7,251.85 కోట్లు -కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఈ పథకాన్ని అమలుచేస్తున్నది. -ఏడాదికి రూ.6 వేల పెట్టుబడి సాయం.. -2వేల చొప్పున 3 విడుతల్లో అందిస్తున్నది. -కేసీఆర్ బాటలో..పశ్చిమబెంగాల్ క్రిషక్‌బంధు -జార్ఖండ్ ఆశీర్వాద్ యోజన -ఒడిశా కాలియా -ఆంధ్రప్రదేశ్ రైతు భరోసా
దేశానికే ఆదర్శంగా.. దేశంలోనే తొలిసారిగా రైతుకు పెట్టుబడి సాయం కోసం రైతుబంధు పథకం తెలంగాణ రాష్ట్రం అమలు చేసింది. మొదట్లో సీజన్‌కు ఎకరానికి రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.8వేల పంట పెట్టుబడి సాయం అందించింది. ప్రస్తుతం దానిని పెంచి రూ.5 వేల చొప్పున రూ.10వేలకు ప్రతి రైతుకు అందజేస్తున్నది.
వ్యవసాయం.. అన్నదాత. ఈ దేశంలో కేవలం నినాదాలకే పరిమితమైన పదాలు ఏవైనా ఉన్నాయా అంటే.. ఈ రెండే. ప్రచారాల్లో, పాదయాత్రల్లో రాజకీయ నాయకుల విచిత్రవేషాలకు పనికొచ్చేది రైతు.. ఊకదంపుడు ప్రసంగాలకు పనికొచ్చేది ఎవుసం.. ఫొటోలకు పోజులిచ్చేందుకు ఉపయోగపడేదేమో ఓ నాగలి. అంతకుమించి గత ఏడున్నర దశాబ్దాల్లో దేశంలో 75 శాతం మందికి జీవనాధారమైన వ్యవసాయం గురించి, రైతు ఆర్థిక పరిస్థితి గురించి ఒక్క ప్రభుత్వం.. ఒక్క నాయకుడు తీసుకున్న ఒక్కటంటే ఒక్క నిర్ణయం దుర్భిణీ వేసి వెతికినా దొరకదు.
కానీ..ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ మస్తిష్కంలోనుంచి పుట్టిన ఒకే ఒక్క పథకం తెలంగాణలో రైతు జీవితాన్ని.. వ్యవసాయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసింది. యావత్ దేశానికి దిక్సూచిగా మారింది. దేశంలోని రైతులందరికీ ఆలంబనగా నిలిచింది. జాతీయ, అంతర్జాతీయ వ్యవస్థలకు ఆశ్చర్యం కలిగించింది. భావజాలాలకు అతీతంగా దేశంలోని ఆర్థికవేత్తలు మొదలుకొని రాజకీయ నాయకుల వరకు భేష్.. శభాష్.. అనిపించుకుంటున్నది ఆ పథకమే రైతుబంధు.
దేశానికే ఆదర్శంగా…దేశంలో మొట్ట మొదటిసారిగా రైతుబంధు పథకం తెలంగాణ రాష్ట్రం అమలు చేసింది. మొదట్లో సీజన్‌కు ఎకరానికి రూ.4 వేల చొప్పున ఏడాదికి 8వేల పంట పెట్టుబడి సాయం అందించింది. ప్రస్తుతం దానిని పెంచిరూ.5 వేల చొప్పున రూ.10వేలకు ప్రతి రైతుకు అందజేస్తున్నది
పశ్చిమబెంగాల్ క్రిషక్‌బంధు పథకం రైతుకు ఏడాదికి ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు విడుతల్లో ఇస్తారు. రైతుబీమా పథకం కూడా ఈ రాష్ట్రం అమలుచేస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రైతు భరోసా పేరుతో రైతులకు పెట్టుబడిసాయాన్ని అందిస్తున్నది. ప్రతిరైతుకు ఏడాదికి రూ.7,500 ఇస్తున్నది.
ఒడిశా కాలియా పేరుతో రైతుబంధును అందిస్తున్నది. మొదట్లో పంటకు రూ.5 వేల చొప్పున, ఏడాదికి 10 వేలు ఇవ్వగా.. దానిని ఈ ఏడాది నుంచి రూ.4 వేలకు తగ్గించింది.
జార్ఖండ్ ఆశీర్వాద్ యోజనగా రైతుకు ఏడాదికి ఎకరాకు 5 వేల సాయం అందిస్తున్నది.
సాధారణ రైతునుంచి ఆర్థిక, వ్యవసాయ నిపుణులదాకా అందరి మన్ననలు పొందిన పథకం రైతుబంధు. రైతన్నకు ఆర్థికంగా అండ కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం దేశవ్యాప్తంగా సంచలనమే సృష్టిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట రైతుబంధు పథకాన్ని అమలు చేస్తుండగా.. కొన్నిరాష్ర్టాలు అదేబాటలో నడుస్తున్నాయి. అన్నిరాష్ర్టాల వ్యవసాయశాఖ మంత్రులతో ఇటీవల జరిగిన సమావేశంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఈ పథకాన్ని ఉదాహరణగా చూపెట్టారంటే దీని గొప్పతనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పథకం అన్నిరాష్ర్టాలకు మార్గదర్శకం అని సూచించారు. 2018 మే 10న తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఈ పథకం కింద ప్రతిఏటా సుమారు రూ.14వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది.
ప్రముఖుల నోట.. రైతుబంధు మాట రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో మెదిలిన ఈ ఆలోచన అటు రైతులనే కాదు.. రాజకీయ, ఆర్థిక, వ్యవసాయ నిపుణులను సైతం ఆకర్షించింది. దేశంలోనే తక్కువ వయసుగల తెలంగాణ రాష్ట్రం అమలుచేస్తున్న ఈ పథకాన్ని అనేకమంది ప్రముఖులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రశంసించారు. ప్రపంచబ్యాంకు, ఐక్యరాజ్యసమితిలోభాగమైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏవో), ప్రముఖ ఆర్థిక నిపుణులు అరవింద్ సుబ్రమణ్యన్, అశోక్ గులాటి, ఐకార్ మాజీ డైరెక్టర్ ఆర్‌ఎస్ పరోడా, ప్రముఖ సామాజికవేత్త అన్నాహజరే తదితర ప్రముఖులు రైతుబంధు పథకాన్ని కొనియాడారు. ఇది రైతుల బతుకులు మార్చే పథకమని, దేశం మొత్తం దీనిని అమలుచేయాల్సిన ఆవశ్యకత ఉన్నదని ఉద్ఘాటించారు.
అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) యూనివర్సిటీ రైతుబంధు పథకంపై అధ్యయనం చేస్తున్నది. ఈ పథకం వల్ల రైతులకు చేకూరుతున్న మేలు, అమలు, తదితర అంశాలను పరిశీలిస్తున్నది.
సముద్రంలో దీపస్తంభం లాంటిది తెలంగాణలో అమలుచేస్తున్న రైతుబంధు పథకంలాంటిది దేశానికి అత్యవసరం. ఇది రైతులకు సముద్రంలో దీపస్తంభం లాంటిది. కేంద్రంతోపాటు, అన్ని రాష్ర్టాలు అమలుచేయాలి. ఇలాంటి పథకాలతో రైతు ఆత్మహత్యలను నివారించవచ్చు. ఎకరాకు రూ.5వేల పెట్టుబడి ఇవ్వడం గొప్ప విషయం. – అన్నా హజరే (2019 జనవరి 19)
భేషైన పథకం తెలంగాణలో అమలుచేస్తున్న రైతుబంధు పథకం చాలా బాగున్నది. దీనివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. మిగతా రాష్ర్టాలు కూడా ఇలాంటి పథకాలపై ఆలోచన చేయాలి. తెలంగాణలో ఈ పథకాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. -నరేంద్రసింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయశాఖమంత్రి (2020, ఆగస్టు 27)
వ్యవసాయరంగానికి వెలుగు రేఖ తెలంగాణ అమలుచేస్తున్న రైతుబంధు వ్యవసాయరంగానికి ఓ వెలుగు రేఖ. ఈ పథకం రైతుకు ఆర్థిక భరోసాను ఇస్తుంది. కరోనా సంక్షోభంలోనూ తెలంగాణలో వ్యవసాయం పండుగలా ఉండేందుకు ఈ పథకం ప్రధాన కారణం. అన్ని రాష్ర్టాలు ఇలాంటి పథకాలపై ఆలోచన చేయాలి. – గోవిందరాజులు, నాబార్డ్ చైర్మన్ (2020, ఆగస్టు 27)
కనీస ఆదాయానికి మార్గం రైతుబంధు ఎప్పటికైనా దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన పథకం. దేశంలో ప్రధాన డిమాండ్‌గా ఉన్న కనీస ఆదాయం పాలసీకి ఇది నాందిగా చెప్పుకోవచ్చు. ఈ పథకం వ్యవసాయరంగాన్ని ఆచరణీయంగా, లాభదాయకంగా మారుస్తుంది. దీంతో రైతుల ఆదాయం రెట్టింపు చేయొచ్చు. – అరవింద్ సుబ్రమణ్యన్, ప్రధానమంత్రి మాజీ ముఖ్య ఆర్థికసలహాదారు
చీకటిలో వెలుగురేఖ రైతుబంధు పథకం రైతులకు చీకటిలో వెలుగురేఖ వంటిది. పెట్టుబడి కోసం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న రైతుకు ఈ పథకంతో ఇచ్చే సాయం ఉపశమనంగా ఉంటుంది. ఇలాంటి పథకాల గురించి అన్ని రాష్ర్టాలు ఆలోచించాలి. అప్పుడే రైతుకు భరోసా. – ఎంఎస్ స్వామినాథన్ (2019, జనవరి 20)
ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పథకం రైతులకు ఆర్థిక భరోసా ఇస్తున్నది. ఆర్థిక బాధలను తగ్గించడానికి ఇదొక ఉత్తమ మార్గం. వ్యవసాయం చేసే రైతులను గుర్తించి ఎకరాకు కొంత మొత్తం ఆర్థిక సాయం చేయడం మంచి నిర్ణయం. – రఘురామ్ రాజన్, ఆర్బీఐ మాజీ గవర్నర్
ఐరాస టాప్ 20 పథకాల్లో రైతుబంధు తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం వినూత్నమైన పథకాలను ప్రవేశపెట్టింది. రైతుబంధు.. రైతులను అన్నివిధాలా ఆదుకుంటుంది. దీనిగురించి విని ఆశ్చర్యపోయా. అందుకే వ్యవసాయంలో ప్రపంచవ్యాప్తంగా 700 పథకాల వివరాలకు ఐరాసాకు చేరగా.. రైతుబంధు టాప్-20లో ఒకటిగా నిలిచింది. -జోస్ గ్రాసినో డిసిల్వా, ఎఫ్‌ఏవో డైరెక్టర్ జనరల్
వ్యవసాయరంగ సంక్షోభ నివారణకు ఫార్ములా తెలంగాణ రైతుబంధు పథకం వ్యవసాయరంగ సంక్షోభ నివారణకు మంచి ఫార్ములా. ఈ పథకాన్ని కేంద్రంతోపాటు అన్ని రాష్ర్టాలు అమలుచేస్తే రైతుల కష్టాలు తీరుతాయి. రైతులు ధీమాగా వ్యవసాయం చేయాలంటే ఇలాంటి భరోసా పథకాలను ప్రవేశపెట్టాల్సిందే. -ప్రొఫెసర్ రమేశ్ చంద్, నీతి ఆయోగ్ సభ్యుడు
ఆసక్తికరమైన పథకం రైతుబంధు పథకం ఆసక్తికరంగా ఉన్నది. ఆర్థికంగా ఇబ్బందిపడే రైతులకు నేరుగా పంట పెట్టుబడి ఇవ్వడం మంచి ఆలోచన. దీనివల్ల రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరుగడంతోపాటు ఆదా యం కూడా పెరుగుతుంది. -అశోక్ గులాటీ, ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త
చిన్న రైతులకు అండ రైతుబంధు పథకం ఎంతో అభినందనీయం. ఈ పథకం అమలు చేయడం ద్వారా ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు అండగా ఉన్నైట్లెంది. ఈ పథకం వల్ల సాగు విస్తీర్ణం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. -ఆర్‌ఎస్ పరోడా, ఐకార్ మాజీ డైరెక్టర్ జనరల్
అద్భుతమైన పథకం రైతుబంధు అద్భుతమైన పథకం. లక్షల మంది రైతులకు ఒకేసారి పెట్టుబడి అందించేలా పథకం అమలుచేయడం గొప్ప విషయం. మా అధ్యయనంలో కూడా పథకం అమలు భేష్ అని తేలింది. ఈ పథకం వల్ల రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. -ప్రపంచబ్యాంక్
పెట్టుబడికి అప్పు తెచ్చెటోన్ని సీఎం కేసీఆర్ ఇత్తున్న రైతుబంధు పైసలు మాకు మస్తు పనికొస్తున్నయి. రైతుబంధు రాకముందు ఎవుసం పెట్టుబడికి అప్పు తెచ్చెటోన్ని. రైతుబంధు పైసలు వచ్చినప్పటి నుంచి ఇగ అప్పు తెత్తలేను. – పోశయ్య, రైతు, జూలూరు గ్రామం, భూదాన్‌పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా