Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఢిల్లీలో యాచించడం కాదు.. శాసిద్దాం

-ఇద్దరు ఎంపీలతో రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం..
-పదహారు మందితో ఏదైనా సాధించవచ్చు
-కేసులతో పాలమూరును అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు
-వ్యక్తుల మధ్య కాదు.. పార్టీల మధ్యే పోటీ
-111 జీవోకు త్వరలో పరిష్కారం
-డాక్టర్ రంజిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి
-పరిగి, చేవెళ్ల రోడ్‌షోలలో కేటీఆర్

ఢిల్లీలో యాచించడం కాదు.. శాసించి రాష్ర్టానికి రావాల్సిన నిధులు తెచ్చుకుందామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు. 16 మంది ఎంపీలను గెలిపిస్తే ఏవైనా సాధించవచ్చని అన్నారు. దేశాన్ని 71 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ దేశానికి చేసిందేమీలేదని, ఇప్పటికీ కరంటులేని ఊళ్లు, రోడ్లు లేని గ్రామాలు అనేకం ఉన్నాయని తెలిపారు. ఆదివారం చేవెళ్ల టీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డికి మద్దతుగా చేవెళ్ల, పరిగిలో నిర్వహించిన రోడ్‌షోలలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ రోడ్‌షోలకు భారీసంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. చేవెళ్లలో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్నప్పటికీ కేటీఆర్ ప్రసంగాన్ని విన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఓటేస్తే రాహుల్‌గాంధీకి లాభం, బీజేపీకి ఓటేస్తే మోదీకి లాభం అని.. అదే టీఆర్‌ఎస్‌కు వేస్తే తెలంగాణ గడ్డకు ప్రయోజనమని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా ప్రకటిస్తారని ప్రజ లు ఆశించారని.. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై విమర్శలు చేసి వెళ్లిపోయారని విమర్శించారు. 16 మంది ఎంపీలు ఉం టే ఏం చేస్తారంటున్నారని.. ఇద్దరు ఎంపీలతోనే రాష్ట్రం సాధించిన సీఎం కేసీఆర్.. అదే 16 మంది ఎంపీలు ఉంటే ఏం చేస్తారో ఆలోచించండని కేటీఆర్ అన్నారు. ఢిల్లీకి 16 మంది గులాబీ సైనికులను పంపిస్తే హైదరాబాద్‌కు బుల్లెట్ రైలు ఎందుకు రాదు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా ఎందుకు రాదుఅని ప్రశ్నించారు. పాలమూ రు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు ఓవైపు కేసులు వేస్తూ.. మరోవైపు ర్యాలీలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉన్నదని 29 రాష్ర్టాలు ఉండగా 25 రాష్ర్టాల్లో అడ్రస్ లేని పరిస్థితి నెలకొన్నదని, ఆ పార్టీకి 80 నుంచి 90 సీట్లే వస్తాయని జోస్యం చెప్పారు.

కృష్ణానీటితో పరిగి నియోజకవర్గంలోని లక్ష ఎకరాలను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. ఐదేండ్ల కిందట చేవెళ్ల నుంచి పోటీచేసిన వ్యక్తి ఎవరో ఇక్కడి ప్రజలకు పరిచయం లేదని.. అయినప్పటికీ కేసీఆర్ పంపించిన అభ్యర్థి అంటూ ప్రజలం తా నిండు ఆశీర్వాదంతో గెలిపించారని చెప్పా రు. కారణాలు ఏవైనా ఆయన పార్టీని వదిలిపెట్టిపోయారు.. మనకేం బాధ లేదు.. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ జరుగుతున్నది వ్యక్తుల మధ్య కాదు.. కరంట్ అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్‌కు, రైతుల సంక్షేమానికి 24 గంటల కరంట్ అందిస్తున్న టీఆర్‌ఎస్‌కు మధ్య అని కేటీఆర్ చెప్పారు. చేవెళ్ల నియోజకవర్గంలోని 84 గ్రామాల ప్రజలకు ఇబ్బందిగా ఉన్న 111 జీవోను పర్యావరణం, చెరువులకు నష్టంలేకుండా ఎత్తివేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. పర్యావరణవేత్తలుగానీ, కోర్టులుగానీ అభ్యంతరం పెట్టకుండా అతి త్వరలో ఈ సమస్యను పరిష్కరించనున్నట్టు పేర్కొన్నారు.

ఈ జీవో ఎత్తివేతతో చేవెళ్ల ప్రాంతం ఐటీ పరిశ్రమలతో ఐటీహబ్‌గా మా రుతుందని చెప్పా రు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. మంచిపనులు చేస్తున్న కేసీఆర్‌కు ఓటు వే స్తారా లేదా దగుల్ బాజీ పనులు చేస్తూ సాగునీరు రాకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్‌కు ఓటువేస్తారా ఆలోచించండని అన్నారు. చేవెళ్ల టీఆర్‌ఎస్ అభ్యర్ధి రంజిత్‌రెడ్డిని భారీమెజార్టీ తో గెలిపిస్తే నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, కాలె యాదయ్య, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మ న్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి గట్టు రాంచందర్‌రావు, యువ నాయకుడు కార్తీక్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎన్నికల పరిశీలకులు బాబూరావు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.