Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఢిల్లీలో మిషన్ కేటీఆర్!

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన సదస్సులో తెలంగాణ రాష్ట్రం అమలుచేస్తున్న మిషన్ భగీరథ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై కేంద్ర మంత్రి సహా పలు రాష్ర్టాల మంత్రులు, అధికారులు ప్రశంసల జల్లు కురిపించారు. బ్యూరోక్రాట్లకు దీటుగా యువ మంత్రి ఇంత మంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం అభినందనీయమని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ పేర్కొన్నారు. -భగీరథపై ప్రజెంటేషన్ బాగుంది -కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్ ప్రశంసలు -అన్ని రాష్ర్టాలూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచన -ప్రశంసల జల్లు కురిపించిన పలు రాష్ర్టాలు -2016 చివరికల్లా 6852 గ్రామాలకు రక్షిత తాగునీరు -రెండో దశలో 2017 చివరికి 15,077 గ్రామాలకు -2018 చివరి నాటికి మిగిలిన 2295 గ్రామాలకు సరఫరా -కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సదస్సులో మిషన్ భగీరథ ఆవశ్యకత, లక్ష్యాలను వివరించిన కేటీఆర్

KTR-presentation-on-Mission-Bhagiradha-in-New-Delhi

మిగిలిన రాష్ర్టాలు సైతం తాగునీటి వ్యవస్థ నిర్వహణలో తెలంగాణ రాష్ర్టాన్ని అనుసరించాలని కేంద్రమంత్రి సూచించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మూడురోజుల సదస్సులో భాగంగా బుధవారం గ్రామీణ తాగునీటి వ్యవస్థ నిర్వహణ, స్వచ్ఛభారత్ అనే అంశాలపై చర్చాగోష్ఠి జరిగింది. వివిధ రాష్ర్టాల మంత్రులు తమ రాష్ర్టాల్లో గ్రామీణ తాగునీటి నిర్వహణకు అనుసరిస్తున్న విధానాలను ప్రదర్శించారు. మన రాష్ట్రం తరఫున ప్రత్యేకంగా హాజరైన మంత్రి కేటీఆర్ అరగంటపాటు మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రణాళిక మొదలు.. ప్రస్తుతం జరుగుతున్న తొలి దశ పనుల వరకు ఇచ్చిన ప్రజెంటేషన్ అందరినీ ఆకట్టుకుంది. మిషన్ భగీరథ ఆవశ్యకతను వివరించడంతోపాటు.. ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు రక్షిత తాగునీరు ఏ విధంగా అమలవుతుందో కేటీఆర్ వివరించారు.

కేటీఆర్ సుమారు అరగంట పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నంతసేపూ వివిధ రాష్ర్టాల మంత్రులు, అధికారులు పూర్తి దృష్టి కేంద్రీకరించి.. ఆసక్తిగా విన్నారు. అనంతరం కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ మాట్లాడుతూ, సాధారణంగా ఇలాంటి సదస్సుల్లో ఏదైనా ప్రాజెక్టుపై సంబంధిత శాఖ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తుంటారని, స్వయంగా మంత్రులు ఇవ్వరని పేర్కొన్నారు. కానీ యువ మంత్రి కేటీఆర్ స్వయంగా తానే రూపొందించుకున్న ప్రజెంటేషన్ ఇవ్వడం అరుదని అన్నారు. బ్యూరోక్రాట్లకు దీటుగా ప్రజెంటేషన్ ఇచ్చారంటూ కేటీఆర్‌ను అభినందించారు. ఒకరకంగా బ్యూరోక్రాట్లకంటే సమగ్రంగా ఉన్నదని ప్రశంసించారు. మిగిలిన రాష్ర్టాలు కూడా ఈ తరహాలో తమ నిర్దిష్ట తాగునీటి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ప్రాజెక్టులను రూపొందించుకుని, మిషన్ భగీరథనుంచి స్ఫూర్తి పొందాలని కేంద్ర మంత్రి సూచించారు.

ఈ ప్రజెంటేషన్‌ను చూసిన కర్ణాటక అధికారులు స్వయంగా తెలంగాణకు వెళ్ళి ప్రాజెక్టును పరిశీలిస్తామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పర్యటనతోనే దీని ఫలితాలు స్పష్టంగా అర్థమవుతాయని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టును ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, బీహార్ రాష్ర్టాలు ప్రశంసించాయి. ఈ ప్రాజెక్టు తీరు తెన్నులను ప్రజెంటేషన్‌ ద్వారా చూసిన అధికారులు ఆశ్చర్యం వ్యక్తంచేయడంతోపాటు దీనికి సంబంధించిన వివరాలను మంత్రి కేటీఆర్‌ను అడిగి తెలుసుకున్నారు. వాటిని తమకూ ఇవ్వాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి ప్రజలకు రక్షిత తాగునీటిని అందించడానికి జరుగుతున్న ప్రయత్నాలను అన్ని రాష్ర్టాలు చేపట్టడం ద్వారా రాష్ర్టాలు ప్రగతిపథంలో పయనిస్తాయని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ ఆలోచనలతో కార్యాచరణలోకి అంతకు ముందు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో మంత్రి కేటీఆర్ తన ప్రజెంటేషన్‌లో వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తున్నా తాగునీటికి ఎక్కువగా భూగర్భ నీటిపైనే ప్రజలు ఆధారపడుతున్నారని కేటీఆర్ తెలిపారు. ఫ్లోరైడ్ మొదలు ఆర్సెనిక్‌లాంటి అనేక కలుషితాలతో నీటిని తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని, ఫలితంగా అనారోగ్యానికి గురవుతున్నారని, అంతిమంగా రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం చూపుతున్నదని వివరించారు. ఈ కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు మిషన్ భగీరథ (వాటర్ గ్రిడ్) ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిందని వివరించారు. తొమ్మిది జిల్లాల్లో ఉన్న 99 శాసనసభా నియోజకవర్గాల్లోని 437 గ్రామీణ మండలాల్లో 8770 పంచాయతీల్లోని 24802 గ్రామాల్లో ఈ ప్రాజెక్టు అమలవుతుందని తెలిపారు.

సుమారు 2.36 కోట్ల గ్రామీణ ప్రజానీకం, 53.31 లక్షల పట్టణ ప్రజానీకానికి ఈ ప్రాజెక్టు ద్వారా రక్షిత తాగునీరు లభిస్తుందని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం సుమారు రూ.40 వేల కోట్లను ఖర్చు పెడుతున్నదని తెలిపారు. తొలి విడతగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.4000 కోట్లను మంజూరు చేసిందని, ఇందులో డిసెంబర్‌ నాటికి రూ.537.16 కోట్లు ఖర్చయిందని, మరో రెండు నెలల్లో రూ. 2,240 కోట్లు ఖర్చు కావాల్సి ఉందని తెలిపారు. తొలి దశ పనులు ముగింఫులో ఉన్నాయని, ఏప్రిల్‌కల్లా తొమ్మిది నియోజకవర్గాల్లోని 2022 గ్రామాల్లో ఈ పథకం వినియోగంలోకి వస్తుందని మంత్రి కేటీఆర్ వివరించారు.

కాలపరిమితితో ముందుకెళ్తున్నాం ఈ ప్రాజెక్టు కోసం కొత్త పైప్‌లైన్ నిర్మాణ పనులు చేయాల్సి ఉందని మంత్రి తెలిపారు. నీటిని శుద్ధి చేయడం, నిల్వ చేయడం తదితర అవసరాలన్నింటికోసం సుమారు 181 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని చెప్పారు. ఇందుకోసం 32 ప్రాంతాల్లో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం కూడా జరుగుతున్నదని వివరించారు. ఈ ప్రాజెక్టును అనుకున్న విధంగా విజయవంతంగా పూర్తి చేయడం కోసం ముఖ్యమంత్రి మొదలు గ్రామీణ ప్రాంతాల్లో కిందిస్థాయి ఉద్యోగుల వరకు నిర్దిష్ట కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని పని చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 2016 చివరికల్లా సుమారు 28% పనుల్ని పూర్తిచేసి 6852 గ్రామాలకు రక్షిత తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

ఆ తర్వాతి దశలో 2017 చివరికల్లా మరో 62% పనుల్ని పూర్తిచేసి 15,077 గ్రామాలకు, 2018 చివరి నాటికి మిగిలిన 10% పనుల్ని పూర్తి చేసి 2295 గ్రామాలకు రక్షిత తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ప్రస్తుతం ఆశించిన స్థాయిలోనే పనులు జరుగుతున్నాయని, అనుకున్న విధంగానే 2018 చివరికల్లా మొత్తం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తెలంగాణ తాగునీటి సరఫరా కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థను నెలకొల్పిందని మంత్రి చెప్పారు. పనుల్ని అనుకున్న విధంగా పర్యవేక్షించడానికి అవసరమైన సంఖ్యలో ఇంజినీర్లు లేకపోవడంతో కొత్తగా 1238 పోస్టుల్ని సృష్టించి నియామకం చేసినట్టు వివరించారు. ఈ ప్రాజెక్టును వ్యాప్కోస్ సంస్థ అధ్యయనం చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించిందని తెలిపారు.

ఈ ప్రాజెక్టుకు మొత్తం 39.27 టీఎంసీల నీరు అవసరమని, ఇందులో గోదావరి నది నుంచి 19.62 టీఎంసీలు, కృష్ణానది నుంచి 19.65 టీఎంసీల నీటిని వినియోగిస్తామని తెలిపారు. ప్రతి ఇంటికీ నల్లాద్వారా రక్షిత తాగునీటిని అందించాలంటే వివిధ గ్రామాలగుండా 51,227 కి.మీ. మేర పైప్‌లైన్ సరఫరా వ్యవస్థ అవసరమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. కొన్నిచోట్ల ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూమి, అసైన్డ్ భూమి, అటవీ భూములతోపాటు చివరకు రక్షణ శాఖకు చెందిన భూములగుండా కూడా పైప్‌లైన్ నిర్మాణం జరుగాల్సి ఉందని చెప్పారు. అన్ని రకాల అనుమతులు మంజూరైతే అనుకున్నట్లుగా నిర్దిష్ట మూడేండ్ల కాలపరిమితిలోనే పూర్తి చేస్తామని కేటీఆర్ స్పష్టంచేశారు.

1.30 లక్షల కి.మీ. పైప్‌లైన్ వ్యవస్థ నీటి శుధ్ధికి ప్రస్తుతం ఉన్న 60 వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లద్వారా రోజుకు 812 మిలియన్ లీటర్ల నీరు శుద్ధి అవుతున్నదని కేటీఆర్ తెలిపారు. ఇంకా 50 ప్లాంట్లను ఏర్పాటు చేసి 3311 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేయనున్నామని చెప్పారు. ఇందుకోసం ఎంపిక చేసిన ప్రాంతాల్లో పెద్దపెద్ద నీటి నిల్వ ట్యాంకులను నెలకొల్పుతున్నామని తెలిపారు. గ్రామంలో చిట్టచివరి ఇంటి వరకూ పైప్‌ల ద్వారా తాగునీరు అందాలంటే మొత్తం 1.30 లక్షల కి.మీ. మేర పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు కావాల్సి ఉందని తెలిపారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ రోజుకు కనీసం 100 లీటర్లు, మున్సిపాలిటీ ప్రాంతాల్లో 135 లీటర్లు, కార్పొరేషన్ ప్రాంతాల్లో 150 లీటర్ల చొప్పున అందించడం వీలవుతుందని చెప్పారు. తాగునీటికి మాత్రమే కాకుండా 10% నీటిని పరిశ్రమలకు కూడా కేటాయించనున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ రెండు నదులద్వారా తీసుకుంటున్న సాగునీటిలో 10% మొత్తాన్ని తాగునీటికి ఈ ప్రాజెక్టు ద్వారా మళ్ళించనున్నామని చెప్పారు.

కేంద్రం సాయం అడిగాం.. ఇప్పటికీ అందలేదు మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్లు అవసరమవుతున్నందున కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని అడిగామని, ఇప్పటివరకు అందలేదని అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాకు చెప్పారు. అయినా కేంద్రం మీద ఆధారపడకుండా స్వంతంగా తామే పూర్తి చేయాలని భావిస్తున్నామని తెలిపారు. హడ్కో, నాబార్డ్ సంస్థల నుంచి మాత్రమే కాకుండా నీతి ఆయోగ్ నుంచి కూడా ఆర్థిక సాయం కోసం ముఖ్యమంత్రి లేఖలు రాశారని కేటీఆర్ గుర్తు చేశారు. అన్ని రాష్ర్టాలకు కలిపి రూ.1000 కోట్లు ఇవ్వడానికి నీతి ఆయోగ్ ముందుకొచ్చిందని, మొత్తం వెయ్యి కోట్లను తెలంగాణకే ఇచ్చినా ఈ ప్రాజెక్టుకు పెద్దగా ఉపయోగం ఉండదని అన్నారు. కేంద్రంపై ఆధారపడకుండా స్వంతంగా కూడా ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికగా ఉన్న ఈ ప్రాజెక్టును అమలుచేసి ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షలను నిజం చేస్తామని తెలిపారు.

ప్రజల ఆరోగ్యాన్ని, రోజురోజుకూ అడుగంటిపోతున్న భూగర్భ నీటి మట్టాల్ని దృష్టిలో పెట్టుకుని రక్షిత తాగునీటిని అందించాలని భావిస్తున్నామని తెలిపారు. అనుకున్న విధంగా మూడేండ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అధికారుల మధ్య సమన్వయం జరుగుతూ ఉన్నదని, అన్ని స్థాయిల్లోనూ పనులు ఆశించిన మేరకు జరిగేలా పర్యవేక్షణ యంత్రాంగం కూడా ఉందని తెలిపారు. స్వయంగా కేంద్రమంత్రి తనను పిలిపించి అన్ని రాష్ర్టాలకూ మిషన్ భగీరథ గురించి వివరించాల్సిందిగా కోరినందుకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టును అభినందించడం మాత్రమే కాకుండా అన్ని రాష్ర్టాలూ స్ఫూర్తిగా తీసుకుని ఈ తరహాలో ప్రాజెక్టులను రూపొందించుకోవాలని ఆయా రాష్ర్టాల మంత్రులకు కేంద్ర మంత్రి సూచించడం సంతోషంగా ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

తెలంగాణకు మరో అవార్డు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ తెలంగాణకు అవార్డును ప్రదానం చేశారు. ప్రతి రాష్ట్రంలోనూ వంద రోజుల వ్యవధిలో ఒక తాగునీటి పరీక్షా ప్రయోగశాలను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేయగా తెలంగాణ ప్రభుత్వం నాలుగు రోజుల ముందుగానే, అంటే 96 రోజుల వ్యవధిలోనే నెలకొల్పినందుకుగాను కేంద్రం ఈ అవార్డును ఇచ్చింది. కేంద్రం ప్రణాళిక ప్రకారం ఇలాంటి ప్రయోగశాలను నెలకొల్పిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ఈ అవార్డును స్వయంగా కేటీఆర్‌కు మంత్రి అందజేశారు. ఈ అవార్డు పట్ల కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.