-మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, భూసార పథకాలను కొనియాడిన ప్రధాని మోదీ -మీ దూరదృష్టి ఆదర్శనీయమని వ్యాఖ్య -ఇవి శాశ్వత పరిష్కారాలంటూ కేంద్ర మంత్రులకు సూచనలు -వెంటనే అధ్యయనం చేయాల్సిందిగా అధికారులకు ఆదేశం -కొత్త జాతీయ పథకాల్లో ఈ అంశాలను చేర్చాలని సూచన -కరువు నివారణ చర్యలను వివరించిన సీఎం కేసీఆర్ -తాగునీరు, సాగునీరు సమస్యలకు తక్షణ, దీర్ఘకాల చర్యలు -పర్యావరణ సమతుల్యత కోసం హరితహారం చేపట్టినం -రాష్ట్ర భారీ ప్రణాళికలకు కేంద్రం నిధులిచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి -ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరిన ముఖ్యమంత్రి

రాష్ట్రంలో కరువు సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకుంటున్న చర్యలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. వెంటనే ఊరటనిచ్చేందుకు తక్షణ చర్యలు.. శాశ్వత పరిష్కారం కోసం దీర్ఘకాలిక చర్యలు చేపట్టడాన్ని అభినందించారు. ప్రత్యేకించి తాగునీటి సమస్య నివారణకు మిషన్ భగీరథ, సాగునీటి సమస్య పరిష్కారానికి మిషన్ కాకతీయతోపాటు భూసార పరీక్షల పథకాలను అమలు చేస్తుండటాన్ని కొనియాడారు. రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్షం, కరువు పరిస్థితులను వివరించి, ఆర్థికసాయం కోరేందుకు వచ్చిన ముఖ్యమంత్రితో మంగళవారం భేటీ సందర్భంగా ఆయన సంతృప్తి వ్యక్తంచేస్తూ ప్రతిస్పందించారు. ప్రధాని కార్యాలయంలో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటిగంటన్నర వరకు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా హాజరుకాగా, ప్రధాని నరేంద్రమోదీతోపాటు వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సిబ్బంది వ్యవహారాల మంత్రి జితేంద్రసింగ్, పలువురు కేంద్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ వెల్లడించిన వివరాలపై ప్రధాని సంతృప్తి చెందడం మాత్రమే కాకుండా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, భూసార పరీక్షల పథకాలపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో అమలవుతున్న ఈ మూడు ప్రాజెక్టులను స్వయంగా అధ్యయనం చేసి ఇతర రాష్ట్రాలకు కూడా అమలు చేయడంపై సూచనలు ఇవ్వాల్సిందిగా కేంద్ర మంత్రులను, అధికారులను ప్రధాని ఆదేశించారు. దేశవ్యాప్తంగా జాతీయ పథకాలుగా ప్రవేశపెట్టడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించాల్సిందిగా సూచించారు. కరువును ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న తక్షణ, దీర్ఘకాలిక ప్రణాళికలను ప్రధానికి కేసీఆర్ వివరించారు. పథకాల సమగ్ర అమలు ద్వారా భవిష్యత్తులో రైతులకు, సామాన్యులకు కలిగే ప్రయోజనాలను వివరించి వీటికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వర్షాభావం తీవ్ర ప్రభావం చూపిస్తున్నదని, కరువుతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం (714 మి.మీ.) కంటే ఈసారి 14% తక్కువ నమోదైందని, కేవలం 610 మి.మీ. మాత్రమే కురిసిందని, భూగర్భ జలాలు అడుగంటాయని తెలిపారు.
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణమని వివరించారు. నిజామాబాద్ జిల్లాల్లో మైనస్ 45%, మెదక్‌లో మైనస్ 35%, రంగారెడ్డిలో మైనస్ 27%, మహబూబ్‌నగర్‌లో మైనస్ 25% నమోదైనట్లు వివరించారు. 231 గ్రామీణ మండలాల్లో తీవ్ర కరువు నెలకొన్నదని, వాటిని కరువు మండలాలుగా ప్రకటించామని తెలిపారు. 5519 గ్రామాలు, 12,680 నివాస ప్రాంతాలు కరువుబారీన పడ్డాయన్నారు. ఈ కారణంగా ఈ ప్రాంతాల్లోని సుమారు 1.70 కోట్ల మంది ప్రభావితులయ్యారని తెలిపారు. ఈ ప్రాంతాల్లో సహాయ చర్యలకు రూ.3,064 కోట్ల మేర ఆర్థికసాయం కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశామని, కానీ జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి కేంద్రం రూ. 791.21 కోట్లకు మాత్రమే అనుమతులు మంజూరు చేసిందని చెప్పారు. ఇప్పటివరకు మూడు విడతలుగా రూ.712.62 కోట్లు మాత్రమే విడుదల చేసిందంటూ, మిగతా మొత్తం విడుదల చేయాలని ప్రధానిని కోరా రు. కేంద్ర సాయాన్ని కరువు ప్రాంతాల్లో రైతులను ఆదుకొ నేందుకు, జాతీయ ఉపాధి హామీ కార్మికులకు వేతనాల కోసం వినియోగించాలనుకున్నామని, కానీ కేంద్రం ఇచ్చిన రూ.712.62 కోట్లలో రూ.702.71 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీకి కాగా, రూ.88.50 కోట్లు మాత్రమే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కోసం ఉద్దేశించినవని తెలిపారు.
కరువు నివారణకు అనేక చర్యలు.. కరువు ప్రాంతాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న తక్షణ, స్వల్పకాల ప్రయోజనాలతోపాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం లాంటి దీర్ఘకాల ప్రణాళికల గురించి కేసీఆర్ వివరించారు. కరువుతో సుమారు 13.52 లక్షల హెక్టార్లలోని పంటలు దెబ్బతినడంతో సుమారు 21.78 లక్షల మంది రైతులు నష్టపోయారని తెలిపారు. ప్రధాన పంటలైన పత్తి (6.50 లక్షల హెక్టార్లు), మొక్కజొన్న (2.67 లక్షల హెక్టార్లు), సోయాబీన్ (1.03 లక్షల హెక్టార్లు) భారీగా దెబ్బతిన్నాయన్నారు. వీటికితోడు సుమారు 23,700 హెక్టార్లలో కూరగాయలు, మామిడి, బత్తాయి, పసుపు, మిరప తదితర ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని, సుమారు 49,500 మంది రైతులు నష్టపోయారని తెలిపారు. పత్తి పంటకు వరుసగా జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని పత్తిని సాగుచేయొద్దని రైతులకు సూచించామని, ఆ విధంగా 17.73 లక్షల హెక్టార్లలో సాగయ్యే పత్తి ఈసారి సుమారు 60% తగ్గి కేవలం 10.64 లక్షల హెక్టార్లకు మాత్రమే పరిమితమైందన్నారు. సోయాబీన్, మొక్కజొన్న, మినుములు తదితర ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రైతులకు అవగాహన కలిగించినట్లు తెలిపారు.
రైతుల్ని ఆదుకోడానికి కేంద్రం నుంచి ఎంత త్వరగా నిధులు విడుదలైతే అంతే త్వరగా ఇన్‌పుట్ సబ్సిడీని అందజేయగలుగుతామని ప్రధానికి స్పష్టం చేశారు. రైతులను ఆర్థిక భారం నుంచి విముక్తి కల్పించడం కోసం సుమారు రూ. 17 వేల కోట్ల మేరకు రుణమాఫీ అందజేయాలని ప్రభుత్వం భావించిందని, రెండు విడతలుగా ఇప్పటివరకు సుమారు రూ.8080 కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకే చేరవేసిందని, రానున్న ఖరీఫ్ సీజన్‌లో మరో రూ. 4040 కోట్లను విడుదల చేయనున్నదని, దీని ద్వారా సుమారు 36 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని ప్రధానికి కేసీఆర్ వివరించారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని అవగాహన కల్పించడంతోపాటు సూక్ష్మ సేద్యం, బిందు సేద్యం, తుంపరసేద్యం తదితరాల గురించి వివరించామని, ఇప్పటివరకు 39,847 హెక్టార్లకు బిందుసేద్యం ఉపకరణాలను అందించినట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రూ.302 కోట్లను ఖర్చు చేయనున్నదని, మరో 38,640 హెక్టార్లకు రూ.302 కోట్లను విడుదల చేయనున్నదని తెలిపారు. కరువు పరిస్థితుల్లో పశువులకు ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో 231 కరువు మండలాల్లో ఉన్న సుమారు 64 లక్షల పశువులకు జూన్ వరకు 5.58 లక్షల టన్నుల పశుగ్రాసాన్ని అందిస్తున్నామని, ఇందుకోసం రూ.9.88 కోట్లను ఖర్చు చేస్తున్నదని సీఎం చెప్పారు. పశుగ్రాస క్యాంపులను ఏర్పాటుకు రూ.162 కోట్లను ఖర్చు చేశామని తెలిపారు.
ప్రతి రైతుకు రెండు పశువుల చొప్పున ఒక్కో పశువుకు రోజుకు రెండు కిలోల చొప్పున పశుగ్రాసాన్ని అందిస్తున్నామని, ఇందుకోసం అదనంగా రూ.15 కోట్లను ఖర్చు చేశామని చెప్పారు. పశువులకు తాగునీటిని అందుబాటులో ఉంచేందుకు 10,622 నీటి తొట్టెలను ఏర్పాటు చేశామన్నారు. పశుగ్రాస అవసరాలకు రూ.75.90 కోట్లను విడుదల చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని, ఇప్పటివరకు విడుదల కాలేదని ప్రధానికి కేసీఆర్ గుర్తు చేశారు. కరువును దృష్టిలో పెట్టుకుని వెంటనే ఈ నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కరువు పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఆహార సమస్య తలెత్తరాదన్న ఉద్దేశంతో వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనాన్ని సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, ఈ విధంగా సుమారు 24 లక్షల మంది విద్యార్థులకు భోజనాన్ని సమకూరుస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అదే విధంగా రేషనుకార్డు ఉన్న ప్రతి కుటుంబానికి చౌకధరల దుకాణాల ద్వారా సబ్సిడీ బియ్యాన్ని అందించే పథకాన్ని పకడ్బందీగా అమలుచేస్తున్నామని, ప్రతి వ్యక్తికి నెలకు ఆరు కిలోల చొప్పున కిలోను ఒక్క రూపాయికే అందజేస్తున్నామని వివరించారు. కుటుంబంలో ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికీ అందజేయాలని ప్రభుత్వం భావించిందని, ఇందుకోసం రూ.2,500 కోట్లను కేటాయించిందని తెలిపారు. బియ్యానికితోడు కిరోసిన్, గోధులను కూడా సబ్సిడీ మీద అందజేస్తున్నదని తెలిపారు.
తాగునీటి సరఫరాకు పకడ్బందీ ప్రణాళిక కరువు, వేసవి పరిస్థితుల్లో తాగునీటికి తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చాలా ముందుచూపుతో వ్యవహరించిందని ప్రధానికి ముఖ్యమంత్రి తెలిపారు. భూగర్భ జలాలు అడుగంటడంతో ట్యాంకర్ల ద్వారా ఇతర ఏర్పాట్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. తక్కువ వర్షపాతం నమోదైనందువల్ల భూగర్భ జలాలు మరో 2.61 మీటర్ల మేర పడిపోయాయని, 28,310 బోర్లు ఎండిపోయాయని వివరించారు. వేసవి నీటి ఎద్దడిని ఎదుర్కోవడం కోసం సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద రూ.303.60 కోట్లను ఖర్చు చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటివనరులే లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా ప్రతి కుటుంబానికి తాగునీరు అందించడం కోసం 2420 గ్రామాల్లో 7208 ప్రైవేటు బోర్లను కిరాయికి తీసుకుని తగిన ప్రత్యామ్నాయాన్ని చేపట్టామని తెలిపారు. తక్షణం ప్రజలకు ఉపశమనం కలిగే విధంగా కేంద్రం జాతీయ గ్రామీణ తాగునీటి పథకం కింద రూ. 227 కోట్లను విడుదల చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడం కోసం తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందని,వచ్చే సంవత్సరం డిసెంబరునాటికి 90% పథకాన్ని అమలులోకి తేవాలనుకుంటున్నామని, ఆశించిన విధంగానే పూర్తవుతుందన్న దీమా ఉందని తెలిపారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు శాశ్వత ప్రాతిపదికన మిషన్ భగీరథను చేపట్టామని, రాష్ట్రంలోని 24,224 ఆవాసాల్లోని ప్రతి ఇంటికీ తాగునీరందిస్తామని వివరించారు. ఈ ఏడాది చివరికల్లా సుమారు 6000 ఆవాసాలకు అందజేస్తామని తెలిపారు.
భవిష్యత్తు కోసం సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణ నుంచి కరువును, సాగునీటి కొరతను శాశ్వతంగా నిర్మూలించేందుకు మిషన్ కాకతీయ పేరుతో బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని, మొత్తం నాలుగు దశల్లో రాష్ట్రంలోని 46 వేల చెరువులను పునరుద్ధరించనున్నామని ప్రధానికి కేసీఆర్ వివరించారు. తొలిదశలో రూ.2591 కోట్లను ఖర్చుచేసి 8105 చెరువులను పునరుద్ధరించామని, ఆక్రమణలను తొలగించామని, వర్షం కురియగానే వీటిలోకి నీరు చేరడానికి సిద్ధంగా ఉంచామని తెలిపారు. రెండో దశ కూడా ప్రారంభమైందని, ఈ దశలో 10,124 చెరువుల మరమ్మత్తు పనులకు రూ. 2969 కోట్లను ఖర్చు చేస్తున్నామన్నారు. దీంతో 4200 గ్రామాల్లో సాగునీటి సమస్యలు తీరుతాయన్నారు. మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణలో ఇకపైన సాగునీటి సమస్యలే తలెత్తబోవని, భూగర్భ జలమట్టం గణనీయంగా పెరుగుతుందన్నా రు. దీనికితోడు చాలా ముందుచూపుతో సుమారు 280 టీఎంసీల నీటిని సద్వినియోగానికి 38 ప్రాజెక్టులు, బ్యారేజీల నిర్మాణానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, పొరుగు రాష్ట్రాలతో కూడా చర్చలు ప్రారంభించామన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటా నీరు సమర్థంగా వినియోగంతోపాటు, భవిష్యత్తులో ఎంతటి కరువు వచ్చినా సాగునీటి కోసం సమస్యలు తలెత్తవద్దనే ఉద్దేశంతోనే బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నామన్నారు. వర్షపు నీరు వృథా కాకుండా భూగర్భ జలమట్టం పెరిగే విధంగా సుమారు 4.20 లక్షల ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టామన్నారు.
అభివృద్ధికి నిధులివ్వండి.. ఒక ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వండి.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కొత్తగా ఏర్పడిన తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, ఇందుకోసం ప్రతి జిల్లాకు సంవత్సరానికి రూ.50 కోట్ల చొప్పున కేంద్రం ఆర్థిక సాయం చేస్తూ ఉన్నదని సీఎం గుర్తుచేశారు. తొమ్మిది జిల్లాల్ని వెనుకబడిన జిల్లాలుగా గుర్తించిన కేంద్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి మాత్రమే ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.450 కోట్లను విడుదల చేసిందంటూ మిగిలిన డబ్బుల్ని కూడా ఇవ్వాలని ప్రధానిని కోరారు. ఏపీకి రెండు విడతలుగా రూ.700 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మాత్రం ఒక్కసారే విడుదల చేసిందన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకూ సమానంగా నిధులు విడుదల కావాల్సి ఉన్నదని గుర్తుచేశారు. సాగునీటి అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లను కేటాయించిందని, ఈ కేటాయింపుల నుంచి మిషన్ కాకతీయకు ఆర్థికసాయం చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న 38 ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని, దీనికి ఆమోదం తెలియజేయగానే సంబంధిత ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదికను, ప్రతిపాదనలను పంపుతామని ప్రధానికి కేసీఆర్ స్పష్టం చేశారు.
కరువుకు శాశ్వత పరిష్కారం పర్యావరణమే భూమిపై తగిన నిష్పత్తిలో చెట్లులేకపోవడంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతిన్నదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ విస్తీర్ణంలో 33% మేరకు అడవులను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని, ఇందులో భాగంగానే 230 కోట్ల మొక్కలను నాటాలని హరితహారం పేరుతో ఒక పథకానికి శ్రీకారం చుట్టిందని సీఎం వివరించారు. వర్షాలు సరిగ్గా కురవకపోవడానికి, రుతువుల్లో మార్పులు రావడానికి, వేసవితాపం పెరిగిపోవడానికి ప్రకృతిలో ఏర్పడిన మార్పులే కారణమని, ఇందుకోసం మైదాన ప్రాంతాల్లో 120 కోట్ల మొక్కలను, హైదరాబాద్ నగరంలో 10 కోట్ల మొక్కలను నాటనున్నామని చెప్పారు. మరో 100 కోట్ల మొక్కలను అటవీ ప్రాంతంలోనే నాటనున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం రూ.300 కోట్లను ఇందుకోసం కేటాయిస్తున్నామని, గత సంవత్సరం ఈ పథకాన్ని ప్రారంభించామని, వర్షాలు తగ్గిపోవడంతో తాత్కాలికంగా నిలిపేసి మళ్ళీ మరో నెల రోజుల్లో వర్షాలు ప్రారంభం కాగానే తిరిగి మొదలుపెడుతామని చెప్పారు.
పూడికతీత పనులకు ఉపగ్రహ పరిజ్ఞానం కేసీఆర్‌తో భేటీపై ట్వీట్ చేసిన ప్రధాని మోదీ సీఎం కే చంద్రశేఖరరావుతో మంగళవారం మధ్యాహ్నం జరిగిన భేటీ వివరాలను ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ప్రస్తావించారు. తెలంగాణలో ని కరువుతోపాటు తాగునీటి పథకాలు, సాగునీటి పథకాలు, పూడికతీత పనులకు ఉపగ్రహ పరిజాన వినియోగం, రాష్ట్రంలో కరువు పరిస్థితులు, తాగునీటి కొరత, తదితరాలన్నింటినీ తాము చర్చించుకున్నామని ప్రధాని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. పనుల్లో ప్రజల భాగస్వామ్యం గురించి కూడా మాట్లాడుకున్నామని తెలిపారు. నీటి చెరువులను, సహజసిద్ధమైన నీటి తావులను పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టు గురించీ, తక్కువ నీటి వనరులున్నప్పుడు వ్యవసాయంలో సూక్ష్మ సేద్యం విధానాలను అనుసరించడం గురించీ ఈ సమావేశంలో కేసీఆర్ తనకు వివరించారని మోదీ తెలిపారు. మిషన్ భగీరధ గురించి కూడా సీఎం కేసీఆర్ వివరించారని మోదీ పేర్కొన్నారు.
గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం జాతీయ ఉపాధి హామీ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నదని, అందువల్లనే కేంద్రం నుంచి విడుదలైన రూ.1202 కోట్లను పూర్తి స్థాయిలో కార్మికులకు చెల్లించడంతోపాటు రాష్ట్ర వాటాను కూడా పంపిణీ చేశామని, ఆ విధంగా మొత్తం రూ. 1330 కోట్లను ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 13 లక్షల కుటుంబాలకు ప్రతి ఒక్కరికీ సంవత్సరానికి 150 పనిదినాలను కల్పించినట్లు చెప్పారు. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛను పథకం ద్వారా నెలకు తలా వెయ్యి రూపాయల చొప్పున అర్హులందరికీ ఇస్తున్నామని, 35.89 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రతి నెలా తలా రూ.1500 చొప్పున ఇస్తున్నామని, కేంద్రం నుంచి కేవలం రూ.253 కోట్లు మాత్రమే అందుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ.4800 కోట్లను ఇస్తూ ఉన్నదని కేసీఆర్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం రూ.2800 కోట్లను ఖర్చు చేస్తూ 14 లక్షల మందికి స్కాలర్‌షిప్‌లను ఇస్తున్నామని కూడా ప్రధానికి వివరించారు. కరువు పరిస్థితులున్నా సంక్షేమ పథకాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలకుతోడు నగర పంచాయతీలకు కూడా విస్తరింపజేయాలని కోరారు.
కేసీఆర్‌కు ప్రధాని ప్రశంసలుతెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం ప్రాజెక్టుల గురించి కేసీఆర్ చేసిన వివరణలను ఆసక్తితో విన్న ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. ఈ ప్రాజెక్టులు శాశ్వత పరిష్కారం చూపేవిగా ఉన్నాయని, వీటివల్ల దీర్ఘకాల ప్రయోజనాలు కలుగుతాయని వ్యాఖ్యానించిన ప్రధాని పక్కనే ఉన్న మంత్రులకు పలు సూచనలు చేశారు. తెలంగాణలో ఈ ప్రాజెక్టుల అమలుతీరును స్వయంగా తెలుసుకున్న ప్రధాని సంబంధిత అధికారుల్ని వెంటనే ఆ రాష్ట్రానికి వెళ్ళి క్షేత్రస్థాయి పర్యటన చేసి పరిస్థితిని అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల వల్ల దీర్ఘకాలంలో కలిగే ప్రయోజనాలను అంచనా వేయాలన్నారుఏ. ప్రతి రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులను అమలుచేసినట్లయితే అనేక సమస్యలకు, ముఖ్యంగా కరువుకు ఆస్కారం ఉండదని వివరించారు. వీలైతే జాతీయ స్థాయిలో రూపొందించే పథకాలకు వీటినుంచి స్వీకరించాల్సిన అంశాలను కూడా పరిశీలించాలని సూచించారు. ఇప్పటికే మిషన్ కాకతీయపై కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి ప్రశంసలు కురిపించడంతోపాటు పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు గురించి ప్రధానమంత్రి స్వయంగా కేసీఆర్‌ను వివరాలు అడిగి మరీ తెలుసుకుని అధికారులకు ఆదేశాలు జారీచేయడం గమనార్హం. అదే విధంగా సగటు అవసరమైన రక్షిత తాగునీటిని ప్రతి ఒక్కరికీ అందజేయడం కోసం నల్లాల ద్వారానే సంవత్సరం పొడవునా నిరంతరాయంగా సరఫరా చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ గురించి కూడా అడిగి తెలుసుకున్న ప్రధాని ముఖ్యమంత్రి చొరవను, దూరదృష్టిని ప్రశంసించారు. ఈ పథకం పనులు ఏ విధంగా జరుగుతున్నాయో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. కరువుకు, ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని కేసీఆర్ వివరించి హరితహారం గురించి చెప్పడంతో ఈ పథకం దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. అదే విధంగా భూసారాన్ని బట్టి రైతులకు ఎలాంటి పంటలు వేయాలో, ప్రతి సంవత్సరం ఒకే పంటను కాకుండా పంటమార్పిడి అవగాహన కలిగించడంతోపాటు తక్కువ సాగునీటితో ఎక్కువ దిగుబడి వచ్చేలా కేసీఆర్ చేస్తున్న ఆలోచనలను కూడా ప్రధాని అభినందించారు.