Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

దీపం వెలుగులో చదువుకున్న…

-వ్యవసాయానికి మోటతో నీళ్లు కొట్టిన -నాటి కమ్యూనిస్టులిచ్చిన స్ఫూర్తి వేరు -రాష్ట్ర ఉద్యమంలో సంతోషంగా జైలుకెళ్లిన -కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యం -పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి

Palla Rajeshwar Reddy

వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం శోడిషపల్లి మా స్వగ్రామం. నా చిన్నతనంలో కరెంటు సౌకర్యం ఉండేది కాదు. మాది మారుమూల పల్లె అయినందున కనీస రవాణా సౌకర్యాలు సైతం లేకపోయేవి. అమ్మ అనసూయ, నాన్న రాఘవరెడ్డి ముగ్గురు మగ సంతానంలో నేనే పెద్దవాణ్ని. భూములమ్మి మరీ మా ముగ్గుర్నీ ఉన్నత చదువులు చదవించిన ఘనత మా నాన్నది. గ్రామంలో అవకాశం లేనందున 7వ తరగతి వరకు పక్కనే ఉన్న మల్లికుదుర్ల గ్రామంలో చదివా. నిత్యం మా ఊరి నుంచి మల్లికుదుర్లకు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూనే వెళ్లేది. తిరిగి వచ్చిన తర్వాత చదువు పూర్తిగా కిరోసిన్ దీపాల వెలుగులోనే సాగేది. చాలాసార్లు దీపం జుట్టుకు అంటుకోవడంతో వెంట్రుకలు కాలిపోయిన సంఘటనలు అనేకం జరిగాయి. గ్రామంలో కొందరికి డీజిల్ ఇంజిన్లు ఉన్నా.. మా నాన్న వ్యవసాయానికి నీళ్లు పూర్తిగా మోట సాయంతోనే కొట్టే వాళ్లు. నేను అనేక సందర్భాల్లో మోట కొట్టి, పశువుల మేపి నాన్నకు సాయపడేవాన్ని. పల్లెటూరిలో ఉండే కష్టాలతోపాటు అక్కడి ఆప్యాయతానురాగాలు సైతం నేటికీ నాకు చిరపరిచితమే. 7వ తరగతి పూర్తయిన తర్వాత మా ఊరికి కరెంట్ లైన్ వచ్చింది. రవాణా సౌకర్యాలు లేక ఎక్కడికైనా వెళ్లాలంటే ఎడ్ల బండ్లు, గుర్రపు కచ్చడాలు ఉపయోగించిన సంగతి నాకింకా స్పష్టంగా గుర్తుంది. ఆనాటి సౌకర్యాల లేమి చూస్తే అనిపించేది ఎప్పటికైనా ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలనే ఆలోచనలు వచ్చేవి.

డిగ్రీలో ఉండగా ఎస్‌ఎఫ్‌ఐలోకి అడుగులు.. 8 నుంచి 10వ తరగతి వరకు ఖమ్మంలోని మంట్ ఫోర్ట్ స్కూల్‌లో చదివా. మా మేనమామలు ఉండడం వల్ల చదువుల కోసం ఖమ్మం వచ్చాను. మళ్లీ ఇంటర్ హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ తర్వాత.. బీఎస్సీ చదువును ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ కాలేజీలో చదివా. బీఎస్సీ మ్యాథమెటిక్స్ చదువుతున్న సమయంలోనే విద్యార్థు సమస్యలపై పోరాటంలో సాగి.. సీపీఐ(ఎం) అనుబంధమైన ఎస్‌ఎఫ్‌ఐలో నాయకుడిగా ఎదిగా. నాలో ప్రగతిశీల భావజాలం పెంపొందడానికి ఎస్‌ఎఫ్‌ఐ ప్రధానంగా తోడ్పడింది. ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కాలేజీలో లెక్చరర్ల బృందం సైతం అనునిత్యం నన్ను ప్రోత్సహిస్తూ చదువుల్లో ముందుకు నడిపించేది. ఒక్కరి పేరు చెప్పి.. తక్కువ చేయలేను కానీ.. అక్కడి వాళ్లంతా నన్ను తీర్చిదిద్దిన మహనీయులే. ఖమ్మం పట్టణ ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శిగా పని చేశాను.

ఉస్మానియాలో పీహెచ్‌డీ.. డిగ్రీ తర్వాత ఓయూకు చేరింది నా చదువుల ప్రస్థానం. ఎమ్మెస్సీ ఎంట్రన్స్‌లో ఉస్మానియా విశ్వ విద్యాలయ స్థాయిలో 6వ ర్యాంకు సాధించాను. ఆ తర్వాత ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ సైతం ఓయూలోనే చేశా. పీహెచ్‌డీ సందర్భంగా యూజీసీ ఫెలోషిప్‌కు ఎంపికైన ఏకైక విద్యార్థిని నేనొక్కడిని మాత్రమే. రీసెర్చ్ విభాగంలో జరిగిన ఒక పరిశోధనలోనూ నాకు బెస్ట్ పేపర్ అవార్డు దక్కింది. ఒక వైపు చదువుల పరంపర కొనసాగిస్తూనే.. హైదరాబాద్‌లోనూ విద్యార్థి సంఘాల నాయకుడిగా చురుకైన పాత్ర పోషించాను. పీహెచ్‌డీ చేస్తున్నప్పుడే జన విజ్ఞాన వేదికలోనూ హైదరాబాద్ సిటీ సెక్రటరీగా పని చేశాను. మూఢ నమ్మకాల రూపు మాపు కోసం.. శాస్త్రీయ విధానాల స్థాపన కోసం శ్రమించా. పాఠశాల, కాలేజీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు.. హాస్టళ్ల సమస్యలపై అనేకసార్లు ఉద్యమాలు చేశాం.

కాలేజీల స్థాపనతో విజ్ఞాన వెలుగులు.. వామపక్ష పార్టీతో అనుబంధం.. ప్రగతిశీల భావజాలం మెండుగా ఉన్న నేను ప్రైవేటీకరణను వ్యతిరేకించే వారిలో ఒకరిని. పీహెచ్‌డీ పూర్తి చేసిన తర్వాత ప్రైవేట్ కాలేజీ లెక్చరర్‌గా 8 ఏళ్లు పని చేశాను. అనేక కష్టాలకోర్చి ఉద్యోగం చేశాను. అలాంటి అనుభవాలతోనే కాలేజీ స్థాపించాలనే ఆలోచనకు దారితీసింది. శ్రీసాయి డిగ్రీ కాలేజీతో మొదలైన ప్రస్థానం.. నేడు నాలుగు జిల్లాల్లో ఆరు క్యాంపస్‌లకు చేరుకుంది. నల్లగొండతోపాటు మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మా విద్యాసంస్థల్లో 18 వేల మంది విద్యార్థ్ధులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నా రు.1500 మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉపాధి పొందుతున్నారు. ప్రతీ ఏటా 4 వేల మంది చదువులు పూర్తి చేసి వివిధ కొలువుల్లో స్థిర పడుతున్నారు. స్వదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు.

ఎస్‌ఎఫ్‌ఐ నాయకురాలితో ఆదర్శ వివాహం.. విద్యార్థి సంఘాల నాయకుడిగా ఎస్‌ఎఫ్‌ఐలో పని చేస్తున్నప్పుడే నీలిమతో పరిచయం ఏర్పడింది. పార్టీ అంగీకారం మేరకు పార్టీ పెద్దల సమక్షంలో కులాంతర వివాహం చేసుకున్నాను. 1992లో మా పెళ్లి జరిగింది. ఆ తర్వాత నేను రాజకీయాల్లో, కాలేజీల కార్యకలాపాల్లో బిజీగా ఉన్నా.. కుటుంబాన్ని పూర్తిగా తాను చూసుకునేది. పిల్లల సంరక్షణ పక్కాగా చూసుకునేది. నా ప్రతీ పని వెనుకా ఆమె ప్రోత్సాహం.. కుటుంబ సభ్యుల మద్దతు చాలా ఉంది. నేను ఎంతో పని ఒత్తిడితో ఇంటికి వెళ్లకున్నా.. సహనంతో నా బాధ్యతను తాను చూసుకుంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ గాయపడ్డ అనేక మంది విద్యార్థులకు ఆస్పత్రిలో, ఇంట్లో ఆమె చేసిన సేవలు అనేకం ఉన్నాయి.

కమ్యూనిస్టు నుంచి తెలంగాణ ఉద్యమంలోకి.. సీపీఐ(ఎం)లో ఉన్నప్పుడే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ఆలోచించా. ఆ పార్టీలోని అనేక వేదికల మీదా ఈ అంశంపై చర్చించాను. వరంగల్‌లో జరిగిన తొలి తెలంగాణ జనసభకు సైతం హాజరయ్యాను. 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించి ప్రత్యేక రాష్ట్ర పోరాటం ఉధృతం చేసిన తర్వాత ప్రతీ సందర్భాన్ని నిశితంగా పరిశీలిస్తూ.. పరోక్షంగా ఉద్యమానికి మద్దతుగా నిలిచాను. నేను పని చేసిన తొలి తరం కమ్యూనిస్టు నేతల్లో కనిపించిన వ్యక్తిగత క్రమశిక్షణ, భావజాలం ప్రత్యేకంగా ఉండేవి. ఏయే వర్గాల నుంచి వచ్చాం అనేది కాకుండా.. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడేలా సాగాలంటూ వాళ్లు స్ఫూర్తినిచ్చేవారు.

విద్యార్థుల మరణాలకు చలించి ప్రత్యక్ష పోరులోకి.. ప్రత్యేక తెలంగాణ పోరాటంలో కేసీఆర్ దీక్ష, ఆ తర్వాత ఉస్మానియా విద్యార్థుల పోరాటం.. అమరవీరుల ప్రాణత్యాగాలు నన్ను చలింపజేశాయి. నీ వంతు బాధ్యతగా ప్రత్యక్ష పోరులో పాల్గొనాల్సిన అవసరాన్ని మా కళాశాల విద్యార్థి వేణుగోపాల్‌రెడ్డి ఆత్మహత్య నాకు గుర్తు చేసింది. తరగతి గదిలో ఉత్సాహంగా ఉండే వేణుగోపాల్‌రెడ్డి రాష్ట్రం రాదేమోనన్న అనుమానంతో తనువు చాలించాడు. ఆ రోజు వేణుగోపాల్‌రెడ్డి శవయాత్ర హైదరాబాద్‌లో నిర్వహించిన మాపై పోలీసు లాఠీలు గర్జించాయి. నిర్భందాన్ని విధించాయి. ఫైరింగ్ కూడా జరిగింది. ఆ ఘటనలో నాపై పోలీసులు 18 సెక్షన్ల కింద 11 కేసులు బనాయించారు. హత్యా నేరం సైతం మోపారు. 11 రోజుల పాటు చంచల్‌గూడ జైలులో ఉన్నాను. అయినా ఏనాడూ జైలులో చింతించిన దాఖలాలు లేవు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగస్వామ్యం పంచుకున్నందుకు సంతోషించాను కూడా. తర్వాత నాలుగేళ్ల పాటు ఓయూ జేఏసీ జరిపిన ఉద్యమంలో కీలక భూమిక పోషించాను. కాళోజీ, జయశంకర్ సార్ రచనలు నన్ను లోతైన ఆలోచనలకు గురి చేశాయి.

కేసీఆర్ సైన్యంలో సైనికుడిగా నడుస్తూ.. కేసీఆర్ అద్వితీయ పోరాటం.. అలుపెరుగని ఉద్యమ ఫలితమే నేటి ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. అష్ట కష్టాలకోర్చి విద్యార్థుల బలిదానాలతో సాధించుకున్న ఈ తెలంగాణను బంగారు తెలంగాణగానూ తీర్చిదిద్దడం కేవలం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యం. ప్రతీ ఎకరా భూమికి సాగు నీరు.. ప్రతి ఇంటికీ రక్షిత తాగు నీరు.. ప్రతీ నిరుద్యోగికీ ఉద్యోగం చెప్పిన ప్రతీ వాగ్దానాల అమలు కోసమే ప్రభుత్వం పని చేస్తోంది. సమాజ సేవలో ఏదైతే సాధించాలని కమ్యూనిస్టు రాజకీయాల వైపు అడుగులు వేశానో.. తెలంగాణ రాష్ట్ర సమితి సారథ్యంలో అంతకన్నా ఎక్కువే చేయగలననే నమ్మకంతో ఇటు వచ్చాను. కేసీఆర్ సైన్యంలో సైనికుడిగా పనిచేస్తూ.. రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపే దిశగా తీసుకెళ్లడమే అంతి మ లక్ష్యం. విద్యార్థి సంఘాల నాయకుడిగా విద్యార్థుల సమస్యలు.. ప్రైవేటు కాలేజీ లెక్చరర్‌గా అధ్యాపకుల అవస్థలు.. ఇంజినీరింగ్ కాలేజీల సంఘం నాయకుడిగా యాజమాన్యాల ఇబ్బందులు.. ఇలా అన్ని కోణాలతోనూ నాకు అనుబంధం ఉంది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.