ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమవుతుందని చెరువుల పునరుద్ధరణపై నియమించిన క్యాబినెట్ సబ్‌కమిటీ చైర్మన్, భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గ్రామసభల ద్వారా చెరువులను గుర్తిస్తామని చెప్పారు.-ఐదు విడతలుగా పనులు.. అన్ని వర్గాలకూ ప్రాధాన్యం
-గ్రామసభల ద్వారా చెరువుల గుర్తింపు
-భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు
హరీశ్‌రావు క్యాబినెట్ సబ్ కమిటీ గురువారం సచివాలయంలో సమావేశమై చెరువుల పునరుద్ధరణలో తీసుకోవాల్సిన చర్యలపై మూడున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో కమిటీ మంత్రులు ఈటెల రాజేందర్, కే తారకరామారావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జీ జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషీ, ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, చిన్ననీటిపారుదలశాఖ చీఫ్ ఇంజినీర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఐదు దశల్లో చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టాలని కమిటీ నిర్ణయించింది. మొదటి దశ కింద ఏ జిల్లాలోని ఏయే చెరువులు చేపట్టాలనే అంశంపై చర్చించారు.
గతంలో కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఆర్‌ఆర్ కింద ఇచ్చిన నిధులు, ప్రపంచ బ్యాంకు, నాబార్డు నిధులతో పలు చెరువుల్లో ఆధునీకరణ పనులు కొంతమేర జరిగాయని, కానీ ఎక్కడా చెరువుల్లో పేరుకుపోయిన పూడికతీత పనులు జరుగలేదని గుర్తించారు. దాంతో చెరువుల సామర్థ్యం పెరుగలేదని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి చెరువులకు మొదటి ప్రాధాన్యం ఇస్తే త్వరితగతిన పనులు పూర్తిచేసి సాగుకు అందుబాటులోకి తీసుకురావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం ఏటా సుమారు 9వేల చెరువులను పునరుద్ధరించాలని సీఎం కేసీఆర్ సూచించిన విషయం తెలిసిందే. తొలిదశలో రాష్ట్రంలోని 20 శాతం చెరువులను ఈ విధానంలో చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే మరమ్మతులు చేసిన చెరువులను లెక్కిస్తే 12 శాతం వరకు మొదటి దశలో ఉన్నాయి. వీటితోపాటు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చే గ్రామాల్లోని మరో 8 శాతం చెరువులను కలుపుకొని మొదటిదశలో పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది.
సమావేశం అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణను వేగంవంతం చేయాలని నిర్ణయించామని, ముందు వేటికి ప్రధాన్యం ఇవ్వాలనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. మూడునాలుగు రోజుల్లో మరోసారి కమిటీ సమావేశమై సిఫారసులను ముఖ్యమంత్రి అందజేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేస్తామని స్పష్టం చేశారు. మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇసుక విక్రయించాలని భావిస్తున్నామని, త్వరలోనే మెరుగైన ఇసుక విధానాన్ని తీసుకొస్తామని తెలిపారు. రాక్ శాండ్ వాడకాన్ని పెంచాల్సి ఉందన్నారు.
పూడికతీతతో ఎన్నో ప్రయోజనాలు చెరువుల్లో పూడికతీయటంవల్ల రైతులకు అనేక ప్రయోజనాలున్నాయని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ ఫోరం తెలిపింది. క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశంలో పాల్గొన్న ఫోరం ప్రధాన కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రామిరెడ్డి, చెరువుల పునరుద్ధరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఒక మిలియన్ క్యూబిక్ అడుగుల పూడిక తీయడానికి రూ.5లక్షలు ఖర్చవుతుందని, పూడిక మట్టిని రైతులు తమ పొలాల్లో వేసుకోవడం ద్వారా కృత్రిమ ఎరువుల వాడకం 50శాతం మేర తగ్గుతుందని, 15-20 శాతం దిగుబడి పెరుగుతుందని వివరించారు. పూడికతీతతో భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని, కార్మికులకు ఉపాధి, మత్స్యసాగు చేసుకోవచ్చన్నారు. చెరువులను దత్తత తీసుకొని అభివృద్ధి చేసేందుకు స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించాలని సూచించారు.